durga rao
-
సీజ్ ద ఆటో..
సాక్షి ప్రతినిధి, ఏలూరు/పెరవలి : పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరుకు చెందిన ఆటో డ్రైవర్ పంజా దుర్గారావుపై రెచ్చిపోయారు. ఆటోపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫొటోలను చూసి ఆటోను వెంబడించి మరీ రోడ్డుపై ఆపి డ్రైవర్‌పై బూతు పురాణంతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆటోకు అడ్డంగా కారు పెట్టి, తణుకు పోలీసులను పిలిపించి స్టేషన్‌కు తీసుకెళ్లమని ఆదేశించారు. ఆటోను సీజ్ చేయించారు. ఎలాంటి కేసు లేకున్నా, రాత్రి ఎనిమిది గంటలైనా ఆటో డ్రైవర్‌ను స్టేషన్లోనే ఉంచడం తణుకులో చర్చనీయాంశమైంది. దుర్గారావు ప్రతిరోజూ కానూరు నుంచి తణుకుకు సర్వీస్ ఆటో నడుపుతుంటాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అభిమానంతో ఆటోపై వైఎస్ జగన్, కారుమూరి ఫొటోలను వేసుకున్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉండ్రాజవరం రోడ్డులోకి ఆటో ప్రవేశించింది. అదే సమయంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తన వాహనంలో వస్తున్నారు. ఎమ్మెల్యే కారును గమనించి దుర్గారావు దారి ఇచ్చాడు. అయినా ఎమ్మెల్యే వాహనం ముందుకు వెళ్లకుండా దుర్గారావు నడుపుతున్న ఆటోను అనుసరించింది. ఈ క్రమంలో ఆటోను పూర్తిగా పక్కకు నిలిపి, దారి ఇచ్చినా ఎమ్మెల్యే కారు ముందుకు వెళ్లలేదు. ఒక కిలోమీటరు దాటిన తర్వాత తణుకులోని రాష్ట్రపతి రోడ్డులో ఆటోను ఓవర్టేక్ చేసి, ఎదురుగా కారు నిలిపి.. ఎమ్మెల్యే కిందకు దిగారు. అసభ్య పదజాలంతో దుర్గారావుపై విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యులపైనా బూతు పురాణంతో రెచ్చిపోయారు. తణుకు టౌన్ సీఐ కొండయ్యకు ఫోన్ చేసి రప్పించారు. రావాలని ఆదేశించిండంతో సీఐ ఆగమేఘాల మీద వచ్చి ఆటో డ్రైవర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఎంఈఐ శ్రీనివాస్‌ను కూడా రప్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఆటో.. పశ్చిమగోదావరిలోకి వచ్చిందంటూ.. ఆటోను సీజ్ చేసి రూ.3,400 జరిమానా విధించారు. ఆ తర్వాత ఆటోకు విధించిన చలానా మొత్తాన్ని చెల్లించినా, ఎమ్మెల్యే చెబితేనే వాహనం ఇస్తామని రవాణా శాఖా«ధికారులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో రాత్రి 9 గంటలైనా దుర్గారావును విడిచి పెట్టలేదు. కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా అనుమతించ లేదు. స్థానిక టీడీపీ నేతలతో దుర్గారావుపై ఫిర్యాదు చేయించేందుకు ఎమ్మెల్యే రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.ఎమ్మెల్యేది నీతిమాలిన చర్య ఎమ్మెల్యే రాధాకృష్ణ తీరుపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. ఎమ్మెల్యే స్థాయిని మరచి సామాన్య ఆటో డ్రైవర్‌పై ప్రతాపం చూపిస్తూ అసభ్య పదజాలంతో దూషించడం నీతిమాలిన చర్య అని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తే ఇలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి ఎస్ఐని కింద కూర్బోబెట్టడం, కానిస్టేబుల్‌ను దుర్భాషలాడటం, మహిళ ఛాతీపై గుద్దుకుంటూ వెళ్లిపోవడం లాంటి దిగజారుడు పనులు చేశారని గుర్తు చేశారు. దుర్గారావును ఇబ్బంది పెడితే పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని కారుమూరి హెచ్చరించారు. -
భారత్ అందుల టీం కెప్టెన్ దుర్గారావు... ఇన్స్పిరేషన్ స్టోరీ...
-
A2 ఎవరు ...?
-
అంధుల భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా దుర్గారావు
వంగర: విజయనగరం జిల్లా వంగర మండలం కొప్పరవలస గ్రామానికి చెందిన టొంపాకి దుర్గారావు (26)ను భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా (కేబీ) ఎంపిక చేసింది. ఈ విషయాన్ని అసోసియేషన్ చైర్మన్ కె.మహేంతేష్ గురువారం ఢిల్లీలో ప్రకటించారు. దుర్గారావు నేపథ్యమిదీ నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గారావు చిన్నతనంలోనే తండ్రి దాలయ్య మరణించారు. తల్లి సుందరమ్మ రెక్కల కష్టంతో దుర్గారావును పెంచి పెద్దచేశారు. విజయనగరం జిల్లా మెట్టవలస అంధుల పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. ఇంటర్ సికింద్రాబాద్‌లో, డిగ్రీ హైదరాబాద్‌లోని కాలేజీల్లో పూర్తిచేశాడు. అంధుల క్రికెట్లో భారత్ తరఫున రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండుసార్లు అంధుల వన్డే క్రికెట్ ప్రపంచ కప్, మూడుసార్లు అంధుల టీ–20 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకోవడంలో దుర్గారావు కీలక పాత్ర పోషించాడు. 2014 భారత అంధుల క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్‌గా ఆరంగేట్రం చేశాడు. 2014 నవంబర్ 7 నుంచి డిసెంబర్ 25 వరకు దక్షిణాఫ్రికాలో జరిగిన అంధుల క్రికెట్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 2016 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు భారత్‌లో జరిగిన టీ–20 జట్టులో స్థానం లభించింది. 2018 జనవరిలో దుబాయ్‌లో జరిగిన అంధుల వరల్డ్ కప్‌లో కూడా ఆల్‌రౌండర్‌గా ప్రతిభ చాటాడు. 2019లో వెస్టిండీస్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లో సత్తాచాటి భారత్‌కు విజయాన్ని అందించాడు. 2022 భారత్‌లో జరిగిన వరల్డ్ కప్ విజయంలోనూ, ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఇప్సా) లండన్‌లో జరిగిన క్రికెట్ టోర్నీలో ద్వితీయ స్థానం సాధించడంలో కీలక భూమిక పోషించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 21నుంచి 26 వరకు దుబాయ్‌లో జరిగే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక దేశాల ముక్కోణపు టోర్నీకి భారత అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించనున్నాడు. నా ఆశయానికి అమ్మే తోడు నేను మంచి క్రికెటర్‌గా ఎదగాలని ఆకాక్షించాను. కష్టపడి సాధన చేశాను. నా ఆశయానికి మా అమ్మ సుందరమ్మ సహకారం తోడైంది. పాఠశాల, కళాశాలల్లో ఉపాధ్యాయులు, స్నేహితులు ప్రోత్సాహం నాకు మరింత ఉత్సాహాన్నివ్వడంతో భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాను. కష్టపడితే ఎంతటి విజయమైనా సిద్ధిస్తుందని నమ్ముతాను. ఇదే నా విజయ రహస్యం – టొంపాకి దుర్గారావు, కెప్టెన్ భారత అంధుల జట్టు -
మహేశ్‌బాబులా ఉండే అతడికే నా ఫుల్ సపోర్ట్: టిక్‌టాక్ దుర్గారావు
టిక్‌టాక్ బ్యాన్ కాకముందు ఆ యాప్ ద్వారా బాగా పాపులర్ అయిన వాళ్లలో దుర్గారావు ఒకరు. అతడు భార్యతో కలిసి చేసిన 'నాది నెక్కిలీసు గొలుసు' డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో ఒక్కరోజులోనే ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. దీంతో తరచూ భార్యతో కలిసి డ్యాన్సులు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. దీంతో అతడికి పలు బుల్లితెర షోల నుంచి ఆఫర్లు వచ్చాయి. సతీసమేతంగా షోకు రండంటూ ఆహ్వానాలు అందడంతో పలు షోలలోనూ కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే అతడు బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లోనూ పాల్గొంటున్నాడని తెగ ప్రచారం జరిగింది. అతడు కూడా పలు ఇంటర్వ్యూల్లో తనకు బిగ్‌బాస్ షో నుంచి పిలుపు వచ్చిందని చెప్పుకొచ్చాడు. తీరా ఈ సీజన్లో మాత్రం పాల్గొనలేదు. తాజాగా అతడు బిగ్‌బాస్ షో గురించి మాట్లాడుతూ.. 'యాంకర్ రవి కోసమే బిగ్‌బాస్ చూస్తున్నాను. ఆయన నవ్వు, అందం.. అచ్చం మహేశ్‌బాబులానే ఉంటారు. నేను మహేశ్‌బాబు అభిమానిని. రవిని చూస్తుంటే మహేశ్‌బాబుగారే గుర్తొస్తారు. నా ఫుల్ సపోర్ట్ రవిగారికే! ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే అతడంటే నాకు, నా భార్యకు చాలా ఇష్టం' అని చెప్పుకొచ్చాడు. -
‘బిగ్‌బాస్’లోకి టిక్‌టాక్ స్టార్ దుర్గారావు!
దుర్గారావు.. సోషల్ మీడియాలో ఈ పేరు ఒక సంచలనం. టిక్ టాక్‌ను ఈయన వాడుకున్నంత బాగా ఎవరూ వాడుకోలేదంటే అతిశయోక్తి కాదు. ఎక్కడో పల్లెటూరిలో పుట్టిన పెరిగిన దుర్గారావు.. టిక్‌టాక్ ద్వారా ఫేమస్ అయ్యాడు. తన భార్యతో కలిసి వేసిన స్టెప్పుల్లో సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యాయో అందరికి తెలిసిందే. రఘు కుంచె సంగీత సారధ్యంలో వచ్చిన ‘నాదీ నక్కిలీసు గొలుసు’ పాటతో దుర్గారావు మరింత ఫేమస్ అయ్యాడు. దుర్గారావు స్టెప్పులను సినీ హీరోలు కూడా వేశారంటే.. మనోడికి ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. టిక్‌టాక్ బ్యాన్ అయినప్పటికీ.. దుర్గారావు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. టిక్‌టాక్ ఇచ్చిన గుర్తింపుతో ఆయన సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.ఈ మధ్యే జగపతిబాబుతో కలిసి స్టేజీపై డాన్సులు కుమ్మేసాడు దుర్గా రావు. ఇటీవల విడుదలైన రవితేజ ‘క్రాక్’లో మెరిశాడు. ఇలా పలు సినిమాల్లో చాన్స్ కొట్టేసిన దుర్గారావుకు.. తాజాగా మరో బంపరాఫర్ తగిలిందని ప్రచారం సాగుతోంది. బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఐదో సీజన్‌కి దుర్గారావు ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దుర్గా రావుకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. పైగా మంచి ఎంటర్టైనర్ కూడా. అందుకే దుర్గా రావును బిగ్ బాస్ 5 తెలుగులో కంటెస్టెంట్‌గా తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కానీ నిజమైతే దుర్గారావు నక్కతోకను తొక్కినట్లే. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ ఐదో సీజన్‌కి యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ యాంకర్ రవి, కమెడియన్ హైపర్ ఆది పేర్లను నిర్వాహకులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత? ఐదో సీజన్లో ఇంకా ఎవరెవరు ఉండబోతున్నారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మరోవైపు బిగ్‌బాస్ నాల్గో సీజన్ విజయవంతం కావడంతో ఐదో సీజన్‌కు నిర్వాహకులు అప్పుడే పనులు మొదలు పెట్టారు. దీని కోసం వారి అధికారిక యూట్యూబ్ చానెల్ లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేపై వీక్షకుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. దీంతో అతి త్వరలో బిగ్‌బాస్ 5 సీజన్ ను ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం. చదవండి : బిగ్‌బాస్ 5 : మొదటి కంటెస్టెంట్ పేరు ఖరారు! -
దుర్గారావుతో జగపతి బాబు చిందులు
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా రాణించిన జగపతి బాబు.. ఆ తర్వాత ఆయనలోని మరో యాంగిల్ బయటపెడుతూ విలన్ గా మారారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘లెజండ్’ లో జగపతి బాబు విలన్ గా నటించి మెప్పించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తండ్రిగా, మామగా మెప్పిస్తున్నారు. ఇక రీల్ లైఫ్‌ని పక్కనపెడితే.. రియల్ లైఫ్‌లో జగపతి బాబు చాలా సైలెంట్. సినిమా వేడుకల్లో కూడా ఎక్కువగా మాట్లాడడు. అసలు సినిమా వేడుకలకు హాజరు కావడమే చాలా అరుదు. అలాంటిది ఓ సాధారణ టిక్‌టాక్ స్టార్ అడిగితే స్టేజ్ మీదికి రావడమే కాదు.. అతని కోరికను కాదనకుండా అతనితో కలిపి స్టెప్పులు వేశారు. ఆ టిక్‌టాక్ స్టార్ ఎవరో కాదు దుర్గారావు. జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం‘ఎఫ్.సి.యు.కె’ (ఫాదర్ చిట్టి ఉమ్మా కార్తీక్). ఈ మూవీ ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకకి సోషల్ మీడియా సెలబ్రిటీలను ఆహ్వానించి వారితో పాటలను విడుదల చేయించారు. దీంట్లో భాగంగా ‘అనుకున్నది అవ్వదురా.. కానీ అయ్యేది తెలవదురా’ అనే సాంగ్‌ను టిక్ టాక్ దుర్గారావు, అతని భార్య చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ.. తాను జగపతి బాబు అభిమానిని అని.. ఆయనతో కలిసి ఒక్క స్టెప్ వేయాలని ఉందని కోరాడు. దీంతో జగపతి బాబు స్టేజ్ మీదికి వచ్చి.. దుర్గారావుతో కలిసి స్టెప్పులేసి అలరించాడు. తన కోరికను మన్నించి స్టేజ్ మీదకు వచ్చి డ్యాన్స్ చేసిన జగపతి బాబుకి దుర్గారావు ధన్యవాదాలు తెలిపాడు. కాగా, టిక్‌టాక్ ద్వారా బాగా ఫేమస్ అయిన వారిలో దుర్గారావు ఒకడు. టిక్‌టాక్‌లో తన భార్యతో కలిసి ఇతడు చేసిన డ్యాన్సులు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా అందులో నక్కిలీసు గొలుపు పాటకు ఆ ఇద్దరు వేసిన స్టెప్పులైతే ఎంత ఫేమస్ అయ్యాయో చెప్పక్కర్లేదు. -
తాండూరులో ‘టిక్‌టాక్’ దుర్గారావు సందడి
సాక్షి, తాండూరు టౌన్: టిక్‌టాక్ ఫేమ్ దుర్గారావు–గంగారత్నం దంపతులు ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరులో సందడి చేశారు. ఓ ఆల్బమ్ షూటింగ్ కోసం తాండూరుకు వచ్చిన వారితో పలువురు ఫొటోలు, సెల్ఫీలు దిగారు. డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఉమాశంకర్ నేతృత్వంలో ‘దొంగచూపు చూడకే కొండముచ్చి’ అనే ఆల్బమ్‌లో పాట చిత్రీకరణకు తాండూరు పరిధిలోని నారాయణపూర్ బ్రిడ్జి వద్దకు వచ్చినట్లు దుర్గారావు తెలిపారు. కాగా టిక్ టాక్ యాప్ ద్వారా దుర్గారావు తన భార్యతో కలిసి ఫేమస్ అయిన విషయం తెలిసిందే. హావభావాలతో పాటుగా, తనదైన శైలిలో నటులను అనుకరిస్తూ చేసే వీడియోలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అంతేకాకుండా సినిమా పాటలకి, డైలాగ్స్‌ను తన భార్యతో కలిసి దుర్గారావు వీడియోలు చేయడం విశేషం. -
మినీ వ్యానులో మంటలు
కంకిపాడు(కృష్ణాజిల్లా): వేగంగా వెళ్తున్న వాహనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. అప్రమత్తమైన డ్రైవర్ తన ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ సంఘటన కష్ణాజిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు వంతెన సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గోషాల నుంచి నిడమనూరు వెళ్తున్న మినీ వ్యాన్ ఉప్పులూరు సమీపంలోకి రాగానే ఇంజన్లో మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన డ్రైవర్ దుర్గారావు వాహనం బయటకు వచ్చాడు. మంటలు ఆర్పేందుకు యత్నించే లోపే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి వాహనం పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే లోపే వ్యాను కాలి బూడిదైంది. -
పాత నేరస్తుడి దారుణ హత్య
విజయవాడ: పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి ప్రాంతానికి చెందిన పోలివెట్టి దుర్గారావు కొంతకాలంగా నందిగామలో నివాసం ఉంటున్నాడు. ఇతనిపై పలు దొంగతనాలు, ఘర్షణలకు సంబంధించి కేసులు ఉన్నాయి. ఓ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరయ్యేందుకు గురువారం సాయంత్రం పోరంకికి చేరుకున్న దుర్గారావు స్థానిక మిత్రులతో కలసి రాత్రి స్థానికంగా ఉండే పార్కులో మందుపార్టీ చేసుకున్నాడు. అయితే శుక్రవారం ఉదయం అతడు విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించారు. మిత్రులే అతడిని కొట్టి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
విజయనగరం: తోటపల్లి సీఎం సభలో దుర్గారావు అనే వ్యక్తి గురువారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దుర్గరావు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఎం. రాజాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'దుర్గారావును పోలీసులే కొట్టి చంపారు'
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ వ్యవహారం పోలీసుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. దుర్గారావు లాకప్ డెత్‌పై ఏలూరుకు చెందిన న్యాయవాది రాయలు బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. టవల్‌తో దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నాడనే పోలీసుల వాదన అవాస్తవమని, అలా ఆత్మహత్యకు పాల్పడటం కూడా అసాధ్యమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దుర్గారావును పోలీసులే కొట్టి చంపారని, పోలీసులపై హత్యకేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని రాయలు కోరారు. పోలీసుల జీతాల నుంచి మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేలా చర్యలకు ఆదేశించాలని మానవ హక్కుల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో నక్కా దుర్గారావు అనే విచారణ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. సోమవారం అతడు పోలీస్ స్టేషన్‌లోని బాత్రూంలో హ్యాంగర్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడాడు. ఈ విషయం తెలిసి పోలీసులు ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా దుర్గారావును పలు దొంగతనాల కేసులో పోలీసులు శుక్రవారమే అరెస్టు చేశారు. -
భీమవరం పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్???
-
భీమవరంలో లాకప్‌డెత్
పశ్చిమగోదావరి(భీమవరం): భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో నక్కా దుర్గా రావు అనే విచారణ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీస్ స్టేషన్‌లోని బాత్రూంలో హ్యాంగర్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడాడు. ఈ విషయం తెలిసి పోలీసులు ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దుర్గారావును పలు దొంగతనాల కేసులో శుక్రవారమే అరెస్టు చేసినట్లు తెలిపారు. -
ఆగని వేట!
హైదరాబాద్‌లో పినకడిమి వాసిపై కాల్పులు నిందితులకు కలిసొచ్చిన పోలీసు వైఫల్యం పోలీసుల సహకారంపై బలపడుతున్న అనుమానాలు విజయవాడ సిటీ : పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామ ప్రతీకార దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. గత సెప్టెంబర్‌లో ఉంగుటూరు మండలం పెదఆవుటపల్లి జాతీయ రహదారిపై తండ్రీ కొడుకులను కాల్చి చంపిన నిందితులు.. వీరి సమీప బంధువుపై బుధవారం ఉదయం హైదరాబాద్‌లో కాల్పులు జరిపారు. ట్రిపుల్ మర్డర్ తర్వాత అజ్ఞాతంలో ఉన్న నిందితులు మరోసారి కాల్పులకు తెగబడటం నగర పోలీసుల వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. మూడు హత్యల వెనుక పశ్చిమ గోదావరి పోలీసుల వైఫల్యం ఉంటే.. బుధవారం నాటి ఘటన నగర పోలీసుల వైఫల్యంగానే చెప్పొచ్చు. గత ఏడాది ఏప్రిల్ 7న పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన ఏలూరు జెకె ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ కేసులో ప్రధాన నిందితుడు తూరపాటి నాగరాజు పెదవేగి పోలీసుల కస్టడీ నుంచి పరారై హైదరాబాద్ సరూర్‌నగర్‌లో అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు. దుర్గారావు హత్య కేసులో నిందితులుగా ఉన్న గంధం మారయ్య, ఇతని సోదరుడు పగిడి మారయ్యతో పాటు తండ్రి గంధం నాగేశ్వరరావు సెప్టెంబర్ 24న పెదఆవుటపల్లి జాతీయ రహదారిపై జరిగిన తుపాకీ కాల్పుల్లో మృతి చెందారు. మూడు హత్యలకు లండన్‌లో ఉంటున్న భూతం గోవింద్‌ను ప్రధాన సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు..ఇతని సోదరుడు భూతం శ్రీనివాసరావు సహా పలువురిని నిందితులుగా చేర్చారు. లండన్ నుంచి సుపారీ తీసుకొని ఢిల్లీకి చెందిన కిరాయి షూటర్లు తండ్రీ కొడుకులను పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. ఢిల్లీ పోలీసుల సాయంతో షూటర్లను అక్టోబర్ 8 న అరెస్టు చేసిన పోలీసులు, నిందితులకు సహకరించిన మరికొందరిని కూడా అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు ఇప్పటి వరకు పట్టుబడలేదు. పోలీసులు కూడా షూటర్లు, ఇతర నిందితులను అరెస్టు చేసి ప్రధాన నిందితుల పట్టివేతలో ఉదాసీనంగా వ్యవహరించినట్టు తూరపాటి నాగరాజుపై జరిగిన కాల్పులే నిదర్శనం. సరూర్‌నగర్‌లో ఉంటున్న నాగరాజు బయటకు వెళ్లి మోటారు సైకిల్‌పై ఇంటికి వెళుతుండగా మరో మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు కాల్పులు జరిపారు. నిందితులు మూడు రౌండ్లు కాల్పులు జరపగా రెండు బుల్లెట్ గాయాలకు లోనైన నాగరాజు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదీ జరిగింది పినకడిమికి చెందిన తూరపాటి నాగరాజు కుమారుడైన శివకృష్ణ 2006లో భూతం గోవింద్ కుమార్తె ఉమాదేవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పట్లో వీరి పెళ్లిని భూతం సోదరులు తీవ్రంగా వ్యతిరేకించారు. 2009లో భర్త, అత్తమామలపై ఉమాదేవి పెదవేగి పోలీసు స్టేషన్లో వేధింపుల కేసు పెట్టారు. ఆ తర్వాత జరిగిన సర్పంచి ఎన్నికలు ఆ రెండు కుటుంబాల మధ్య వైరాన్ని మరింత పెంచాయి. నాగరాజుకు వ్యతిరేకంగా భూతం సోదరులు బలపరిచిన వ్యక్తి సర్పంచిగా గెలుపొందారు. అప్పటి నుంచి నాగరాజు భూతం సోదరులపై ప్రతీకారంతో రగిలిపోయాడు. ఇందులో భాగంగా జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు 2014 ఏప్రిల్ 7న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాగరాజు పోలీసుల అదుపు నుంచి తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇతనికి బావ గంధం నాగేశ్వరరావు, మేనళ్లుల్లు పగిడి మారయ్య, మారయ్య ఆర్థికంగా సహకరిస్తున్నారనే అనుమానంపై ఏలూరు కోర్టు వాయిదాకు వెళుతుండగా పెద అవుటుపల్లి గ్రామం వద్ద హతమార్చారు. పోలీసుల సహకారం? తొలి నుంచి కూడా ప్రత్యర్థులను హతమార్చడంలో భూతం సోదరులకు పోలీసుల సహకారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దుర్గారావు హత్యలో ప్రధాన నిందితుడైన నాగరాజు పరారీకి పోలీసులే కారణమని చెబుతున్నారు. ఆ తర్వాత కోర్టు వాయిదాకు వచ్చిన గంధం కుటుంబీకులకు అనధికారిక ఎస్కార్టు ఏర్పాటు చేసి నిందితులకు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై ఓ ఇన్స్పెక్టర్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్య తీసుకున్నారు. తండ్రీ కొడుకుల హత్యకు సంబంధించి ప్రధాన నిందితులను పట్టుకోవడంలో కమిషనరేట్ పోలీసుల వైఫల్యమే నిందితులకు సహకరించిందని చెబుతున్నారు. హత్యలు జరిగిన కొద్ది రోజులు హడావుడి చేసిన పోలీసులు..ఆపై మిన్నుకుండిపోయారు. ఢిల్లీ షూటర్లను, స్థానికంగా ఉన్న కొందరు నిందితులను మాత్రమే పోలీసులు పట్టుకోగలిగారు. అంతే తప్ప విదేశాల్లో ఉండి ప్రత్యర్థులను హతమార్చేందుకు ఆర్థిక సాయం చేస్తున్న గోవింద్‌ను రప్పించడంలోనూ, ఇక్కడే ఉంటూ కిరాయి హంతకులను సమకూర్చుతున్న భూతం శ్రీనివాసరావును పట్టుకోవడంలోను కమిషనరేట్ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. -
ప్రేమ జంట బలవన్మరణం
ఇష్టం లేని పెళ్లితో పరారై వచ్చిన జంట తిరుపతిలోని ఓ లాడ్జీలో బస ఘటనకు ముందు తిరుమలకు వెళ్లివచ్చిన ప్రేమికులు లాడ్జీలోనే ఇద్దరూ ఆత్మహత్య తిరుపతి క్రైం: ఓ ప్రేమ జంట బలవన్మరణం చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసి ప్రియురాలికి దూరం చే యడంతో ఆ యువకుడు మనస్తాపం చెందాడు. ప్రియురాలితో కలిసి తిరుపతికి వచ్చి ఇద్దరూ తిరిగిరాని లోకానికి వెళ్లారు. ఈ ఘటన తిరుపతి నగరంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన దుర్గారావు(25) అలియాస్ పండు, నల్లజర్ల మండలం అనంతపల్లెకు చెందిన దేవిశ్రీ(23) ప్రేమించుకున్నారు. అయితే ఆ యువకుడికి ఇష్టం లే కున్నా తల్లిదండ్రులు 8 నెలల క్రితం శిరీషా అనే అమ్మా యితో వివాహం చేశారు. ఇది నచ్చని అతను నాలుగు రోజుల క్రితం తన ప్రియురాలితో కలిసి తిరుపతికి వచ్చారు. గోవిందరాజస్వామి గుడి సమీపంలో ఓ లాడ్జీలో బుధవారం ఉదయం 4 గంటల సమయంలో గది అద్దెకు తీసుకున్నారు. సాయంత్రం తిరుమల వెళ్లి గురువారం ఉదయం తిరిగి లాడ్జీకి చేరుకున్నారు. సాయంత్రం అద్దె గది ఖాళీ చేయాల్సి ఉండగా లాడ్జి మేనేజర్ ఫోన్ చేయగా పది నిమిషాల్లో రెడీ అయి వస్తామని చెప్పారు. పది నిమిషాల సమయంలో ఏం జరిగిందో తెలియదు. ఇద్దరూ మృత్యువాతపడ్డారు. చేతులు కోసుకుని దేవిశ్రీ ఫ్యాన్‌కు ఉరివేసుకోగా, దుర్గారావు బాత్రూమ్లో ఉరివేసుకున్నాడు. సంఘటనా స్థలంలో పండూ ఐ లవ్యూ.. పండూ ఐలవ్యూ అంటూ 124 పేజీల నోట్‌బుక్ దొరికింది. చచ్చినా, బతికినా నీతోనే అని, మరొకరితో పెళ్లి అయినా నేను నీదానినే అని దేవిశ్రీ స్పష్టంగా అం దులో రాసివుంది. లాడ్జి సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే వారిద్దరూ రక్తపు మడుగులో పడిఉన్నారు. వారి సెల్‌ఫోన్లులో నంబర్ల ఆధారంగా బంధువులకు పోలీసులు ఫోన్ చేసి ఆరా తీయగా వివరాలు తెలిశాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెడికల్ కళాశాలకు తరలించారు. మృతుల తల్లిదండ్రులు, బంధువులు స్వగ్రామం నుంచి బయలుదేరినట్లు సమాచారం. కాగా దేవిశ్రీ కనిపించలేదని ఆమె తల్లిదండ్రులు ఈ నెల 11న నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వైద్యుడిని చితకబాదిన బంధువులు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో రోగి మృతి చెందడంతో ఆగ్రహించిన బంధువులు వైద్యుడిపై దాడికి పాల్పడ్డారు. ఏలూరు రాణినగర్‌కు చెందిన దుర్గారావు కడుపునొప్పితో బాధపడుతూ శుక్రవారం రాత్రి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. అయితే అతను చికిత్స పొందుతూ మృతి చెందడంతో వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే దుర్గారావు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. మృతదేహంతో సహా ధర్నా చేస్తూ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని వాదనలు దిగారు. అనంతరం వైద్యుడు శ్యామ్ సుందర్‌పై దాడికి యత్నించారు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే దుర్గారావు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు డాక్టర్‌పై చేయి చేసుకోవటంతో పాటు ఆసుపత్రి ఆవరణలో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని బంధువులతో చర్చిలు జరపటంతో వారు ఆందోళన విరమించారు. -
నా బిడ్డ శవాన్నయినా అప్పగించండి
పోలీసులే మాయం చేశారు టీడీపీ నాయకులతో కలిసి కుట్ర న్యాయం చేయాలని డీసీపీకి ఓ తల్లి వేడుకోలు అల్లిపురం : తన కుమారుడ్ని అప్పగించాలని ఓ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. కనీసం శవాన్నయినా అప్పగించండంటూ మంగళవారం పోలీసులను వేడుకుంది. తెలుగుదేశం నాయకులతో పోలీసులు కుమ్మక్కై తన బిడ్డను మాయం చేశారని ఆరోపిస్తోంది. భీమిలి మండలం చిననాయినిపాలెంకు చెందిన బొడ్డు దుర్గారావు వైఎస్సార్సీపీ పక్షాన ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఈ నెల 4న గ్రామంలో పోలమాంబ పండగ సందర్భంగా జరిగిన వివాదంలో పోలీసులు దుర్గారావును అరెస్ట్ చేశారు. గత శుక్రవారం విడుదలై వచ్చాడు. అదే రోజు ఆ గ్రామంలో ఫైబర్ బోటును, వలతో సహా గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఈ కేసులో భీమిలీ పోలీసులు శనివారం బొడ్డు దుర్గారావు, బొడ్డు సతీష్‌లను తీసుకువెళ్లారు. తర్వాత వీరేమయ్యారో తెలియలేదు. మూడు రోజులపాటు స్టేషన్ సెల్లోనే చూశామని, సోమవారం సాయంత్రానికి దుర్గారావును పోలీసులు మాయం చేశారని దుర్గారావు తల్లి సత్తెమ్మ, బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తక్షణమే కోర్టులో హాజరుపరచాలని ఈమె భీమిలీ కోర్టులో పిటీషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో కలిసి భీమిలీ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే తాము అలాంటి పేరు గల వ్యక్తులను ఎవరినీ అరెస్ట్ చేసి తీసుకురాలేదని పోలీసులు సమాధానమిచ్చారు. తెలుగుదేశం నాయకులు హరి, పరశురామ్లతో కలసి పోలీసులు కుట్ర పన్ని తన కొడుకును చంపేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేసింది. సత్తెమ్మతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో మంగళవారం కమిషనరేట్ వచ్చి శాంతి,భద్రతల డీసీపీ ఎం.శ్రీనివాసులను కలిశారు. ఆయన సమగ్ర విచారణ చేయిస్తామని భరోసా ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. భీమిలీ సిఐ అప్పలనాయుడు, మధురవాడ ఏసీపీ రంగరాజులను న్యూస్‌లైన్ వివరణ కోరగా భిన్న కథనాలు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. దుర్గారావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకువస్తుండగా కొంతమంది దుండగులు తమపై దాడి చేసి దుర్గారావును తీసుకుపోయారని భీమిలి సీఐ చెబుతున్నారు. ఆ పేరుగ ల వ్యక్తిని భీమిలీ పోలీసులు అరెస్ట్ చేయలేదని మధురవాడ సీఐ చెబుతున్నారు. ఇలా ఇద్దరూ పొంతన లేని సమాధానాలివ్వడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. -
అనుమానంతో భార్య హత్య
పాతపట్నం : అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని బూరగాం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బూరగాం గ్రామంలో యర్లంకి దుర్గారావు కూలి పని చేస్తుంటాడు. మద్యానికి బానిస కావడంతో దుర్గారావుకు, అతని భార్య సుశీల (30)కు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కొంతకాలంగా భార్యపై అనుమానంతో ఉన్న అతను శుక్రవారం ఇంట్లో భార్యపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని సమీపంలో గల పొలాల్లో పడేసి వరిగడ్డితో కప్పేశాడు. అతను అక్కడ సంచరిస్తుండడంతో స్థానికులు అనుమానించడంతో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. సుశీల హత్య ఉదంతం తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వారి కుమార్తె చిట్టెమ్మ ఏడాదిన్నర కిందట మృతి చెందింది. కుమారుడు పెంటయ్య ఉన్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.సురేష్‌బాబు తెలిపారు.