నేడు కర్నూలులో ఎల్‌ఎల్‌ఆర్ మేళా
Published Sun, Feb 26 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM
కర్నూలు: రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు ఆటోడ్రైవర్లకు ఎల్‌ఎల్‌ఆర్ మేళా నిర్వహించనున్నట్లు డీటీసీ ప్రమీల శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎల్‌ఎల్‌ఆర్ మేళా నిర్వహిస్తామన్నారు. ఆటో కార్మికుల నుంచి భారీ స్పందన లభించడంతో గత ఆదివారం కర్నూలుతో పాటు నంద్యాల, ఆదోని కార్యాలయాల్లోనూ ఎల్‌ఎల్‌ఆర్ మేళా నిర్వహించారు. ఆటో రిక్షా ట్రాన్స్‌పోర్టు లైసెన్స్ కోసం కొన్నేళ్లుగా కార్మికులు ఎదురు చూస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు లైసెన్స్ పొందాలంటే కనీసం 8వ తరగతి చదివి ఉండాలనే నిబంధన ఉండేది. ఈ విధానాన్ని తొలగిస్తూ చదువుతో నిమిత్తం లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని లైసెన్సులు జారీ చేయాలని ఆ శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఈనెల 11న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మొదటి విడత ఈ నెల 12, 13 తేదీల్లో కర్నూలు రవాణా శాఖ కార్యాలయంలో, రెండవ విడత 19వ తేదీ కర్నూలుతో పాటు ఆదోని, నంద్యాల కార్యాలయాల్లో ఎల్‌ఎల్‌ఆర్ డ్రైవింగ్ మేళా నిర్వహించారు. దాదాపు 1200 మందికి పైగా డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేశారు. డీటీసీ ప్రమీల పర్యవేక్షణలో ఆదివారం కూడా కర్నూలు కార్యాలయంలో ఎల్‌ఎల్‌ఆర్ మేళా కొనసాగనుంది. ఆటో కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, మెడికల్ సర్టిఫికెట్‌తో కార్యాలయానికి వచ్చిన ప్రతి ఆటో కార్మికుడికి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని లైసెన్స్ జారీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Advertisement