మొండెం లేని తల కలకలం రేపింది... ఆదివారం గౌలిగూడలో గుర్తుతెలియని వ్యక్తిని ఎవరో హత్య చేసి తలను, మొండెంను వేరు చేశారనే...
అప్జల్‌గంజ్: మొండెం లేని తల కలకలం రేపింది... ఆదివారం గౌలిగూడలో గుర్తుతెలియని వ్యక్తిని ఎవరో హత్య చేసి తలను, మొండెంను వేరు చేశారనే వదంతులు వ్యాపించాయి. తీరా అది ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తల అని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు... కాచిగూడ రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతడి తల, మొండెం వేరయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఉస్మానియా మార్చురీకి రిక్షాలో తరలించారు.
అయితే రిక్షాలో మృతదేహాన్ని తరలిస్తుండగా గౌలిగూడ శివాజీ బ్రిడ్జి సమీపంలో రిక్షాలోంచి తల కిందపడింది. ఇది గమనించని రిక్షావాలా మొండెంతో ఉస్మానియా మార్చురీకి వెళ్లిపోయాడు. తల రోడ్డుపై పడటంతో అది చూసిన పాదచారులు, వాహనదారులు ఎవరో వ్యక్తిని హత్య చేసి, తలను రోడ్డుపై పడేశారంటూ పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఆ వ్యక్తిని హత్య చేశారనే పుకార్లు షికార్లు చేశాయి.
ఘటనాస్థలానికి చేరుకున్న అప్జల్‌గంజ్ ఎస్‌ఐ రాఘవేందర్ దర్యాప్తు చేపట్టగా...అది కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఆత్మహత్య చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి తల అని తేలింది. అయితే రిక్షాలో తరలిస్తుండగా పడిపోయినట్లు గుర్తించిన పోలీసులు రిక్షావాలను రప్పించి తలను ఉస్మానియా మార్చురీకి తరలించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.