వాహనం బదిలీ మరిస్తే ముప్పు తప్పదు
Published Tue, Aug 9 2016 8:47 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న రెండు వాహనాలు నయీంకు చెందినవి కావు.ఆర్టీఏ రికార్డుల ప్రకారం మల్లాపూర్,యాఖుత్‌పురా నూర్‌ఖాన్ బజార్‌కు చెందిన వేరు వేరు వ్యక్తుల పేరిట నమోదై ఉన్నాయి.పైగా మల్లాపూర్ అడ్రస్‌కు, ఆర్టీఏలో నమోదైన బిరుదరాజు లక్ష్మి అనే పేరుకు ఎలాంటి సంబంధం లేదు. అప్పటికి రెండు,మూడు అడ్రస్‌లపై బదిలీ అయిన వాహనాలు చివరకు ఎన్‌కౌంటర్ స్థలంలో పోలీసులకు పట్టుబడ్డాయి. ఈ వాహనాలు నయీంకు ఎలా వచ్చాయనే సంగతి పోలీసుల విచారణలో తేలాల్సిందే. ఈ ఒక్క ఉదంతంలోనే కాదు. చాలా సంఘటనల్లో పోలీసులు, రవాణా అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాలకు, ఆ క్షణం వరకు వాటిని వినియోగిస్తున్న వ్యక్తులకు ఎలాంటి సంబంధం ఉండడం లేదు.వాహనాలు అమ్మిన వెంటనే యాజమాన్య బదిలీ చేయడం లేదు. అలాగే కొనుగోలు చేసిన వాళ్లు కూడా తమ పేరిట తిరిగి నమోదు చేసుకోవడం లేదు. ఇలాంటి వాహనాలు సంఘవిద్రోహులు, నేరస్థుల చేతుల్లో పడితే ప్రమాదం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాహనాల బదిలీపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది.
భారీ మూల్యం తప్పదు...
కార్లు,మోటారుబైక్‌లు వంటి వ్యక్తిగత వాహనాలు, ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, ప్రైవేట్ బస్సులు, తదితర రవాణా వాహనాలు ప్రతి రోజు వేల సంఖ్యలో ఒకరి నుంచి ఒకరికి చేతులు మారుతాయి. సెకెండ్‌హ్యాండ్స్ అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 10 ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతి రోజు సుమారు 1000 వరకు పాత వాహనాల క్రయవిక్రయాలు జరుగుతాయి. కానీ వాహన యాజమాన్య బదిలీ కోసం ఆర్టీఏకు వస్తున్న వాహనాలు మాత్రం 250 నుంచి 300 వరకు మాత్రమే ఉన్నాయి. చాలామంది వాహనదారులు తమ పాత వాహనాలను అమ్మిన వెంటనే కొన్నవాళ్ల పేరిట బదిలీ చేయడం లేదు.
వాహనం కొనుగోలు చేసిన వ్యక్తులు సైతం సకాలంలో తమ పేరిట బదిలీ చేసుకోవడం లేదు. పైగా ఇలా బదిలీ కాకుండా ఉన్న వాహనాలు ఒకరి నుంచి మరొకరికి అదే పనిగా మారిపోతున్నాయి. చివరకు అసలు వాహన యజమానికి, దానిని వినియోగించే వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 10 లక్షల వాహనాలు బదిలీ కాకుండా ఉన్నట్లు అధికారుల అంచనా. నగరంలో తిరుగుతున్న 1.4 లక్షల ఆటో రిక్షాల్లో సగానికి పైగా బినామీ పేర్లు, ఫైనాన్షియర్‌లపైనే నమోదై ఉన్నాయి. కానీ వాటిని వినియోగించే వ్యక్తులు మాత్రం వేరే ఉన్నారు. అలాగే తమిళనాడు, మహారాష్ర్ట, న్యూఢిల్లీ, గుజరాత్, తదితర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన లక్షలాది కార్లు, క్యాబ్‌లు ఎలాంటి డాక్యుమెంట్‌లు లేకుండానే నగరంలో తప్పుడు చిరునామాలపైన నమోదై తిరుగుతున్నాయి.
చాలా వాహనాలు ఎలాంటి యాజమాన్య బదిలీ లేకుండానే రోడ్డెక్కుతున్నాయి. ఇలాంటి వాహనాలు రోడ్డు ప్రమాదాల్లో పట్టుబడినప్పుడు, ట్రాఫిక్ ఉల్లంఘనల్లో దొరికిపోయినప్పుడు అసలు వాహన యజమానులు భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదు.రోడ్డు ప్రమాదాలు జరిగినా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా రవాణాశాఖ రికార్డుల్లో నమోదైన వాహన యజమానులనే పోలీసులు పరిగణనలోకి తీసుకొని కేసులు నమోదు చేస్తారు. అలాంటి వాహనాలు తమ వినియోగంలో లేకపోయినప్పటికీ యాజమాన్య బదిలీ చేయకపోవడం వల్ల రూ.వేలల్లో జరిమానాలు చెల్లించ క తప్పదు.
బినామీ దందా....
మరోవైపు వాహనాలపైన బినామీ దందా సైతం యధేచ్చగా సాగిపోతుంది. దొంగ వాహనాలు, కాలం చె ల్లిన వాహనాలు, వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి తరలించిన వాహనాలు, ఒక ఫైనాన్షియర్ నుంచి మరో ఫైనాన్షియర్‌కు బదిలీ అయ్యే వాహనాలు చాలా వరకు బినామీ పేర్లపైనే నమోదవుతున్నాయి. నగరంలోని కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో రవాణా అధికారులు కొందరు దళారులతో కుమ్ముక్కై పెద్ద ఎత్తున ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఏజెంట్‌లు, దళారుల కార్యకలాపాలు యధేచ్చగా సాగిపోతున్నాయి. చిరునామా ధృవీకరణ కోసం రకరకాల ఆధారాలను సృష్టించేస్తున్నారు.
Advertisement