అరాజకీయం! | TDP Activists Attack On YSRCP Activists | Sakshi
Sakshi News home page

అరాజకీయం!

Published Mon, Apr 2 2018 11:52 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

TDP Activists Attack On YSRCP Activists - Sakshi

అక్కుపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కామేశ్వరరావుపై దాడికి పాల్పడుతున్న టీడీపీ కార్యకర్తలు

టార్గెట్‌ వైఎస్సార్‌సీపీ.. టీడీపీ నాయకుల లక్ష్యమిది. రాజకీయంగా ఎత్తుగడలు వేస్తే ప్రజలు కూడా హర్షించేవారే. కానీ అధికార పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కడం ప్రారంభించారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. విమర్శలు, వాగ్వాదాలను కొట్లాటల వరకు తీసుకెళ్తున్నారు. అమాయక కార్యకర్తలను చావగొడుతూ బెదిరిస్తున్నారు. కుదిరితే అధికారులతో దాడులు చేయించడం.. లేదంటే వందిమాగధులతో దాడులకు దిగడం చేస్తున్నారు. టీడీపీ చేస్తున్న ఈ విద్వేష రాజకీయాలను సిక్కోలు వాసులు ద్వేషిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శాంతికాముక జిల్లాగా పేరొందిన సిక్కోలులోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా అధికార టీడీపీ నేతలు దాడులకు తెగిస్తున్నారు. ఈ నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు, మరోవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండు పెల్లుబుకుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. గ్రామాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వ్యక్తిగత వేధింపులకు పాల్పడుతున్నారు. గత వారం రోజుల్లో ఇది తారస్థాయికి చేరింది.

వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లికి చెందిన కుంది కామేశ్వరరావుపై అకారణంగా దాడి చేశారు. తర్వాత లావేరు మండలం బుడుమూరుకు చెందిన వజ్జ ఆదినారాయణ తల పగులకొట్టడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం శ్రీకాకుళం రూరల్‌ మండలం చాపరం పంచాయతీ పరిధిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు లక్ష్మీనారాయణ సమీప బంధువు ఈశ్వరరావుకు చెందిన సొంత ఇంటి నుంచే బలవంతంగా ఖాళీ చేయించేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇలా వ్యక్తిగత కక్ష సాధిం పు చర్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ధోరణులను అడ్డుకొని తీరుతామని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు తదితర నేతలు స్పష్టం చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలే తప్ప అధికార పార్టీ నాయకులకు కొమ్ముగాయవద్దని కోరుతున్నారు.

వంద గజాల్లోపు ప్రభుత్వ భూమిలో ఏదైనా ఆక్రమణలు జరిగితే దాన్ని రెగ్యులైజేషన్‌ చేసుకోవచ్చునని గతంలో టీడీపీ ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది. కానీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను వేధించడానికి దిగిన టీడీపీ నాయకులకు ఆ నిబంధనలేవీ గుర్తురావట్లేదు. శ్రీకాకుళం రూరల్‌ చాపురం పంచాయతీ పరిధిలోని విశాఖ–బి కాలనీలో 87 గజాల స్థలంలోనున్న తంగి ఈశ్వరరావు ఇంటిని కూల్చేయాలం టూ రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు, చాపురం మాజీ సర్పంచ్‌ అల్లు లక్ష్మీనారాయణకు ఈశ్వరరావు సమీప బం ధువు. లక్ష్మీనారాయణ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ముఖ్య అనుచరుల్లో ఒకరు. ఈ నేపథ్యంలో ఈశ్వరరావు ఇంటిని ఖాళీ చేయించేందుకు టీడీపీ నా యకులు చాపకింద నీరులా అధికారులతో ఏర్పాట్లు చేయించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈశ్వరరావు ఇంటి వద్దే ఉన్నారు. దీంతో అధికారులు మిన్నుకుండిపోయినట్లు తెలిసింది. కానీ రాత్రిపూట అయినా ఆ ఇంటిలో నివాసం ఉంటున్నవారిని బలవంతంగానైనా ఖాళీ చేయించడానికి టీడీపీ మండల నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వారికి పరోక్షంగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అండదండలు ఉన్నాయని, అందులో అధి కారులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని ఈశ్వరరావు కు టుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

అధికారులపై ఒత్తిళ్లు...
విశ్వసనీయ సమాచారం ప్రకారం శనివారం ఓ టీడీపీ కీలక నేత ఒత్తిళ్ల మేరకు శ్రీకాకుళం మండల రెవెన్యూ అధి కారులు సమావేశమయ్యారు. ఈశ్వరరావు ఇంటిని ఏవిధంగానైనా ఖాళీ చేయించాలన్న టీడీపీ నేత ఆదేశాలను ఎలా అమలు చేయాలోనంటూ అర్ధరాత్రి వరకూ మల్లగుల్లాలు పడ్డారు. ఈ ప్రక్రియలో పోలీసు రక్షణ కావాలంటూ పంచాయతీ సెక్రటరీ వద్ద పనిచేస్తున్న అటెండర్లతో ఆ రాత్రే డీఎస్పీ, డీపీవో, అగ్నిమాపక శాఖ అధికారులకు పత్రాలను అందచేయించడం గమనార్హం.  

అప్పలసూర్యనారాయణే పట్టా ఇచ్చారు..
కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్నాం. కానీ టీడీపీ నాయకుల వేధింపుల వల్ల బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. 1996లో అప్పటి ఎమ్మెల్యే గుండ అప్పలసూర్యనారాయణ (ప్రస్తుత శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి భర్త) అసెన్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. అప్పుడే అంబేద్కర్‌ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మాకు పట్టా ఇచ్చారు. ఆ పట్టా ప్రకారమే ఆ స్థలంలో ఇల్లు కట్టుకున్నాం. ఈ స్థలంపై కోర్టులో విచారణ జరుగుతున్నా బలప్రయోగంతో ఖాళీ చేయించడానికి ప్రయత్నించడం బాధాకరం.           – ఈశ్వరరావు, ఆదిలక్ష్మీ దంపతులు,చాపురం పంచాయతీ, శ్రీకాకుళం

టీడీపీ నేతల మూకుమ్మడి దాడి...
వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామంలో గత నెల 30న వైఎస్సార్‌సీపీ కుంది కామేశ్వరరావుపై టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. గ్రామంలోని శ్రీరామా సేవాసంఘానికి సంబంధించిన నాలుగేళ్ల నిధులు రూ.17 లక్షల ఖర్చులపై జరిగిన సమావేశంలోనే దాడి చోటుచేసుకోవడం గమనార్హం. కుంది కామేశ్వరావుపై టీడీపీ నేత, మాజీ ఎంపీపీ భర్త, జన్మభూమి కమిటీ అధ్యక్షుడు సూరాడ మోహనరావు, పొట్టి గురునాధ్, పి.శాంతమ్మలు మూకుమ్మడిగా దాడి చేశారు. కామేశ్వరరావు ప్రస్తుతం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయమై వజ్రపుకొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విషమ పరిస్థితిలో ఆదినారాయణ..
లావేరు మండలంలోని బు డుమూరు గ్రామంలో గొల్లవీధిలో గోడ విషయమై జరిగిన తగాదాలో వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త వజ్జ ఆదినారాయణను తీవ్రంగా గాయపరిచారు. టీడీపీ వర్గీయుడైన కాకి రమణ, సన్యాసితో పాటు మరికొంత మంది రోడ్డు మధ్య వరకూ తమ జిరాయితీ భూమి ఉందని గత ఏడాది నవంబరు నెలలో సిమెంటు గోడ కట్టేశారు. కానీ ఆ వీధిలోని సుమారు 500 కు టుంబాలకు అదే మార్గం. ఈ గోడ నిర్మాణాన్ని అడ్డుకోవాలని బుడుమూరు వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌ కింతలి రమావతి, వైఎస్సార్‌ సీపీ నాయకులు గతంలో జిల్లా పంచాయతీ అధికారి కోటీశ్వరరావు, లావేరు ఎంపీడీవో కిరణ్‌కుమార్, ఈవోఆర్‌డీ శ్యామలకుమారి, లావేరు ఎస్‌ ఐ రామారావులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోయింది.

అందుకు భిన్నంగా టీడీపీ నాయకులు ఒత్తిళ్లతో లావేరు పోలీసులే దగ్గరుండి మరీ గోడ నిర్మా ణం పూర్తి చేయించారు. గత నెల 30వ తేదీన వైఎస్సార్‌ సీపీ వర్గీయుడైన వజ్జ ఆదినారాయణ తన కల్లానికి వెళుతుండగా టీడీపీ వర్గానికి చెందిన మహిళలు తిడుతున్నారు. ఇదేమని అడిగిన ఆదినారాయణపై అక్కడే ఉన్న టీడీపీ వర్గీయులు కాకి రమణ, కర్రి అప్పారావు, కాకి సన్యాసి, కాకి పైడయ్య, కర్రి మహేష్, కర్రి లక్ష్మీలతో పాటు పలువురు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆదినారాయణను తొలుత శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిం చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఈ తగాదా విషయంలో టీడీపీ వారితో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement