Lock-up Death
-
కొట్టి చంపేశారు...?
మార్టూరు:ఎస్ఐపై దాడి కేసులో పోలీస్టేషన్‌కు నిందితుడిగా తీసుకొచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించింది. మృతుడి శరీరంపై తీవ్రంగా కొట్టిన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులు మాత్రం అనారోగ్యంతో చనిపోయినట్టు చెబుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా బొల్లాపల్లి టోల్గేట్ వద్ద మార్టూరు ఎస్ఐ నాగమల్లేశ్వరావుపై గత నెల 25వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఇందులో భాగంగా పది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం అదిలాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన పార్టీస్ గ్యాంగ్‌కు చెందిన ఎనిమిది మందిని (ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు) అనుమానితులుగా భావించి మార్టూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో భాగంగా వీరిని విచక్షణారహితంగా హింసించారని సమాచారం. దీంతో బుధవారం మధ్యాహ్నం నిందితుల్లో ఒకరైన రాధోడ్ విజయ్ (25) పరిస్థితి విషమంగా తయారైంది. దీంతో వారిని హడావిడిగా కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ప్రెస్‌నోట్ సిద్ధం చేశారు కూడా. అయితే నిందితులను కోర్టులో ప్రవేశపెట్టేందుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం యద్ధనపూడి ఎస్ఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాధోడ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు ఫిట్నెస్ సర్టిఫికెట్ నిరాకరించి అతన్ని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. అయితే పోలీసులు అద్దంకి ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి ఒంగోలు రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలిసిన మీడియా ప్రతినిధులు సాయంత్రం నాలుగు గంటలకు మార్టూరు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే స్టేషన్‌కు చేరిన చీరాల డీఎస్పీ ప్రేమ్ కాజల్, కందుకూరు డీఎస్పీ ప్రకాశరావు, చీరాల రూరల్, వన్‌టౌన్, టు టౌన్ సీఐలు భక్త వత్సలరెడ్డి, సూర్య నారాయణ, రామారావు సంయుక్తంగా కేసును తమకు అనుకూలంగా మార్చుకోవడానికి పథక రచన ప్రారంభించారు. రాత్రి 8.30 గంటల తర్వాత సోషల్ మీడియా ద్వారా ప్రెస్ నోట్ పంపించారు. అయితే అందులో మొదట రిమాండ్‌కు తరలించినట్లు ఉంది. అందులోనే చివరలో రాసిన వివరాలు పోలీసుల ద్వంద్వ వైఖరిని వెల్లడిస్తున్నాయి. మొదట రిమాండ్‌కు తరలించినట్లు స్పష్టంగా ఉండగా చివరలో మాత్రం కోర్టుకు తీసుకెళ్లేందుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఆస్పత్రికి వెళ్లగా అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు పేర్కొన్నారు. అనుమానాస్పదంగా పోలీసుల తీరు జరిగిన సంఘటనలో పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉంది. మార్టూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ఎక్కడా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు విచక్షణార హితంగా కొట్టడం, బాధించడంతోనే విజయ్రాధోడ్ చనిపోయినట్లు శరీరంపై ఉన్న గాయాల గుర్తులు స్పష్టం చేస్తున్నాయి. లాకప్‌డెత్‌ను సాధారణ గుండెపోటుగా చిత్రీకరించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
లాకప్ డెత్ కాదు..గుండెపోటే!
⇒ భీమ్‌సింగ్ మరణంపై పోస్టుమార్టం నివేదికలో వెల్లడి? ⇒ పోలీసులు కొట్టడం వల్లే మృతిచెందాడంటున్న మృతుడి భార్య ⇒ భీమ్‌సింగ్ కుటుంబానికి రూ. 5 లక్షలు పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని నాయిని హామీ హైదరాబాద్: హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ ఠాణాలో శనివారం కుప్పకూలి మరణించిన భీమ్‌సింగ్‌కు పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా మార్చురీ వద్ద రెండోరోజూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భీమ్‌సింగ్ పోలీసుల దెబ్బల వల్లే మృతి చెందాడని మృతుడి బంధువులు స్థానికులు ఆదివారం కూడా మార్చురీ వద్ద తమ ఆందోళన కొనసాగించారు. ఇదిలా ఉండగా గుండెపోటుతోనే భీమ్‌సింగ్ చనిపోయాడని పోస్ట్‌మార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నట్లు తెలిసింది. గుండెపోటు వల్లనే భీమ్‌సింగ్ మృతి చెందాడని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు అభిప్రాయపడినట్లు నగర సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. భీమ్‌సింగ్ మృతిపై కేసు నమోదుచేసి మహంకాళీ ఏసీపీని విచారణ అధికారిగా నియమించామని ఈ అధికారి అభ్యర్థన మేరకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం భీమ్‌సింగ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కాగా, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల ఆందోళనతో ఆదివారం ఉస్మానియా ఆందోళనలతో అట్టుడికింది. పోలీసుల బందోబస్తును సైతం పట్టించుకోకుండా బంధువులు ఆందోళనను కొనసాగించారు. ఇది తెలుసుకున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెస్ట్, సౌత్ జోన్ డీసీపీలు వెంకటేశ్వర్రావు, సత్యనారాయణలకు ఫోన్ చేసి మృతుని కుటుంబానికి రూ.ఐదు లక్షల నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హమీ ఇచ్చారు. ఈ విషయాన్ని మృతుడి బంధువులకు వెల్లడించడంతో ఆందోళన సద్దుమణిగింది. అనంతరం పురానపూల్లో పోలీసు బందోబస్తు మధ్య భీమ్‌సింగ్ మృతదేహానికి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. న్యాయ విచారణ జరిపించాలి: ఉత్తమ్ భీమ్‌సింగ్ మృతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులతో కలసి ఆదివారం ఉస్మానియా మార్చురీ వద్ద ఆయన భీమ్‌సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరితో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధాతో పాటు మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి బీజేపీ నేతలు భీమ్‌సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఉన్నారు. పోలీసులు కొట్టడంతోనే.. నా భర్తకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. విచారణకు పిలిచి పోలీసులు కొట్టడంతోనే నా భర్త చనిపోయాడు. –గంగాభాయ్, భీమ్‌సింగ్ భార్య -
కారంచేడు పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్?
♦ ఫిట్స్ వస్తే చికిత్స చేయిస్తుండగా చనిపోయాడంటున్న పోలీసులు ♦ చావుకు ఏపీ పోలీసులే కారణం అంటున్న మృతుని బంధువులు ♦ జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని ఏపీ ఎమ్మెల్యే ఆమంచి డిమాండ్ చీరాల: దొంగతనం కేసులో కారంచేడు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఆటో డ్రైవర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. చావుకు పోలీసులే కారణమని, మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని కొట్టినందువల్లే చనిపోయాడంటూ పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులు ప్రకాశం జిల్లా చీరాల ఏరియూ ఆసుపత్రి మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోస్టుమార్టం నిలిచిపోయింది. పోలీసులు మాత్రం వేటపాలెంలో జరిగిన ఓ దొంగతనం కేసుకు సంబంధించి ఓ ఆటోడ్రైవర్‌ను విజయవాడలో అదుపులోకి తీసుకొని కారంచేడు పోలీస్‌స్టేషన్‌కు తరలించామని, అతనికి ఫిట్స్ రావడంతో వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడని చెబుతున్నారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఘటనా స్థలానికి వచ్చి పోలీసులే చంపి ఆ తర్వాత వైద్యశాలకు తరలించారని, ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపిం చాలని డిమాండ్ చేశారు. బంధువులు, ఆమంచి వర్గీయులతో పాటు పోలీసులు అధిక సంఖ్యలో రావడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
విచారణకని వెళ్లి.. శవమయ్యాడు!
అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లిలో లాకప్‌డెత్? ధర్మవరం: ఒక హత్య కేసులో అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి(సీకే పల్లి) పోలీసులు అదుపులో తీసుకున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మూడు రోజుల క్రితం పోలీసులతో పాటు వెళ్లిన బత్తిని శ్రీరాములు(52) అనే వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలో శవమై కనిపించాడు. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర అనేక అనుమానాలకు తావిస్తోంది. లాకప్‌డెత్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులే చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. సీకే పల్లి మండలం ముష్టికోవెల కొండల్లో మాల సుధాకర్ అనే వ్యక్తి ఈ ఏడాది జూన్‌లో హత్యకు గురయ్యాడు. గుప్తనిధుల తవ్వకాల్లో భాగంగా ఈ హత్య జరిగినట్లు నిర్ధారించుకున్న సీకే పల్లి పోలీసులు కేసు దర్యాప్తులో కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. అందులో భాగంగా కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామానికి చెందిన శ్రీరాములును మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అలా విచారణకు అని వెళ్లిన ఆయన ఉన్నట్టుండి శుక్రవారం సీకే పల్లి ప్రభుత్వాసుపత్రిలో శవం అయ్యాడు. ఆసుపత్రిలో నమోదైన వివరాల ప్రకారం బంధువులకు సమాచారం అందించగా... అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
‘లాకప్ డెత్’పై విచారణ ప్రారంభం
గోల్కొండ: ఆసిఫ్‌నగర్ ఠాణాలో ‘లాకప్ డెత్’పై విచారణ ప్రారంభించారు. కేసు విచారణాధికారి, సీసీఎస్ ఏసీపీ సోమేశ్వర రావు సోమవారం ఉదయమే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన నేరుగా లాకప్‌లో వృతిచెందిన నక్కల పద్మ నివసించే భోజగుట్ట శివాజీనగర్ వెళ్లారు. వుృతురాలి కుటుంబ సభ్యులను కలిశారు. పద్మ కుమారులు సాయి, రవిలతో సుదీర్ఘంగా మాట్లాడారు. పలు వివరాలను ఆయన సేకరించారు. చోరీ కేసులో ప్రధాన నిందితులైన మంజుల, లక్ష్మీలతో పద్మకు ఉన్న పరిచయంపై కూడా ఆయన వివరాలను ఆరా తీశారు. కాగా ఎఫ్ఐఆర్లో ఉన్న వివరాలు, పద్మ కుమారులు తెలిపిన వివరాలకు సబంధం లేనట్లుగా తెలిసింది. ఇదిలా ఉండగా ఆభరణాలతో ఉన్న బ్యాగ్‌ను పోగొట్టుకున్న దీప్తిరాజ్ ఇచ్చిన ఫిర్యాదు కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి దీప్తిరాజ్ ఎఫ్ఐఆర్ను నిశితంగా పరిశీలించారు. సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ నాంపల్లి: ఆసిఫ్‌నగర్ ఠాణాలో చోటుచేసుకున్న నక్కల పద్మ లాకప్ డెత్ కేసును రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. లాకప్‌డెత్ ఘటనపై సెప్టెంబరు 11వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. దీంతో పాటుగా ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్, హైదరాబాదు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి సమగ్రమైన నివేదికను అందజేయాలని కోరింది. -
'దుర్గారావును పోలీసులే కొట్టి చంపారు'
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ వ్యవహారం పోలీసుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. దుర్గారావు లాకప్ డెత్‌పై ఏలూరుకు చెందిన న్యాయవాది రాయలు బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. టవల్‌తో దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నాడనే పోలీసుల వాదన అవాస్తవమని, అలా ఆత్మహత్యకు పాల్పడటం కూడా అసాధ్యమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దుర్గారావును పోలీసులే కొట్టి చంపారని, పోలీసులపై హత్యకేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని రాయలు కోరారు. పోలీసుల జీతాల నుంచి మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేలా చర్యలకు ఆదేశించాలని మానవ హక్కుల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో నక్కా దుర్గారావు అనే విచారణ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. సోమవారం అతడు పోలీస్ స్టేషన్‌లోని బాత్రూంలో హ్యాంగర్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడాడు. ఈ విషయం తెలిసి పోలీసులు ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా దుర్గారావును పలు దొంగతనాల కేసులో పోలీసులు శుక్రవారమే అరెస్టు చేశారు. -
భీమవరం పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్???
-
భీమవరంలో లాకప్‌డెత్
పశ్చిమగోదావరి(భీమవరం): భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో నక్కా దుర్గా రావు అనే విచారణ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీస్ స్టేషన్‌లోని బాత్రూంలో హ్యాంగర్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడాడు. ఈ విషయం తెలిసి పోలీసులు ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దుర్గారావును పలు దొంగతనాల కేసులో శుక్రవారమే అరెస్టు చేసినట్లు తెలిపారు. -
పోలీసులే కొట్టి చంపారు: మృతుని బంధువుల ఆరోపణ
కాకినాడ: ఓ కేసులో క్రైమ్ విభాగానికి సంబంధించిన పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మృతి చెందడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ కేసు విచారణ నిమిత్తం వెంకటరమణ అనే వ్యక్తిని టూటౌన్ పీఎస్ పోలీసులు తీసుకొచ్చారు. నిందితుడు వెంకటరమణను తీసుకొచ్చిన కొద్ది సేపటికే మృతి చెందాడు. దాంతో వెంకటరమణను పోలీసులే కొట్టి చంపారంటూ మృతుడి బంధువులు ఆరోపించారు. పోలీసులు కొట్టి చంపారంటూ మృతుని బంధువులు పోలీస్ స్టేషన్ బయట బైటాయించారు. దాంతో పోలీసు స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది.