‘సుప్రీత్... కంగారుపడొద్దు. అంతా బాగుంటుంది. నీకు మేమంతా ఉన్నాం..’ – ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బాలుడికి ముఖ్యమంత్రి జగన్ భరోసా
సీటీ స్కాన్, రక్త పరీక్షల్లో అంతా నార్మల్.. నీటిలోనూ ఎలాంటి తేడాలేదు.. ప్రమాదకర స్థాయిలో భార లోహాల ఆనవాళ్లు లేవు.. కలుషితాల జాడలేవీ కానరాలేదు.. మినరల్ వాటర్, కాచి చల్లార్చిన నీటిని తీసుకున్న వారూ అనారోగ్యం బారిన పడ్డారు. ఈ వింత వ్యాధికి కారణం ఏమిటి..? ఎందుకిలా?
ఏలూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, సాక్షి ప్రతినిధి ఏలూరు: అంతుబట్టని వ్యాధికి కారణాలను అన్వేషించేందుకు అత్యున్నత స్థాయి వైద్య నిపుణుల బృందాలను రాష్ట్ర ప్రభుత్వం భాగస్వాములను చేసింది. ఏలూరు పరిసరాల్లో బాధితులకు ఒకవైపు యుద్ధ ప్రాతిపదికన వైద్యసేవలు అందించడం, హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేయ డంతోపాటు నిపుణుల బృందాలను రాష్ట్రానికి రప్పిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన వైద్య బృందం ఇప్పటికే నగరానికి చేరుకోగా కేంద్ర బృందాలను సైతం వెంటనే పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ముగ్గురితో కూడిన కేంద్ర వైద్య నిపుణుల బృందం మంగళవారం ఏలూరు చేరుకుని సాయంత్రానికి నివేదిక ఇవ్వనుంది. ఢిల్లీ ఎయిమ్స్, ఎన్‌ఐఎన్, ఐసీఎంఆర్, ఎన్సీడీసీ బృందాలు కూడా నేడు ఏలూరు చేరుకోనున్నాయి.
విష పదార్థాల ప్రభావమా?
ఏలూరులో ఆకస్మికంగా పలువురు వరుసగా అనారోగ్యానికి గురైన ఘటనలో విష పదార్థాల (న్యూరో టాక్సిన్స్) ప్రభావం మెదడుకు సోకి ఇలా జరుగుతుండవచ్చనే కోణంలో పరిశీలన జరుగుతోంది. మూర్ఛ, వాంతుల లక్షణాలతో వస్తున్న బాధితుల నుంచి నమూనాలు సేకరించి ఇప్పటికే వివిధ పరీక్షలు నిర్వహించినా వ్యాధికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదు. కొంతమంది రోగులను నిశితంగా పరిశీలించిన అనంతరం కొన్ని రకాల విష పదార్థాలు బాధితుల మెదడుపై ప్రభావం చూపి ఉండవచ్చనే ప్రాథమిక అంచనాకు వచ్చారు. నీటి ద్వారా, ఆహారం ద్వారా ఇలాంటి విష పదార్థాలు మెదడుకు సోకి మూర్ఛ లేదా వాంతులకు దారి తీసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. గత వారం రోజులుగా బాధితులు ఎలాంటి ఆహారం తీసుకున్నారు? ఏ కూరగాయలు తిన్నారు? అనే వివరాలను సేకరిస్తున్నారు. ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి బాధితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
కూపిల్లరీ తేడాలను బట్టి..
బాధితుల కనుగుడ్డులో కొన్ని మార్పులను బట్టి న్యూరో టాక్సిన్స్ దీనికి కారణం కావచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీన్నే కూపిల్లరీ ఛేంజెస్ అంటారు. కనుగుడ్డు మధ్యలో భాగం చూసినప్పుడు స్పందన ఆశించినంతగా లేదని, గుడ్డు పరిమాణం కూడా కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తోంది. సాధారణ వ్యక్తులను బాధితులతో పోల్చిచూస్తే ఈ తేడాలు కనిపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే పైరిథ్రిమ్ (దోమల నియంత్రణకు వాడే మందు) లేదా ఆర్గానో పాస్ఫేట్ (పురుగు మందు) అవశేషాలు కలిసిన ఆహారం తినడం వల్ల ఇలా మెదడు సంబంధిత ఇబ్బందులు తలెత్తి ఉండచ్చునని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇన్ఫెక్షన్‌కు తావే లేదు
ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరిశీలించిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇన్ఫెక్షన్ (ఒకరి నుంచి ఒకరికి వచ్చే జబ్బు) కాదని నిర్ధారించారు. మాస్ హిస్టీరియా లాంటిది అసలే కాదని నిపుణులు తేల్చారు. ఇన్ఫెక్షన్ సంబంధిత జబ్బులైతే జ్వరం లేదా ఒళ్లు నొప్పులు లాంటివి వస్తాయని, వీరిలో ఇలాంటివేవీ లేవని, దీన్ని బట్టి ఇది ఇన్ఫెక్షన్ జబ్బు కాదని పేర్కొంటున్నారు. ఒక్కోసారి పుట్టగొడుగులు తిన్నా, పచ్చ కర్పూరం, యూకలిప్టస్ ఆయిల్ వాడినా మూర్ఛ, వాంతి లక్షణాలు కనిపించవచ్చు. అయితే అలాంటివి వాడిన వారు బాధితుల్లో ఎవరూ లేరని నిర్ధారించారు.
నమూనాలు.. టెస్టులు ఇలా
– ఇప్పటివరకు 22 నీటి నమూనాలు సేకరించగా అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. ఇ–కొలి బాక్టీరియా రిపోర్టు మాత్రం ఇంకా రావాల్సి ఉంది.
– 52 మంది బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాలను విశ్లేషించి అంతా సాధారణంగానే ఉన్నట్లు గుర్తించారు.
– 35 మంది నుంచి సెరబ్రరల్ స్పైనల్ ఫ్లూయిడ్ (వెన్నుపూస ద్రవాలు) సేకరించి పరీక్షలు చేశారు. ఇందులో సెల్‌కౌంట్ నార్మల్‌గా ఉంది. సీమర్ టెస్ట్ రిపోర్టు రావాల్సి ఉంది.
– సీటీ స్కాన్ 45 మందికి నిర్వహించగా అందరికీ నార్మల్‌గా ఉన్నట్లు తేలింది.
– ర్యాండమ్ మిల్క్ టెస్ట్ (పాలు) 9 నమూనాలు సేకరించి పరీక్షలు చేశారు. ఈ రిపోర్టు రావాల్సి ఉంది.
– ఆహారంలో ఏవైనా రసాయనాల ప్రభావం వల్ల ఇలా జరిగిందా? అనే కోణంలో ఐఐసీటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) పరిశోధిస్తోంది.
– పుణెలోని ఎన్‌ఐవీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ) వైరస్ సంబంధిత జాడ కోసం
నమూనాలను విశ్లేషిస్తోంది.
సీసీఎంబీ నివేదిక కీలకం..
హైదరాబాద్‌లోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) ఇచ్చే రిపోర్టులు కీలకంగా మారాయి. ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏలకు సంబంధించి వెంటనే నిర్ధారణ చేయగలిగే సామర్థ్యం సీసీఎంబీకి ఉంది. వైరస్ లేదా బాక్టీరియా సంబంధిత అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు ఇక్కడ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది. బాధితుల నుంచి సేకరించిన నమూనాలు ఇప్పటికే అక్కడికి పంపారు. ఈ రిపోర్టులు మంగళవారం వచ్చే అవకాశం ఉంది. ఇందులో కొంతమేర కీలక ఆధారాలు లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
నగరానికి డబ్ల్యూహెచ్‌వో, ఇతర బృందాలు..
ఏలూరులో చోటు చేసుకున్న ఘటనపై పలు జాతీయ వైజ్ఞానిక పరిశోధనా సంస్థలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. డాక్టర్ గంగాభవానీ నేతృత్వంలో ముగ్గురితో కూడిన బృందం సోమవారం ఏలూరు చేరుకుంది. ఇప్పటికే ఎయిమ్స్ మంగళగిరి వైద్యులు నమూనాలను పరిశీలిస్తుండగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యుల బృందం, ఎన్‌ఐఎన్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ న్యూట్రిషన్), ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్), ఎన్‌సీడీసీ (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) బృందాలు నేడు నగరానికి చేరుకోనున్నాయి.
నేటి సాయంత్రం కేంద్ర బృందం నివేదిక..
అంతుచిక్కని వ్యాధికి కారణాలను అన్వేషించేందుకు ముగ్గురితో కూడిన కేంద్ర వైద్య బృందం మంగళవారం ఏలూరు చేరుకోనుంది. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జంషెడ్ నాయర్, వైరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ డియోష్టవర్, డాక్టర్ సంకేత్ కులకర్ణితో కూడిన బృందం తమ పరిశోధనలో తేలిన అంశాలపై నేటి సాయంత్రానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. మరోవైపు దీనిపై జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుతో మాట్లాడిన ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో కూడా ఉపరాష్ట్రపతి మాట్లాడారు. బాధితులకు ఉన్నత స్థాయి వైద్యం అందించడంతోపాటు ఈ ఘటనకు కారణాలను శోధించి వీలైనంత త్వరగా పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించాలని సూచించారు.
ప్రాథమిక అంచనా మాత్రమే
పలువురు బాధితులను పరిశీలించినప్పుడు దీనికి న్యూరో టాక్సిన్స్ కారణం కావచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చాం. ఆ కోణంలో పరిశోధిస్తున్నాం. ఇది ఇన్ఫెక్షన్ డిసీజ్ కాదనేది వంద శాతం నిజం. ఇప్పటివరకూ ఏ రిపోర్టులోనూ ఇన్ఫెక్షన్‌కు ఆధారాలు లభించలేదు. బాధితుల కళ్లను పరిశీలించినప్పుడు కూపిల్లరీ ఛేంజెస్ కనిపించాయి. దీన్ని బట్టి పెస్టిసైడ్స్ ప్రభావం ఉండవచ్చని అంచనా వేస్తున్నాం’
–డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరో ఫిజీషియన్
ఆందోళన అవసరం లేదు..
‘ఏలూరు ఘటనపై ఆందోళన అవసరం లేదు. ఎవరికీ ప్రాణాపాయం లేదు. అన్నిరకాల టెస్టులూ చేశాం. జాతీయ సంస్థలు నమూనాలు సేకరించి కారణాలను విశ్లేషిస్తున్నాయి. బాధితులకు సత్వర చికిత్స అందేలా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. డిశ్చార్జి అయిన వారి వద్దకు కూడా రోజూ ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు వెళ్లి పరిస్థితిపై సమాచారం ఇవ్వాలని ఆదేశించాం’
–కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ
రికవరీ రేటు బావుంది
‘బాధితుల సంఖ్య పెరుగుతున్నా రికవరీ రేటు బాగుంది. ఏ ఒక్కరికీ ప్రాణాపాయ పరిస్థితి లేదు. ప్రముఖ వైద్యుల సూచనల మేరకు మూర్ఛ నియంత్రణకు మెడజాలం, ఫినటాయిన్, లెవటరెసిటాం లాంటి ఇంజక్షన్లు ఇస్తున్నాం. వెంటనే కోలుకుంటున్నారు’
–డా.పీవీఆర్ మోహన్, సూపరింటెండెంట్, ఏలూరు జిల్లా ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment