ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ హోరు కొనసాగుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వరుసగా 70వ రోజు ఆందోళనలు నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు సైతం సమ్మె చేపట్టడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. వైఎస్‌ఆర్ సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఎన్‌జీఓల ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లా కేంద్రమైన ఒంగోలులో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించారు.
నగరంలోని పోస్టాఫీసులు, బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ కార్యాలయాలతో పాటు సుమారు 60 వాణిజ్య బ్యాంకులు పూర్తిగా మూతపడ్డాయి. అలాగే నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించిన ఉద్యోగులు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇంటిని ముట్టడించారు. ఆ సమయంలో ఆందోళనకారులను ఎంపీ ఇంటివద్ద పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తాను ఎంపీ పదవికి ఎప్పుడో రాజీనామా చేశానని, స్పీకర్ ఆమోదించడం లేదని ఉద్యోగులకు మాగుంట సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రాజీనామా లేఖను వారందరికీ చూపించారు. అనంతరం ఉద్యోగులతో కలిసి ఆందోళన కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు.
ర్యాలీలు, రాస్తారోకోలు, ముట్టడి కార్యక్రమాలతో నిరసన...
జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, ముట్టడి కార్యక్రమాలతో సమైక్యవాదులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మరోసారి ముట్టడించారు. ఉద్యోగులు అధిక సంఖ్యలో వాటిని ముట్టడించి కార్యకలాపాలను అడ్డుకున్నారు. అద్దంకిలో ఆర్టీసీ కార్మికులు, ఎన్‌జీఓలు, ఉద్యోగులు కలిసి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మూసివేయించి నిరసన తెలిపారు. పట్టణంలో భారీ ర్యాలీ, రాస్తోరోకో నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు రోడ్డుపై ఆందోళనకు దిగి నిరసన తెలియజేశారు. టీడీపీ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. చీరాల పట్టణంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ కార్మికులు, టీడీపీ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. విజ్ఞాన్ భారతి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించారు. మార్కాపురంలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉద్యోగులంతా నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టాఫీసులు, బ్యాంకులు, ఎల్‌ఐసీ కార్యాలయాలను మూసివేయించి కేంద్ర ప్రభుత్వ సర్వీసులను అడ్డుకున్నారు. ఎన్‌జీఓలు, ఉపాధ్యాయులు ప్రదర్శన నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తల దీక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీ కార్యకర్తల దీక్షను ఉద్యోగులు అడ్డుకున్నారు. సమైక్యం కోసం చేస్తున్నారా..విభజన కోసం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఏ విషయం ప్రకటించిన తర్వాతే దీక్షలు చేయాలంటూ హెచ్చరించారు. కొండపిలోనూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కొనసాగింది. టీడీపీ కార్యకర్తల రిలేదీక్షలు జరుగుతున్నాయి.
కందుకూరులోనూ సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. పర్చూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 20వ రోజుకు చేరాయి. వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తల దీక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు దీక్షలు ప్రారంభమయ్యాయి. గిద్దలూరు నియోజకవర్గంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. వైఎస్ జగన్ ఆమరణ దీక్షకు మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో వివేకానందకాలనీ యువకులు కూర్చున్నారు. విద్యుత్ ఉద్యోగులు స్థానిక కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి జేఏసీ నాయకులతో కలిసి రాస్తారోకో చేశారు.
టీడీపీ నాయకుల రిలేనిరాహార దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. కనిగిరిలో సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తుతోంది. రాష్ట్రవిభజనకు నిరసనగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎన్‌ఎంయూ కార్మికులు రిలే దీక్షకు కూర్చున్నారు. ముందుగా రోడ్డుపై బైఠాయించి తమలపాకులు తిని నిరసన తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు రోడ్డుపై బత్తాకాయలు అమ్మి నిరసన తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు వేర్పాటువాదుల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి చర్చిసెంటర్‌లో వాటిని దహనం చే శారు. వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలేదీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కనిగిరి, వెలిగండ్ల, హెచ్‌ఎం పాడు, సీఎస్ పురం, పామూరులో టీడీపీ కార్యకర్తలు రిలేదీక్షలు చేపట్టారు. దర్శిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగులు ముట్టడించి కార్యకలాపాలను అడ్డుకున్నారు. యర్రగొండపాలెంలో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తల దీక్షలు నాలుగోరోజుకు చేరుకున్నాయి. బ్యాంకులు, పోస్టాఫీసులు, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగులు మూసివేయించి నిరసన తెలిపారు.
సమైక్య రాష్ట్రాన్ని రక్షిస్తాం
Published Wed, Oct 9 2013 6:34 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement