
రుణాలు చెల్లించకపోతే మీకే నష్టం!
రైతులకు బ్యాంకుల హెచ్చరికలు
విజయవాడ బ్యూరో: పాత అప్పులు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రైతులకు ఇచ్చిన సలహాను బ్యాంకులు తమకు అనుకూలంగా మార్చుకున్నారుు. మొన్నటి వరకు నోటీసులకే పరిమితమైన వివిధ బ్యాంకులు తాజాగా అప్పులు చెల్లించాలన్న అంశంపై విస్తృత ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. విజయవాడ ఆంధ్రాబ్యాంకు జోనల్ అధికారులు ఈ మేరకు తమ విధానాలను స్పష్టం చేశారు. 2014 మార్చి 31కి ముందు రుణాలు పొందిన రైతులందరూ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం వర్తింపునకు అర్హులేననీ, అయితే వారు తీసుకున్న రుణాలను ముందుగా చెల్లించాలని కృష్ణా జిల్లా ఆంధ్రాబ్యాంకు డీజీఎం కృష్ణారావు స్పష్టం చేశారు.
పాత అప్పులు చెల్లించకపోతే కొత్త రుణాల మంజూరులో ఆలస్యం కావటంతోపాటు ప్రభుత్వం ఇచ్చే 7 శాతం వడ్డీ రాయితీని నష్టపోతారని చెప్పారు. పావలా వడ్డీ రుణాలు పొందే అవకాశాన్నీ, పంట రుణాల బీమా సదుపాయాన్ని నష్టపోవాల్సి వస్తుందని వివరించారు. పలు ఇతర బ్యాంకులు కూడా ఇదే పద్దతిని అనుసరించేందుకు సిద్ధమవుతున్నాయి.