లెర్నింగ్ లైసెన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలు వాహన వినియోగదారులను ఇంకా ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. కఠినమైన, తార్కికమైన ప్రశ్నలతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏజెంట్‌లు, మధ్యవర్తుల ద్వారా వచ్చేవారు ఎలాంటి పరీక్షలు లేకుండానే క్షణాల్లో లెర్నింగ్ లైసెన్స్ తీసుకుని వెళ్తుండగా నేరుగా వచ్చేవారు మాత్రం ఫెయిల్ అవుతున్నారు. డ్రైవింగ్ నేర్చుకునేందుకు అవసరమైన సాధారణ పరిజ్ఞానం మేరకు వినియోగదారుల అవగాహనను అంచనా వేయాల్సి ఉండగా అందుకు విరుద్దంగా గందరగోళాన్ని సృష్టించే ప్రశ్నలతోనే ఫెయిల్ అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో నేరుగా వచ్చేవారిని ఉద్దేశపూర్వకంగానే గందరగోళానికి గురి చేసి ఫెయిల్ చేస్తూ తప్పనిసరిగా ఏజెంట్‌లను ఆశ్రయించే పరిస్థితి కల్పిస్తున్నారు.
దీంతో రవాణాశాఖలో అన్ని రకాల పౌరసేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినా ఏజెంట్‌లు లేకుండా ఎలాంటి పనులు కావడం లేదు. రోడ్డు భద్రతా నిబంధనలు, ట్రాఫిక్ నియమాలు, వాహనం నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, తదితర అంశాలపైనే లెర్నింగ్ లైసెన్స్ ప్రశ్నలు ఉన్నప్పటికీ అభ్యర్ధులను తికమకపెట్టేలా ఉంటున్నాయి. దీంతో చాలామంది మొదటిసారి సరైన సమాధానాలను ఎంపిక చేయలేక ఫెయిల్ అవుతున్నారు. చివరకు ఏజెంట్‌లను ఆశ్రయించి రెండోసారి పాస్ అవుతున్నారు. గ్రేటర్‌లోని 10 ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతి రోజూ సుమారు 1500 మంది లెర్నింగ్ లైసెన్సు పరీక్షలకు హాజరవుతుండగా వారిలో సగటున 350 నుంచి 400 మంది ఫెయిల్ అవుతున్నారు. వీరందరూ దళారులను ఆశ్రయించకుండా నేరుగా వచ్చేవాళ్లే కావడం గమనార్హం.
ప్రశ్నలు మిగిలే ఉన్నాయి...
శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు పొందడానికి ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఒక వ్యక్తి డ్రైవింగ్ నేర్చుకునేందుకు రవాణాశాఖ అందజేసే లెర్నింగ్ లైసెన్స్ 6 నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ గడువులోగా సదరు వ్యక్తులు డ్రైవింగ్ నేర్చుకొని, అన్ని రోడ్లపైన వాహనాలను నడిపేందుకు అనుభవాన్ని గడించాలి. అప్పుడు మరోసారి శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలకు హాజరుకావలసి ఉంటుంది. ఈ క్రమంలో లెర్నింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు అభ్యర్ధులకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోడ్డు సిగ్నల్స్, రూల్స్ అండ్ రోడ్ రెగ్యులేషన్స్, జనరల్ డ్రైవింగ్ ప్రిన్సిపల్స్, తదితర అంశాలపై ఈ ప్రశ్నలను రూపొందించారు. ఈ కేటగిరీల్లో మొత్తం 450 వరకు ప్రశ్నలతో ఒక క్వశ్చన్ బ్యాంక్‌ను రవాణాశాఖ సిద్ధం చేసింది.
ఈ క్వశ్చన్‌బ్యాంకు నుంచే అభ్యర్ధుల పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. ఇందు లో కొన్ని గందరగోళానికి గురిచేస్తున్నట్లు అభ్యర్ధులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు ‘సూర్యోదయానికి ముందు, తరు వాత డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెడ్ లైట్ ఎలా ఉండాలి’. సాధారణంగా దీనికి ప్రతి ఒక్కరు ‘లైటు వెలిగించుకొని’ బం డి నడపాలనే భావిస్తారు. కానీ లైట్ లో భీమ్‌లో ఉండాలనేది సమాధానం. అలాగే రోడ్డు మీద గుంతల్లో నీళ్లు చిమ్ముతూ బండి నడిపితే మోటారు వాహన చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘన అవుతుందనే విషయం చాలా మందికి తెలియదు. పరిమితికి మించిన బరువుతో వెళ్లే వాహనాలు ఏ సెక్షన్ ప్రకారం నేరంగా పరిగణిస్తారు. ’వాయు కాలుష్యం వల్ల వాతావరణంలోని ఓజోన్ పొర దెబ్బతింటే ఏమవుతుంది’ వంటి లెర్నర్‌కు సంబంధం లేని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి.
సమయాభావ సమస్యే...
లెర్నింగ్ లైసెన్సు కోసం నిర్వహించే ఆన్‌లైన్ టెస్ట్‌లో 20 ప్రశ్నలకు సరైన జవాబులను ఎంపిక చేసేందుకు 10 నిమిషాల సమయం ఇచ్చారు. ఒక్కో ప్రశ్నకు అరనిమిషం వ్యవధి లో సమాధానం గుర్తించాలి. అభ్యర్ధులు కనీసం 12 ప్రశ్నల కు సరైన సమాధానం గుర్తిస్తే చాలు. ఉత్తీర్ణులైనట్లుగా భావి ంచి లెర్నింగ్ లైసెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. దీంతో వాహ నం నేర్చుకొనేందుకు అనుమతి లభిస్తుంది. అయితే చాలామం ది అభ్యర్ధులు సరైన జవాబులు గుర్తించేందుకు సమ యం చాలడం లేదని అభిప్రాయపడుతున్నారు. ‘‘స్క్రీన్‌పై ఒక ప్రశ్నను చదివి అర్ధం చేసుకొని జవాబును గుర్తించే లోపే మరో ప్రశ్న ముందుంటుంది. దీంతో గందరగోళానికి గురవుతున్నాం.’’ అని మోతీనగర్‌కు చెందిన సంపత్ పేర్కొన్నా రు. లెర్నింగ్ లైసెన్స్ పరీక్షకు సమయాన్ని 15 నిమిషాలకు పెంచాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు.
ఒక్కసారి చదువుకొని వస్తే చాలు..
చాలామంది ఒక్కసారైనా ప్రశ్నావళిని చూడకుండానే నేరుగా పరీక్షకు హాజరవుతున్నారని, దాంతో వారికి ఆ ప్రశ్నలు కఠినంగా కనిపిస్తున్నాయని సంయుక్త రవాణా కమిషనర్ రమేష్ ‘సాక్షి’తో తెలిపారు. ‘ కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉన్న మాట నిజమే. గతంలో ఒక కమిటీ వేసి చాలా వరకు సరళీకరించాం. మార్పులు, చేర్పులు చేశాము. 827 ప్రశ్నలను సగానికి కుదించాము. క్వశ్చన్ బ్యాంకు ప్రింటెడ్ బుక్స్ అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఉన్నాయి. రవాణాశాఖ వెబ్‌సైట్‌లో కూడా ఉంది. వెబ్‌సైట్‌లో మాక్ టెస్ట్‌కు కూడా హాజరు కావచ్చు. ఎలాంటి కసరత్తు లేకుండా, సన్నద్ధత లేకుండా వచ్చేవాళ్లకు మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. ’’ అని చెప్పారు. సరైన సమాధానాలను గుర్తించిన తరువాత ఫెయిల్ చేయడమంటూ ఉండదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment