పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ వ్యవహారం పోలీసుల మెడకు ఉచ్చు బిగుస్తోంది.
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ వ్యవహారం పోలీసుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. దుర్గారావు లాకప్ డెత్పై ఏలూరుకు చెందిన న్యాయవాది రాయలు బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. టవల్తో దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నాడనే పోలీసుల వాదన అవాస్తవమని, అలా ఆత్మహత్యకు పాల్పడటం కూడా అసాధ్యమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దుర్గారావును పోలీసులే కొట్టి చంపారని, పోలీసులపై హత్యకేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని రాయలు కోరారు. పోలీసుల జీతాల నుంచి మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేలా చర్యలకు ఆదేశించాలని మానవ హక్కుల కమిషన్కు విజ్ఞప్తి చేశారు.
కాగా భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో నక్కా దుర్గారావు అనే విచారణ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. సోమవారం అతడు పోలీస్ స్టేషన్‌లోని బాత్రూంలో హ్యాంగర్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడాడు. ఈ విషయం తెలిసి పోలీసులు ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా దుర్గారావును పలు దొంగతనాల కేసులో పోలీసులు శుక్రవారమే అరెస్టు చేశారు.