సాక్షి, అమరావతి: రక్షణగా ఉండాల్సిన పోలీసులే వేధింపులకు దిగితే.. ఆ బాధితులు, నిందితుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కొన్ని సార్లు పోలీసుల వేధింపులతో బాధితులు ప్రాణాలే తీసుకుంటున్నారు. శనివారం వైజాగ్‌లో రౌడీషీటర్ హత్యలో డీఎస్పీ పాత్ర ఉండటంతో పోలీసుల పనితీరు మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవలే రాజధాని ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చోటు చేసుకున్న ఘటనలు పోలీస్ శాఖను అపఖ్యాతి పాల్జేశాయి. దీనికితోడు పలువురు పోలీసులు అక్రమార్జనకు, అక్రమ సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రజల్లో వారిపై సదభిప్రాయం పోతోంది. కట్టుతప్పుతున్న పోలీసుల తీరుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసిన కొన్ని ఘటనలు.
ఆత్మహత్యలకు కారణం పోలీసులే!
విశాఖలో రౌడీషీటర్ గేదెల రాజు హత్య వెనుక డీఎస్పీ రవిబాబు హస్తం ఉందన్న ఆరోపణలతో పోలీస్ శాఖలో కలకలం రేగుతోంది. ఇదిలా ఉండగా.. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి పోలీసుల వేధింçపుల కారణంగా మైలవరం గ్రామానికి చెందిన కట్టుకోలు రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డీఎస్పీ, మంగళగిరి సీఐలు రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసే రాజగోపాల్‌రెడ్డిని ఇళ్ల స్థలాల అమ్మకాల విషయంలో స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అతన్ని తీవ్రంగా వేధించడంతో ఆత్మహత్య చేసుకుంటూ.. తన మరణానికి ఏఆర్ డీఎస్పీ, సీఐ, మంగళగిరికి చెందిన శంకరరెడ్డి కారణమని తాను రాసిన లేఖలో పేర్కొన్నాడు.
రాజగోపాల్‌రెడ్డి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక భార్యాభర్తల వివాదంలో కృష్ణా జిల్లా కూచిపూడి ఎస్‌ఐ గుడివాడ అనిల్ ఓవర్ యాక్షన్‌తో మొవ్వ మండలం కోసూరు శివారు తురకపాలెంలో బుధవారం రాత్రి వీరంకి శ్రీహరి అనే యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు రోజూ ఉదయం స్టేషన్‌కు పిలిపించి రాత్రి పొద్దుపోయే వరకు నిర్బంధించి, రూ.2 లక్షలు భరణం ఇవ్వాలంటూ ఎస్‌ఐ తీవ్ర ఒత్తిడి చేసి బెదిరింపులకు దిగడంతో శ్రీహరి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుని బంధువులు ఆరోపించారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీషీటర్ యర్లగడ్డ దుర్గారావు (నక్కల పండు) ఆదివారం పురుగుమందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు యత్నించినట్టు ఆరోపించాడు.
మహిళలతో ఆసభ్యంగా..
ఒక కేసులో సాయం కోసం స్టేషన్‌కు వచ్చిన వివాహిత ఫోన్ నంబర్‌ను తీసుకున్న నూజివీడు ఎస్సై వెంకటకుమార్ తన కోరిక తీర్చకుంటే ఆమె భర్తను కేసులో ఇరికిస్తానంటూ బెదిరించారు. అతని ఫోన్ వాయిస్‌ను రికార్డు చేసిన బాధితురాలు ఈ నెల 10న కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠిని ఆశ్రయించడంతో ఆ ఎస్సైను శెలవుపై పంపించారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఎస్‌ఐ విజయకుమార్ నూజివీడుకు చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం నెరిపిన ఫొటోలు, వీడియోను ఆమె భర్త సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఆ ఎస్సై నుంచి తనకు ప్రాణహాని ఉందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఆ ఎస్సైను ఎస్పీ సస్పెండ్ చేశారు. మచిలీపట్నం పోస్టల్ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి తన సహోద్యోగిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేస్తే.. నిందితుడి నుంచి రూ. 25 వేలు లంచం తీసుకున్న ఎస్సై అశ్వక్‌పై క్రమశిక్షణ వేటు వేశారు.
టీడీపీ సేవలో తరిస్తూ..
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో అధికారపార్టీ సేవల్లో తరిస్తున్న సీఐ హనుమంతరావు వైఎస్సార్‌సీపీ శ్రేణులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి కాసు మహేశ్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొంటే కేసులు పెడతామంటూ కార్యకర్తలు, సానుభూతిపరులను బెదిరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల గుంటూరు జిల్లా నరసరావుపేట, తెనాలి ప్రాంతాల్లో పోలీస్ అధికారుల తీరు వివాదాస్పదమైంది. వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు, కృష్ణా జిల్లా గుడివాడలో సామాన్యులపై తమ ప్రతాపం చూపిన పోలీస్ కానిస్టేబుళ్లు నడిరోడ్డుపైనే గొడ్డును బాదినట్టు బాదడంతో జనం విస్తుపోయారు. ఇలాంటి ఘటనలు పోలీస్ శాఖను అపఖ్యాతి పాల్జేస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పోలీసులే.. వేధింపులకు దిగితే
Published Mon, Oct 16 2017 4:03 AM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment