వంగర: విజయనగరం జిల్లా వంగర మండలం కొప్పరవలస గ్రామానికి చెందిన టొంపాకి దుర్గారావు (26)ను భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా (కేబీ) ఎంపిక చేసింది. ఈ విషయాన్ని అసోసియేషన్ చైర్మన్ కె.మహేంతేష్ గురువారం ఢిల్లీలో ప్రకటించారు.
దుర్గారావు నేపథ్యమిదీ
నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గారావు చిన్నతనంలోనే తండ్రి దాలయ్య మరణించారు. తల్లి సుందరమ్మ రెక్కల కష్టంతో దుర్గారావును పెంచి పెద్దచేశారు. విజయనగరం జిల్లా మెట్టవలస అంధుల పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. ఇంటర్ సికింద్రాబాద్‌లో, డిగ్రీ హైదరాబాద్‌లోని కాలేజీల్లో పూర్తిచేశాడు. అంధుల క్రికెట్లో భారత్ తరఫున రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు.
రెండుసార్లు అంధుల వన్డే క్రికెట్ ప్రపంచ కప్, మూడుసార్లు అంధుల టీ–20 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకోవడంలో దుర్గారావు కీలక పాత్ర పోషించాడు. 2014 భారత అంధుల క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్‌గా ఆరంగేట్రం చేశాడు. 2014 నవంబర్ 7 నుంచి డిసెంబర్ 25 వరకు దక్షిణాఫ్రికాలో జరిగిన అంధుల క్రికెట్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 2016 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు భారత్‌లో జరిగిన టీ–20 జట్టులో స్థానం లభించింది.
2018 జనవరిలో దుబాయ్‌లో జరిగిన అంధుల వరల్డ్ కప్‌లో కూడా ఆల్‌రౌండర్‌గా ప్రతిభ చాటాడు. 2019లో వెస్టిండీస్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లో సత్తాచాటి భారత్‌కు విజయాన్ని అందించాడు. 2022 భారత్‌లో జరిగిన వరల్డ్ కప్ విజయంలోనూ, ఇంటర్నేషనల్ బ్‌లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఇప్సా) లండన్‌లో జరిగిన క్రికెట్ టోర్నీలో ద్వితీయ స్థానం సాధించడంలో కీలక భూమిక పోషించాడు.
ఈ ఏడాది ఫిబ్రవరి 21నుంచి 26 వరకు దుబాయ్‌లో జరిగే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక దేశాల ముక్కోణపు టోర్నీకి భారత అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించనున్నాడు.
నా ఆశయానికి అమ్మే తోడు
నేను మంచి క్రికెటర్‌గా ఎదగాలని ఆకాక్షించాను. కష్టపడి సాధన చేశాను. నా ఆశయానికి మా అమ్మ సుందరమ్మ సహకారం తోడైంది. పాఠశాల, కళాశాలల్లో ఉపాధ్యాయులు, స్నేహితులు ప్రోత్సాహం నాకు మరింత ఉత్సాహాన్నివ్వడంతో భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాను. కష్టపడితే ఎంతటి విజయమైనా సిద్ధిస్తుందని నమ్ముతాను. ఇదే నా విజయ రహస్యం
– టొంపాకి దుర్గారావు, కెప్టెన్ భారత అంధుల జట్టు
Comments
Please login to add a commentAdd a comment