
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా రాణించిన జగపతి బాబు.. ఆ తర్వాత ఆయనలోని మరో యాంగిల్ బయటపెడుతూ విలన్ గా మారారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘లెజండ్’ లో జగపతి బాబు విలన్ గా నటించి మెప్పించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తండ్రిగా, మామగా మెప్పిస్తున్నారు. ఇక రీల్ లైఫ్‌ని పక్కనపెడితే.. రియల్ లైఫ్‌లో జగపతి బాబు చాలా సైలెంట్. సినిమా వేడుకల్లో కూడా ఎక్కువగా మాట్లాడడు. అసలు సినిమా వేడుకలకు హాజరు కావడమే చాలా అరుదు. అలాంటిది ఓ సాధారణ టిక్‌టాక్ స్టార్ అడిగితే స్టేజ్ మీదికి రావడమే కాదు.. అతని కోరికను కాదనకుండా అతనితో కలిపి స్టెప్పులు వేశారు. ఆ టిక్‌టాక్ స్టార్ ఎవరో కాదు దుర్గారావు.
జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం‘ఎఫ్.సి.యు.కె’ (ఫాదర్ చిట్టి ఉమ్మా కార్తీక్). ఈ మూవీ ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకకి సోషల్ మీడియా సెలబ్రిటీలను ఆహ్వానించి వారితో పాటలను విడుదల చేయించారు. దీంట్లో భాగంగా ‘అనుకున్నది అవ్వదురా.. కానీ అయ్యేది తెలవదురా’ అనే సాంగ్‌ను టిక్ టాక్ దుర్గారావు, అతని భార్య చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ.. తాను జగపతి బాబు అభిమానిని అని.. ఆయనతో కలిసి ఒక్క స్టెప్ వేయాలని ఉందని కోరాడు. దీంతో జగపతి బాబు స్టేజ్ మీదికి వచ్చి.. దుర్గారావుతో కలిసి స్టెప్పులేసి అలరించాడు. తన కోరికను మన్నించి స్టేజ్ మీదకు వచ్చి డ్యాన్స్ చేసిన జగపతి బాబుకి దుర్గారావు ధన్యవాదాలు తెలిపాడు.
కాగా, టిక్‌టాక్ ద్వారా బాగా ఫేమస్ అయిన వారిలో దుర్గారావు ఒకడు. టిక్‌టాక్‌లో తన భార్యతో కలిసి ఇతడు చేసిన డ్యాన్సులు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా అందులో నక్కిలీసు గొలుపు పాటకు ఆ ఇద్దరు వేసిన స్టెప్పులైతే ఎంత ఫేమస్ అయ్యాయో చెప్పక్కర్లేదు.