బాబోయ్ మార్చురీ!
♦ ఉస్మానియాలో పనిచేయని ఫ్రీజర్లు
♦ గుట్టలుగా పేరుకుపోతున్న మృతదేహాలు
♦ పట్టించుకోని జీహెచ్‌ఎంసీ అధికారులు
♦ ఆందోళనలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది
అప్జల్‌గంజ్ : ఉస్మానియా ఆసుపత్రి శవాల కంపు కొడుతోంది. మార్చురీలోని ఫ్రీజర్లు పని చేయడంలేదు. దీనికి తోడు అనాథ శవాలు గుట్టుగుట్టలుగా పేరుకుపోతున్నాయి. వీటిని బయట పెట్టడంతో ఎండల తీవ్రత కారణంగా త్వరగా కుళ్లిపోయి కిలో మీటరు మేర దుర్వాసన వెదజల్లుతోంది. కొంతకాలం క్రితం మార్చురీని ఆధునీకరించి 38 వరకు శవాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 3 మాత్రమే పని చేస్తున్నాయి.
ఎండ తీవ్రత పెరగడంతో నగరంలో మృతుల సంఖ్య పెరిగింది. పుట్‌పాత్‌లు, ప్రధాన కూడళ్ల వద్ద ఉండే యాచకులు, వృద్ధులు వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్నారు. ఇలా మార్చురీకి రోజు 3 నుంచి 4 వరకు అనాథ శవాలు చేరుతున్నాయి. పోస్టుమార్టం నిర్వహించాక మార్చురీలో భద్రపరుస్తున్నారు. మృతదేహాల వద్ద లభించిన సమాచారాన్ని బట్టి కొన్నింటిని వారి బంధువులకు అప్పగిస్తున్నారు. మిగితా వాటిని కొన్ని రోజుల తర్వాత మార్చురీలో ఉన్న ఓ గదిలో పడేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఆ గది పూర్తిగా శవాల గుట్టగా మారిపోయింది. అనాథ శవాల విషయంలో అటు ఆసుపత్రి యాజమాన్యంగాని, ఇటు జీహెచ్‌ఎంసీ అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. దీంతో రోజుల తరబడి శవాలు మార్చురీలోనే కుళ్లిపోతున్నాయి.
వెదజల్లుతున్న దుర్వాసన
ఉస్మానియా మార్చురీలో ప్రస్తుతం 80కి పైగా మృతదేహాలు కుళ్లిపోయే దశలో ఉన్నాయి. వీటన్నింటినీ ఫ్రీజర్ల నుంచి తీసి ఓ గదిలో పడేశారు. వీటి నుంచి ముక్కుపుటాలు అదిరే దుర్వాసన వస్తోంది. కుళ్లిపోయిన శవాలపైన వాలిన ఈగలు, దోమల పలు రకాల వ్యాధులను వ్యాపింప చేస్తున్నాయి. ఉస్మానియా మార్చురీ వెనుక భాగంలో ప్రధాన రహదారి ఉంది. ఈ మార్గంలో నిత్యం వందలాది మంది వాహనదారులు ప్రయాణిస్తుంటారు.ఉస్మానియా మార్చురీకి దగ్గరలోనే పీజీ విద్యార్థుల క్వార్టర్స్, ఆసుపత్రి పరిపాలనా విభాగం, మార్చురీ ప్రహరీ ఆనుకొని విద్యుత్ సబ్ స్టేషన్ ఉన్నాయి. మార్చురీ నుంచి వస్తున్న దుర్వాసనతో ఆసుపత్రి సిబ్బంది,రోగులు ఇబ్బందిపడుతున్నారు.
పట్టించుకోని జీహెచ్‌ఎంసీ...
గతంలో అనాథ శవాలను సత్యహరిశ్ఛద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పురానాపూల్, అంబర్‌పేట, నల్లకుంట, బన్సీలాల్‌పేట్ శ్మశాన వాటికల్లో మూకుమ్ముడిగా దహనం చేసేవారు. ఆయ ప్రాంతాల వారి నుంచి తీవ్ర అభ్యంతరం రావడంతో నిలిపివేశారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను జీహెచ్‌ఎంసీ చూస్తోంది. కొన్ని రోజులుగా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదు. మార్చురీలోని ఫ్రీజర్ల మరమ్మతులకు కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి పేరుకుపోయిన మృతదేహాలను జీహెచ్‌ఎంసీ అధికారులు తరలించి ఖననం చేయాలని ఆసుపత్రి సిబ్బంది కోరుతున్నారు. లేదంటే పరిస్థితి విషమించి పలు రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.