వైఎస్ అవివాష్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేస్తోన్న పోలీసులు
పులివెందుల టీడీపీ నేత సతీష్‌రెడ్డి నాలుగురోజులుగా పదేపదే రచ్చకైనా.. చర్చకైనా సిద్ధమేనంటూ చేస్తున్న సవాల్ వెనుక మర్మం ఏమిటో ఆదివారం బట్టబయలైంది.
పులివెందులలో టీడీపీ హయాంలో ఏమీ అభివృద్ధి జరగకపోయినా సవాల్‌కు పూనుకోవడం వెనుక కేవలం రచ్చ చేయాలనే వ్యూహం కనిపిస్తోంది. జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలో పులివెందుల అనగానే వైఎస్సార్ అభివృద్ధి గురించి ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు. అలాంటి గడ్డపై అధికారాన్ని అడ్డం పెట్టుకుని జలుం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తోంది.
పులివెందుల/రూరల్/టౌన్ : పులివెందుల టీడీపీ అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు పొలీసులు ఒత్తాసు పలకడంతో పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం పులివెందులలో సాయంత్రం 4గంటలకు పూలంగళ్ల సర్కిల్‌లో టీడీపీ నాయకులు పులివెందుల అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసరడం.. ఇందుకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చర్చకు సిద్ధమని ప్రతి సవాల్ విసరడం తెలిసిందే. చర్చకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పార్టీ నేతలు సిద్ధమయ్యారు. అయితే ఉదయం నుంచి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు.
ఉదయం 10గంటల సమయంలో పెద్ద ఎత్తున పోలీసు అధికారులు అవినాష్‌రెడ్డి ఇంటి వద్దకు చేరుకుని ఆయనను హౌస్ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. దీనికి ఎంపీ ససేమిరా ఒప్పుకోలేదు. చర్చకు సవాల్ విసిరింది టీడీపీ నాయకులైతే సవాల్‌ను స్వీకరించామని.. మమ్ములను నిలువరించడం మంచి పద్ధతి కా>దన్నారు. అనంతరం ఆయన స్వగృహం నుంచి స్థానిక పాత ఎమ్మెల్యే ఆఫీసుకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు తరలి వచ్చారు. అక్కడికి కూడా పులివెందుల ఏఎస్పీ కృష్ణారావు ఇతర పోలీసు అధికారులు చేరుకున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.
ఈ సమయంలో అక్కడ దాదాపు గంటసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలను బలవంతంగా పోలీసులు పోలీసు వ్యానులో ఎక్కించడం జరిగింది. ఈ సమయంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీ డౌన్ డౌన్.. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పోలీసులు వాహనాలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఎంపీని వాహనం నుంచి కిందికి దించక తప్పలేదు. దీంతో మళ్లీ కార్యకర్తల నడుమ పాత ఎమ్మెల్యే ఆఫీసుకు చేరుకున్నారు. అనంతరం ఎంపీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త సంయమనం పాటించి లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కల్గకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. సాయంత్రం 4గంటలకు టీటీపీ నాయకులు పూలంగళ్ల సర్కిల్ వస్తే తనను పంపించడానికి పోలీసులు ఒప్పుకోవడం జరిగిందన్నారు. కావున ఇందుకు ప్రతి కార్యకర్త సహకరించాలని కోరారు.
గాలిలోకి భాష్పవాయువు ప్రయోగం
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భాష్ప వాయువును ప్రయోగించారు. అయితే ఇందుకు ఏమాత్రం ప్రయోజనం లేకపోవడవంతో యథావిధిగా పోలీసులు పది రౌండ్లు కాల్పులు కాల్చుతూ భాష్పవాయువు ప్రయోగించారు. రాళ్ల దాడులలో ట్రాఫిక్ ఎస్‌ఐ చిరంజీవి తలకు గాయాలయ్యాయి. దాడుల నేపథ్యంలో పూలంగళ్ల సర్కిల్ శాంతి భద్రతలను కాపాడే సమయంలో ఇరు వర్గాల దాడులలో తలకు బలంగా గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. తలలో 5కుట్లు పడ్డాయి.
ఎస్పీ రావడంతో అదుపులో శాంతిభద్రతలు:
పులివెందులకు ఎస్పీ బాబుజీ అట్టాడ రాగానే ప్రత్యేక పొలీసు దళంతో గుంపులను చెదరగొట్టారు. దీంతో ప్రజలు గుంపులుగా లేకుండాపోయారు. దీంతో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయి. అనంతరం ఎస్పీ వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి చేరుకుని చర్చకు అనుకూల వాతావరణం తాను కల్పిస్తానని టీడీపీ నాయకులతో మాట్లాడి కడపలో ప్రశాంతంగా చర్చ వేదికను ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో ఎంపీ అక్కడ నుంచి వెనుతిరిగారు.
పులివెందుల పూల అంగళ్ల వద్ద రచ్చకైనా...చర్చకైనా అంటూ ప్రచారంతో రెచ్చగొట్టిన టీడీపీ నేతలు ఏదో ఒక రకంగా తప్పించుకునే మాటలు మాట్లాడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం సాయంత్రం టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వైఎస్సార్ సీపీపై విమర్శలు చేశారు. పులివెందులలో అలజడులకు వైఎస్సార్ సీపీనే కారణమని నిందించారు. అంతేకాకుండా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలపై కూడా విమర్శలు గుప్పించారు.
పోలీసుల దాడిలో వైఎస్సార్‌సీపీ నాయకులకు గాయాలు
పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు.తెలుగుదేశం పార్టీ నాయకులు యథేచ్చగా రోడ్డుపై చేరుకుని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్లు విసిరి హల్‌చల్ చేస్తుంటే వారిని నిలువరించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద ఉన్న కార్యకర్తలపై పోలీసులు యథేచ్చగా లాఠీఛార్జి చేశారు. ఈ లాఠీఛార్జిలో వైఎస్సార్‌సీపీ నాయకులు వరప్రసాద్, ప్రతాప్, చెన్నకేశవులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల జూలం నశించాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
టీడీపీ నాయకులకు ఒత్తాసు పలికిన పోలీసులు
పోలీసుల అదుపులో ఉదయం నుంచి ఉన్న టీడీపీ నాయకులను సాయంత్రం 3గంటల ప్రాంతంలో వదిలేయడంతో వారు పూలంగళ్ల సర్కిల్‌కు చేరుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలంగళ్ల సర్కిల్‌కు చేరుకున్నారనే విషయం తెలియగానే వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు సర్కిల్‌కు వెళ్లడానికి ముందుకు కదిలారు. అయితే చాగలేటి టెక్స్‌టైల్స్ సమీపంలోకి రాగానే పోలీసులు అడ్డగించారు. ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చగొడుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్లు విసిరి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో ప్రతిఘటించి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులపై ఎదురు దాడికి దిగారు
Comments
Please login to add a commentAdd a comment