సోషల్ మీడియా కార్యకర్తపై తణుకు ఎమ్మెల్యే వీరంగం
ఆటోను అడ్డగించి మరీ బూతు పురాణం
ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీస్‌స్టేషన్‌కు తరలింపు, ఆటో సీజ్
ఆటోపై జగన్ బొమ్మ, సోషల్ మీడియాలో యాక్టివ్.. అందుకే అభ్యంతరం
‘తూర్పు’ నుంచి ‘పశ్చిమ’లోకి ఆటో వచ్చిందని ఫైన్
జరిమానా చెల్లించినా విడిచి పెట్టడానికి ససేమిరా
ఎమ్మెల్యే చెబితేనే ఆటో ఇస్తామని స్పష్టీకరణ
సాక్షి ప్రతినిధి, ఏలూరు/పెరవలి : పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరుకు చెందిన ఆటో డ్రైవర్ పంజా దుర్గారావుపై రెచ్చిపోయారు. ఆటోపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫొటోలను చూసి ఆటోను వెంబడించి మరీ రోడ్డుపై ఆపి డ్రైవర్‌పై బూతు పురాణంతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆటోకు అడ్డంగా కారు పెట్టి, తణుకు పోలీసులను పిలిపించి స్టేషన్‌కు తీసుకెళ్లమని ఆదేశించారు. ఆటోను సీజ్ చేయించారు.
ఎలాంటి కేసు లేకున్నా, రాత్రి ఎనిమిది గంటలైనా ఆటో డ్రైవర్‌ను స్టేషన్‌లోనే ఉంచడం తణుకులో చర్చనీయాంశమైంది. దుర్గారావు ప్రతిరోజూ కానూరు నుంచి తణుకుకు సర్వీస్ ఆటో నడుపుతుంటాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అభిమానంతో ఆటోపై వైఎస్ జగన్, కారుమూరి ఫొటోలను వేసుకున్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉండ్రాజవరం రోడ్డులోకి ఆటో ప్రవేశించింది. అదే సమయంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తన వాహనంలో వస్తున్నారు.
ఎమ్మెల్యే కారును గమనించి దుర్గారావు దారి ఇచ్చాడు. అయినా ఎమ్మెల్యే వాహనం ముందుకు వెళ్లకుండా దుర్గారావు నడుపుతున్న ఆటోను అనుసరించింది. ఈ క్రమంలో ఆటోను పూర్తిగా పక్కకు నిలిపి, దారి ఇచ్చినా ఎమ్మెల్యే కారు ముందుకు వెళ్లలేదు. ఒక కిలోమీటరు దాటిన తర్వాత తణుకులోని రాష్ట్రపతి రోడ్డులో ఆటోను ఓవర్‌టేక్ చేసి, ఎదురుగా కారు నిలిపి.. ఎమ్మెల్యే కిందకు దిగారు. అసభ్య పదజాలంతో దుర్గారావుపై విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యులపైనా బూతు పురాణంతో రెచ్చిపోయారు.
తణుకు టౌన్ సీఐ కొండయ్యకు ఫోన్ చేసి రప్పించారు. రావాలని ఆదేశించిండంతో సీఐ ఆగమేఘాల మీద వచ్చి ఆటో డ్రైవర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఎంఈఐ శ్రీనివాస్‌ను కూడా రప్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఆటో.. పశ్చిమగోదావరిలోకి వచ్చిందంటూ.. ఆటోను సీజ్ చేసి రూ.3,400 జరిమానా విధించారు.
ఆ తర్వాత ఆటోకు విధించిన చలానా మొత్తాన్ని చెల్లించినా, ఎమ్మెల్యే చెబితేనే వాహనం ఇస్తామని రవాణా శాఖా«ధికారులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో రాత్రి 9 గంటలైనా దుర్గారావును విడిచి పెట్టలేదు. కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా అనుమతించ లేదు. స్థానిక టీడీపీ నేతలతో దుర్గారావుపై ఫిర్యాదు చేయించేందుకు ఎమ్మెల్యే రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
ఎమ్మెల్యేది నీతిమాలిన చర్య
ఎమ్మెల్యే రాధాకృష్ణ తీరుపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. ఎమ్మెల్యే స్థాయిని మరచి సామాన్య ఆటో డ్రైవర్‌పై ప్రతాపం చూపిస్తూ అసభ్య పదజాలంతో దూషించడం నీతిమాలిన చర్య అని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తే ఇలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి ఎస్‌ఐని కింద కూర్బోబెట్టడం, కానిస్టేబుల్‌ను దుర్భాషలాడటం, మహిళ ఛాతీపై గుద్దుకుంటూ వెళ్లిపోవడం లాంటి దిగజారుడు పనులు చేశారని గుర్తు చేశారు. దుర్గారావును ఇబ్బంది పెడితే పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని కారుమూరి
హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment