
పంటల బీమా సొమ్ము సర్కారుకు ఇవ్వలేం
* రైతుల ఖాతాలకే జమ.. స్పష్టం చేసిన బ్యాంకర్లు
* 2013-14లో పంటల బీమా కింద రావాల్సింది రూ. 650 కోట్లు
* రుణ మాఫీలో భాగంగా ఖజానాకు జమ చేయాలన్న సర్కారు
* అలా సాధ్యం కాదని సర్కారుకు బీమా సంస్థ, బ్యాంకర్ల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రైతు పంటల బీమా సొమ్ము ను రుణ మాఫీలో భాగంగా సర్కారు ఖజానాకు జమ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇటు వ్యవసాయ పంటల బీమా కంపెనీతో పాటు అటు బ్యాంకర్లు కూడా సర్కారు ఖజానాకు ఇవ్వలేమని ప్రభుత్వానికి తేల్చిచెప్పాయి. ఏపీలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంటల బీమా కిం ద రూ. 650 కోట్లు రావాల్సి ఉంది. రుణ మాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన షరతుల్లో ఈ పంటల బీమా సొమ్మును సర్కారు జమ చేసుకుంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఒక్కో రైతు కుటుంబం ఎన్ని రుణాలు తీసుకున్నప్పటికీ ఒక్కో కుటుంబానికి లక్షన్నర రూపాయ లు మాత్రమే మాఫీ చేస్తామని షరతు విధించిన విషయం తెలిసిందే. లక్షన్నర మాఫీ చేస్తున్నం దున పంటల బీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని, రైతులకు ఇవ్వబోమని షరతుల్లో పేర్కొన్నారు.
అందులో భాగంగానే పం టల బీమా సొమ్ము వస్తే ఆ మొత్తాన్ని సర్కారు ఖజానాకు ఇవ్వాలని బ్యాంకర్లను, వ్యవసాయ పంటల బీమా కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై బ్యాంకులు, పంటల బీమా కంపెనీ స్పందిస్తూ అలా చేయటం సాధ్యం కాదని స్పష్టంచేశాయి. వ్యవసాయ పంటల బీమా కంపెనీ నుంచి ఆయా రైతుల పేరుమీదనే బీమా సొమ్ము వస్తుందని, అందువల్ల ఆయా రైతుల ఖాతాలకే బీమా సొమ్ము జమ చేస్తామని బ్యాంకులు స్పష్టంచేశాయి. వాస్తవంగా పంటల బీమా ప్రీమియాన్ని ఆయా పంటల వారీగా 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం, మరో 25 శాతం కేంద్ర ప్రభుత్వం, మిగతా 50 శాతం రైతులు చెల్లిస్తారు. ఏకంగా 50 శాతం ప్రీమియం రైతులు చెల్లిస్తున్నప్పటకీ ఆ బీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ కింద మినహాయించుకోవడం ఎంతవరకు సమంజశం అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పంటల బీమా గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించడం సాధ్యం కాదని వ్యవసాయ పంటల బీమా సంస్థ స్పష్టంచేసింది.