
మార్టూరు:ఎస్‌ఐపై దాడి కేసులో పోలీస్టేషన్‌కు నిందితుడిగా తీసుకొచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించింది. మృతుడి శరీరంపై తీవ్రంగా కొట్టిన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులు మాత్రం అనారోగ్యంతో చనిపోయినట్టు చెబుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా బొల్లాపల్లి టోల్‌గేట్ వద్ద మార్టూరు ఎస్‌ఐ నాగమల్లేశ్వరావుపై గత నెల 25వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఇందులో భాగంగా పది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం అదిలాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన పార్టీస్ గ్యాంగ్‌కు చెందిన ఎనిమిది మందిని (ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు) అనుమానితులుగా భావించి మార్టూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
విచారణలో భాగంగా వీరిని విచక్షణారహితంగా హింసించారని సమాచారం. దీంతో బుధవారం మధ్యాహ్నం నిందితుల్లో ఒకరైన రాధోడ్ విజయ్ (25) పరిస్థితి విషమంగా తయారైంది. దీంతో వారిని హడావిడిగా కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ప్రెస్‌నోట్ సిద్ధం చేశారు కూడా. అయితే నిందితులను కోర్టులో ప్రవేశపెట్టేందుకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం యద్ధనపూడి ఎస్‌ఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాధోడ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ నిరాకరించి అతన్ని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. అయితే పోలీసులు అద్దంకి ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి ఒంగోలు రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
విషయం తెలిసిన మీడియా ప్రతినిధులు సాయంత్రం నాలుగు గంటలకు మార్టూరు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే స్టేషన్‌కు చేరిన చీరాల డీఎస్పీ ప్రేమ్ కాజల్, కందుకూరు డీఎస్పీ ప్రకాశరావు, చీరాల రూరల్, వన్‌టౌన్, టు టౌన్ సీఐలు భక్త వత్సలరెడ్డి, సూర్య నారాయణ, రామారావు సంయుక్తంగా కేసును తమకు అనుకూలంగా మార్చుకోవడానికి పథక రచన ప్రారంభించారు. రాత్రి 8.30 గంటల తర్వాత సోషల్ మీడియా ద్వారా ప్రెస్ నోట్ పంపించారు. అయితే అందులో మొదట రిమాండ్‌కు తరలించినట్లు ఉంది. అందులోనే చివరలో రాసిన వివరాలు పోలీసుల ద్వంద్వ వైఖరిని వెల్లడిస్తున్నాయి. మొదట రిమాండ్‌కు తరలించినట్లు స్పష్టంగా ఉండగా చివరలో మాత్రం కోర్టుకు తీసుకెళ్లేందుకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం ఆస్పత్రికి వెళ్లగా అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు పేర్కొన్నారు.
అనుమానాస్పదంగా పోలీసుల తీరు
జరిగిన సంఘటనలో పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉంది. మార్టూరు ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు ఎక్కడా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు విచక్షణార హితంగా కొట్టడం, బాధించడంతోనే విజయ్‌రాధోడ్ చనిపోయినట్లు శరీరంపై ఉన్న గాయాల గుర్తులు స్పష్టం చేస్తున్నాయి. లాకప్‌డెత్‌ను సాధారణ గుండెపోటుగా చిత్రీకరించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment