
నా బిడ్డ శవాన్నయినా అప్పగించండి
పోలీసులే మాయం చేశారు
టీడీపీ నాయకులతో కలిసి కుట్ర
న్యాయం చేయాలని డీసీపీకి ఓ తల్లి వేడుకోలు
అల్లిపురం : తన కుమారుడ్ని అప్పగించాలని ఓ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. కనీసం శవాన్నయినా అప్పగించండంటూ మంగళవారం పోలీసులను వేడుకుంది. తెలుగుదేశం నాయకులతో పోలీసులు కుమ్మక్కై తన బిడ్డను మాయం చేశారని ఆరోపిస్తోంది. భీమిలి మండలం చిననాయినిపాలెంకు చెందిన బొడ్డు దుర్గారావు వైఎస్సార్‌సీపీ పక్షాన ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఈ నెల 4న గ్రామంలో పోలమాంబ పండగ సందర్భంగా జరిగిన వివాదంలో పోలీసులు దుర్గారావును అరెస్ట్ చేశారు. గత శుక్రవారం విడుదలై వచ్చాడు. అదే రోజు ఆ గ్రామంలో ఫైబర్ బోటును, వలతో సహా గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఈ కేసులో భీమిలీ పోలీసులు శనివారం బొడ్డు దుర్గారావు, బొడ్డు సతీష్‌లను తీసుకువెళ్లారు. తర్వాత వీరేమయ్యారో తెలియలేదు. మూడు రోజులపాటు స్టేషన్ సెల్లోనే చూశామని, సోమవారం సాయంత్రానికి దుర్గారావును పోలీసులు మాయం చేశారని దుర్గారావు తల్లి సత్తెమ్మ, బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తక్షణమే కోర్టులో హాజరుపరచాలని ఈమె భీమిలీ కోర్టులో పిటీషన్ వేశారు.
కోర్టు ఆదేశాల మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో కలిసి భీమిలీ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే తాము అలాంటి పేరు గల వ్యక్తులను ఎవరినీ అరెస్ట్ చేసి తీసుకురాలేదని పోలీసులు సమాధానమిచ్చారు. తెలుగుదేశం నాయకులు హరి, పరశురామ్‌లతో కలసి పోలీసులు కుట్ర పన్ని తన కొడుకును చంపేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేసింది. సత్తెమ్మతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో మంగళవారం కమిషనరేట్ వచ్చి శాంతి,భద్రతల డీసీపీ ఎం.శ్రీనివాసులను కలిశారు. ఆయన సమగ్ర విచారణ చేయిస్తామని భరోసా ఇవ్వడంతో వారు వెనుదిరిగారు.
భీమిలీ సిఐ అప్పలనాయుడు, మధురవాడ ఏసీపీ రంగరాజులను న్యూస్‌లైన్ వివరణ కోరగా భిన్న కథనాలు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. దుర్గారావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకువస్తుండగా కొంతమంది దుండగులు తమపై దాడి చేసి దుర్గారావును తీసుకుపోయారని భీమిలి సీఐ చెబుతున్నారు. ఆ పేరుగ ల వ్యక్తిని భీమిలీ పోలీసులు అరెస్ట్ చేయలేదని మధురవాడ సీఐ చెబుతున్నారు. ఇలా ఇద్దరూ పొంతన లేని సమాధానాలివ్వడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.