Agents system
-
రవాణా శాఖలో ఏజెంట్ల దందా
చిత్తూరులో మామూళ్ల భాగోతం డ్రైవింగ్ రాకపోయినా, సాంకేతిక పరీక్ష పాస్ కాకున్నా లెసైన్స్ అధికారుల పేరుచెప్పి భారీ వసూళ్లు ఎల్‌ఎల్‌ఆర్‌కు రూ.2 వేలు రూ.2 వేలు ఇస్తే డ్రైవింగ్ లెసైన్స్ రవాణా శాఖ కార్యాలయం వద్దే ఏజెంట్ల మకాం సాక్షి, చిత్తూరు: రవాణా శాఖలో ఏజెంట్ల వ్యవస్థను ఎప్పుడో రద్దు చేసినా చిత్తూరు రవాణా కార్యాలయంలో మాత్రం ఇప్పటికీ నడుస్తోంది. డ్రైవింగ్ రాకపోయినా, సాంకేతిక పరీక్ష పాస్ కాకపోయినా రూ.రెండు వేలు కొడితే ఎల్ఎల్ఆర్(తాత్కాలిక లెసైన్స్) చేతిలో పెడుతున్నారు. మరో రెండువేలు ముట్టజెబితే ఏకంగా డ్రైవింగ్ లెసైన్స్ ఇచ్చేస్తున్నారు. చిత్తూరు రవాణా శాఖ కార్యాలయం మొత్తం ఏజెంట్ల కనుసన్నల్లోనే నడుస్తోంది. రోజుకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఆ శాఖ అధికారులు ఇక్కడ బొమ్మల్లా మారారు. ఏజెంట్లు చెప్పిన పనిచేయడం, వారు చేయమన్న ఫైల్‌పై సంతకం పెట్టడమే వారి విధి. మిగతాదంతా ఏజెంట్లు చూసుకుంటారు. సాయంత్రానికి అధికారుల వాటా పంచి మిగిలింది వారు జేబులో వేసుకొని వెళుతున్నారు. వ్యాపారం జోరుగా సాగుతుండడంతో ఏజెంట్లు రవాణా శాఖ కార్యాలయం వద్దే పదుల సంఖ్యలో సొంత కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా చిత్తూరు రవాణాలో వసూళ్ల దందా జోరుగా సాగుతోంది. సాంకేతిక పరీక్షలో అక్రమాలు నిబంధనల మేరకు డ్రైవింగ్ రావడం తో పాటు రవాణా శాఖ నిర్వహించే సాంకేతిక పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే తాత్కాలిక లెసైన్స్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ అందుకు భిన్నంగా జరుగుతోంది. డ్రైవింగ్ రాకపోయినా ఏజెం ట్లు దగ్గరుండి అధికారులతో చెప్పి పరీక్ష పెట్టకుండానే లెసైన్స్ ఇచ్చేస్తున్నారు. పెద్ద వాహనాలు తోలడం రా ని వారికి సైతం హెవీ లెసైన్స్‌లు ఇస్తున్నారు. ఇక సాంకేతిక పరీక్షలో ప్రధానంగా ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్ వ్యవస్థపై అవగాహనకు సంబంధించి 20 ప్రశ్నలు ఉండగా ఇందులో నిర్ణీత సమయంలో 12 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తేనే ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ పరీక్షలో కనీసం రెండుసార్లకు పైబడి వస్తేనే ఉత్తీర్ణత సాధిస్తారు తప్పించి మొదటిసారే ఉత్తీర్ణులవడం దాదాపు అసాధ్యం. మళ్లీ రావడం కుదరదని జనం ఏజెంట్లు అడిగిన కాడికి ముట్టజెబుతుండడంతో ఏజెంట్లే దగ్గరుండి సాం కేతిక పరీక్షను పాస్ చేయిస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లతో డ్రైవింగ్ లెసైన్స్‌లు తాజా నిబంధనల మేరకు డ్రైవింగ్ లెసైన్స్ రావాలంటే పదో తరగతి పాసై ఉండాలి. కంప్యూటర్ సెంటర్లో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి వాటి ఫొటోస్టాట్ నకళ్లు పెట్టి ఏజెంట్లు డ్రైవింగ్ లెసైన్స్‌లు ఇప్పిస్తున్నారు. ఏజెంట్లే నకిలీ సర్టిఫికెట్ల విషయమై సలహాలిచ్చి మరీ అక్రమాలను ప్రోత్సహిస్తూ సొంత వ్యాపారం చక్కబెట్టుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏజెంట్ల కార్యాలయాలు రవాణా శాఖలో ఏజెంట్ల వ్యవస్థకు ప్రభుత్వం ఎప్పుడో మంగళం పాడినా చిత్తూరు రవాణా శాఖ కార్యాలయంలో మాత్రం కొనసాగుతోంది. అధికారులు 11 గంటలకు కార్యాలయానికి వస్తే ఏజెంట్లు మాత్రం 8 గంటల నుంచే రవాణా శాఖ కార్యాలయం వద్ద తిష్టి వేస్తున్నారు. ఒక్కో అధికారికి, సిబ్బందికి సైతం తమ సొంత మనుషులను అటెండర్లుగా పెట్టి అన్నీ వారే చూసుకుంటున్నారు. రూ.లక్షల్లో మామూళ్లు రవాణా శాఖ కార్యాలయం మామూళ్లు రూ.లక్షల్లోనే ఉంటున్నట్లు సమాచారం. నిత్యం వేలాది మంది సర్టిఫికెట్ల కోసం వస్తుండడంతో వసూళ్ల కార్యక్రమం అంతేస్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడున్న ఓ ముఖ్య అధికారి నెల మూమూళ్లు సుమారు రూ.8 లక్షలకు పైనే ఉందంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. దీనిపై రవాణా శాఖ అధికారిని వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
కాసులిస్తే... యమపురికి లెసైన్స్!
తిరుపతి(మంగళం): ఏజెంట్ల వ్యవస్థ వాహనదారులకు అధిక భారమవుతుందని భావించిన రాష్ట్రప్రభుత్వం పారదర్శకంగా సేవలందించేందుకు కొన్నేళ్ల కిందటే దీనిని రద్దు చేసింది. లెసైన్స్‌లు, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, ఏపని అయినా నేరుగా కార్యాలయానికి వెళ్లి ప్రభుత్వం నిర్ణయించిన రుసుము చెల్లించి చేసుకోవాలన్నదే దీని వెనుక ఉద్దేశం. అయితే తిరుపతి ఆర్టీఏలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఏజెంట్ల వ్యవస్థ నాటుకుపోయింది. బీమా పేరుతో కార్యాల యాన్ని ప్రారంభించి ఆ ముసుగులో ఏజెం టు పనులు చేస్తున్నారు. ఉదయం ఆర్టీఏ కార్యాలయానికి అధికారులు రాకముందే వీరు వాహనదారులతో బేరాలు కుదుర్చుకుంటారు. అలా ఏజెంట్లు కుదుర్చుకున్న లెసైన్స్‌లకు సంబంధించిన రికార్డులను మాత్రమే సాయంత్రం 4 నుంచి అధికారులు చూస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్యాలయం పరిధిలో దాదాపు 50మంది ఏజెంట్లు ఉన్నారంటే అధికారులు ఏవిధంగా వారికి మద్దతు పలుకుతున్నారో స్పష్టమవుతోంది. అడ్డూ అదుపు లేదు.. ద్విచక్ర వాహనం, కారు లెసైన్స్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.525 కాగా ఇక్కడ ఏజెంట్లు ఒక్కో లెసైన్స్‌కు దాదాపు రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారని వాహనదారులు చెబుతున్నారు. అదే హెవీ లెసైన్స్‌కు అయితే ఏకంగా రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే మేమందరికీ ఇవ్వాలి కదా అని సమాధానం చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా నేరుగా వెళితే కంప్యూటర్లో 20 ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదనో మరో వంకతోనో తిప్పిపంపుతున్నట్టు వాహనదారులు చెబుతున్నారు. ఏజెంట్ ద్వారా వెళితే సమాధానాలు చెప్పక పోయినా పాస్మార్కు పడుతుంది. అధికారి లేకుండానే డ్రైవింగ్ పరీక్ష లెసైన్స్‌లు జారీ చేసే ముందు ఎంఈఏ అధికారి దగ్గరుండి ట్రాక్ వద్ద ప్రతి ఒక్కరితో వాహనం నడిపించి సమర్థులకు లెసైన్స్ జారీ చేయాలి. ఇక్కడ మాత్రం ఆయన ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఉంటారు. మిగతా సమయంలో సిబ్బందే డ్రైవింగ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష చేయకుండానే లెసైన్స్ జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. పెరుగుతున్న ప్రమాదాలు రోడ్లపై జరుగుతున్న వాహనాల ప్రమాదాలకు ఒక రకం గా వాహన తనిఖీ అధికారులు కారణమవుతున్నారు. ఆటోలు, జీపుల్లో పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. సామర్థ్యంలేని వాహనాలను నడుపుతున్నా పట్టించుకోవడం లేదు. ఇలాంటి వాటిని సీజ్ చేస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. డ్రైవింగ్ రాకున్నా లై సెన్స్ పొందిన వారు వాహనాలు నడపడం, ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్లపై తిరగడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇకనైనా అధికారులు ఇలాంటి వాటికి చెక్‌పెట్టాల్సి ఉంది. అలాంటి దేమీ లేదు మేం ఏజెంట్లను ప్రోత్సహించడం లేదు. ఏజెంట్ల వ్యవస్థ రద్దయింది. ఎవరైనా సరే నేరుగా కార్యాలయానికి వచ్చి ప్రభుత్వం నిర్ణయించిన రుసుము చెల్లించి పనులు చేసుకోవచ్చు. పాఠశాల బస్సుల విషయంలో అయితే కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఫిట్నెస్ లేని పాఠశాల బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను కూడా సీజ్ చేస్తున్నాం. -ఎంఎస్ఎస్బీ.ప్రసాద్, ఆర్టీవో, తిరుపతి -
రవాణా శాఖ రాంగ్‌రూట్
సాక్షి, కర్నూలు: రవాణా శాఖ పరిధిలో ఏజెంట్ల వ్యవస్థను ఏనాడో రద్దు చేశారు. వీరి ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా కార్యాలయానికి వెళ్లి సేవలు పొందే వీలు కల్పించారు. ప్రతి పనికి నిర్ణీత కాల వ్యవధిని నిర్దేశించారు. ఇంకేముంది.. మన పని సులువేననుకుంటే పొరపాటు. కార్యాలయం గేటు వద్దకు చేరుకోగానే ఏజెంట్ల వ్యవస్థ ఎంతలా వేళ్లూనుకుందో ఇట్టే అర్థమవుతుంది. వాళ్లను పట్టించుకోకుండా లోనికి వెళితే అక్కడో మాయాలోకం కనిపిస్తుంది. ఎవరు ఏమిటో.. ఏది ఎక్కడో.. ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపు పుణ్యకాలం గడిచిపోతుంది. డబ్బు ముట్టనిదే ఇక్కడ పని జరగని పరిస్థితి. లేదంటే ఎక్కడ లేని నిబంధనలు గుర్తొస్తాయి. ఏజెంట్ల ద్వారా వెళితే మీ పని క్షణాల్లో జరిగిపోతుంది. ఎల్ఎల్ఆర్ పొందేందుకు కంప్యూటర్‌పై పరీక్ష నిర్వహిస్తున్నారు. తెరపై కనిపించే 20 ప్రశ్నలకు పది నిమిషాల్లో అభ్యర్థులు సమాధానాలను టిక్ చేయాల్సి ఉంటుంది. వీటిలో 12 సరైన సమాధానాలు సూచించగలిగితే ఉత్తీర్ణత సాధించినట్లు.. అంతకు తగ్గితే ఫెయిల్ అయినట్లు ప్రకటిస్తారు. కర్నూలులోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో ప్రతిరోజూ సగటున 75 నుంచి 100 మంది వరకు ఎల్ఎల్ఆర్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. లెర్నింగ్ లెసైన్స్ పొందడానికి దరఖాస్తు రుసుము ద్విచక్ర వాహనానికైతే రూ.60, కారుతో కలిపి తీసుకోవాలంటే రూ. 90 చెల్లించాలి. నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకునే వారికి ఖర్చయ్యేది ఈ రుసుము మాత్రమే. కార్యాలయం బయట ఉండే ఏజెంట్లను ఆశ్రయిస్తే మాత్రం రూ.1,000 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. వీరి ద్వారా వెళ్లే ప్రతి దరఖాస్తుకు కార్యాలయంలోని సిబ్బందికి వాటాలు వెళ్తుంటాయనేది బహిరంగ రహస్యం. ఇలాంటి ఫైళ్లే చకాచకా కదిలిపోతాయన్నది లెసైన్స్ కోసం వెళ్లిన వారికి తెలియనిది కాదు. ఈ నేపథ్యంలో కొందరు అధికారులు ఏజెంట్లను ప్రత్యేకంగా నియమించుకున్నారు. నేరుగా వెళితే కొర్రీలు వేసి తిప్పి పంపుతున్నారు. గత వారం రోజుల్లోనే లెసైన్స్‌లకు సంబంధించి దాదాపు 300 ఫైళ్లు పెండింగ్‌లో ఉండటం అధికారుల పనితీరుకు నిదర్శనం. హెల్మెట్ బిల్లు సరిగా లేదనో.. మెడికల్ సర్టిఫికెట్ ప్రభుత్వాస్పత్రి నుంచి తీసుకురాలేదనో.. పాన్‌కార్డుల్లో ఫొటో సరిగా కనబడలేదనో.. కార్లకు స్టిక్కర్ వేయించలేదనో.. అడ్రస్ ప్రూఫ్ సరిగా లేదనే సాకులతో దరఖాస్తులను తిరస్కరించడం కార్యాలయంలో పరిపాటిగా మారింది. ఈ విషయమై ‘సాక్షి’ ఉప రవాణాశాఖాధికారి శివరామ్‌ప్రసాద్‌ను వివరణ కోరగా.. రిజిస్ట్రేషన్ సమయంలో దరఖాస్తుదారులు ఒరిజినల్స్‌తో రావాలని తెలిపారు. జిరాక్స్‌లను అనుమతించబోమన్నారు. ఒకవేళ పక్కాగా దరఖాస్తు చేసినా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాంటి వారిపై అప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని తెలిపారు.