
వైద్యుడిని చితకబాదిన బంధువులు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో రోగి మృతి చెందడంతో ఆగ్రహించిన బంధువులు వైద్యుడిపై దాడికి పాల్పడ్డారు. ఏలూరు రాణినగర్‌కు చెందిన దుర్గారావు కడుపునొప్పితో బాధపడుతూ శుక్రవారం రాత్రి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. అయితే అతను చికిత్స పొందుతూ మృతి చెందడంతో వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే దుర్గారావు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు.
మృతదేహంతో సహా ధర్నా చేస్తూ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని వాదనలు దిగారు. అనంతరం వైద్యుడు శ్యామ్ సుందర్‌పై దాడికి యత్నించారు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే దుర్గారావు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు డాక్టర్పై చేయి చేసుకోవటంతో పాటు ఆసుపత్రి ఆవరణలో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని బంధువులతో చర్చిలు జరపటంతో వారు ఆందోళన విరమించారు.