eluru government hospital
-
చింతమనేని ప్రభాకర్ వింత ప్రవర్తన.. ఐసీయూలోకి తోపుడు బండ్లు..
ఏలూరు టౌన్: తన విపరీత ధోరణితో నిత్యం వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నించే ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో వందలాది మందితో లోనికి వెళ్లి వైద్య సేవలకు తీవ్ర అసౌకర్యం కలిగించారు. ఐసీయూలోకి ఏకంగా తోపుడు బండ్లపై మామిడి పండ్లను తీసుకెళ్లి రోగులకు పంచే కార్యక్రమం చేపట్టడంతో సిబ్బంది, రోగుల బంధువులు ముక్కున వేలేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని చింతమనేని తనదైన శైలిలో రెచ్చిపోయారు. బ్యాక్టీరియా, వైరస్లు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు పాటించే ఐసీయూలోకి తోపుడు బండ్లు తీసుకుని వెళ్లడంపై వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సేవా కార్యక్రమాల పేరుతో పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు వేసుకుని మరీ ఆస్పత్రిలో హడావుడి చేయడంపై వైద్యులు, రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఇటు పునాది రాళ్లు-అటు సమాధి రాళ్లు -
ఏలూరు: అస్వస్థత కేసులు తగ్గుముఖం
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరులో అస్వస్థత కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు 556 కేసులు నమోదవ్వగా, 458 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది గంటలుగా కొత్త కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం 68 మంది బాధితులు చికిత్సపొందుతున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని ఎయిమ్స్ బృందం పేర్కొంది. ఆహారం, బ్లడ్, యూరిన్ శాంపిల్స్ సేకరించామని, మంగళగిరిలో కొన్ని టెస్టులు, ఢిల్లీలో కొన్ని టెస్టులు చేశామని వైద్యులు పేర్కొన్నారు. (చదవండి: ఏలూరు ఘటన: సీఎం జగన్‌తో మాట్లాడిన గవర్నర్) రిపోర్ట్స్‌ని బట్టి రక్తంలో ఫెస్టిసైడ్‌తో పాటు లెట్ మెటల్స్ గుర్తించామని, పూర్తి రిపోర్ట్స్ రాగానే కారణాలు తెలుస్తాయని వైద్య బృందం పేర్కొంది. కచ్చితంగా ఇన్ఫెక్షన్ అయితే కాదని.. ఇన్ఫెక్షన్ అయితే జ్వరం తగ్గదని, ఫిట్స్ వస్తున్నాయి కాబట్టి.. వేరే సమస్య అయి ఉండొచ్చని వెల్లడించారు. రేపు సాయంత్రానికి కారణం ఏంటనేది కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. ఢిల్లీ నుంచి మరో బృందం రానుందని.. ఎయిమ్స్ వైద్యుల బృందం తెలిపారు. (చదవండి: ఏలూరు: వైద్య పరీక్షలపై సీఎం జగన్ ఆరా) -
ఏలూరు: వైద్య పరీక్షలపై సీఎం జగన్ ఆరా
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన వారికి నిర్వహిస్తున్న పరీక్షలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఇప్పటివరకూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన వైద్య బృందాలు నిర్వహించిన పరీక్షల వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సీఎంకు వివరించారు. అస్వస్థతకు గురైన వారికి ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం నిర్వహించిన పరీక్షల్లో సీసం, నికెల్ లాంటి మూలకాలు ఉన్నట్టుగా తెలుస్తోందని మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. అలాగే ఐఐసీటీ కూడా పరీక్షలు చేస్తోందని ఆ వివరాలు కూడా త్వరగా వస్తాయని వెల్లడించారు. (చదవండి: ఏలూరు: డబ్ల్యూహెచ్ఓ నుంచి ఇద్దరు ప్రతినిధులు) బాధితులకు నిర్వహించిన పరీక్షలు, అలాగే ఆ ప్రాంతంలో నీళ్లు, పాలకు నిర్వహించిన పరీక్షలు.. వీటన్నింటి ఫలితాలను ఓ నివేదిక రూపంలో పొందుపరచి తనకు ఇవ్వాలని, దీనిపై వీడియో కాన్ఫరెన్స్‌కూడా ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైన అంశాల ప్రకారం సీసం లాంటి మూలకాలు ఎలా ఆ ప్రాంత ప్రజల శరీరాల్లోకి చేరాయో, దానికి తగ్గ కారణాలను పూర్తిస్థాయిలో పరిశోధించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజారోగ్య సిబ్బంది, తదితర విభాగాలు నిశిత పరిశీలన చేయాలని, అస్వస్థతకు దారి తీసిన కారణాలు, మార్గాలను గుర్తించాలని ఆదేశించారు. బాధితులకు కొనసాగుతున్న వైద్య చికిత్స, వారికి అందుతున్న సదుపాయాలపై కూడా అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు.(చదవండి: మనం కట్టేవి 'ఊళ్లు') -
శాంపిల్స్ సేకరిస్తున్నాం
-
మెరుగైన వైద్యంతో భరోసా
-
ఆందోళన వద్దు.. అత్యున్నత వైద్యం అందిస్తున్నాం
సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరు టౌన్: అంతుచిక్కని వ్యాధితో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సోమవారం ఉదయం 10.20 గంటలకు ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ బాధితులతో దాదాపు గంటసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. వారి వద్దకు వెళ్లి వారి మంచంపైనే కూర్చొని అందర్నీ పలకరించారు. బాధితులు ఎలా అస్వస్థతకు గురయ్యారు? ఎలాంటి లక్షణాలు కనిపించాయి? ప్రస్తుతం ఎలా ఉంది? వైద్యం ఎలా అందుతోంది? ఆస్పత్రిలో సదుపాయాలు ఎలా ఉన్నాయి? అని వాకబు చేశారు. బాధితులు ఒక్కొక్కరి వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించి ఆందోళన చెందవద్దని, పూర్తి స్థాయిలో వైద్య చికిత్స అందచేస్తామని ధైర్యాన్ని కల్పించారు. అత్యున్నత వైద్య నిపుణులు, పరిశోధక బృందాలను రప్పించామని ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని స్వయంగా సీఎం భరోసానివ్వడం బాధితులకు కొండంత ఊరటనిచ్చింది. బాధితులకు ఇబ్బంది లేకుండా... బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి వస్తున్నప్పటికీ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒకవైపు ఎమర్జెన్సీ విభాగంలో వైద్య సేవలు కొనసాగిస్తూనే మరోవైపు ఎంసీహెచ్ బ్లాక్‌లో బాధితులను సీఎం పరామర్శించేలా ఏర్పాట్లు చేశారు. అనారోగ్యానికి గురవుతున్న బాధితులకు సత్వరమే వైద్య సేవలు అందించేలా 20 మందికి పైగా వైద్యుల బృందాన్ని నియమించారు. ఎమర్జెన్సీ విభాగం వద్ద హెల్ప్ డెస్కును ఏర్పాటు చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు వివరాలు అందించటంతోపాటు 108 అంబులెన్సు వాహనాలను సిద్ధంగా ఉంచారు. సీఎం వైఎస్ జగన్ వెంట ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎస్పీ కె.నారాయణ నాయక్ తదితరులున్నారు. -
అనుక్షణం అప్రమత్తం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గత కొద్ది రోజులుగా ఏలూరు పరిసరాల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలపై పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అంతుచిక్కని అనారోగ్యంతో ఆకస్మికంగా అస్వస్థతకు గురై ఏలూరులోని ఆసుపత్రిలో చేరిన బాధితులను సీఎం జగన్ సోమవారం పరామర్శించారు. ప్రభుత్వాసుపత్రికి చేరుకుని నేరుగా బాధితులను కలిసి వారితో మాట్లాడారు. అనారోగ్యం ఎలా వచ్చింది? ప్రస్తుతం ఎలా ఉంది? వైద్యం సక్రమంగా అందుతోందా? అని ఆరా తీశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కోలుకుని డిశ్చార్జ్ అయిన వారికి ఏ మందులు ఇస్తున్నారు? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమయ్యారు. సాధారణ స్థాయిలోనే భార లోహాలు.. అంతుబట్టని అనారోగ్యం కేసులు ఎప్పుడు, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయన్న విషయాలను సీఎం జగన్ ఆరా తీశారు. నాలుగో తేదీన నాలుగైదు కేసులు వచ్చాయని, ఐదో తేదీ సాయంత్రం నుంచి కేసులు పెరిగిపోయాయని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు వివరించారు. ఇప్పటి వరకూ 340 కేసులు వెలుగులోకి రాగా 168 మంది డిశ్చార్జి అయ్యారని, 14 మందిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ పంపించామని వివరించారు. డిశ్చార్జి అయిన వారిలో ముగ్గురు మళ్లీ అదే లక్షణాలతో తిరిగి వచ్చారని చెప్పారు. కళ్లు తిరిగి పడిపోవడం, ఫిట్స్, నీరసం, అయోమయంగా ఉండటం లాంటి లక్షణాలు ఉన్నాయని తెలిపారు. అస్వస్థతకు గురైన వారికి అందిస్తున్న వైద్య సహాయం సహా ఇప్పటి వరకూ తీసుకున్న చర్యల గురించి సీఎం వాకబు చేశారు. ఏ పరీక్షలు నిర్వహించారు? ఫలితాలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. తాగునీటిìకి సంబంధించి అన్ని పరీక్షలు చేయించామని, రిపోర్టులు సాధారణంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. అందులో భార లోహాలు (హెవీ మెటల్స్) ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో కూడా పరీక్షలు నిర్వహించామని అవి సాధారణ స్థాయిలోనే ఉన్నాయని కలెక్టర్ వివరించారు. రక్త పరీక్షల నివేదికకు మరికొంత సమయం.. వివిధ రోగాలకు కారణం అయ్యే అన్ని రకాల వైర‹స్ పరీక్షలు నిర్వహించామని, అవి కూడా నెగిటివ్ వచ్చాయని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ వెల్లడించారు. బ్లడ్ కల్చర్ రిపోర్టు రావడానికి కొంత సమయం పడుతుందని, వాటి ఫలితాల కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. సీటీ స్కాన్ రిపోర్టులు కూడా సాధారణంగానే ఉన్నాయన్నారు. అస్వస్థతకు కారణాలు ఇంకా నిర్దిష్టంగా తెలియలేదని చెప్పారు. నీటితో పాటు పాలు కూడా పరీక్షించామని, అవి బాగానే ఉన్నాయన్నారు. అనుమానం ఉన్న అన్ని రకాల పరీక్షలు చేశామని, అయితే ఏ జాడ తెలియలేదన్నారు. ఏలూరు అర్బన్ ప్రాంతంలోనే కాకుండా రూరల్, దెందులూరు పరిధిలో కూడా కేసులు గుర్తించామని చెప్పారు. అనారోగ్యానికి గురైన వారిలో అన్ని వయసుల వారు ఉన్నారని ముఖ్యమంత్రికి వివరించారు. మున్సిపల్ వాటర్ తాగేవారితో పాటు నీళ్లు వేడి చేసుకుని తాగేవారూ అస్వస్థతకు గురవుతున్నారని, మినరల్ వాటర్ తాగేవారు కూడా అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. పరీక్షల కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు శాంపిల్స్ పంపించామని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ బృందాలతోపాటు ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, డబ్ల్యూహెచ్‌వో బృందాలు కూడా వస్తున్నాయని, అవి పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి రావచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పేర్ని నాని, మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కాల్ 104, 108 ప్రత్యేక బృందాలు వచ్చాక వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని, ఏ ఘటన జరిగినా వెంటనే స్పందించేలా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఏలూరులోనే అందుబాటులో ఉండాలని సూచించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా 104, 108 నంబర్లకు కాల్ చేసేలా అవగాహన కల్పించాలని, కాల్ అందిన వెంటనే వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. డిశ్చార్జి అయిన వారిని కూడా అబ్జర్వేషన్లో ఉంచి పౌష్టికాహారం, మందులు అందించాలని జిల్లా కలెక్టర్‌కు సీఎం సూచించారు. -
ఇంకా మిస్టరీనే.. వేగంగా అడుగులు
సీటీ స్కాన్, రక్త పరీక్షల్లో అంతా నార్మల్.. నీటిలోనూ ఎలాంటి తేడాలేదు.. ప్రమాదకర స్థాయిలో భార లోహాల ఆనవాళ్లు లేవు.. కలుషితాల జాడలేవీ కానరాలేదు.. మినరల్ వాటర్, కాచి చల్లార్చిన నీటిని తీసుకున్న వారూ అనారోగ్యం బారిన పడ్డారు. ఈ వింత వ్యాధికి కారణం ఏమిటి..? ఎందుకిలా? ఏలూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, సాక్షి ప్రతినిధి ఏలూరు: అంతుబట్టని వ్యాధికి కారణాలను అన్వేషించేందుకు అత్యున్నత స్థాయి వైద్య నిపుణుల బృందాలను రాష్ట్ర ప్రభుత్వం భాగస్వాములను చేసింది. ఏలూరు పరిసరాల్లో బాధితులకు ఒకవైపు యుద్ధ ప్రాతిపదికన వైద్యసేవలు అందించడం, హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేయ డంతోపాటు నిపుణుల బృందాలను రాష్ట్రానికి రప్పిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన వైద్య బృందం ఇప్పటికే నగరానికి చేరుకోగా కేంద్ర బృందాలను సైతం వెంటనే పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ముగ్గురితో కూడిన కేంద్ర వైద్య నిపుణుల బృందం మంగళవారం ఏలూరు చేరుకుని సాయంత్రానికి నివేదిక ఇవ్వనుంది. ఢిల్లీ ఎయిమ్స్, ఎన్ఐఎన్, ఐసీఎంఆర్, ఎన్సీడీసీ బృందాలు కూడా నేడు ఏలూరు చేరుకోనున్నాయి. విష పదార్థాల ప్రభావమా? ఏలూరులో ఆకస్మికంగా పలువురు వరుసగా అనారోగ్యానికి గురైన ఘటనలో విష పదార్థాల (న్యూరో టాక్సిన్స్) ప్రభావం మెదడుకు సోకి ఇలా జరుగుతుండవచ్చనే కోణంలో పరిశీలన జరుగుతోంది. మూర్ఛ, వాంతుల లక్షణాలతో వస్తున్న బాధితుల నుంచి నమూనాలు సేకరించి ఇప్పటికే వివిధ పరీక్షలు నిర్వహించినా వ్యాధికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదు. కొంతమంది రోగులను నిశితంగా పరిశీలించిన అనంతరం కొన్ని రకాల విష పదార్థాలు బాధితుల మెదడుపై ప్రభావం చూపి ఉండవచ్చనే ప్రాథమిక అంచనాకు వచ్చారు. నీటి ద్వారా, ఆహారం ద్వారా ఇలాంటి విష పదార్థాలు మెదడుకు సోకి మూర్ఛ లేదా వాంతులకు దారి తీసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. గత వారం రోజులుగా బాధితులు ఎలాంటి ఆహారం తీసుకున్నారు? ఏ కూరగాయలు తిన్నారు? అనే వివరాలను సేకరిస్తున్నారు. ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి బాధితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కూపిల్లరీ తేడాలను బట్టి.. బాధితుల కనుగుడ్డులో కొన్ని మార్పులను బట్టి న్యూరో టాక్సిన్స్ దీనికి కారణం కావచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీన్నే కూపిల్లరీ ఛేంజెస్ అంటారు. కనుగుడ్డు మధ్యలో భాగం చూసినప్పుడు స్పందన ఆశించినంతగా లేదని, గుడ్డు పరిమాణం కూడా కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తోంది. సాధారణ వ్యక్తులను బాధితులతో పోల్చిచూస్తే ఈ తేడాలు కనిపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే పైరిథ్రిమ్ (దోమల నియంత్రణకు వాడే మందు) లేదా ఆర్గానో పాస్ఫేట్ (పురుగు మందు) అవశేషాలు కలిసిన ఆహారం తినడం వల్ల ఇలా మెదడు సంబంధిత ఇబ్బందులు తలెత్తి ఉండచ్చునని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్ఫెక్షన్కు తావే లేదు ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరిశీలించిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇన్ఫెక్షన్ (ఒకరి నుంచి ఒకరికి వచ్చే జబ్బు) కాదని నిర్ధారించారు. మాస్ హిస్టీరియా లాంటిది అసలే కాదని నిపుణులు తేల్చారు. ఇన్ఫెక్షన్ సంబంధిత జబ్బులైతే జ్వరం లేదా ఒళ్లు నొప్పులు లాంటివి వస్తాయని, వీరిలో ఇలాంటివేవీ లేవని, దీన్ని బట్టి ఇది ఇన్ఫెక్షన్ జబ్బు కాదని పేర్కొంటున్నారు. ఒక్కోసారి పుట్టగొడుగులు తిన్నా, పచ్చ కర్పూరం, యూకలిప్టస్ ఆయిల్ వాడినా మూర్ఛ, వాంతి లక్షణాలు కనిపించవచ్చు. అయితే అలాంటివి వాడిన వారు బాధితుల్లో ఎవరూ లేరని నిర్ధారించారు. నమూనాలు.. టెస్టులు ఇలా – ఇప్పటివరకు 22 నీటి నమూనాలు సేకరించగా అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. ఇ–కొలి బాక్టీరియా రిపోర్టు మాత్రం ఇంకా రావాల్సి ఉంది. – 52 మంది బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాలను విశ్లేషించి అంతా సాధారణంగానే ఉన్నట్లు గుర్తించారు. – 35 మంది నుంచి సెరబ్రరల్ స్పైనల్ ఫ్లూయిడ్ (వెన్నుపూస ద్రవాలు) సేకరించి పరీక్షలు చేశారు. ఇందులో సెల్‌కౌంట్ నార్మల్‌గా ఉంది. సీమర్ టెస్ట్ రిపోర్టు రావాల్సి ఉంది. – సీటీ స్కాన్ 45 మందికి నిర్వహించగా అందరికీ నార్మల్‌గా ఉన్నట్లు తేలింది. – ర్యాండమ్ మిల్క్ టెస్ట్ (పాలు) 9 నమూనాలు సేకరించి పరీక్షలు చేశారు. ఈ రిపోర్టు రావాల్సి ఉంది. – ఆహారంలో ఏవైనా రసాయనాల ప్రభావం వల్ల ఇలా జరిగిందా? అనే కోణంలో ఐఐసీటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) పరిశోధిస్తోంది. – పుణెలోని ఎన్ఐవీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ) వైరస్ సంబంధిత జాడ కోసం నమూనాలను విశ్లేషిస్తోంది. సీసీఎంబీ నివేదిక కీలకం.. హైదరాబాద్‌లోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) ఇచ్చే రిపోర్టులు కీలకంగా మారాయి. ఆర్ఎన్ఏ, డీఎన్ఏలకు సంబంధించి వెంటనే నిర్ధారణ చేయగలిగే సామర్థ్యం సీసీఎంబీకి ఉంది. వైరస్ లేదా బాక్టీరియా సంబంధిత అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు ఇక్కడ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది. బాధితుల నుంచి సేకరించిన నమూనాలు ఇప్పటికే అక్కడికి పంపారు. ఈ రిపోర్టులు మంగళవారం వచ్చే అవకాశం ఉంది. ఇందులో కొంతమేర కీలక ఆధారాలు లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నగరానికి డబ్ల్యూహెచ్‌వో, ఇతర బృందాలు.. ఏలూరులో చోటు చేసుకున్న ఘటనపై పలు జాతీయ వైజ్ఞానిక పరిశోధనా సంస్థలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. డాక్టర్ గంగాభవానీ నేతృత్వంలో ముగ్గురితో కూడిన బృందం సోమవారం ఏలూరు చేరుకుంది. ఇప్పటికే ఎయిమ్స్ మంగళగిరి వైద్యులు నమూనాలను పరిశీలిస్తుండగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యుల బృందం, ఎన్ఐఎన్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ న్యూట్రిషన్), ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్), ఎన్సీడీసీ (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) బృందాలు నేడు నగరానికి చేరుకోనున్నాయి. నేటి సాయంత్రం కేంద్ర బృందం నివేదిక.. అంతుచిక్కని వ్యాధికి కారణాలను అన్వేషించేందుకు ముగ్గురితో కూడిన కేంద్ర వైద్య బృందం మంగళవారం ఏలూరు చేరుకోనుంది. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జంషెడ్ నాయర్, వైరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ డియోష్టవర్, డాక్టర్ సంకేత్ కులకర్ణితో కూడిన బృందం తమ పరిశోధనలో తేలిన అంశాలపై నేటి సాయంత్రానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. మరోవైపు దీనిపై జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుతో మాట్లాడిన ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో కూడా ఉపరాష్ట్రపతి మాట్లాడారు. బాధితులకు ఉన్నత స్థాయి వైద్యం అందించడంతోపాటు ఈ ఘటనకు కారణాలను శోధించి వీలైనంత త్వరగా పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించాలని సూచించారు. ప్రాథమిక అంచనా మాత్రమే పలువురు బాధితులను పరిశీలించినప్పుడు దీనికి న్యూరో టాక్సిన్స్ కారణం కావచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చాం. ఆ కోణంలో పరిశోధిస్తున్నాం. ఇది ఇన్ఫెక్షన్ డిసీజ్ కాదనేది వంద శాతం నిజం. ఇప్పటివరకూ ఏ రిపోర్టులోనూ ఇన్ఫెక్షన్కు ఆధారాలు లభించలేదు. బాధితుల కళ్లను పరిశీలించినప్పుడు కూపిల్లరీ ఛేంజెస్ కనిపించాయి. దీన్ని బట్టి పెస్టిసైడ్స్ ప్రభావం ఉండవచ్చని అంచనా వేస్తున్నాం’ –డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరో ఫిజీషియన్ ఆందోళన అవసరం లేదు.. ‘ఏలూరు ఘటనపై ఆందోళన అవసరం లేదు. ఎవరికీ ప్రాణాపాయం లేదు. అన్నిరకాల టెస్టులూ చేశాం. జాతీయ సంస్థలు నమూనాలు సేకరించి కారణాలను విశ్లేషిస్తున్నాయి. బాధితులకు సత్వర చికిత్స అందేలా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. డిశ్చార్జి అయిన వారి వద్దకు కూడా రోజూ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు వెళ్లి పరిస్థితిపై సమాచారం ఇవ్వాలని ఆదేశించాం’ –కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ రికవరీ రేటు బావుంది ‘బాధితుల సంఖ్య పెరుగుతున్నా రికవరీ రేటు బాగుంది. ఏ ఒక్కరికీ ప్రాణాపాయ పరిస్థితి లేదు. ప్రముఖ వైద్యుల సూచనల మేరకు మూర్ఛ నియంత్రణకు మెడజాలం, ఫినటాయిన్, లెవటరెసిటాం లాంటి ఇంజక్షన్లు ఇస్తున్నాం. వెంటనే కోలుకుంటున్నారు’ –డా.పీవీఆర్ మోహన్, సూపరింటెండెంట్, ఏలూరు జిల్లా ఆస్పత్రి -
రేపు ఏలూరుకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన వారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు ( సోమవారం) పరామర్శించనున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయల్దేరుతారు. ఉదయం 10:20 గంటలకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. తర్వాత స్థానిక జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం అవుతారు. (చదవండి : ఏలూరు ఘటన: 292కి చేరిన బాధితులు) ఏలూరులో పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే సీఎం జగన్ ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి నాని ఆదివారం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించడమే కాకుండా వైద్యపరంగా తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో స్వయంగా పర్యవేక్షించారు. సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఏలూరులో బాధితులను పరామర్శించి అస్వస్థతకు దారితీసిన కారణాలపై పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కూడా రేపు ఏలూరులో పర్యటించి అధికారులతో సమావేశంకానున్నారు. -
ఏలూరు ఘటన: క్రమంగా తగ్గుతున్న కేసులు..
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య ఇప్పటివరకు 270కి చేరింది. అస్వస్థతకు గురైన బాధితులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఇప్పటివరకు 117 మందిని డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం పదిమందిని అధికారులు విజయవాడ తరలించారు. బాధితులకు వైద్యసిబ్బంది అలుపెరగకుండా సేవలు అందిస్తున్నారు. (చదవండి: భయపడవద్దు.. అండగా ఉంటాం: ఆళ్ల నాని) లక్షణాలు కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. వైద్య బృందం.. ఇంటింటికి ఆరోగ్య సర్వే చేపట్టింది. టెస్టుల కోసం శాంపిల్స్‌ను అధికారులు వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఫిట్స్ లక్షణాలతో చేరిన బాధితులకు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో అదనపు బెడ్లు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంత్రి ఆళ్లనాని పర్యవేక్షణలో కలెక్టర్, అధికారులు చర్యలు చేపట్టారు. కంట్రోల్ రూమ్ ద్వారా కలెక్టర్.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. (చదవండి: ఏలూరు ఘటనపై సీఎం జగన్ ఆరా) డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సమీక్ష.. ఉదయం నుంచి క్రమంగా కేసులు తగ్గాయని మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్, డీఎంహెచ్‌వో, వైద్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతాల్లో 108 వాహనాలు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎం కార్యాలయం నుంచి గంట గంటకు ఇక్కడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని మంత్రి తెలిపారు. ‘‘నీరు, ఫుడ్ పాయిజన్ లాంటివి ఏమీ జరగలేదు. విజయవాడ ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చింది. నిపుణుల బృందాలు కూడా ఏలూరు రానున్నాయి. ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతాల్లో వాలంటీర్లు సర్వే చేపట్టారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని రేపు(సోమవారం) సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శిస్తారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సీఎం సమీక్షిస్తారని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. -
భయపడవద్దు.. అండగా ఉంటాం: ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు : అస్వస్థతకు గురై ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని ఆదివారం ఉదయం మరోసారి పరామర్శించారు. వార్డులో ఉన్న ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులతో పాటు, అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 227 కేసులు నమోదయ్యాయి.ఇంకా మూర్ఛ, వాంతులు వంటి బాధితులు పెరుగుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలోనే కాకుండా ప్రయివేట్ ఆసుపత్రుల్లో వీరు చేరారు. ఇప్పటివరకూ70 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. బాధితుల్లో 105 మంది పురుషులు, 76 మంది స్త్రీలు, 46 మంది చిన్నారులు ఉన్నారు. (ఏలూరు ఘటనపై సీఎం జగన్ ఆరా) కేసుల వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశాం. ఇంటింటి సర్వే చేసి ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తున్నాం. మెరుగైన వైద్యం కోసం కొందరిని విజయవాడ తరలించాం. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఫోన్ చేశారు. ఘటనపై సీఎం జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి చక్కబడే వరకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. బాధితులకు బాసటగా ఉంటాం. ఎటువంటి ఆందోళన చెందవద్దు. ప్రాణాంతకమైన వ్యాధి కాదు, ఎవరు భయపడవద్దు. ప్రత్యేక వైద్య బృందాలను ఏలూరు పంపించి వ్యాధి లక్షణాలపై పరీక్షలు చేస్తామని ముఖ్యమంత్రి ఆదేశించారు. (ఏలూరులో కలకలం.. పలువురికి అస్వస్థత) ఎవరికీ ప్రాణపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. చికిత్స అనంతరం సాధారణ స్థితికి వస్తున్నారు. నీటి నమూనా సేకరించిన రాష్ట్ర స్థాయి ల్యాబ్‌కు పంపాం. నీటిలో కాలుష్యం లేదని నివేదికలో తేలింది. బాధితుల రక్త నమునాలు సేకరించి ల్యాబ్‌కు పంపాం. ఎలాంటి వైరస్ కారణాలు లేవని తేలింది. మరికొన్ని రిపోర్టులు రావాల్సి ఉంది. వచ్చాక కారణాలు తెలుస్తాయి. ఈ పరిస్థితికి కారణాలను ఆన్వేషిస్తున్నాం. స్వయంగా ముఖ్యమంత్రి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు’ అని తెలిపారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అంతుచిక్కని వ్యాధిపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరెండెంటెంట్, డీఎంహెచ్‌వో, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
ఏలూరు ఘటన: 20 మంది డిశ్చార్జ్
సాక్షి, ఏలూరు: నగరంలోని వన్‌టౌన్ ఏరియాలో అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బాధితులు డిశ్చార్జ్ అవుతున్నారు. శనివారం అర్ధరాత్రి డాక్టర్ల బృందం పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం.. 20 మంది బాధితులు పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించే విషయంలో డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక పర్యవేక్షణలో ఏలూరు కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని మోనిటరింగ్ చేయడానికి మంత్రి ఆదేశాలు ఇచ్చారు. చదవండి: (ఏలూరులో కలకలం.. పలువురికి అస్వస్థత) ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంచార్జి డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ పర్యవేక్షణలో వైద్యుల బృందం ప్రత్యేకంగా వైద్యసేవలు అందిస్తోంది. ఈ మేరకు వైద్యుల బృందం మీడియాతో మాట్లాడుతూ.. ఏలూరు నగరంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దు. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మంత్రి ఆళ్ల నాని ఆదేశాల మేరకు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిళ్ళపల్లి జై ప్రకాష్ ప్రభుత్వ ఆస్పత్రిలో మకాం వేసి బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు సమన్వయం చేస్తున్నారు. ఏలూరులో అనారోగ్యానికి గురైన ప్రాంతాలలో ప్రత్యేకంగా మెడికల్ టీమ్‌లు, ఇంటింటి సర్వే చేపట్టామని తెలిపారు. కాగా, మంత్రి ఆదేశాల మేరకు ఏలూరు ఆర్డీవో పనబాక రచన, ఎమ్మార్వో సోమశేఖర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. -
ఏలూరు ప్రభుత్వాస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్న బాధితులు
-
గాయపడ్డ వారికి మంత్రి ఆళ్ల నాని పరామర్శ
సాక్షి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద రోడ్డుప్రమాదంలో గాయపడ్డవారిని మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసిన ఆయన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. తెలంగాణలోని ముణుగూరులో జరిగే వివాహానికి వెళ్లేందుకు ఏలూరు నుంచి 280 మంది మిని బస్సులో బయలుదేరారు. పుట్లగట్లగూడెం వద్దకు రాగానే బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. వెంటనే ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. -
గాయపడ్డ వారికి మంత్రి ఆళ్ల నాని పరామర్శ
-
అసభ్యకర వీడియో చిత్రీకరణ.. వ్యక్తికి దేహశుద్ది
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : తమకు తెలియకుండా అసభ్యకర వీడియో చిత్రీకరిస్తున్న ఓ వ్యక్తికి దేహశుద్ధి చేశారు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి మహిళా సెక్యూరిటీ సిబ్బంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళా సెక్యూరిటీ సిబ్బందికి తెలియకుండా చాటుగా ఓ వ్యక్తి వారిని వీడియో తీస్తున్నాడు. అది గమనించిన ఓ మహిళా సెక్యూరిటీ.. మిగితా సిబ్బందికి తెలియజేశారు. ఇంతలోనే ఆ వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేశారు. పరుగెత్తి పట్టుకున్న సిబ్బంది ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అతని ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేసి పోలీసులకు అప్పగించారు. -
వైద్యుడిని చితకబాదిన బంధువులు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో రోగి మృతి చెందడంతో ఆగ్రహించిన బంధువులు వైద్యుడిపై దాడికి పాల్పడ్డారు. ఏలూరు రాణినగర్‌కు చెందిన దుర్గారావు కడుపునొప్పితో బాధపడుతూ శుక్రవారం రాత్రి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. అయితే అతను చికిత్స పొందుతూ మృతి చెందడంతో వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే దుర్గారావు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. మృతదేహంతో సహా ధర్నా చేస్తూ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని వాదనలు దిగారు. అనంతరం వైద్యుడు శ్యామ్ సుందర్‌పై దాడికి యత్నించారు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే దుర్గారావు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు డాక్టర్‌పై చేయి చేసుకోవటంతో పాటు ఆసుపత్రి ఆవరణలో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని బంధువులతో చర్చిలు జరపటంతో వారు ఆందోళన విరమించారు.