ఆమె మృతదేహం కోసం ‘వారి’ వాగ్వాదం | Married women Commit Suicide | Sakshi
Sakshi News home page

ఆమె మృతదేహం కోసం ‘వారి’ వాగ్వాదం

Published Thu, Jan 7 2016 7:50 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

Married women Commit Suicide

♦ అయిదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్న వివాహిత ఆత్మహత్య
♦ తల్లిదండ్రులు హిందువులు, భర్త ముస్లిం కావడంతో వివాదం
♦ ఉస్మానియా మార్చురీ వద్ద 3 గంటలసేపు ఇరువురి బంధువుల వాగ్వాదాలు
♦ పోలీసుల జోక్యంతో కొలిక్కి, బందోబస్తు మధ్య ఖననం
 
 సాక్షి, హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకోవడానికి ఆమె కులం, మతం గోడలు బద్దలుకొట్టింది. అయితే  చనిపోయిన తర్వాత  వాటి నేపథ్యంలోనే ఆమె అంతిమ సంస్కారం ‘వివాదం’లో చిక్కుకోవడం పలువురిని కదిలించింది. ఆమె తల్లిదండ్రులు హిందువులు, భర్త ముస్లిం కావడంతో ఏ మతాచారం ప్రకారం ఆమెను సాగనంపాలన్న దానిపై రగడ చోటుచేసుకుంది. నగరంలోని ఉస్మానియా మార్చురీ వద్ద మంగళవారం మూడు గంటల పాటు సాగిన ఈ వివాదం చివరకు రాజీతో తెరపడింది. అంత్యక్రియల నేపథ్యంలో ఆసిఫ్‌నగర్ పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

నగరంలోని రామ్‌నగర్ ప్రాంతానికి చెందిన విక్రమాచారి కుమార్తె ప్రియాంక చారి. తమ కుటుంబ స్నేహితుడిగా ఉన్న జునైద్ ఆష్మీతో ప్రేమలో పడింది. అయిదేళ్ల కిందట అతడిని వివాహం చేసుకోవడానికి ఇస్లాం మతం స్వీకరించి తన పేరును అర్బా సుల్తానాగా మార్చుకుంది. వృత్తిరీత్యా కారుడ్రైవరైన జునైద్ ఆరు నెలల కిందట జీవనోపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు.అర్బా మాత్రం జేబాబాగ్ మిలన్ థియేటర్ సమీపంలో అత్తవారింట్లో నివసిస్తోంది. జునైద్, అర్బాలకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. డిసెంబర్ 31న పుట్టింటికి వెళ్లిన అర్బా ఆదివారం జేబాబాగ్‌కు తిరిగి వచ్చింది. సోమవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో హఠాత్తుగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

దీనిపై సమాచారం అందుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం  నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అర్బా కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఆత్మహత్య విషయం తెలుసుకున్న జునైద్ మంగళవారం దుబాయ్ నుంచి నగరానికి చేరుకున్నాడు. పోస్టుమార్టం పరీక్షలు పూర్తయ్యే సమయానికి అర్బా తల్లిదండ్రులు, భర్త తదితరులు మార్చురీ వద్దకు చేరుకున్నారు. వీరిలో ఎవరికి వారు తమ మతాచారం ప్రకారం అంత్యక్రియలు చేయాలని భావించారు. దీంతో మృతదేహాన్ని తమకు అప్పగించాలంటే తమకు ఇవ్వాలంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు.

ఇలా ప్రారంభమైన చిరువివాదం మూడున్నర గంటల పాటు తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. చివరకు పోలీసుల జోక్యంతో రాజీకి వచ్చిన అర్బా తల్లిదండ్రులు మృతదేహాన్ని జునైద్‌కు అప్పగించడానికి అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. మంగళవారం సాయంత్రం జేబాబాగ్‌లోని ముస్లిం శ్మశాన వాటికలో అర్బా మృతదేహం ఖననం చేయగా...ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసిఫ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు ‘సాక్షి’తో మాట్లాడుతూ... ఇరు పక్షాలు వారంతట వారే రాజీకి రావడంతో అర్బా భర్తకు ఆమె మృతదేహాన్ని అప్పగించామన్నారు. దీంతో వివాదం ముగిసిందని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement