
హైదరాబాద్: అనుమానాస్పద రీతిలో ఓ విశ్రాంత ఆర్మీ అధికారి మృతి చెందిన ఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మెహిదీపట్నం సంతోష్‌నగర్ విజయశ్రీ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నం.406లో ఆర్మీ విశ్రాంత ఉద్యోగి శంకర శ్రీశైల మల్లిఖార్జునరావు(75) తన భార్య రోహిణితో కలసి నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు శ్రీధర్, కుమార్తె శ్రీదేవి ఉద్యోగ నిమిత్తం అమెరికాలో ఉంటున్నారు.
ఆదివారం రోహిణి టీ తీసుకుని బెడ్రూంలోకి వెళ్లబోగా తలుపు లోపల గడియవేసి ఉంది. ఎంతసేపు పిలిచినా చప్పుడు లేకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచి తలుపు విరగ్గొట్టి చూడగా బెడ్రూంలో నుంచి దట్టమైన పొగలు కనిపించాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అదుపులోకి రాలేదు. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పి చూడగా మల్లిఖార్జున్‌రావు పూర్తిగా కాలిపోయి ఉన్నారు. కాగా, ఇతనికి టీ తాగి స్మోక్ చేసే అలవాటు ఉన్నట్లు రోహిణి తెలిపింది. సమాచారం అందుకున్న ఎస్సై పి.వెంకటేశ్వర్లు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment