రవాణా శాఖలో ఏజెంట్ల దందా
చిత్తూరులో మామూళ్ల భాగోతం
డ్రైవింగ్ రాకపోయినా, సాంకేతిక పరీక్ష పాస్ కాకున్నా లెసైన్స్
అధికారుల పేరుచెప్పి భారీ వసూళ్లు
ఎల్‌ఎల్‌ఆర్‌కు రూ.2 వేలు రూ.2 వేలు ఇస్తే డ్రైవింగ్ లెసైన్స్
రవాణా శాఖ కార్యాలయం వద్దే ఏజెంట్ల మకాం
సాక్షి, చిత్తూరు: రవాణా శాఖలో ఏజెంట్ల వ్యవస్థను ఎప్పుడో రద్దు చేసినా చిత్తూరు రవాణా కార్యాలయంలో మాత్రం ఇప్పటికీ నడుస్తోంది. డ్రైవింగ్ రాకపోయినా, సాంకేతిక పరీక్ష పాస్ కాకపోయినా రూ.రెండు వేలు కొడితే ఎల్‌ఎల్‌ఆర్(తాత్కాలిక లెసైన్స్) చేతిలో పెడుతున్నారు. మరో రెండువేలు ముట్టజెబితే ఏకంగా డ్రైవింగ్ లెసైన్స్ ఇచ్చేస్తున్నారు. చిత్తూరు రవాణా శాఖ కార్యాలయం మొత్తం ఏజెంట్ల కనుసన్నల్లోనే నడుస్తోంది. రోజుకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఆ శాఖ అధికారులు ఇక్కడ బొమ్మల్లా మారారు. ఏజెంట్లు చెప్పిన పనిచేయడం, వారు చేయమన్న ఫైల్‌పై సంతకం పెట్టడమే వారి విధి.
మిగతాదంతా ఏజెంట్లు చూసుకుంటారు. సాయంత్రానికి అధికారుల వాటా పంచి మిగిలింది వారు జేబులో వేసుకొని వెళుతున్నారు. వ్యాపారం జోరుగా సాగుతుండడంతో ఏజెంట్లు రవాణా శాఖ కార్యాలయం వద్దే పదుల సంఖ్యలో సొంత కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా చిత్తూరు రవాణాలో వసూళ్ల దందా జోరుగా సాగుతోంది.
సాంకేతిక పరీక్షలో అక్రమాలు
నిబంధనల మేరకు డ్రైవింగ్ రావడం తో పాటు రవాణా శాఖ నిర్వహించే సాంకేతిక పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే తాత్కాలిక లెసైన్స్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ అందుకు భిన్నంగా జరుగుతోంది. డ్రైవింగ్ రాకపోయినా ఏజెం ట్లు దగ్గరుండి అధికారులతో చెప్పి పరీక్ష పెట్టకుండానే లెసైన్స్ ఇచ్చేస్తున్నారు. పెద్ద వాహనాలు తోలడం రా ని వారికి సైతం హెవీ లెసైన్స్‌లు ఇస్తున్నారు. ఇక సాంకేతిక పరీక్షలో ప్రధానంగా ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్ వ్యవస్థపై అవగాహనకు సంబంధించి 20 ప్రశ్నలు ఉండగా ఇందులో నిర్ణీత సమయంలో 12 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తేనే ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ పరీక్షలో కనీసం రెండుసార్లకు పైబడి వస్తేనే ఉత్తీర్ణత సాధిస్తారు తప్పించి మొదటిసారే ఉత్తీర్ణులవడం దాదాపు అసాధ్యం. మళ్లీ రావడం కుదరదని జనం ఏజెంట్లు అడిగిన కాడికి ముట్టజెబుతుండడంతో ఏజెంట్లే దగ్గరుండి సాం కేతిక పరీక్షను పాస్ చేయిస్తున్నారు.
నకిలీ సర్టిఫికెట్లతో డ్రైవింగ్ లెసైన్స్‌లు
తాజా నిబంధనల మేరకు డ్రైవింగ్ లెసైన్స్ రావాలంటే పదో తరగతి పాసై ఉండాలి. కంప్యూటర్ సెంటర్‌లో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి వాటి ఫొటోస్టాట్ నకళ్లు పెట్టి ఏజెంట్లు డ్రైవింగ్ లెసైన్స్‌లు ఇప్పిస్తున్నారు. ఏజెంట్లే నకిలీ సర్టిఫికెట్ల విషయమై సలహాలిచ్చి మరీ అక్రమాలను ప్రోత్సహిస్తూ సొంత వ్యాపారం చక్కబెట్టుకుంటున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఏజెంట్ల కార్యాలయాలు
రవాణా శాఖలో ఏజెంట్ల వ్యవస్థకు ప్రభుత్వం ఎప్పుడో మంగళం పాడినా చిత్తూరు రవాణా శాఖ కార్యాలయంలో మాత్రం కొనసాగుతోంది. అధికారులు 11 గంటలకు కార్యాలయానికి వస్తే ఏజెంట్లు మాత్రం 8 గంటల నుంచే రవాణా శాఖ కార్యాలయం వద్ద తిష్టి వేస్తున్నారు. ఒక్కో అధికారికి, సిబ్బందికి సైతం తమ సొంత మనుషులను అటెండర్లుగా పెట్టి అన్నీ వారే చూసుకుంటున్నారు.
రూ.లక్షల్లో మామూళ్లు
రవాణా శాఖ కార్యాలయం మామూళ్లు రూ.లక్షల్లోనే ఉంటున్నట్లు సమాచారం. నిత్యం వేలాది మంది సర్టిఫికెట్ల కోసం వస్తుండడంతో వసూళ్ల కార్యక్రమం అంతేస్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడున్న ఓ ముఖ్య అధికారి నెల మూమూళ్లు సుమారు రూ.8 లక్షలకు పైనే ఉందంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. దీనిపై రవాణా శాఖ అధికారిని వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.