లాకప్ డెత్ కాదు..గుండెపోటే!
⇒ భీమ్‌సింగ్ మరణంపై పోస్టుమార్టం నివేదికలో వెల్లడి?
⇒ పోలీసులు కొట్టడం వల్లే మృతిచెందాడంటున్న మృతుడి భార్య
⇒ భీమ్‌సింగ్ కుటుంబానికి రూ. 5 లక్షలు పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని నాయిని హామీ
హైదరాబాద్: హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ ఠాణాలో శనివారం కుప్పకూలి మరణించిన భీమ్‌సింగ్‌కు పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా మార్చురీ వద్ద రెండోరోజూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భీమ్‌సింగ్ పోలీసుల దెబ్బల వల్లే మృతి చెందాడని మృతుడి బంధువులు స్థానికులు ఆదివారం కూడా మార్చురీ వద్ద తమ ఆందోళన కొనసాగించారు. ఇదిలా ఉండగా గుండెపోటుతోనే భీమ్‌సింగ్ చనిపోయాడని పోస్ట్‌మార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నట్లు తెలిసింది. గుండెపోటు వల్లనే భీమ్‌సింగ్ మృతి చెందాడని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు అభిప్రాయపడినట్లు నగర సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. భీమ్‌సింగ్ మృతిపై కేసు నమోదుచేసి మహంకాళీ ఏసీపీని విచారణ అధికారిగా నియమించామని ఈ అధికారి అభ్యర్థన మేరకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం భీమ్‌సింగ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
కాగా, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల ఆందోళనతో ఆదివారం ఉస్మానియా ఆందోళనలతో అట్టుడికింది. పోలీసుల బందోబస్తును సైతం పట్టించుకోకుండా బంధువులు ఆందోళనను కొనసాగించారు. ఇది తెలుసుకున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెస్ట్, సౌత్ జోన్ డీసీపీలు వెంకటేశ్వర్‌రావు, సత్యనారాయణలకు ఫోన్ చేసి మృతుని కుటుంబానికి రూ.ఐదు లక్షల నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హమీ ఇచ్చారు. ఈ విషయాన్ని మృతుడి బంధువులకు వెల్లడించడంతో ఆందోళన సద్దుమణిగింది. అనంతరం పురానపూల్‌లో పోలీసు బందోబస్తు మధ్య భీమ్‌సింగ్ మృతదేహానికి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
న్యాయ విచారణ జరిపించాలి: ఉత్తమ్
భీమ్‌సింగ్ మృతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులతో కలసి ఆదివారం ఉస్మానియా మార్చురీ వద్ద ఆయన భీమ్‌సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరితో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధాతో పాటు మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి బీజేపీ నేతలు భీమ్‌సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఉన్నారు.
పోలీసులు కొట్టడంతోనే..
నా భర్తకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. విచారణకు పిలిచి పోలీసులు కొట్టడంతోనే నా భర్త చనిపోయాడు.
–గంగాభాయ్, భీమ్‌సింగ్ భార్య