రూ.130... ఒక ప్రాణం!
- ఒకరినొకరు తోసుకున్న హోటల్ కార్మికులు
- కింద పడిపోయిన కార్మికుడు రాజు
- సిమెంట్ దిమ్మకు తల తగిలి మృతి
హైదరాబాద్: రూ.130 కోసం ఇద్దరు హోటల్ కార్మికుల మధ్య తలెత్తిన ఘర్షణ ఒకరి మరణానికి కారణమైంది. రాజధాని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పైస్ బావర్చీ హోటల్ వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది హత్య కాదని, ఐపీసీ సెక్షన్ 304(2) కింద కేసు నమోదు చేశామని కంచన్‌బాగ్ ఇన్‌స్పెక్టర్ శంకర్ తెలిపారు.
మహరాష్ట్రకు చెందిన రాజు (28), ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన కమలేశ్ (30) బతుకుతెరువు కోసం నగరానికి వచ్చారు. అడ్డా కూలీలైన వీరు పబ్లిక్ గార్డెన్‌లో నివసిస్తున్నారు. ఇటీవల ఇరువురినీ హఫీజ్‌బాబానగర్‌లోని స్పైస్ బావర్చి రెస్టారెంట్ నిర్వాహకుడు పనికి కుదుర్చుకున్నాడు. మూడు రోజుల క్రితం రూ.130 అప్పుగా ఇచ్చానని, ఈ మొత్తం తిరిగి ఇవ్వాలని సోమవారం రాజును కమలేశ్ అడిగాడు. అయితే తాను డబ్బే తీసుకోలేదని, అలాంటప్పుడు ఎలా తిరిగిస్తానంటూ రాజు వాదించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తన డబ్బులిచ్చే వరకు పనికి కూడా వెళ్లనీయనంటూ రాజును కమలేశ్ అడ్డుకున్నాడు.
ఈ ఘర్షణలో కమలేశ్ బలంగా తోయగా... రాజు అక్కడే ఉన్న సిమెంట్‌తో నిర్మించిన డ్రైనేజీ రెయిలింగ్‌పై పడ్డాడు. కణత భాగానికి బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న కంచన్‌బాగ్ పోలీసులు... నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఐపీసీ సెక్షన్ 304(2) కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.