
కారంచేడు పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్?
♦ ఫిట్స్ వస్తే చికిత్స చేయిస్తుండగా చనిపోయాడంటున్న పోలీసులు
♦ చావుకు ఏపీ పోలీసులే కారణం అంటున్న మృతుని బంధువులు
♦ జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని ఏపీ ఎమ్మెల్యే ఆమంచి డిమాండ్
చీరాల: దొంగతనం కేసులో కారంచేడు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఆటో డ్రైవర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. చావుకు పోలీసులే కారణమని, మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని కొట్టినందువల్లే చనిపోయాడంటూ పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులు ప్రకాశం జిల్లా చీరాల ఏరియూ ఆసుపత్రి మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు.
దీంతో పోస్టుమార్టం నిలిచిపోయింది. పోలీసులు మాత్రం వేటపాలెంలో జరిగిన ఓ దొంగతనం కేసుకు సంబంధించి ఓ ఆటోడ్రైవర్‌ను విజయవాడలో అదుపులోకి తీసుకొని కారంచేడు పోలీస్‌స్టేషన్‌కు తరలించామని, అతనికి ఫిట్స్ రావడంతో వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడని చెబుతున్నారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఘటనా స్థలానికి వచ్చి పోలీసులే చంపి ఆ తర్వాత వైద్యశాలకు తరలించారని, ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపిం చాలని డిమాండ్ చేశారు. బంధువులు, ఆమంచి వర్గీయులతో పాటు పోలీసులు అధిక సంఖ్యలో రావడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.