కాసులిస్తే... యమపురికి లెసైన్స్!
తిరుపతి(మంగళం): ఏజెంట్ల వ్యవస్థ వాహనదారులకు అధిక భారమవుతుందని భావించిన రాష్ట్రప్రభుత్వం పారదర్శకంగా సేవలందించేందుకు కొన్నేళ్ల కిందటే దీనిని రద్దు చేసింది. లెసైన్స్‌లు, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, ఏపని అయినా నేరుగా కార్యాలయానికి వెళ్లి ప్రభుత్వం నిర్ణయించిన రుసుము చెల్లించి చేసుకోవాలన్నదే దీని వెనుక ఉద్దేశం. అయితే తిరుపతి ఆర్టీఏలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఏజెంట్ల వ్యవస్థ నాటుకుపోయింది. బీమా పేరుతో కార్యాల యాన్ని ప్రారంభించి ఆ ముసుగులో ఏజెం టు పనులు చేస్తున్నారు. ఉదయం ఆర్టీఏ కార్యాలయానికి అధికారులు రాకముందే వీరు వాహనదారులతో బేరాలు కుదుర్చుకుంటారు. అలా ఏజెంట్లు కుదుర్చుకున్న లెసైన్స్‌లకు సంబంధించిన రికార్డులను మాత్రమే సాయంత్రం 4 నుంచి అధికారులు చూస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్యాలయం పరిధిలో దాదాపు 50మంది ఏజెంట్లు ఉన్నారంటే అధికారులు ఏవిధంగా వారికి మద్దతు పలుకుతున్నారో స్పష్టమవుతోంది.
అడ్డూ అదుపు లేదు..
ద్విచక్ర వాహనం, కారు లెసైన్స్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.525 కాగా ఇక్కడ ఏజెంట్లు ఒక్కో లెసైన్స్‌కు దాదాపు రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారని వాహనదారులు చెబుతున్నారు. అదే హెవీ లెసైన్స్‌కు అయితే ఏకంగా రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే మేమందరికీ ఇవ్వాలి కదా అని సమాధానం చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా నేరుగా వెళితే కంప్యూటర్‌లో 20 ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదనో మరో వంకతోనో తిప్పిపంపుతున్నట్టు వాహనదారులు చెబుతున్నారు. ఏజెంట్ ద్వారా వెళితే సమాధానాలు చెప్పక పోయినా పాస్‌మార్కు పడుతుంది.
అధికారి లేకుండానే డ్రైవింగ్ పరీక్ష
లెసైన్స్‌లు జారీ చేసే ముందు ఎంఈఏ అధికారి దగ్గరుండి ట్రాక్ వద్ద ప్రతి ఒక్కరితో వాహనం నడిపించి సమర్థులకు లెసైన్స్ జారీ చేయాలి. ఇక్కడ మాత్రం ఆయన ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఉంటారు. మిగతా సమయంలో సిబ్బందే డ్రైవింగ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష చేయకుండానే లెసైన్స్ జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి.
పెరుగుతున్న ప్రమాదాలు
రోడ్లపై జరుగుతున్న వాహనాల ప్రమాదాలకు ఒక రకం గా వాహన తనిఖీ అధికారులు కారణమవుతున్నారు. ఆటోలు, జీపుల్లో పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. సామర్థ్యంలేని వాహనాలను నడుపుతున్నా పట్టించుకోవడం లేదు. ఇలాంటి వాటిని సీజ్ చేస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. డ్రైవింగ్ రాకున్నా లై సెన్స్ పొందిన వారు వాహనాలు నడపడం, ఫిట్‌నెస్ లేని వాహనాలు రోడ్లపై తిరగడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇకనైనా అధికారులు ఇలాంటి వాటికి చెక్‌పెట్టాల్సి ఉంది.
అలాంటి దేమీ లేదు
మేం ఏజెంట్లను ప్రోత్సహించడం లేదు. ఏజెంట్ల వ్యవస్థ రద్దయింది. ఎవరైనా సరే నేరుగా కార్యాలయానికి వచ్చి ప్రభుత్వం నిర్ణయించిన రుసుము చెల్లించి పనులు చేసుకోవచ్చు. పాఠశాల బస్సుల విషయంలో అయితే కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఫిట్‌నెస్ లేని పాఠశాల బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను కూడా సీజ్ చేస్తున్నాం.
-ఎంఎస్‌ఎస్‌బీ.ప్రసాద్, ఆర్టీవో, తిరుపతి