
విచారణకని వెళ్లి.. శవమయ్యాడు!
అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లిలో లాకప్‌డెత్?
ధర్మవరం: ఒక హత్య కేసులో అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి(సీకే పల్లి) పోలీసులు అదుపులో తీసుకున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మూడు రోజుల క్రితం పోలీసులతో పాటు వెళ్లిన బత్తిని శ్రీరాములు(52) అనే వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలో శవమై కనిపించాడు. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర అనేక అనుమానాలకు తావిస్తోంది. లాకప్‌డెత్ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పోలీసులే చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. సీకే పల్లి మండలం ముష్టికోవెల కొండల్లో మాల సుధాకర్ అనే వ్యక్తి ఈ ఏడాది జూన్‌లో హత్యకు గురయ్యాడు. గుప్తనిధుల తవ్వకాల్లో భాగంగా ఈ హత్య జరిగినట్లు నిర్ధారించుకున్న సీకే పల్లి పోలీసులు కేసు దర్యాప్తులో కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు.
అందులో భాగంగా కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామానికి చెందిన శ్రీరాములును మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అలా విచారణకు అని వెళ్లిన ఆయన ఉన్నట్టుండి శుక్రవారం సీకే పల్లి ప్రభుత్వాసుపత్రిలో శవం అయ్యాడు. ఆసుపత్రిలో నమోదైన వివరాల ప్రకారం బంధువులకు సమాచారం అందించగా... అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.