కర్నూలు–హైదరాబాద్ హైవేపై కూలీల ఆటోను ఢీకొన్న లారీ
ఇద్దరు మహిళల మృతి
ఇద్దరి పరిస్థితి విషమం
మరో 17 మందికి గాయాలు
కర్నూలు (హాస్పిటల్): వారంతా కూలీలు. వానలు కురవక.. చేద్దామంటే పనులు దొరక్క పొట్టచేతబట్టుకుని వలసబాట పట్టిన కూలీల్లో ఇద్దరిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. ఆటోడ్రైవర్ సహా 17 మంది గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. కర్నూలు జిల్లాలో వర్షాభావంతో వ్యవసాయం పడకేసింది. పనులు కూడా దొరకని పరిస్థితుల్లో కర్నూలు మండలం ఇ.తాండ్రపాడు గ్రామానికి చెందిన పలువురు ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్తున్నారు. రోజులాగే గురువారం స్టీరింగ్ ఆటోలో 20 మంది కూలీలు తెలంగాణలోని ఉండవెల్లి మండలం కంచుపాడు బయలుదేరారు.
ఆ ఆటోను కర్నూలు –హైదరాబాద్ హైవేపై జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి స్టేజీ సమీపంలోని వరసిద్ధి వినాయక కాటన్ మిల్లు వద్ద వెనుక నుంచి 20 టైర్లు గల భారీ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో పైకెగిరి కింద పడింది. ఆటోలో ఉన్న లక్ష్మీదేవి (58) అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన 19 మందిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు మూడు అంబులెన్సుల్లో తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమాదేవి అలియాస్ తెలుగు సుజాత (40) మృతి చెందింది. ప్రియాంక (18), అనిత పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఆటో డ్రైవర్ నరసింహులు (40)తోపాటు లక్ష్మీదేవి (60), రాధ (40), మద్దిలేటి (50), వరుణ్‌కుమార్ (13), కె.వరలక్ష్మి (44), పద్మ (45), రమాదేవి (40), నందు (17), భాస్కర్ (47), పావని (25), లక్ష్మీదేవి (50), లక్ష్మీదేవి (50), చిట్టెమ్మ (60), వరలక్ష్మి(47)తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. క్షతగాత్రులు, వారి కుటుంబసభ్యులు, బంధువులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆస్పత్రిలోని క్యాజువాలిటీ కిక్కిరిసిపోయింది.
క్షతగాత్రులకు ప్రజాప్రతినిధుల పరామర్శ
ప్రమాదంలో గాయపడిన వారిని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి, కోడుమూరు వైఎస్సార్‌సీపీ నాయకులు డాక్టర్ ఆదిమూలపు సతీష్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్ డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
పరిహారం కోసం డిమాండ్
రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడ్డ వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వి.వీరశేఖర్, ప్రధాన కార్యదర్శి కేవీ నారాయణ డిమాండ్ చేశారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేక సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని, ఉపాధి హామీ పనులు కల్పించకపోవడం, పనిచేసిన వారికి 11 నెలలైనా బిల్లులు రాకపోవడం వల్ల పొట్టకూటి కోసం వెళ్లి వారు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment