శ్రీకాకుళం రూరల్: సమయం సోమవారం ఉదయం 6 గంటలు. విశాఖ–బి కాలనీ అంతా నిర్మానుషంగా ఉంది. ఇంతలో వైఎస్సార్‌సీపీకి చెందిన అల్లు లక్ష్మీనారాయణ బంధువు తంగి ఈశ్వరరావు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ముందస్తుగా నలు వైపుల నుంచి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన పహారా కాశారు. టీడీపీ నాయకుల అండదండలతో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేశారు. చివరకు తలుపులు పగులగొట్టి దౌర్జన్యకాండకు దిగి ఇంటిని ఖాళీ చేయించారు.
అసలేమైందంటే..
చాపురం పంచాయతీ విశాఖ–బి కాలనీలో నివసిస్తున్న మాజీ సర్పంచ్ అల్లు లక్ష్మీనారాయణ బంధువు తంగి ఈశ్వరరావుకు 1996లో టీడీపీ ప్రభుత్వం సుమారు 2 సెంట్లు పట్టా జారీచేసింది. గుండ అప్పలసూర్యనారాయణ ఎమ్మెల్యేగా, అసెన్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలో తంగి ఈశ్వరరావుకు ఈ పట్టా అందజేశారు. దీని ప్రకారం.. ఇల్లు నిర్మించుకోగా ఈశ్వరరావు కుటుంబసభ్యులు పై పోర్షన్‌లో ఉంటున్నారు. కింద పోర్షన్‌లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావుకు అల్లు లక్ష్మీనారాయణ నిత్యం అందుబాటులో ఉంటూ చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వీటితోపాటు మండల టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చేవారు. దీంతో ఆయనపై టీడీపీ నేతలు కక్షగట్టి.. ఆయన్ను దెబ్బతీయాలనే దుర్బుద్ధితో చాపురం పంచాయతీ సెక్రటరీ అజయ్‌బాబును రంగంలోకి దించారు. లక్ష్మీనారాయణ బంధువు కట్టుకున్న ఇల్లు రిజర్వుస్థలంలో ఉందని అది ప్రభుత్వ ఆస్తి అని దఫదఫాలుగా నోటీసులు ఇవ్వడం ప్రారంభించారు.
పక్కా ప్రణాళికతోనే..
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రెండు రోజుల క్రితం జిల్లా ఉన్నతాధికారులతో జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత సమావేశమయ్యారు. అల్లు లక్ష్మీనారాయణ ఉంటున్న ఇంటిని ఖాళీచేయడంలో ఆంత్యర్యమేంటని ప్రశ్నించారు. అదేమైనా బాబ్రీ మసీదా అంటూ అధికారులపై ఫైర్ అయినట్లు సమాచారం. రెండు రోజుల్లో ఖాళీచేయించాలని హుకుం జారీచేశారు. రెండు రోజులు అవసరం లేదని ఒక్కరోజులోనే ఖాళీ చేయిస్తామని జిల్లా పంచాయతీ అధికారులు పూర్తి హామీ ఇచ్చారు. అదేరోజు రాత్రి (శనివారం) తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకూ దీనికి సంబంధించిన ఫైల్‌ను ఆగమేఘాలపై తయారుచేశారు. చాపురం సెక్రటరీ వద్ద పనిచేస్తున్న అటెండర్‌లతో రాత్రి 2 గంటల సమయంలో డీఎస్పీ, జిల్లా పంచాయతీ కార్యాలయాలతో పాటు ఫైర్, రిమ్స్ అధికారులకు కాపీ అందజేశారు. అల్లు లక్ష్మీనారాయణ ఇంటిని బలవంతంగా ఖాళీచేయిస్తున్నారన్న వార్త వైఎస్సార్ సీపీ నాయకులకు తెలియడంతో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సుమారు 300 మంది కార్యకర్తలు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో ఇంటిని ఖాళీ చేయిస్తే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని భావించి జిల్లా ఉన్నతాధికారులు వెనక్కు తగ్గారు. ఆదివారం అర్ధరాత్రైనా ఖాళీ చేయించాలని అధికారులపై టీడీపీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వాతావరణం అనుకూలించకపోవడంతో సోమవారానికి వాయిదా వేశారు.
200 మంది పోలీసులు..
అల్లు లక్ష్మీనారాయణ బంధువు ఇంటిచుట్టూ వైఎస్సార్‌సీపీ నేతల రాకపోకలు లేవని భావించిన అధికారులు.. సుమారు 200 మంది పోలీసులు, ప్రత్యేక బలగాలతో అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఇంట్లో అల్లు లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులతో సహా 12 మంది ఉన్నారు. పోలీసుల విషయం గ్రహించిన అల్లు లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులు తలుపులు బిగించుకుని భయాందోళన మధ్యే ఉండిపోయారు. కనీసం మైక్ అనౌన్సుమెంట్ లేకుండానే మాకుమ్మడిగా పోలీసులు సమక్షంలో పంచాయతీ అధికారులు తలుపులు పగలగొట్టారు.
సెక్రటరీ అత్యుత్సాహం
చాపురం పంచాయతీ సెక్రటరీ అజయ్‌బాబు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. సెక్రటరీ హోదాలో ఉన్న ఆయన ఓ గునపంతో తలుపులు బద్దలు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇల్లు ఖాళీచేయించడం వెనుక కూడా ఆయన ప్రమేయమే ఎక్కువగా ఉందని అల్లు కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకుందామని వారించినప్పటికీ జిల్లా పంచాయతీ అధికారులెవరూ వారి మొరవినలేదు. తామంతా ఆత్మహత్య చేసుకుంటామని వారించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. చివరికి కిరోసిన్ పారబోసినా, గ్యాస్ లీక్ చేసినా వారి గోడు పట్టించున్న వారే కరువయ్యారు.
ఒక్కసారిగా చెలరేగిన మంటలు..
ఇల్లంతా కిరోసిన్ జల్లడంతో ఫైర్ సిబ్బంది భాష్పవాయువు ప్రయోగించారు. అది కిరోసిన్‌కు అంటుకుని ఉన్నఫళంగా మంటలు చెలరేగాయి. దీంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ టి.పనసారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్‌తో మంటలను అదుపు చేశారు. తర్వాత ఇంట్లోని వారంతా బయటకు వచ్చారు. సంఘటన స్థలంలో ఉంచిన ఆంబులెన్స్‌లో ఒకొక్కరినీ రిమ్స్ ఆస్పత్రికి, తర్వాత రూరల్, నరసన్నపేట, లావేరు పోలీస్టేషన్‌లకు అంచెలంచెలుగా ఆంబులెన్స్‌లోనే తిప్పించారు.
లావేరు స్టేషన్‌లో నేతల నిర్బంధం
లావేరు: శ్రీకాకుళం మండలం చాపురం పంచాయతీ విశాఖ–బి కాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, వారి బంధువులను శ్రీకాకుళం పోలీసులు లావేరు పోలీస్‌స్టేషన్‌లో సోమవారం నిర్బంధించారు. వైఎస్సార్ సీపీ నాయకుడు తంగి ఈశ్వరరావు ఇంటిపై టీడీపీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడి చేసి దౌర్జన్యంగా ఖాళీ చేయించారు. ఈ నేపథ్యంలో తంగి ఈశ్వరరావు, ఆయన భార్య ఆదిలక్ష్మి, నాయకులు అల్లు లక్ష్మీనారాయణ, అల్లు కృష్ణ, శిమ్మ సుదర్శనరావు, శిమ్మ విజయప్రభతో పాటు మరో ఐదుగురిని లావేరు స్టేషన్‌లో నిర్బంధించారు. వీరిని డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృçష్ణమూర్తి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వైవీ సూర్యనారాయణ, శ్రీకాకుళం జెడ్పీటీసీ చిట్టి జనార్దనరావు, జిల్లా నాయకులు మామిడి శ్రీకాంత్, మెట్టాడ స్వరూప్ పరామర్శించారు. జేఆర్‌పురం సీఐ రామకృష్ణతో చర్చించారు. లావేరు స్టేషన్‌కు వీరిని ఎందుకు తీసుకొచ్చారన్న విషయంపై పోలీసులు మౌనంగా వ్యవహరిస్తున్నారు.
టీడీపీ హయాంలో ఇళ్లు నేలమట్టమే
టీడీపీ హయాంలో స్థానిక ఎమ్మెల్యే గుండలక్ష్మీదేవి ఆధ్వర్యంలో నగరంలో ఇల్లు కొట్టడమే కనిపిస్తోంది తప్ప ఇల్లు కట్టించి నగరవాసులకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని కేంద్రప్రభుత్వ నిధులతో ఇళ్లు కట్టించినా వాటిని ప్రారంభించే పరిస్థితులు కనిపించట్లేదు. ఇటీవల నగరంలోని 13 చోట్ల ఇళ్లు కొట్టినప్పటికీ ఎమ్మెల్యే హోదాలో వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత ఆమెకు లేకపోవడం దారుణం. ధర్మాన ప్రసాదరావు రాజకీయ జీవితంలో నగరంలోనే కాదు జిల్లాలో ఎక్కడా ఇళ్లు కొట్టించిన సందర్భాలు లేవు.
– మూకళ్ల తాతబాబు, వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment