బావమరిదితో రాయ‘బేరం’
సాక్షి, ఏలూరు : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవిని మూడోసారి దక్కించుకునేందుకు కనుమూరి బాపిరాజు ఉవ్విళ్లూరుతున్నారు. నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి కాం గ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఘోర పరాజయం పాలైన ఆయన ఏదోరకంగా టీటీడీ పదవిని నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం టీడీపీ నేతలను సైతం కలుస్తున్నట్లు సమాచారం. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు ప్రయత్నించిన కనుమూరికి చేదు అనుభవం ఎదురైంది. భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అటునుంచి పని కాదని బాపిరాజు భావించారు. తనపై పోటీ చేసి బీజేపీ తరపున ఎంపీగా గెలిచిన తన బావమరిది గోకరాజు గంగరాజును ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు.
గతంలో నరసాపురం ఎంపీగా ఉంటూనే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి దక్కించుకున్నారు కనుమూరి బాపిరాజు. సమైక్యాంధ్ర ద్రోహులుగా ముద్ర వేయించుకున్న వారిలో ఆయన కూడా ఒకరిగా మిగిలిపోయారు. రాష్ట్రం ముక్కలవుతుంటే ఎంపీగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు. ఇదేమని అడిగితే తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో చివరకు మిగిలిన సీనియర్ ఆయనొక్కరే. 2019 ఎన్నికల్లోనూ టికెట్టిస్తామని కాంగ్రెస్ అధిష్టానం చెప్పడంతో గత ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభా స్థానం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే ఇదే స్థానం నుంచి గెలిచిన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు తనకు స్వయానా బావమరిది కావడంతో అతని ద్వారా పని జరిపించుకోవాలని చూస్తున్నారు.
ఐ.భీమవరంలో వేదపాఠశాల భవనం ప్రారంభోత్సవానికి గత ఏడాది డిసెంబర్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని తీసుకురావాలని బాపిరాజు భావించా రు. కానీ సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయింది. శీతాకాలంలో తప్పక వస్తానని రాష్ట్రపతి తనకు హామీ ఇచ్చారని, అప్పటివరకు తనను టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించవద్దని వేడుకుంటున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉం డటం, తన బావమరిది ఎంపీ కావడం తో కేంద్రం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రికి సిఫారసు చేయించుకోవడానికి బాపిరాజు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమా చారం. నిజానికి బాపిరాజు పదవీకాలం మరో రెండు నెలల్లో ముగియనుంది. ఈ ఏడాది చివరివరకు పొడిగిస్తే మూడోసారి ఆ పదవి దక్కించుకునట్టవుతుంది. కానీ టీడీపీలో ఈ పదవి కోసం గట్టి పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తనవారిని కాదని మీసాల రాజు కు పదవి ఇస్తారా అనేది అనుమానమే.