Osmania mortuary
-
అనుమానాస్పద రీతిలో విశ్రాంత ఆర్మీ అధికారి మృతి
హైదరాబాద్: అనుమానాస్పద రీతిలో ఓ విశ్రాంత ఆర్మీ అధికారి మృతి చెందిన ఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మెహిదీపట్నం సంతోష్‌నగర్ విజయశ్రీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నం.406లో ఆర్మీ విశ్రాంత ఉద్యోగి శంకర శ్రీశైల మల్లిఖార్జునరావు(75) తన భార్య రోహిణితో కలసి నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు శ్రీధర్, కుమార్తె శ్రీదేవి ఉద్యోగ నిమిత్తం అమెరికాలో ఉంటున్నారు. ఆదివారం రోహిణి టీ తీసుకుని బెడ్రూంలోకి వెళ్లబోగా తలుపు లోపల గడియవేసి ఉంది. ఎంతసేపు పిలిచినా చప్పుడు లేకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచి తలుపు విరగ్గొట్టి చూడగా బెడ్రూంలో నుంచి దట్టమైన పొగలు కనిపించాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అదుపులోకి రాలేదు. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పి చూడగా మల్లిఖార్జున్‌రావు పూర్తిగా కాలిపోయి ఉన్నారు. కాగా, ఇతనికి టీ తాగి స్మోక్ చేసే అలవాటు ఉన్నట్లు రోహిణి తెలిపింది. సమాచారం అందుకున్న ఎస్సై పి.వెంకటేశ్వర్లు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.130... ఒక ప్రాణం!
- ఒకరినొకరు తోసుకున్న హోటల్ కార్మికులు - కింద పడిపోయిన కార్మికుడు రాజు - సిమెంట్ దిమ్మకు తల తగిలి మృతి హైదరాబాద్: రూ.130 కోసం ఇద్దరు హోటల్ కార్మికుల మధ్య తలెత్తిన ఘర్షణ ఒకరి మరణానికి కారణమైంది. రాజధాని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పైస్ బావర్చీ హోటల్ వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది హత్య కాదని, ఐపీసీ సెక్షన్ 304(2) కింద కేసు నమోదు చేశామని కంచన్‌బాగ్ ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపారు. మహరాష్ట్రకు చెందిన రాజు (28), ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన కమలేశ్ (30) బతుకుతెరువు కోసం నగరానికి వచ్చారు. అడ్డా కూలీలైన వీరు పబ్లిక్ గార్డెన్లో నివసిస్తున్నారు. ఇటీవల ఇరువురినీ హఫీజ్‌బాబానగర్‌లోని స్పైస్ బావర్చి రెస్టారెంట్ నిర్వాహకుడు పనికి కుదుర్చుకున్నాడు. మూడు రోజుల క్రితం రూ.130 అప్పుగా ఇచ్చానని, ఈ మొత్తం తిరిగి ఇవ్వాలని సోమవారం రాజును కమలేశ్ అడిగాడు. అయితే తాను డబ్బే తీసుకోలేదని, అలాంటప్పుడు ఎలా తిరిగిస్తానంటూ రాజు వాదించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తన డబ్బులిచ్చే వరకు పనికి కూడా వెళ్లనీయనంటూ రాజును కమలేశ్ అడ్డుకున్నాడు. ఈ ఘర్షణలో కమలేశ్ బలంగా తోయగా... రాజు అక్కడే ఉన్న సిమెంట్‌తో నిర్మించిన డ్రైనేజీ రెయిలింగ్‌పై పడ్డాడు. కణత భాగానికి బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న కంచన్‌బాగ్ పోలీసులు... నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఐపీసీ సెక్షన్ 304(2) కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
లాకప్ డెత్ కాదు..గుండెపోటే!
⇒ భీమ్‌సింగ్ మరణంపై పోస్టుమార్టం నివేదికలో వెల్లడి? ⇒ పోలీసులు కొట్టడం వల్లే మృతిచెందాడంటున్న మృతుడి భార్య ⇒ భీమ్‌సింగ్ కుటుంబానికి రూ. 5 లక్షలు పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని నాయిని హామీ హైదరాబాద్: హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ ఠాణాలో శనివారం కుప్పకూలి మరణించిన భీమ్‌సింగ్‌కు పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా మార్చురీ వద్ద రెండోరోజూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భీమ్‌సింగ్ పోలీసుల దెబ్బల వల్లే మృతి చెందాడని మృతుడి బంధువులు స్థానికులు ఆదివారం కూడా మార్చురీ వద్ద తమ ఆందోళన కొనసాగించారు. ఇదిలా ఉండగా గుండెపోటుతోనే భీమ్‌సింగ్ చనిపోయాడని పోస్ట్‌మార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నట్లు తెలిసింది. గుండెపోటు వల్లనే భీమ్‌సింగ్ మృతి చెందాడని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు అభిప్రాయపడినట్లు నగర సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. భీమ్‌సింగ్ మృతిపై కేసు నమోదుచేసి మహంకాళీ ఏసీపీని విచారణ అధికారిగా నియమించామని ఈ అధికారి అభ్యర్థన మేరకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం భీమ్‌సింగ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కాగా, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల ఆందోళనతో ఆదివారం ఉస్మానియా ఆందోళనలతో అట్టుడికింది. పోలీసుల బందోబస్తును సైతం పట్టించుకోకుండా బంధువులు ఆందోళనను కొనసాగించారు. ఇది తెలుసుకున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెస్ట్, సౌత్ జోన్ డీసీపీలు వెంకటేశ్వర్రావు, సత్యనారాయణలకు ఫోన్ చేసి మృతుని కుటుంబానికి రూ.ఐదు లక్షల నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హమీ ఇచ్చారు. ఈ విషయాన్ని మృతుడి బంధువులకు వెల్లడించడంతో ఆందోళన సద్దుమణిగింది. అనంతరం పురానపూల్లో పోలీసు బందోబస్తు మధ్య భీమ్‌సింగ్ మృతదేహానికి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. న్యాయ విచారణ జరిపించాలి: ఉత్తమ్ భీమ్‌సింగ్ మృతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులతో కలసి ఆదివారం ఉస్మానియా మార్చురీ వద్ద ఆయన భీమ్‌సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరితో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధాతో పాటు మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి బీజేపీ నేతలు భీమ్‌సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఉన్నారు. పోలీసులు కొట్టడంతోనే.. నా భర్తకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. విచారణకు పిలిచి పోలీసులు కొట్టడంతోనే నా భర్త చనిపోయాడు. –గంగాభాయ్, భీమ్‌సింగ్ భార్య -
ఆమె మృతదేహం కోసం ‘వారి’ వాగ్వాదం
♦ అయిదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్న వివాహిత ఆత్మహత్య ♦ తల్లిదండ్రులు హిందువులు, భర్త ముస్లిం కావడంతో వివాదం ♦ ఉస్మానియా మార్చురీ వద్ద 3 గంటలసేపు ఇరువురి బంధువుల వాగ్వాదాలు ♦ పోలీసుల జోక్యంతో కొలిక్కి, బందోబస్తు మధ్య ఖననం సాక్షి, హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకోవడానికి ఆమె కులం, మతం గోడలు బద్దలుకొట్టింది. అయితే చనిపోయిన తర్వాత వాటి నేపథ్యంలోనే ఆమె అంతిమ సంస్కారం ‘వివాదం’లో చిక్కుకోవడం పలువురిని కదిలించింది. ఆమె తల్లిదండ్రులు హిందువులు, భర్త ముస్లిం కావడంతో ఏ మతాచారం ప్రకారం ఆమెను సాగనంపాలన్న దానిపై రగడ చోటుచేసుకుంది. నగరంలోని ఉస్మానియా మార్చురీ వద్ద మంగళవారం మూడు గంటల పాటు సాగిన ఈ వివాదం చివరకు రాజీతో తెరపడింది. అంత్యక్రియల నేపథ్యంలో ఆసిఫ్‌నగర్ పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని రామ్‌నగర్ ప్రాంతానికి చెందిన విక్రమాచారి కుమార్తె ప్రియాంక చారి. తమ కుటుంబ స్నేహితుడిగా ఉన్న జునైద్ ఆష్మీతో ప్రేమలో పడింది. అయిదేళ్ల కిందట అతడిని వివాహం చేసుకోవడానికి ఇస్లాం మతం స్వీకరించి తన పేరును అర్బా సుల్తానాగా మార్చుకుంది. వృత్తిరీత్యా కారుడ్రైవరైన జునైద్ ఆరు నెలల కిందట జీవనోపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు.అర్బా మాత్రం జేబాబాగ్ మిలన్ థియేటర్ సమీపంలో అత్తవారింట్లో నివసిస్తోంది. జునైద్, అర్బాలకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. డిసెంబర్ 31న పుట్టింటికి వెళ్లిన అర్బా ఆదివారం జేబాబాగ్కు తిరిగి వచ్చింది. సోమవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో హఠాత్తుగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అర్బా కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఆత్మహత్య విషయం తెలుసుకున్న జునైద్ మంగళవారం దుబాయ్ నుంచి నగరానికి చేరుకున్నాడు. పోస్టుమార్టం పరీక్షలు పూర్తయ్యే సమయానికి అర్బా తల్లిదండ్రులు, భర్త తదితరులు మార్చురీ వద్దకు చేరుకున్నారు. వీరిలో ఎవరికి వారు తమ మతాచారం ప్రకారం అంత్యక్రియలు చేయాలని భావించారు. దీంతో మృతదేహాన్ని తమకు అప్పగించాలంటే తమకు ఇవ్వాలంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఇలా ప్రారంభమైన చిరువివాదం మూడున్నర గంటల పాటు తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. చివరకు పోలీసుల జోక్యంతో రాజీకి వచ్చిన అర్బా తల్లిదండ్రులు మృతదేహాన్ని జునైద్‌కు అప్పగించడానికి అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. మంగళవారం సాయంత్రం జేబాబాగ్లోని ముస్లిం శ్మశాన వాటికలో అర్బా మృతదేహం ఖననం చేయగా...ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసిఫ్‌నగర్ ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు ‘సాక్షి’తో మాట్లాడుతూ... ఇరు పక్షాలు వారంతట వారే రాజీకి రావడంతో అర్బా భర్తకు ఆమె మృతదేహాన్ని అప్పగించామన్నారు. దీంతో వివాదం ముగిసిందని తెలిపారు. -
బాబోయ్ మార్చురీ!
♦ ఉస్మానియాలో పనిచేయని ఫ్రీజర్లు ♦ గుట్టలుగా పేరుకుపోతున్న మృతదేహాలు ♦ పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులు ♦ ఆందోళనలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అప్జల్‌గంజ్ : ఉస్మానియా ఆసుపత్రి శవాల కంపు కొడుతోంది. మార్చురీలోని ఫ్రీజర్లు పని చేయడంలేదు. దీనికి తోడు అనాథ శవాలు గుట్టుగుట్టలుగా పేరుకుపోతున్నాయి. వీటిని బయట పెట్టడంతో ఎండల తీవ్రత కారణంగా త్వరగా కుళ్లిపోయి కిలో మీటరు మేర దుర్వాసన వెదజల్లుతోంది. కొంతకాలం క్రితం మార్చురీని ఆధునీకరించి 38 వరకు శవాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 3 మాత్రమే పని చేస్తున్నాయి. ఎండ తీవ్రత పెరగడంతో నగరంలో మృతుల సంఖ్య పెరిగింది. పుట్‌పాత్‌లు, ప్రధాన కూడళ్ల వద్ద ఉండే యాచకులు, వృద్ధులు వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్నారు. ఇలా మార్చురీకి రోజు 3 నుంచి 4 వరకు అనాథ శవాలు చేరుతున్నాయి. పోస్టుమార్టం నిర్వహించాక మార్చురీలో భద్రపరుస్తున్నారు. మృతదేహాల వద్ద లభించిన సమాచారాన్ని బట్టి కొన్నింటిని వారి బంధువులకు అప్పగిస్తున్నారు. మిగితా వాటిని కొన్ని రోజుల తర్వాత మార్చురీలో ఉన్న ఓ గదిలో పడేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఆ గది పూర్తిగా శవాల గుట్టగా మారిపోయింది. అనాథ శవాల విషయంలో అటు ఆసుపత్రి యాజమాన్యంగాని, ఇటు జీహెచ్ఎంసీ అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. దీంతో రోజుల తరబడి శవాలు మార్చురీలోనే కుళ్లిపోతున్నాయి. వెదజల్లుతున్న దుర్వాసన ఉస్మానియా మార్చురీలో ప్రస్తుతం 80కి పైగా మృతదేహాలు కుళ్లిపోయే దశలో ఉన్నాయి. వీటన్నింటినీ ఫ్రీజర్ల నుంచి తీసి ఓ గదిలో పడేశారు. వీటి నుంచి ముక్కుపుటాలు అదిరే దుర్వాసన వస్తోంది. కుళ్లిపోయిన శవాలపైన వాలిన ఈగలు, దోమల పలు రకాల వ్యాధులను వ్యాపింప చేస్తున్నాయి. ఉస్మానియా మార్చురీ వెనుక భాగంలో ప్రధాన రహదారి ఉంది. ఈ మార్గంలో నిత్యం వందలాది మంది వాహనదారులు ప్రయాణిస్తుంటారు.ఉస్మానియా మార్చురీకి దగ్గరలోనే పీజీ విద్యార్థుల క్వార్టర్స్, ఆసుపత్రి పరిపాలనా విభాగం, మార్చురీ ప్రహరీ ఆనుకొని విద్యుత్ సబ్ స్టేషన్ ఉన్నాయి. మార్చురీ నుంచి వస్తున్న దుర్వాసనతో ఆసుపత్రి సిబ్బంది,రోగులు ఇబ్బందిపడుతున్నారు. పట్టించుకోని జీహెచ్ఎంసీ... గతంలో అనాథ శవాలను సత్యహరిశ్ఛద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పురానాపూల్, అంబర్‌పేట, నల్లకుంట, బన్సీలాల్‌పేట్ శ్మశాన వాటికల్లో మూకుమ్ముడిగా దహనం చేసేవారు. ఆయ ప్రాంతాల వారి నుంచి తీవ్ర అభ్యంతరం రావడంతో నిలిపివేశారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను జీహెచ్ఎంసీ చూస్తోంది. కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదు. మార్చురీలోని ఫ్రీజర్ల మరమ్మతులకు కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి పేరుకుపోయిన మృతదేహాలను జీహెచ్ఎంసీ అధికారులు తరలించి ఖననం చేయాలని ఆసుపత్రి సిబ్బంది కోరుతున్నారు. లేదంటే పరిస్థితి విషమించి పలు రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కలకలం రేపిన మొండెం లేని తల
అప్జల్‌గంజ్: మొండెం లేని తల కలకలం రేపింది... ఆదివారం గౌలిగూడలో గుర్తుతెలియని వ్యక్తిని ఎవరో హత్య చేసి తలను, మొండెంను వేరు చేశారనే వదంతులు వ్యాపించాయి. తీరా అది ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తల అని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు... కాచిగూడ రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతడి తల, మొండెం వేరయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఉస్మానియా మార్చురీకి రిక్షాలో తరలించారు. అయితే రిక్షాలో మృతదేహాన్ని తరలిస్తుండగా గౌలిగూడ శివాజీ బ్రిడ్జి సమీపంలో రిక్షాలోంచి తల కిందపడింది. ఇది గమనించని రిక్షావాలా మొండెంతో ఉస్మానియా మార్చురీకి వెళ్లిపోయాడు. తల రోడ్డుపై పడటంతో అది చూసిన పాదచారులు, వాహనదారులు ఎవరో వ్యక్తిని హత్య చేసి, తలను రోడ్డుపై పడేశారంటూ పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఆ వ్యక్తిని హత్య చేశారనే పుకార్లు షికార్లు చేశాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అప్జల్‌గంజ్ ఎస్ఐ రాఘవేందర్ దర్యాప్తు చేపట్టగా...అది కాచిగూడ రైల్వేస్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి తల అని తేలింది. అయితే రిక్షాలో తరలిస్తుండగా పడిపోయినట్లు గుర్తించిన పోలీసులు రిక్షావాలను రప్పించి తలను ఉస్మానియా మార్చురీకి తరలించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
మార్చురీ వద్దే పడిగాపులు
ఉస్మానియా ఆస్పత్రి వద్ద బస్సు దుర్ఘటన మృతుల బంధువుల నిరీక్షణ గుర్తించిన మృతదేహాలను అప్పగించాలంటూ వేడుకోలు సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో మృతి చెందినవారికి సంబంధించిన వివరాలుగానీ, మృతుల వస్తువులకు సంబంధించిగానీ ఏదైనా వివరాలు కావాలంటే హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో గానీ, ఉస్మానియా ఆస్పత్రిలోని పోలీస్ హెల్ప్‌లైన్ కేంద్రంలోగానీ సంప్రదించాలని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. మరోవైపు.. కొందరు మృతుల బంధువులు శుక్రవారం ఉస్మానియా మార్చురీ వద్దకు తరలివచ్చారు. దీంతో ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణం అయిన వారి దుఃఖంతో కన్నీటి సంద్రమైంది. మృతుల బంధువులు కొందరు రెండు రోజుల నుంచీ మార్చురీ వద్దే నిరీక్షిస్తున్నారు. ఆభరణాలు, వస్తువులను బట్టి తమవారి మృతదేహాలను గుర్తించామని, వాటిని తమకు అప్పగించాలని విన్నవిస్తూనే ఉన్నారు. కాగా.. అఫ్జల్‌గంజ్ పీఎస్‌ను నోడల్ కేంద్రంగా ఏర్పాటు చేశామని, మృతదేహాలు ఆస్పత్రి మార్చురీలో ఉన్నా అవి పోలీసుల అధీనంలోనే ఉంటాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉస్మానియా మార్చురీలో 42 మృతదేహాలున్నాయని, వాటిని కోడ్ నంబర్లతో భద్రపరిచామని పేర్కొన్నారు. మృతదేహాల శాంపిళ్లకు, బంధువుల డీఎన్ఏ నమూనాలు సరిపోలి.. పోలీసులు అనుమతించిన తర్వాత మృతదేహాలను అప్పగిస్తామన్నారు. వైద్య విద్య డెరైక్టర్ ఈ మృతదేహాలకు సంబంధించిన నివేదికను వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఇచ్చారు. కాగా.. గురువారం 41 మంది మృతులకు సంబంధించిన బంధువులు వారి డీఎన్ఏ నమూనాలు ఇవ్వగా... మిగతా ఒక్క మృతుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్లాస్ కాంట్రాక్టర్ అజయ్ చౌహాన్ సోదరుడు వినోద్ చౌహాన్ శుక్రవారం డీఎన్ఏ శాంపిల్ ఇచ్చారు. దీంతో డీఎన్ఏ నమూనాల సేకరణ ముగిసినట్లు మహబూబ్‌నగర్ ఓఎస్డీ ఆపరేషన్స్ బి.కమలాకర్‌రెడ్డి ప్రకటించారు. డీఎన్ఏ పరిశీలన నివేదిక రావడానికి వారం రోజులకు పైనే పడుతుందని, ఆ తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని అసిస్టెంట్ కలెక్టర్ విజయకుమార్ రాజు పేర్కొన్నారు. మృతదేహాలను గుర్తించిన అనంతరం తామే బంధువులకు ఫోన్‌ద్వారా సమాచారం ఇస్తామని, స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. వారం రోజులు ఎక్కడుండాలి..? బస్సు దుర్ఘటనలో మరణించిన అజయ్ చౌహాన్ మృతదేహం కోసం వచ్చిన ఆయన సోదరుడు వినోద్ చౌహాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఆయన మృతదేహాన్ని ఇచ్చేవరకూ ఎక్కడ ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అజయ్ మృతి చెందిన విషయం ఆలస్యంగా తెలిసింది. డీఎన్ఏ పరీక్షల కోసం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాను. కూలి పనులు చేసుకుని జీవించే వాళ్లం. మృతదేహాన్ని ఎప్పుడు అప్పగిస్తారో తెలియదు. అంతవరకు ఎక్కడ ఉండాలో తెలియడం లేదు. ప్రభుత్వాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు’’ అని వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. నిలకడగా క్షతగాత్రుల ఆరోగ్యం.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో యోగేష్ గౌడ ఆరోగ్యం మెరుగుపడినట్లు ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ సమి తెలిపారు. ఆయనకు అమర్చిన వెంటిలేటర్‌ను శుక్రవారం ఉదయం తొలగించామని, ఆయన స్వయంగా శ్వాస తీసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. ఇక ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన జైసింగ్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. క్లీనర్ అయాజ్పాషాతో పాటు క్షతగాత్రులు శ్రీకర్, రాజేష్, మజార్పాష ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు.