Power employees
-
చర్చలు మళ్లీ విఫలం.. రోజువారీ సమీక్షల బహిష్కరణకు పిలుపు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ, ఇతర డిమాండ్ల పరిష్కారానికి తెలంగాణ స్టేట్ పవర్/ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీలతో, విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీలతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీ‹శ్‌రెడ్డి ఆదివారం తన కార్యాలయంలో నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. 6శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుకు క్రితం సారి జరిగిన చర్చల్లో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ప్రతిపాదించగా, ఉభయ జేఏసీలు తిరస్కరించాయి. మరోశాతం పెంచి 7శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, దీనికి అంగీకరించి 17 నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని తాజాగా జరిపిన చర్చల్లో విద్యుత్‌శాఖ మంత్రి ప్రతిపాదించగా, ఇందుకూ జేఏసీలు తిరస్కరించాయి. దీంతో విద్యుత్ జేఏసీలతో ఏడో దఫా చర్చలు సైతం విఫలమయ్యాయి. 17నుంచి సమ్మె పిలుపులో మార్పు లేదు: గతంలో జరిగిన చర్చల్లో 30శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుకి పట్టుబట్టామని, తాజాగా కనీసం 25శాతం ఫిట్‌మెంట్‌తోనైనా అమలు చేయాలని కోరామని పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు సాయిబాబు వెల్లడించారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా ఈ నెల 17 నుంచి సమ్మె ప్రారంభిస్తామని, ఈ విషయంలో ఎలాంటి మార్పులేదని ప్రకటించారు. సోమవారం నుంచి జిల్లాల్లో సమ్మె సన్నాహక సమావేశాలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో రోజువారీగా నిర్వహించే సమీక్ష సమావేశాలను సోమవారం నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. చర్చల్లో యాజమాన్యాల తరఫున ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, ఉత్తర/దక్షిణ డిస్కంల సీఎండీలు ఎ.గోపాల్‌రావు, జి.రఘుమారెడ్డి, పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు పి.రత్నాకర్ రావు, శ్రీధర్, బీసీ రెడ్డి పాల్గొన్నారు. -
పీఆర్సీ కోసం ఉద్యమాలు ఉధృతం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ సాధన కోసం ఆందోళనలను తీవ్రం చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. 1004 యూనియన్ కార్యాలయంలో సోమవారం సమావేశమై ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన నోటీసులను యాజమాన్యానికి అందజేసినట్లు జేఏసీ చైర్మన్ జి.సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీ విషయంలో యాజమాన్యం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కార్యాచరణలో భాగంగా ఈనెల 21, 22 తేదీల్లో సర్కిల్ స్థాయిల్లో సమావేశాలు, 24, 25, 28 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన, మార్చి 1, 2న డివిజన్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద భోజన విరామ సమయంలో ప్రదర్శన, మార్చి 3, 4న సర్కిల్ కార్యాలయాలు, కార్పొరేట్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద భోజన విరామ సమయంలో ప్రదర్శన, మార్చి 8 నుంచి 23 వరకు సర్కిల్ కార్యాలయాలు, కార్పొరేట్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద రిలే నిరాహార దీక్షలు, మార్చి 14న కేటీపీఎస్ ప్లాంట్ వద్ద, 17న వరంగల్‌లో, 21న శంషాబాద్‌లో నిరసన సభలు, 24న విద్యుత్ సౌధలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయినా, యాజమాన్యం స్పందించని పక్షంలో 24న అత్యవసర సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో జేఏసీ కో చైర్మన్ శ్రీధర్, కో కన్వీనర్, బీసీ రెడ్డి, వైస్ చైర్మన్ వజీర్ పాల్గొన్నారు. -
ఆ బిల్లు తెస్తే అర్ధగంటలో దేశం అంధకారం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సవరణ బిల్లు-2021ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెడితే.. విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ పిలుపు మేరకు విద్యుత్ ఉద్యోగులందరూ మెరుపు సమ్మెకు దిగుతారని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.రత్నాకర్‌రావు హెచ్చరించారు. లోక్‌సభ వెబ్సైట్లో బిల్లును లిస్టింగ్ చేసిందని, బిల్లును ఎప్పుడు ప్రవేశపెడతారో మూడు రోజుల ముందు వరకు కూడా తెలియనుందన్నారు. తమ వ్యతిరేకతను పట్టించుకోకుండా బిల్లును తెస్తే అర్ధగంటలో యావత్ దేశం అంధకారమవుతుందని హెచ్చరించారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి విద్యుదుత్పత్తి కేంద్రాలు, లోడ్ డిస్పాచ్ సెంటర్లు వంటి అత్యవసర విభాగాల ఉద్యోగులందరూ సమ్మెకు దిగుతారని చెప్పారు. 12 తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతలతో కలసి బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. బడా పారిశ్రామికవేత్తలకు విద్యుత్ సంస్థల ఆస్తులను దోచిపెట్టడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోందని ఆరోపించారు. లైసెన్స్ లేకుండా విద్యుత్ పంపిణీ రంగంలో వ్యాపారం చేసేందుకు ప్రైవేటు వ్యాపారులకు అవకాశం కల్పించడానికి ఈ బిల్లును తీసుకువస్తున్నారని ఆరోపించారు. వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులతోపాటు విద్యుత్ సంస్థలకు ఈ బిల్లు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గృహ వినియోగదారులకు ప్రస్తుతమున్న రాయితీలు ఇక ముందు లభించవని, ప్రైవేటు కంపెనీలు మాఫియాగా ఏర్పడి విద్యుత్ చార్జీలు భారీగా పెంచేస్తాయన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి ఉత్పన్నం అవుతుందని, వ్యవసాయ పంప్సెట్లకు సైతం మీటర్లు బిగించనున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఈ బిల్లును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు విద్యుత్ బిల్లును వ్యతిరేకించే పార్టీలకే విద్యుత్ ఉద్యోగుల మద్దతు ఉంటుందని రత్నాకర్‌రావు తెలిపారు. విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ శాసనసభలో సీఎం కేసీఆర్ తీర్మానం చేశారని, ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని విద్యుత్ ఉద్యోగులను కోరారు. విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్న వారికి మద్దతు తెలిపారు. సమావేశంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ అకౌంట్స్ స్టాఫ్ అసోసియేషన్, 1104 యూనియన్, 1535 యూని యన్, టీవీఈఏ, టీఈడబ్ల్యూఈఏ, బీసీ/ ఎస్సీ, ఎస్టీ/ ఓసీ/ ఎస్టీ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇక జస్టిస్ ధర్మాధికారిదే నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ సంస్థలతో జస్టిస్ డీఎం ధర్మాధికారి ఏకసభ్య కమిషన్ ఏడాదిగా జరుపుతున్న మధ్యవర్తిత్వం ముగిసింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ధర్మాధికారి ఆదివారం రెండో రోజు నిర్వహించిన సమావేశంలో సైతం 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీ స్థానికత కలిగి ఉన్నారన్న కారణంతో తెలంగాణ విద్యుత్ సంస్థలు 2015 జూన్‌లో 1,157 మంది ఉద్యోగులను ఏకపక్షంగా ఏపీకి రిలీవ్ చేయడంతో ఈ వివాదం చెలరేగింది. దీంతో ఉద్యోగుల విభజన కోసం ఉద్యోగులందరి నుంచి ఆప్షన్లు స్వీకరించాలని గతంలో ధర్మాధికారి మార్గదర్శకాలు జారీ చేశారు. రిలీవైన 1,157 మంది ఉద్యోగుల్లో 613 మంది ఏపీకి, 504 తెలంగాణకు ఆప్షన్లు ఇవ్వగా.. మిగిలినవారు ఏ రాష్ట్రానికీ ఆప్షన్లు ఇవ్వలేదు. ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 256 మంది తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చారు. ఏపీకి ఆప్షన్లు ఇచ్చిన 613 మందిని ఏపీ విద్యుత్ సంస్థలు తీసుకుంటే, తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 256 మందిలో సగంమందిని తీసుకుంటామని తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆదివారం సమావేశంలో ఆఫర్ ఇచ్చాయి. దీనిని ఏపీ విద్యుత్ సంస్థలు తిరస్కరించాయి. దీంతో మధ్యవర్తిత్వపు ప్రక్రియ ముగిసిందని, తానే తుది నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టుకు నివేదిస్తానని పేర్కొంటూ జస్టిస్ ధర్మాధికారి సమావేశాన్ని ముగించారు. 2018 నవంబర్ 28న సుప్రీంకోర్టు ధర్మాధికారి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మెట్టు దిగినా..: రిలీవైన 1,157 మందిలో తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 504 మందితోపాటు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేందుకు ఆప్షన్లు ఇచ్చిన 256లో సగం మందిని తీసుకోవడానికి రాష్ట్ర విద్యుత్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలంగాణ విద్యుత్ జేఏసీ నేతలు శివాజీ, అంజయ్యలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి తోడు నాలుగేళ్ల కింద ఏపీ నుంచి 242 మంది తెలంగాణ స్థానికత గల ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు చేర్చుకున్నాయన్నారు. దీంతో మొత్తం 874 మంది ఉద్యోగులను తీసుకునేందుకు తెలంగాణ సంసిద్ధత వ్యక్తం చేయగా, 613 మందిని తీసుకోవడానికి ఏపీ అంగీకరించలేదని ఆరోపించారు. తెలంగాణ విద్యుత్ సంస్థలు మెట్టు కిందికి దిగినా, ఏపీ విద్యుత్ సంస్థలు మొండికేశాయని విమర్శించారు. -
విద్యుత్ ఉద్యోగుల విభజనపై భేటీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీఎం ధర్మాధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ మార్చి 2, 3వ తేదీల్లో హైదరాబాద్‌లో భేటీ కానుంది. ఈ మేరకు బుధవారం ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇచ్చింది. ఏపీలోని విజయవాడలో ఉద్యోగ, కార్మిక సంఘాల అభిప్రాయాన్ని సేకరించిన కమిటీ ..తాజాగా వచ్చేనెల 2, 3 తేదీల్లో తెలంగాణ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కూడా సేకరి స్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే విద్యుత్ సంస్థలతో ఒకసారి సమావేశమైన కమిటీ ఇప్పుడు మరోసారి సమావేశానికి సిద్ధమయ్యింది. రెండ్రోజులుగా విజయవాడలో జరుగుతున్న భేటీలో ఏపీ సంఘాలన్నీ ఉద్యోగులందరి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని నివేదించగా..రిలీవ్ అయిన ఉద్యోగులు మాత్రం తమ 1,157 మంది ఆప్షన్లను మాత్రమే పరిగణంలోకి తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ఏపీకి వెళ్లేందుకు 621 మంది సిద్ధం రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి స్థానికతను 1 నుంచి 7వ తరగతి ఏ ప్రాంతంలో చదివితే, ఆ ప్రాంతానికి స్థానికుడిగా పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులను విభజించాలని డిస్కమ్‌లు పట్టుబడుతున్నాయి. ఏపీ ఉద్యోగ సంఘాలే కాకుండా విద్యుత్ సంస్థల ప్రతినిధులు కూడా ఉద్యోగులందరి దగ్గరి నుంచి అభిప్రాయాలను తీసుకోవాలని కోరాయి. తెలంగాణ డిస్కమ్‌లలో పని చేస్తున్న ఏపీ స్థానికత కలిగిన 1,157 మంది ఉద్యోగులను ఏపీకి కేటాయించాలని, వీరిలో ఇప్పటికే 621 మంది ఏపీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ డిస్కమ్‌లు ఇప్పటికే ధర్మాధికారి కమిషన్‌కు నివేదించాయి. ఉద్యోగల విభజన సందర్భంగా పంజాబ్, బిహార్ రాష్ట్రాల తీర్పులను కూడా జోడించాయి. ఇక సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన ఆర్నెల్లలోపు ఉద్యోగుల విభజన సమస్యను తేల్చాల్సి ఉండగా ఇప్పటికే దీంట్లో మూడు నెలలు గడిచిపోయాయి. -
ఇళ్లపై యమపాశాలు..!
సాక్షి, పెద్దకొత్తపల్లి: మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజల నివాస ఇళ్లపై 11కేవీ విద్యుత్ వైర్లు వేలాడుతూ చిన్నపాటి గాలి, వర్షాలకు మంటలు రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విద్యుత్ వైర్లను తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా.. పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మండలంలో ఇండ్లపై విద్యుత్ వైర్లు ఉన్న గ్రామాలు మండల కేంద్రంతోపాటు ముష్టిపల్లి, పెద్దకారుపాముల, దేవల్‌తిర్మలాపూర్, సాతాపూర్, కల్వకోల్, చెన్నపురావుపల్లి, జొన్నలబొగుడలో ప్రజల ఇండ్లపై విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. రైతులు పండించిన పంటలను మేడలపై ఆరబెట్టుకునేందుకు పైకి వెళ్తే ప్రమాదాలు జరుగుతున్నాయి. వైర్లను తొలగించాలని ఆయా గ్రామాల్లో ప్రజలు, రైతులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. గతంలో పెద్దకారుపాములలో వస్త్రాలను ఆరబెట్టేందుకు మేడపైకి వెళ్లిన యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఆరు నెలల క్రితం చంద్రకల్ గ్రామంలో ఇంటిపై ఉన్న విద్యుత్ వైరు తగలడంతో యువకుడు చనిపోయాడు. వెన్నచర్లలో 11కేవీ విద్యుత్ వైరు గొర్రెలమందపై పడటంతో పది గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఇళ్లపై ఉన్న వైర్లను తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇళ్ల మధ్యన ఉన్న ట్రాన్స్ఫార్మర్ మండలంలోని వెన్నచర్ల, సాతాపూర్, దేదినేనిపల్లి, పెద్దకారుపాముల, ముష్టిపల్లి గ్రామాలలో ఇండ్లమధ్యన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో చిన్నపాటి ఈదురు గాలులు, వర్షాలు వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫీజులు ఎగిరిపోవడంతో పెద్ద మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇండ్ల మధ్యన ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలి గ్రామాలలో ఇండ్ల మధ్యన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తొలగించి ప్రజల ఇబ్బందులు పడకుండ చూడాలి. గ్రామాల చివర విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లను తొలగించేందుకు విద్యుత్ అధికారులు చొరవ చూపాలి. – జలాల్ శివుడు, బీజేపీ మండలాధ్యక్షులు, పెద్దకొత్తపల్లి ఇళ్లపై వైర్లను తొలగించాలి పెద్దకొత్తపల్లి, పెద్దకారుపాముల, ముష్టిపల్లి, మరికల్, సాతాపూర్, వెన్నచర్లలో ఇండ్లపై ఉన్న విద్యుత్ వైర్లను తొలగించి ఇండ్లకు దూరంగా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. విద్యుత్ అధికారులు బిల్లు వసూలుపై చూపిన శ్రద్ధ వైర్లు తొలగించడంపై చూపడం లేదు. ఇండ్లపై ఉన్న వైర్లను తొలగించాలి. – శేఖర్, పెద్దకొత్తపల్లి -
కరెంట్....‘కట్’కట!
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ కార్మికుల సమ్మె కారణంగా వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ బిల్లుల వసూళ్లు, మరమ్మతులు, సాంకేతిక సహకారం తదితర విభాగాలపైనా సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది. సంస్థ నెలవారీ ఆదాయం భారీగా పడిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆర్జిజన్ సహా ఫీస్రేట్ కార్మికులంతా సమ్మెకు దిగడంతో ఎక్కడి బిల్లులు అక్కడే నిలిచిపోయాయి. చిరుజల్లులకు ఫీడర్లలో పలు సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. మరమ్మతు పనులు నిర్వహించే కార్మికులంతా సమ్మె చేస్తుండటంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఆయా కాలనీలన్నీ అంధకారంలో మగ్గాల్సి వస్తోంది. 24 గంటల విద్యుత్ సరఫరా తర్వాత చాలా మంది ఇంట్లో ఇన్వర్టర్లను వినియోగించడం మానేశారు. జనరేటర్లలో డీజిల్ కూడా లేకపోవడం, లాంతర్లు మూలనపడేశారు. అసలే దోమలు..ఆపై ఉక్కపోతకు తోడు ఇంట్లో ఫ్యాన్లు కూడా తిరగకపోవడంతో కంటిమీద కునుకులేకుండా పోతోంది. ఈ సమయంలో రెగ్యులర్ డీఈ, ఏఈ, లైన్మెన్లకు ఫోన్ చేసినా ఫలితం ఉండకపోవడంతో వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతు చేసేవారు లేక..సరఫరాకు బ్రేక్ మంగళవారం అర్థరాత్రి ఒంటిగంటకు అకస్మాత్తుగా సైదాబాద్ కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రాత్రంతా కాలనీలో అంధకారం నెలకొంది. సంబంధిత అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. చివరకు సుమారు 13 గంటల తర్వాత (బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు) కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. ఆస్మాన్‌ఘడ్ డివిజన్ అరుంధతికాలనీ సబ్‌స్టేషన్‌లోని కుమ్మరివాడి ఫీడర్లో మంగళవారం సాయంత్రం ఏబీ స్విచ్ ఫెయిలైంది. దీంతో ఆ ఫీడర్ పరిధిలోని కాలనీల్లో సుమారు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చార్మినార్ సర్కిల్ పరిధి ఫలక్‌నూమా సబ్‌స్టేషన్‌లోని ఛత్రినాక ఫీడర్‌లోని బ్రేకర్‌లో మంగళవారం సాయంత్రం సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా ఆ ఫీడర్ పరిధిలోని కాలనీలకు మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కీసర సబ్‌స్టేషన్ పరిధి అంకిరెడ్డిపల్లి ఫీడర్ పరిధిలో ఇన్సులేటర్ ఫెయిలై..సుమారు మూడు గంటలపాటు సరఫరా నిలిచింది. అదే విధంగా సైనిక్‌పురి సర్కిల్ ఆర్జీకే ఫీడర్‌లోనూ ఇదే సమస్యతో సుమారు రెండు గంటలు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. డీఎంఎల్, ఆలియాబాద్, కండ్ల కోయ తదితర ప్రాంతాల్లోనూ ఇదే సమస్య తలెత్తింది. అత్యవసర సమయంలో ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్లకు ఫోన్ చేసినా ఫలితం ఉండటం లేదు. కాంట్రాక్ట్ కార్మికులంతా సమ్మె చేస్తుండటంతో రెగ్యులర్ కార్మికులపై భారం పడుతోంది. విద్యుత్ బిల్లుల వసూళ్లపై తీవ్ర ప్రభావం మరమ్మతులు, రెవిన్యూ వసూళ్లు, కొత్త కనెక్షన్ల జారీ, మీటర్ల బిగింపు వంటి పనుల్లో తీవ్రజాప్యం జరుగుతుండటంతో వినియోగదారులు అసహనం వ్య క్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 50 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటి నుంచి నెలకు సగటున రూ.450 కోట్లకుపైగా బిల్లుల రూపంలో సంస్థకు చేరుతుంది. బిల్లు చెల్లింపు గడువు దాటిన తర్వాత వంద శాతం బిల్లింగ్ నమోదు కోసం లైన్మెన్ సహా కాంట్రాక్ట్ మీటర్ రీడింగ్ కార్మికులు వినియోగదారుల ఇంటికి వెళ్లి వారంతా సకాలంలో బిల్లు చెల్లించే విధంగా చూస్తారు. నెలాఖరులో ఈ కార్మికులంతా సమ్మెలోకి వెళ్లడంతో ఎక్కడి బిల్లులు అక్క డే నిలిచిపోయాయి. సోమవారం వరకు సంస్థ రెవిన్యూ రూ.200 కోట్లు కూడా దాటక పోవడం విశేషం. ఆన్లైన్, పేటీఎం చెల్లింపులకు అవకాశం ఉన్నా..ఆశించిన స్థాయిలో ఈ సేవలను వినియోగించకపోవడం కూడా మరోకారణం. -
విద్యుత్ ఉద్యోగుల విభజనలో ముందడుగు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు హైకోర్టు చేస్తున్న ప్రయత్నాల్లో ముందడుగు పడింది. విభజన నేపథ్యంలో స్థానికత ఆధారంగా పక్కన పెట్టిన దాదాపు 1,200 మంది ఉద్యోగుల్లో ఎంత మంది ఏపీకి వెళ్లాలనుకుంటున్నారో, ఎంత మంది తెలంగాణలో ఉండదలిచారో తెలుసుకోవాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ‘ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సదరు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలి. రెండు వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి, ఆ వివరాలను ఏపీకి తెలియ జేయాలి. వాటిని ఏపీ పరిశీలించి మరో రెండు వారాల్లో ఓ అభిప్రాయానికి రావాలి’ అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. శుక్రవారం ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోండి పాత విషయాలను పక్కన పెట్టి ఇరుపక్షాలు సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. ఉద్యోగుల విభజన నిమిత్తం తెలంగాణ విద్యుత్ సంస్థలు రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ 1,260 మందికి పైగా విద్యుత్ ఉద్యో గులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఏపీ స్థానికత ఆధారంగా రిలీవ్ చేసిన ఉద్యోగుల జీత భత్యాలను 58:42 నిష్పత్తిలో ఉభయ రాష్ట్రాలు చెల్లించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తుది విచారణను వాయిదా వేసింది. అంతకుముందు కూడా వివాద పరిష్కారాని కి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధి కారిని ఏర్పాటు చేసినా సమస్య కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్యోగుల వ్యాజ్యాలపై హైకోర్టు తుది విచారణ ప్రారంభించి.. సామరస్యపూర్వక పరిష్కార ప్రయత్నాలు ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వివాద పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తెలుసుకోవడం అవసరమని, తెలం గాణకు ఆప్షన్ ఇచ్చిన వారిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుం టూ.. తెలంగాణ ప్రభుత్వం రెండు అడుగు లు తగ్గిందని, అందువల్ల సమస్య పరిష్కా రానికి మీరు (ఏపీ ప్రభుత్వం) చొరవ చూపాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేశ్‌కు సూచిం చింది. విద్యుత్ పంపిణీ సంస్థలు స్వతంత్ర సంస్థలని, వాటికి ప్రాంతీయతను ఆపాదిం చడానికి వీల్లేదని రమేశ్ తెలిపారు. స్థానికత ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టిన ఉద్యోగులందరూ తెలంగాణ ఉద్యోగు లేనని స్పష్టం చేశారు. వారికి ఏపీలో ఎలాంటి పోస్టులు లేవన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల వారీగా సంప్రదింపులు జరిపితే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు ఆప్షన్లు తెలుసుకుంటేనే స్పష్టత ఈ సమయంలో ధర్మాసనం కల్పించుకుని, ఆప్షన్లు తెలుసుకుంటే ఈ మొత్తం వ్యవహారంలో స్పష్టత వస్తుందని సూచన చేసింది. కోర్టుకొచ్చిన వారిలో ఎంత మంది తెలంగాణలో ఉండదలిచారో.. ఎంత మంది ఏపీకి వెళ్లదలిచారో తెలుసుకుని ఎందుకు చెప్పకూడదని ప్రశ్నించింది. ఇలా చేస్తే సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని తెలిపింది. తాను దాదాపు 500 మంది తరఫున హాజరవుతున్నానని, వారిలో 40 శాతం తెలంగాణకు, మిగిలిన వారు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ చెప్పారు. ఈ సమయంలో ప్రకాశ్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, ఆప్షన్లు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, నిర్దిష్ట నమూనా తయారు చేసి ఆప్షన్లు తెలుసుకుంటామని తెలిపారు. ఈ ప్రతిపాదనను స్వాగతించిన ధర్మాసనం, రెండు వారాల్లో ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. -
‘విద్యుత్’ సమ్మె ఉపసంహరణ
► ప్రభుత్వం, ట్రేడ్ యూనియన్ల మధ్య చర్చలు సఫలం ► దశలవారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ► మార్చి 31లోగా మార్గదర్శకాలు ► నేరుగా వేతనాలపై సీఎం దగ్గర మరోసారి సమావేశం ► ట్రేడ్ యూనియన్లు, ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం సాక్షి, హైదరాబాద్: అపరిష్కృత డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగాలని ఇచ్చిన పిలుపును తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స ఫ్రంట్ (టీఈటీయూఎఫ్) ఉపసంహరించుకుంది. 13 కార్మిక సంఘాలు ఫ్రంట్‌గా ఏర్పడి సమ్మెకు పిలుపునివ్వగా, ఇందులోని 1104, 327, తెలుగునాడు కార్మిక సంఘాలు శనివారం విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డితో చర్చల అనంతరం సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రాన్సకో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు ఆదివారం మిగిలిన 9 సంఘాల నేతలతో చర్చలు జరిపి సమ్మె విరమణకు ఒప్పించారు. రిజర్వేషన్లు, స్థానికత నిబంధనల వల్ల క్రమబద్ధీకరణకు అర్హత సాధించని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని ఈ 9 కార్మిక సంఘాలు కోరగా, ఈ అంశంపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్తామని ట్రాన్సకో సీఎండీ కార్మిక నేతలకు హామీ ఇవ్వడంతో సమస్య పరిష్కారమైంది. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 10 లక్షల బీమా సాధ్యమైనంత త్వరగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.10 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని యాజమాన్యాలు తెలిపాయి. అదేవిధంగా జెన్కో విద్యుత్ ప్లాంట్లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రమాదాల్లో మృతి చెందితే 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు అంగీకరించాయి. జెన్కో ప్లాంట్లలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 12 శాతం ప్రత్యేక అలవెన్స చెల్లిస్తామన్నాయి. కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్లుగా విధుల్లో చేరిన కాలం నుంచే జూనియర్ లైన్మెన్లకు నోషనల్ ఫిక్సేషన్ ఇస్తామని హామీ ఇచ్చాయి. 1999-2004 మధ్య కాలంలో నియమితులైన ఉద్యోగులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పన అంశాన్ని మళ్లీ ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపాయి. మార్చి 31లోగా ‘క్రమబద్ధీకరణ’ మార్గదర్శకాలు విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శ కాలను వచ్చే ఏడాది మార్చి 31లోగా జారీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలు హామీ ఇచ్చారుు. తెలంగాణ ట్రాన్సకో, జెన్కో, డిస్కంల ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన వివిధ అంశాలపై ఆదివారం ఆయా సంస్థల యాజమాన్యాలు, టీఈటీయూ ఎఫ్ నేతల మధ్య రాతపూర్వకంగా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో.. సీఎం కేసీఆర్ హామీ మేరకు దశల వారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని యాజ మాన్యాలు అంగీకరించాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిన 8,800 సబ్ స్టేషన్ ఆపరేటర్ల పోస్టులు, ప్రభుత్వ పరిశీలనలో ఉన్న మరో 5,816 కొత్త పోస్టులతో ఔట్ సోర్సింగ్ ఉద్యో గుల క్రమబద్ధీకరణకు హామీ ఇచ్చాయి. క్రమబద్ధీకరణ మార్గదర్శకాలను 2017 మార్చి 31లోగా జారీ చేస్తామని తెలిపారుు. -
ప్రభుత్వానికి పతనం తప్పదు
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ కన్వీనర్ శ్రీధర్ హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరి ష్కరించకపోతే ప్రభుత్వానికి పత నం తప్పదని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ ఇనుగాల శ్రీధర్ హెచ్చరించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ బుధవారం హన్మకొండలో విద్యుత్ ఉద్యోగులు రాష్ట్ర స్థారుు మహాధర్నా నిర్వహించారు. ఉద్యోగులంతా నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలో ఇనుగాల శ్రీధర్ మాట్లాడుతూ సమస్యలు విన్నవించుకుందామనుకుంటే సీఎం కేసీఆర్ అపారుుంట్‌మెంట్ ఇవ్వరన్నారు. విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే సమస్యలు పరిష్కరించాల్సిన ఆ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చైనాకు పారిపోతున్నారని అన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో నిరాహారదీక్ష చేపట్టనున్నామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగుతామన్నారు. ఫ్రంట్ రాష్ట్ర చైర్మన్ పద్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మనది, సీఎం కేసీఆర్ మనోడు, మన సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించామని, కానీ, అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. -
ఎట్టకేలకు సొంత రాష్ట్రంలో పోస్టింగ్‌లు
- ఏపీ నుంచి 204 మంది విద్యుత్ ఉద్యోగుల రాక - అందరికీ పోస్టింగ్‌లు కేటాయించిన తెలంగాణ - మరోవైపు రిలీవైన వారికి షోకాజ్‌లు పంపిస్తున్న ఏపీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల నుంచి స్వచ్ఛందంగా రిలీవైన తెలంగాణ ప్రాంత విద్యుత్ ఉద్యోగులకు ఎట్టకేలకు సొంత రాష్ట్రంలో పోస్టింగ్‌లు లభించాయి. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కో నుంచి రిలీవైన 204 మంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో పోస్టింగ్‌లు కేటాయించాయి. తమను తెలంగాణకు రిలీవ్ చేయాలని ఉద్యోగులు ఏడాదిగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా.. ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అంగీకరించలేదు. దీంతో గత నెల 31న ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత స్టేట్ కేడర్ ఉద్యోగులు మూకుమ్మడిగా స్వచ్ఛందంగా రిలీవై సొంత రాష్ట్రంలో రిపోర్టు చేశారు. ఏపీ ట్రాన్స్‌కో నుంచి 151 మంది.. ఏపీ జెన్కో నుంచి 53 మంది రిలీవై వచ్చారు. వీరిలో దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రం నుంచి రిలీవైన 28 మంది ఉద్యోగులు సైతం ఉన్నారు. స్థానికత నిర్థారణ కోసం సర్టిఫికెట్ల పరిశీలన తదితర లాంఛనాల అనంతరం తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో వీరిని గత శుక్ర, శనివారాల్లో చేర్చుకున్నాయి. వీరంతా 2016 సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో పని చేస్తున్నట్లు పరిగణించి జీతాలు చెల్లించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. తెలంగాణ స్థానికత కలిగిన వారేనని స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అఫిడవిట్ రూపంలో స్వీకరించిన అనంతరమే వీరికి పోస్టింగ్‌లు కేటాయించారు. అఫిడవిట్ సమాచారంలో తేడాలుంటే ఉద్యోగం కోల్పోవడం తో పాటు క్రిమినల్ చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధమేనని అందరి నుంచి ప్రమాణ పత్రాన్ని స్వీకరించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. కాగా, స్వచ్ఛందంగా రిలీవైన ఉద్యోగుల సర్వీ సు పుస్తకాలు, లాస్ట్ పే సర్టిఫికేట్(ఎల్పీసీ)ని ఇచ్చేందుకు ఏపీ అధికారులు అంగీకరించారని రిలీవైన ఉద్యోగులు చెపుతున్నారు. సొంత రాష్ట్రంలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు తెలంగాణ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ నుంచి షోకాజ్ నోటీసులు ఏపీ నుంచి స్వచ్ఛందంగా రిలీవైన తెలంగాణ ఉద్యోగులకు ఆ రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలు షోకాజ్ నోటిసులు జారీ చేస్తున్నాయి. స్వచ్ఛందంగా రిలీవ్ కావడం విభజన చట్టానికి విరుద్ధమని, భవిష్యత్తులో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని నోటీ సుల్లో పేర్కొన్నాయి. విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం న్యాయస్థానాల పరిధిలో ఉన్న నేపథ్యంలో రిలీవ్ చేయలేకపోయామని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎవరికివారుగా రిలీవై వెళ్లిపోవడం సరైంది కాదని పేర్కొన్నట్టు సమాచారం. -
కాంట్రాక్టు ‘విద్యుత్’ కార్మికులకు ఊరట
- సమ్మె విరమణ ఒప్పందంలోని నాలుగు హామీలు నెరవేర్చిన ప్రభుత్వం - విధి నిర్వహణలో మరణిస్తే రూ.10 లక్షల పరిహారం -1,100 మంది కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్ల క్రమబద్ధీకరణ సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి విద్యుత్ సంస్థలు చర్యలు ప్రారంభించాయి. జూన్ 15 నుంచి విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త సమ్మెకు తెలంగాణ విద్యుత్ ట్రేడ్ యూనియన్ల ఫ్రంట్ పిలుపునివ్వగా.. రాష్ట్ర విద్యుత్ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి జూన్ 14న ఫ్రంట్ ప్రతినిధులతో చర్చలు జరిపి సమ్మె విరమణకు ఒప్పించారు. 34 డిమాం డ్ల పరిష్కారం కోసం సమ్మెకు పిలుపునివ్వ గా, 14 డిమాండ్లను 3 నెలల వ్యవధిలో పరిష్కరిస్తామని అప్పట్లో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు హామీ ఇచ్చాయి. వచ్చే నెల 14తో ఈ గడువు పూర్తికానుండగా, 4 హామీలను విద్యుత్ సంస్థలు నెరవేర్చాయి. అందులో 1,100 మంది కాంట్రాక్టు జూనియర్ లైన్మెన్ల క్రమబద్ధీకరణ ఒకటి. అలాగే విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మృతి చెందిన కాంట్రాక్టు ఉద్యోగులకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ.10లక్షలకు పెంచుతున్నట్లు తాజాగా ట్రాన్స్‌కో, డిస్కం లు ఉత్తర్వులు జారీ చేశాయి. క్రెడిట్ కార్డు వైద్య సేవలను వర్తింపజేస్తూ ఉత్తర్వులిచ్చా యి. కాంట్రాక్టు కార్మికుల బీమాను రూ.10 లక్షకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశాయి. మరోవైపు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా జీతాలు చెల్లించాలని ట్రేడ్లు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. 3.26 శాతం డీఏ పెంపు రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని (డీఏ) 3.26% పెంచుతూ ట్రాన్స్‌కో, డిస్కంలు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రస్తు తం 12.585% డీఏ అమలు చేస్తుండగా, గత జూలై 1 నుంచి 15.845 శాతానికి పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. జూలై నెలకు సంబంధించి పెరిగిన డీఏ బకాయిలను ఆగస్టు నెల జీతంతో కలిపి సెప్టెంబర్‌లో చెల్లించనున్నారు. అలాగే విద్యుత్ ప్రమాదాల్లో క్షతగాత్రులుగా మారే శాఖేతర వ్యక్తులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆదేశిస్తూ ట్రాన్స్‌కో, డిస్కంలు ఉత్తర్వులు జారీ చేశాయి. విద్యుత్ ప్రమాదాల్లో 100% అంగవైకల్యం పొందిన బాధితులకే ఈ పరిహారం వర్తించనుందని పేర్కొన్నాయి. -
‘విద్యుత్’ చర్చలు విఫలం
♦ ఉద్యోగుల విభజన వివాదంపై జస్టిస్ ధర్మాధికారి సంప్రదింపులు నిష్ఫలం ♦ సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించుకోవాలని సూచన ♦ ఇరు రాష్ట్రాల అభిప్రాయాలపై త్వరలో హైకోర్టుకు కమిటీ నివేదిక సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏడాది కాలంగా ఉప్పు నిప్పుగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ సంప్రదింపులు విఫలమయ్యాయి. మూడు రోజులపాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశాలు ఎలాంటి ఫలితం తేలకుండా ముగిశాయి. ఈ మినిట్స్ కాపీని ‘సాక్షి’ సంపాదించింది. ఇరు రాష్ట్రాల మధ్య కీలక అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదని కమిటీ ఈ సమావేశాల మినిట్స్‌లో పేర్కొంది. ఈ సమావేశాల వివరాలను హైకోర్టుకు అప్పగించాలని, ఈ అంశంపై నిర్ణయాన్ని హైకోర్టుకే అప్పగించాలని నిర్ణయించింది. సుదీర్ఘంగా చర్చలు విద్యుత్ ఉద్యోగుల వివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల విద్యుత్ ఉన్నతాధికారులతో హైకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రెండో దఫా చర్చల్లో భాగంగా ఈ కమిటీ గత నెల 30, ఈ నెల 1, 2వ తేదీల్లో ఇరు రాష్ట్రాల అధికారులతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపింది. సోమవారం రాత్రి 8 గంటల వరకు జరిగిన చివరి రోజు భేటీలో కూడా ఇరు రాష్ట్రాల అధికారులూ అవే వాదనలు వినిపించారు. స్థానికత ఆధారంగానే విద్యుత్ ఉద్యోగుల విభజన జరపాలన్న డిమాండ్‌ను తెలంగాణ బలంగా వినిపించింది. ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి సీనియారిటీ ప్రకారం విభజన జరపాలని ఏపీ పట్టుబట్టింది. ఇరు రాష్ట్రాల మధ్య కీలక అంశాల్లో తీవ్ర భేదాభిప్రాయాలు వ్యక్తం కావడంతో సమావేశాల వివరాలను హైకోర్టుకు వివరించి... నిర్ణయాన్ని కోర్టుకే అప్పగించాలని జస్టిస్ ధర్మాధికారి నిర్ణయించారు. ఆయన ప్రతిపాదించిన ముసాయిదా మార్గదర్శకాలను సైతం ఇరు రాష్ట్రాలు అంగీకరించలేదు. సూపర్ న్యూమరీ పోస్టుల మంజూరుకు తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే చెప్పారు. ఆప్షన్లు ఇవ్వాల్సిందే: ఏపీ సరిపడా సంఖ్యలో పోస్టులు లేని సందర్భంలో ఉద్యోగుల కేటాయింపులు జరపకూడదని కమిటీ ఎదుట ఏపీ వాదించింది. 2014 జూన్ 1 నాటికి ఉన్న ఖాళీలను మినహాయించిన తర్వాతే తుది కేటాయింపులు జరపాలంది. డిస్కంల ఉద్యోగుల విభజన చేపట్టడానికి వీల్లేదంది. ఉమ్మడి రాష్ట్రం లోని ఏపీసీపీడీసీఎల్ నుంచి అనంతపురం, కర్నూలు జిల్లాలు ఏపీ పరిధిలోకి వెళ్లాయని... వాటితోపాటు ఆ జిల్లాల్లోని పోస్టులు, ఉద్యోగుల్ని ఏపీకి కేటాయించారని తెలిపింది. ఏపీఎన్పీడీసీఎల్ (ప్రస్తుత టీఎస్ఎన్పీడీసీఎల్) పరిధిలోని ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలు ఏపీకి వెళితే అక్కడి పోస్టులు, ఉద్యోగుల్నీ ఏపీకే కేటాయించారని గుర్తు చేసింది. ఏ రాష్ట్రానికి వెళ్లాలన్న అంశంపై ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. స్థానికత ప్రాతిపదికనే: తెలంగాణ ఉన్నత స్థాయి పోస్టుల్లో ఏపీవారే ఎక్కువగా ఉండటంతోపాటు తెలంగాణకు జరి గిన అన్యాయాల నేపథ్యంలో... ఉద్యోగుల విభజనకు, పోస్టుల లభ్యతతో ముడిపెట్టాల్సిన అవసరం లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. కేటాయింపుల్లో వచ్చే ఉద్యోగులకు సరిపడా ఖాళీ పోస్టుల్లేకుంటే సూపర్ న్యూమరీ పోస్టుల్ని సృష్టిం చుకోవాలని సూచించింది. 2009కి పూర్వం డిస్కంలలో జరిగిన నియామకాల్లో ‘ఆర్టికల్ 371డి’ నిబంధనను అమలు చేయనందున డిస్కంల ఉద్యోగుల విభజన సైతం జరపాలంది. ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడం విభజన చట్టం పరిధిలో లేని అంశమని స్పష్టం చేసింది. -
రిలీవైన విద్యుత్ ఉద్యోగులను మళ్లీ చేర్చుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: రిలీవైన 1,252 మంది ఏపీ ఉద్యోగులను మళ్లీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో చేర్చుకుంటే సహాయ నిరాకరణకు దిగుతామని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ సంఘాల సంయుక్త కమిటీ హెచ్చరించింది. రిలీవైన ఉద్యోగులను మళ్లీ తెలంగాణలో చేర్చుకుంటే పనివాతావరణం చెడిపోయే ప్రమాదముందని, వారితో కలసి పనిచేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఏ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పనిచేయాలని స్పష్టం చేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజనకు మోకాలడ్డుతున్న ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాల వైఖరికి వ్యతిరేకంగా నాలుగు విద్యుత్ ఇంజనీర్ల సంఘాల సంయుక్త కమిటీ మంగళవారం విద్యుత్ సౌధలో నిరసన సభ నిర్వహించింది. తెలంగాణ విద్యుత్ రంగ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు ఎ.సుధాకర్‌రావు మాట్లాడుతూ రిలీవైన ఉద్యోగులకు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో చోటు లేదని, ఏపీ ప్రభుత్వం తమ ప్రాంత ఉద్యోగులను ఆదరించి విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తక్షణమే తెలంగాణకు కేటాయించాలని, విద్యుత్ ఉద్యోగుల విభజన ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని కోరారు. 4 నుంచి 7వ తరగతి(4/7) వరకు ఏ రాష్ట్రంలో చదివితే ఆ రాష్ట్ర స్థానికత కలిగి ఉన్నారని నిర్థారించి విద్యుత్ ఉద్యోగుల విభజన చేయాలన్న ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నామని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. పుట్టిన తేదీ ఆధారంగానే స్థానికతను నిర్థారించి విభజన నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల మనోభావాల మేరకే ఉద్యోగుల విభజన జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ పేర్కొన్నారు. నిరసన సభలో పాల్గొన్న ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శాంతియుతంగానే నిరసనలు తెలపాలని సూచించారు. సుప్రీంలో అప్పీల్ చేయాలి రిలీవైన 1,252 మంది విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ విద్యుత్ సంస్థలే 100 శాతం జీతాలు చెల్లించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై అప్పీల్ చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంలో అప్పీల్ చేస్తామని ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీని విస్మరించిన యాజమాన్యాలు రిలీవైన ఉద్యోగులకు పూర్తిగా జీతాలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశాయని ఓ సీనియర్ ఇంజనీర్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నిర్ణయం సరికాదన్నారు. అప్పీల్ విషయంలో తెలంగాణ యాజమాన్యాలను ఒప్పించడంలో విఫలమైన ఉద్యోగ సంఘాలు సోమ, మంగళవారాల్లో పోటాపోటీగా నిరసనలు, ధర్నాలు చేయడం ఎందుకని కొందరు తెలంగాణ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. -
తిరిగి తెలంగాణకు..!
సాక్షి, హైదరాబాద్: ఐదు నెలలుగా ఉద్యోగం, జీతభత్యాలు లేక త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడిన ‘ఏపీ స్థానికత’ విద్యుత్ ఉద్యోగులకు ఉపశమనం లభించింది. ఈ వివాదంపై హైకోర్టు ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేసేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించాయి. దీంతో విధుల్లోంచి రిలీవ్ చేసిన 1,251 మంది విద్యుత్ ఉద్యోగులను తిరిగి తాత్కాలికంగా చేర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు అనుమతిస్తూ బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేయగా... ఆ వెంటనే తెలంగాణ విద్యుత్ సంస్థలు చర్యలు చేపట్టాయి. హైకోర్టు ఆదేశాల అమలుకు తమ వంతు చర్యలు తీసుకుంటున్నామని తెలుపుతూ.. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం సాయంత్రం ఏపీ జెన్కో సీఎండీ కావేటి విజయానంద్‌కు లేఖ రాశారు. జనాభా దామాషా ప్రకారం ఆ ఉద్యోగుల జీతభత్యాలు, బకాయిల్లో 42 శాతం తెలంగాణ వాటాగా.. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం తమ 58 శాతం వాటాను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఉద్యోగుల జీతభత్యాలను తొలుత తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తే... అందులో తమ రాష్ట్ర వాటాను తర్వాత ఇచ్చేస్తామని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు. గడువు దగ్గర పడడంతో.. విద్యుత్ ఉద్యోగుల విభజనకు పుట్టినచోటు ఆధారంగా స్థానికతను నిర్ధారిస్తూ జూన్ 6న తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ వెంటనే తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలు 1,251 మంది ఉద్యోగులను విధుల్లోంచి రిలీవ్ చేశాయి. మరోవైపు వారిని తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు... ఆ ఉద్యోగులను తాత్కాలికంగా తెలంగాణ రాష్ట్రానికే కేటాయించడంతోపాటు జనాభా దామాషా ప్రకారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వారికి జీతభత్యాలు చెల్లించాలని ఆదేశించింది. నాలుగు వారాల్లో తీర్పును అమలు చేయాలని గడువు విధించింది. ఈ గడువు ఈనెల 20తో ముగియనుంది. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త వెనక్కితగ్గాయి. హైకోర్టు ఆదేశాల మేరకు 52 శాతం జీతభత్యాల భారాన్ని భరించేందుకు ఏపీ సర్కారు సంసిద్ధత వ్యక్తం చేయగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తుది తీర్పుపై ఉద్యోగుల భవితవ్యం ఆధారపడి ఉంది. వారు ‘సూపర్’ న్యూమరీ! రిలీవైన ఉద్యోగులను విధుల్లో చేర్చుకున్నా... వారికి గతంలో నిర్వహించిన పోస్టులను కట్టబెట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించి అప్పట్లోనే ఈ ఖాళీలను భర్తీచేశారు. రిలీవైన ఉద్యోగులను తిరిగి చేర్చుకోకముందే తెలంగాణ అధికారులకు సీనియారిటీ ప్రకారం పదోన్నతలు కల్పించి శాశ్వత ప్రాతిపదికన ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ‘రిలీవైన’ ఉద్యోగుల కోసం తాత్కాలికంగా సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలని నిర్ణయం తీసుకుంది. -
విద్యుత్ ఉద్యోగుల విభజన కేసులో మరో మలుపు!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాద వ్యవహారం శుక్రవారం మరో మలుపు తిరిగింది. వివాద పరిష్కారానికి సంబంధించి సంయుక్త కమిటీ ఏర్పాటు చేసేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చెరో నలుగురు పేర్లను సూచించాలన్న కోర్టు ఆదేశాలను అమలు చేయలేకపోతున్నామని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. ఇదిలా ఉంటే విభజన వివాద పరిష్కార బాధ్యతలను రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి షీలాభిడే నేతృత్వంలోని కమిటీకి అప్పగిస్తామన్న కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది. అసలు ఆ కమిటీ ప్రస్తుతం ఉనికిలో ఉందో లేదో చెప్పాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఏదేమైనా కూడా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలూ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఘాటుగా వ్యాఖ్యానిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీతాలు.. రిలీవింగ్‌పైనే వాదనలు వింటాం...: ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశించిన మేర నలుగురు పేర్లను సిఫారసు చేయలేకపోతున్నామని తెలిపారు. అలా అయితే తాము ఇకపై ఉద్యోగుల జీతాల చెల్లింపు, ఉద్యోగుల రిలీవింగ్‌పై సింగిల్ జడ్జి విధించిన స్టే ఉత్తర్వులపైనే ప్రధానంగా వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సుదీర్ఘంగా తమ తమ వాదనలను వినిపించారు. టీ సర్కార్ యూటర్న్ తీసుకుంది... తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ కమిటీ ఏర్పాటునకు అంగీకరించిన తెలంగాణ, ఆ తరువాత యూటర్న్ తీసుకుందని, ఈ విషయాన్ని కూడా తాము పలు సందర్భాల్లో కేంద్రం దృష్టికి తీసుకొచ్చామన్నారు. ధర్మాసనం ఆదేశాల మేరకు తమ వైపు నుంచి నలుగురి పేర్లను సిఫారసు చేస్తూ వారి పేర్లను ఆయన కోర్టు ముందుంచారు. ఈ సమయంలో షీలాభిడే కమిటీ ప్రస్తావన చర్చకు వచ్చింది. దీనికి తెలంగాణ ఏజీ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, అసలు ఆ కమిటీకి చట్టబద్ధత లేదని, ప్రస్తుతం ఆ కమిటీ ఉనికిలో లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, మీరు ఏర్పాటు చేయని కమిటీకి ఉద్యోగుల విభజన వివాద పరిష్కార బాధ్యతలను అప్పగిస్తారని ఎలా చెబుతారని కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అసలు ఆ కమిటీ ఉనికిలో ఉందా..? లేదో..? తెలుసుకుని చెప్పాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టం చేసింది. -
విద్యుత్ ఉద్యోగుల విభజనపై కదలిక
31న ఢిల్లీకి రావాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం ఆదేశం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఈ నెల 31న ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇంధన శాఖ కార్యదర్శులు, జెన్కో సీఎండీలకు పిలుపు వచ్చింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి నుంచి అధికారులకు లేఖలు అందాయి. ఏపీ స్థానికత కలిగి ఉండి తెలంగాణలో పనిచేస్తున్న 1,252 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు గత నెల 10న రిలీవ్ చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మళ్లీ ఉద్యోగాల్లో చేరేందుకు ఉద్యోగులు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ వివాదంలో జోక్యం చేసుకోడానికి మొదట హోంశాఖ అయిష్టత వ్యక్తం చేసినా, ఎట్టకేలకు స్పందించడం విశేషం. -
విద్యుత్ ఉద్యోగుల విభజన సమంజసమే
గవర్నర్‌కు నివేదించిన తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఏపీ విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ఆరోపణలకు సమాధానాలు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన విషయంలో ఏపీ విద్యుత్ సంస్థలు, విద్యుత్ ఉద్యోగుల సంఘాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ మండిపడింది. విభజన చట్టానికి లోబడే ఉద్యోగుల విభజనను తెలంగాణ విద్యుత్ సంస్థలు జరిపాయని స్పష్టం చేసింది. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధుల బృందం మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి ఉద్యోగుల విభజన పూర్వపరాలను, తమ వాదనలను తెలియజేశారు. ఏపీ ఉద్యోగ సంఘాలు చేస్తున్న నాలుగు ప్రధానఆరోపణల వెనక వున్న వాస్తవాలను వినతిపత్రం రూపంలో గవర్నర్‌కు సమర్పించారు. గవర్నర్‌ను కలసినవారిలో జేఏసీ నేతలు శ్రీనివాస్, ముష్టాక్, నాగరాజు, ఆరుద్ర తదితరులున్నారు. ఏపీ ఆరోపణలు.. టీవిద్యుత్ సమాధానాలు ఆరోపణ-1: ఏపీని సంప్రదించకుండానే తెలంగాణ విద్యుత్‌సంస్థ లు ఉద్యోగుల తుది కేటాయింపుల మార్గదర్శకాలను రూపొందించాయి. వాస్తవం: విభజన చట్టంలోని సెక్షన్ 77 ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులకు, సెక్షన్ 82 ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల కేటాయింపులకు వర్తిస్తాయి. విద్యుత్ ఉద్యోగుల విభజనకు సెక్షన్ 77 వర్తింపజేస్తూ ఏపీ సంస్థలు మార్గదర్శకాలను రూపొందించగా, తెలంగాణ సంస్థలు తిరస్కరించాయి. కమల్‌నాథన్ కమిటీ సైతం ఇదే నిర్ణయా న్ని సమర్థించింది. తప్పనిపరిస్థితిలో తెలంగాణ సంస్థలు మార్గదర్శకాలను రూపొందించాయి. ఆరోపణ-2: రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న నిర్వచనం ఆధారంగా ‘స్థానికత’(లోకల్ స్టేటస్)ను నిర్థారించాలి. వాస్తవం: ప్రభుత్వ రంగసంస్థలకు రాష్ట్రపతి ఉత్తర్వులు-1975 వర్తించవని ఉమ్మడి ఏపీ పాలకులు నిర్ణయించి 2009 వరకు కట్టుబడి వున్నారు. గతంలో ఉన్న వాదనతో పాటు విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల విభజనకు రాష్ట్రపతి ఉత్తర్వులు ఏ మాత్రం ఆధారంకాదు. రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తి పేరు తో 2009 నుంచి ‘371 డీ’ను అమలు చేస్తూ నియమించిన ఉద్యోగులను తెలంగాణ సంస్థలు రిలీవ్ చేయలేదు. ఆరోపణ-3: రిలీవ్ చేసిన ఉద్యోగులను ఏపీకి పంపే అధికారం తెలంగాణ సంస్థలకు లేదు. వాస్తవం: ఏపీ విద్యుత్ సంస్థలు తమ వంతు ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను గడువులోగా రూపొందించుకోవడంలో విఫలమైనంత మాత్రాన.. ఆ రాష్ట్ర ఉద్యోగులు తెలంగాణలో శాశ్వతంగా కొనసాగడానికి వీలులేదు. ఏపీలోని టిఉద్యోగులను రిలీవ్ చేయాలని పలుమార్లు కోరినా ఏపీ సంస్థలు ఒప్పుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 75 వేలకుపైగా కొలువులు ఉంటే, విభజనలో భాగంగా తెలంగాణ నుంచి ఏపీకి నామమాత్రంగా 1,231 మంది వెళ్తుండగా, ఏపీ నుంచి తెలంగాణకు 450 మంది రావాల్సి ఉంది. ఆరోపణ-4: టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల పరిధి తెలంగాణకే పరిమితం. ఈ సంస్థల ఉద్యోగులను ఏపీకి పంపలేరు. వాస్తవం: రాష్ట్ర విభజన అనంతరం ఏపీసీపీడీసీఎల్ పేరు టీఎస్ఎస్పీడీసీఎల్గా మారింది. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని కర్నూలు, అనంతపురం జిల్లాలు అవశేషాంధ్రప్రదేశ్లోకి వెళ్లాయి. అలాగే విభజన చట్టం ప్రకారం టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఏడు మండలాలు(ఖమ్మం జిల్లా) ఏపీలో విలీనమయ్యాయి. వీటిల్లో విద్యుత్ సరఫరాను ఏపీఈపీడీసీఎల్ చూస్తోంది. ఏపీలో సంస్థలు విలీనమైన నేపథ్యంలో ఉద్యోగుల పంపకాలు కూడా జరపవచ్చు. -
ఉత్తర్వులు అందాయి.. విధుల్లోకి చేర్చుకోండి
హైదరాబాద్ సిటీ: ఏపీ స్థానికత ఉన్న విద్యుత్ ఉద్యోగులకు కాస్త ఊరట లభించింది. కోర్టు తీర్పు అధికారిక ప్రతి సోమవారం సాయంత్రం వారి చేతికొచ్చింది. దీని ఆధారంగా ఇటీవల రిలీవ్ చేసిన 1,452 మంది ఉద్యోగులను తక్షణమే తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ తాజాగా టీఎస్ ట్రాన్స్‌కో సీఎండీకి లేఖ రాశారు. కోర్టు తీర్పు ప్రతిని దీనికి జత చేశారు. స్థానికత ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏపీకి చెందిన విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేసింది. దీనిపై ఉద్యోగులు కోర్టులో సవాల్ చేశారు. వారికి అనుకూలంగా శుక్రవారమే తీర్పు వెలువడినప్పటికీ, ఉత్తర్వు ప్రతి అందలేదు. ఇదే విషయాన్ని టీఎస్ ట్రాన్స్‌కో సీఎండీ ఏపీ ట్రాన్స్‌కోకు తెలిపారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందడంతో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ నేతృత్వంలో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మె యథాతథం
హైదరాబాద్:విద్యుత్ ఉద్యోగులు సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వంతో సంప్రదింపులు సఫలీకృతం కాకపోవడంతో విద్యుత్ ఉద్యోగులు సమ్మెను మరింత తీవ్రతరం చేసేందుకు నడుంబిగించారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించని విద్యుత్ జేఏసీ సమ్మెతోనే తగిన సమాధానం చెప్పాలని భావిస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఐఆర్(మధ్యంతర భృతి) చెల్లిస్తేనే సమ్మె విరమణపై ఆలోచిస్తామన్నారు. అంతకుముందు కొత్త ప్రభుత్వాలు ఏర్పడేంత వరకూ విద్యుత్ ఉద్యోగులు కాస్త ఓపిక పట్టాలని చీఫ్ సెక్రటరీ మహంతి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాల ఏర్పాటుకు కొంత సమయం పట్టే ఆస్కారం ఉన్నందున అప్పటి వరకూ ఉద్యోగస్తులు ఆగాల్సి న అవశ్యం ఉందన్నారు. దీనికి సంబంధించి ఈరోజు మీడియాతో మాట్లాడిన మహంతి..కొత్త ముఖ్యమంత్రిల వద్దకు ఫైళ్లను పంపించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు ఏర్పడే తరుణంలో తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏప్రిల్ నెల నుంచే ఏరియర్స్ అందుతాయన్నారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే పే రివిజన్ కార్యక్రమం ఉంటుందన్నారు. పే రివిజన్ తో రూ. 1250 కోట్ల మేర అదనపు భారం పడుతుందన్నారు. ఒకవేళ సమ్మె చేస్తే ఆస్పత్రులు, రైల్వేలకు, తాగునీటికి పలు ఇబ్బందులు ఎదురవుతాయని మహంతి తెలిపారు. -
కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే పే రివిజన్
-
కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే పే రివిజన్
హైదరాబాద్:కొత్త ప్రభుత్వాలు ఏర్పడేంత వరకూ విద్యుత్ ఉద్యోగులు కాస్త ఓపిక పట్టాలని చీఫ్ సెక్రటరీ మహంతి స్పష్టం చేశారు. ప్రభుత్వాల ఏర్పాటుకు కొంత సమయం పట్టే ఆస్కారం ఉన్నందున అప్పటి వరకూ ఉద్యోగస్తులు ఆగాల్సి న అవశ్యం ఉందన్నారు. దీనికి సంబంధించి ఈరోజు మీడియాతో మాట్లాడిన మహంతి..కొత్త ముఖ్యమంత్రిల వద్దకు ఫైళ్లను పంపించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు ఏర్పడే తరుణంలో తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏప్రిల్ నెల నుంచే ఏరియర్స్ అందుతాయన్నారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే పే రివిజన్ కార్యక్రమం ఉంటుందన్నారు. పే రివిజన్ తో రూ. 1250 కోట్ల మేర అదనపు భారం పడుతుందన్నారు. ఒకవేళ సమ్మె చేస్తే ఆస్పత్రులు, రైల్వేలకు, తాగునీటికి పలు ఇబ్బందులు ఎదురవుతాయని మహంతి తెలిపారు. -
విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె
-
విద్యుత్ ఉద్యోగులకు 22 శాతం ఫిట్మెంట్!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు 22 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు విద్యుత్ సంస్థల యాజమాన్యం సుముఖత వ్యక్తం చేసింది. శనివారం విద్యుత్‌సౌధలో విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణపై యాజమాన్యానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య చర్చలు జరిగాయి. తమకు 36 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ కావాలని ఉద్యోగ సంఘాలు పట్టుపట్టాయి. దీనిపై గవర్నర్ సలహాదారులను సంప్రదించాక నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం తెలిపింది. 15 ఏళ్ల సర్వీసు ఉన్నవారికి రెండు ఇంక్రిమెంట్లు, 15 ఏళ్లు దాటిన వారికి 3 ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఈ నెల 8న జరిగే సమావేశంలో తుది నిర్ణయం వెలువడనుంది. ఈ భేటీలో విద్యుత్ ఉద్యోగ సంఘ నేతలు గణేష్, సుధాకర్‌బాబు, వేదవ్యాస్, ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా, జెన్కో ఎండీ విజయానంద్ పాల్గొన్నారు. -
17 నుంచి విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె
సమైక్యాంధ్ర ప్రకటించాలని ‘సేవ్’ జేఏసీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీ నుంచి సీమాంధ్రలోని విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగనున్నారు. ఇందుకోసం జెన్కో, ట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఉద్యోగులు సిద్ధం కావాలని సమైక్యాంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల (సేవ్) జేఏసీ చైర్మన్ సాయిబాబు, కన్వీనరు శ్రీనివాసులు పిలుపునిచ్చారు. విద్యుత్ సౌధలో భోజన విరామ సమయంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ ఆరాటపడుతోందని విమర్శించారు. సమ్మెకు సిద్ధమయ్యేందుకు 15న విజయవాడలో జెన్కో ఉద్యోగుల జేఏసీ, 16న గుంటూరులో ట్రాన్స్‌కో, డిస్కంల ఉద్యోగుల జేఏసీ సమావేశం కానున్నట్టు తెలిసింది. అనంతరం యాజమాన్యాలకు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు తెలిసింది. మరోవైపు 17వ తేదీ నుంచి తాము సమ్మెకు సిద్ధమని హైదరాబాద్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ (హైజాక్) చైర్మన్ నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్, కన్వీనర్ అనురాధలు ప్రకటించారు. భారీ విద్యుత్ లైన్లే లక్ష్యం...! రాష్ట్రాన్ని అంధకారంగా మార్చడం ద్వారా తమ సత్తా చూపాలని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు భావిస్తున్నట్టు సమాచారం. భారీ విద్యుత్ లైన్లను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ సరఫరా నిలిపివేయాలని భావిస్త్తున్నట్టు తెలిసింది. 400, 132, 33 కేవీ లైన్లపై దృష్టిసారించి విద్యుత్ సరఫరాను ఒకేసారి నిలిపివేయాలని భావిస్తున్నారు. జెన్కో ప్లాంట్లలోనూ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని యోచిస్తున్నారు. పగటి పూట మాత్రమే విద్యుత్‌ను నిలిపివేయడం కాకుండా పూర్తిస్థాయిలో సరఫరా ఆపాలని భావిస్తున్నారు. వేతన సవరణ కమిటీ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులందరికీ ఒకే వేతన సవరణ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. మార్చి 31 నాటికి కమిటీ నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కాంట్రాక్టు సిబ్బంది వేతన సవరణపై కూడా మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ జూలై 31 నాటికి నివేదిక ఇవ్వనుంది. వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేసినందుకు యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ సుధాకరరావు, చైర్మన్ సీతారామరెడ్డి, కో-చైర్మన్ మోహన్‌రెడ్డి, విద్యుత్ సౌధ జేఏసీ కన్వీనర్ కళ్లెం శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
విద్యుత్ సమ్మె యోచన విరమణ!
ఉద్యోగుల డిమాండ్లకు ఇంధనశాఖ అంగీకారం ఒకే వేతన సవరణ కమిటీ.. మార్చి 31 నాటికి నివేదిక సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులు సమ్మె యోచన విరమించుకున్నారు. తమ డిమాండ్లపై యాజమాన్యంతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం సమ్మె ఆలోచనను విరమించుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. విద్యుత్ ఉద్యోగులందరికీ ఒకే వేతన సవరణ కమిటీ ఏర్పాటుకు అంగీకరించడంతో పాటు మార్చి 31 నాటికి నివేదిక సమర్పించేందుకు అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని జేఏసీ కన్వీనర్ సుధాకర్‌రావు, చైర్మన్ సీతారామరెడ్డి, కో చైర్మన్ మోహన్‌రెడ్డి, విద్యుత్ సౌధ జేఏసీ కన్వీనర్ కళ్లెం శ్రీనివాసరెడ్డి, వెంకన్నగౌడ్, గణే శ్‌రావు, భానుప్రకాశ్, వేదవ్యాసరావు ప్రకటించారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలకు వేర్వేరుగా మూడు వేతన సవరణ కమిటీల ఏర్పాటు, కమిటీల్లో బయటి వ్యక్తుల నియామకం, ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ అంశాలపై ఇంధనశాఖ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 నుంచి నిరవధిక సమ్మె చేయూలని విద్యుత్ ఉద్యోగులు నిర్ణరుుంచుకున్నారు. అరుుతే గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ విద్యుత్ ఉద్యోగులందరికీ ఒకే వేతన సవరణ కమిటీతో పాటు నాలుగేళ్లకు ఒకసారి వేతన సవరణకు అంగీకరిస్తూ ఇంధనశాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది. అంతేగాక కమిటీ విధివిధానాలపై ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా, జెన్కో ఎండీ విజయానంద్ తదితరులు జేఏసీ నేతలతో విద్యుత్ సౌధలో గురువారం నాలుగు గంటలకుపైగా సమావేశమయ్యారు. మార్చి 31 నాటికి నివేదిక ఇవ్వాలని జేఏసీ డిమాండ్ చేసింది. అదేవిధంగా తమ వేతన సవరణను అవసరమైతే కొంత తగ్గించైనా కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలను సవరించాలని జేఏసీ కన్వీనర్ సుధాకర్‌రావు సమావేశంలో పట్టుబట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులకూ ప్రత్యేకంగా వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు కూడా యాజమాన్యం అంగీకరించింది. -
విద్యుత్ ఉద్యోగులకు ఒకే వేతన కమిటీ
దిగొచ్చిన ప్రభుత్వం.. నేడు ఆదేశాలు జారీ నేడు చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అన్ని డిమాండ్లపై సానుకూల స్పందన వస్తేనే సమ్మెపై పునరాలోచిస్తామన్న జేఏసీ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల సమ్మె హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. విద్యుత్ ఉద్యోగులందరికీ ఒకే వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంధనశాఖ గురువారం ఆదేశాలు జారీచేయనుంది. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలకు వేర్వేరుగా వేతన కమిటీలను ఏర్పాటు చేయాలని, ప్రైవేటు విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగుల జీతాలతో పోల్చిచూడాలంటూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.సాహూ ఈనెల 10న ఉత్తర్వులు జారీ చేశారు. వేతన కమిటీలో ప్రైవేటు వ్యక్తికి స్థానం కల్పించారు. దీనిపై విద్యుత్ ఉద్యోగులు మండిపడ్డారు. అందరికీ ఒకే వేతన కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగుల జీతాలతో పోలికను, కమిటీలో బయటి వ్యక్తిని నియమించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 14వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మె నోటీసిచ్చింది. దీంతో ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా, జెన్కో ఎండీ విజయానంద్‌లతో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాహూ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగితే రాష్ట్రం అంధకారంగా మారుతుందనే ఆందోళన ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. చివరకు ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలకు ఒకే వేతన సవరణ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఆమోదముద్ర వేయించారు. గురువారం మధ్యాహ్నం పన్నెండున్నరకు ఉద్యోగ సంఘాలను ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా చర్చలకు ఆహ్వానించారు. ఒకే వేతన సవరణ కమిటీ వేయనున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అధికారికంగా సమాచారం లేదని, అయినప్పటికీ గురువారం యథావిధిగా వర్క్ టు రూల్‌తో పాటు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని జేఏసీ కన్వీనర్ సుధాకర్‌రావు, చైర్మన్ సీతారామరెడ్డి, కో-చైర్మన్ మోహన్‌రెడ్డి, నేతలు కిరణ్, కళ్లెం శ్రీనివాసరెడ్డి, వెంకన్నగౌడ్, గణేష్‌రావు, భానుప్రకాశ్, వేదవ్యాసరావు చెప్పారు. మిగిలిన డిమాండ్లపైన కూడా సానుకూలంగా స్పందన వస్తేనే సమ్మెపై పునారాలోచిస్తామన్నారు. బుధవారం విద్యుత్ ప్లాంట్లు, సబ్ స్టేషన్లు, కార్యాలయాలతో పాటు విద్యుత్ సౌధలో నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. సమ్మె పిలుపు కొనసాగుతుందన్నారు. -
14 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఒకటే వేతన సవరణ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ 14వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్టు విద్యుత్ ఉద్యోగులు ప్రకటించారు. ఈ నెల 12, 13 తేదీల్లో వర్క్ టు రూల్ పాటించడంతో పాటు నిరాహార దీక్షలు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ మంగళవారం తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యదర్శి అజయ్ కల్లాంతో పాటు ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా, జెన్కో ఎండీ విజయానంద్‌లకు సమ్మె నోటీసును అందజేసినట్టు జేఏసీ కన్వీనర్ సుధాకర్‌రావు, చైర్మన్ సీతారామరెడ్డి, కో చైర్మన్ మోహన్‌రెడ్డి తదితరులు చెప్పారు. ఇప్పటికే విద్యుత్ ప్లాంట్లల్లో బొగ్గు నిల్వలు తక్కువగా ఉండటం, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె యోచనపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగుల డిమాండ్లు.. ్హ జెన్కో, ట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు వేర్వేరుగా మూడు వేతన సవరణ కమిటీలు వేయాలన్న ఇంధనశాఖ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి. ్హ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్ఈబీ) ను మూడు ముక్కలు చేసినప్పటి నుంచి ఒకే వేతన సవరణ కమిటీ ద్వారా సవరణ జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా చేయూలి. మూడు కమిటీలను అంగీకరించేది లేదు. ్హ వేతన సవరణ కమిటీలో బయటి వ్యక్తులు సభ్యులుగా ఉండకూడదు. ్హ ప్రైవేటు రంగంలోని ఉద్యోగుల వేతనాలతో పోల్చిచూడాలన్న ఇంధనశాఖ ఆదేశాల్ని రద్దు చేయాలి. -
18 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె!
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయకపోతే వచ్చే నెల 18 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వర్తించాల్సిన వేతన సవరణ కోసం ఇప్పటికీ కమిటీ వేయకుండా ప్రభుత్వం, యాజమాన్యం జాప్యం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) మండిపడింది. వెంటనే వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధలో మంగళవారం వందలాదిమంది ఉద్యోగులు భారీ ధర్నా చేపట్టారు. అనంతరం ఉన్నతాధికారులకు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జె. సీతారామిరెడ్డి, కన్వీనర్ సుధాకర్‌రావు, కో చైర్మన్ జి.మోహన్‌రెడ్డిలు మాట్లాడుతూ.. వాస్తవానికి విద్యుత్ సంస్థల్లో వేతన సవరణకు ప్రభుత్వంతో సంబంధం లేదని చెప్పారు. వేతన సవరణను ఆలస్యం చేసేందుకే అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని యాజమాన్యం అంటోందని ఆరోపించారు. వేతన సవరణకు గత నవంబర్లోనే కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉందని జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.కిరణ్, సంయుక్త కార్యదర్శి ఎంఏ వజీర్, నేతలు చంద్రుడు, భానుప్రకాశ్ తదితరులు తెలిపారు. కాగా, ధర్నా సందర్భంగా తెలుగుతల్లి బొమ్మ ఉన్న సమైక్యాంధ్ర ఫ్లెక్సీని చించేశారని ఇది తెలుగు జాతిని అవమానించడమేనని, ఇందుకు జేఏసీ నాయకత్వం క్షమాపణలు చెప్పాలని జాక్ వైస్ చైర్మన్ గణేష్ డిమాండ్ చేశారు. జేఏసీలో తెలంగాణ ప్రాంతంవారు మాత్రమే ఉన్నారని ఆయన విమర్శించారు. -
పీఆర్సీ వేయాలని 28న విద్యుత్ ఉద్యోగుల మాస్ ధర్నా
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. 2014 ఏప్రిల్ 1 నుంచి కొత్త వేతన సవరణ అమల్లోకి రావాల్సిఉన్నా ఇప్పటి వరకు కమిటీని యాజమాన్యం ఏర్పాటు చేయలేదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) మండిపడింది. ఇందుకు నిరసనగా 28వ తేదీన విద్యుత్ సౌధలో మాస్ ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్టు జేఏసీ చైర్మన్ జె. సీతారామిరెడ్డి, కన్వీనర్ సుధాకర్‌రావు, కో-చైర్మన్ జి. మోహన్‌రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. మొత్తం 14 విద్యుత్ ఉద్యోగుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడినట్టు తెలిపారు. 28 నాటికి కూడా కమిటీ వేయకపోతే అప్పుడు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు. విద్యుత్ సంస్థల్లో వేతన సవరణకు ప్రభుత్వంతో సంబంధం లేదని, దానిని ఆలస్యం చేసేందుకే అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని యాజమాన్యం చెబుతోందన్నారు. నవంబర్లోనే వేతన సవరణ కోసం కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో నిర్వాహక కార్యదర్శి ఎన్.కిరణ్, సహ కార్యదర్శి ఎంఏ వజీర్, చంద్రుడు, భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
దద్దరిల్లిన విద్యుత్ సౌధ
-
విరమణ తాత్కాలికమే!
‘ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం’ మీట్ ది ప్రెస్‌లో అశోక్‌బాబు సాక్షి, హైదరాబాద్: ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేయడం ఇష్టం లేకనే విద్యుత్ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు మళ్లీ విధుల్లో చేరారని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. కొన్నాళ్ల తర్వాత తామూ సమ్మె విరమించే అవకాశాలున్నాయన్నారు. అయితే, సమ్మె విరమణ తాత్కాలికమేనని, అవసరమైనప్పుడు మళ్లీ రంగంలోకి దిగడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన పాల్గొన్నారు. స్వాతంత్య్ర పోరాటం తర్వాత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఉద్యమం సీమాంధ్రలో ప్రస్తుతం జరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని, ఆ తర్వాత ఐదేళ్లు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రం విడిపోదని ఇప్పటికీ తాను గట్టి నమ్మకంతో ఉన్నానని అశోక్‌బాబు చెప్పారు. విభజన ప్రక్రియ నిలిచిపోవటానికి సాంకేతికాంశాలు ప్రతిబంధకాలవుతాయని, ఈ దిశగా తమ ప్రయత్నం సాగుతోందని వెల్లడించారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధుల తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. వాళ్లు చేతులెత్తేస్తే మేం భుజానికెత్తుకున్నాం.. విభజనను అడ్డుకోవాల్సిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చేతులెత్తేశారని, అందువల్లే తాము ఆ బాధ్యతను నెత్తికెత్తుకోవాల్సి వచ్చిందని అశోక్‌బాబు తెలిపారు. తెలంగాణలో సకలజనుల సమ్మె జరిగినప్పుడు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తేగలిగారని ఆయన గుర్తుచేశారు. సీడబ్ల్యూసీ తెలంగాణ అనుకూల ప్రకటన చేయగానే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఉండాల్సిందన్నారు. ‘వారి వైఫల్యం వల్లనే తమకు తలకు మించిన భారమైనా ఉద్యమాన్ని నెత్తికెత్తుకుని, ఉధృతంగా నడపగలిగాం. అదంతా ప్రజల సహకారం వల్లనే సాధ్యమైంది. మేం లేకుంటే ఈ పాటికి రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులోకి వచ్చి ఉండేది. 60 రోజులుగా కేంద్రాన్ని నిలవరించగలుగుతున్నాం. కేంద్రం మొండిగా ముందుకెళ్తే మిలియన్ మార్చ్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం’ అన్నారు. అధికార కాంక్షే కారణం... సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఉన్నప్పుడు వాటిని సరిదిద్దితే బావుండేదని, కొన్ని ఉద్యోగాలు పోయాయనో, మరో కారణమో చెప్తూ రాష్ట్రాన్ని విభజించటం సరికాదని అశోక్‌బాబు పేర్కొన్నారు. నేతల అధికార కాంక్షే ఈ పరిస్థితికి కారణమన్నారు. ‘తెలంగాణ ప్రాంతానికి రాజ్యాధికారం ఉండి ఉంటే ప్రత్యేక రాష్ట్ర వాదన వచ్చేది కాదేమో. ఇప్పటికైనా అన్ని పార్టీలు దీనిపై లోతుగా చర్చించుకోవాలి. తెలంగాణ ప్రాంత నేతలకు ముఖ్యమంత్రి పదవి దక్కి ఉండాల్సింది. ఇప్పటికైనా ఆ దిశగా ప్రయత్నం చేస్తే సమస్య పరిష్కారమవుతుందేమో నేతలు ఆలోచించాలి’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ సహా అన్ని పార్టీల నేతలతో చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కువ మంది తెలంగాణకు అనుకూలంగా ఉన్నారన్న వాదన సరికాదని మా ఉద్యమం ద్వారా తేల్చామని అశోక్‌బాబు వివరించారు. ప్రభుత్వం మోసం చేసింది ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా విభజనపై నిర్ణయం తీసుకుని కేంద్రం దారుణంగా మోసం చేసిందని అశోక్‌బాబు విమర్శించారు. ఇప్పటికీ కేంద్రం స్పష్టత లేని విధివిధానాలతో అసంబద్ధ ప్రకటనలు చేస్తోందన్నారు. విభజన నిర్ణయంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని పార్లమెంటు కాదంటే, పార్లమెంటు నిర్ణయాన్ని కాదనే హక్కు ప్రజలకుందనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని వ్యాఖ్యానించారు. మనుషులేనా అన్న అనుమానం కలుగుతోంది వచ్చే ఎన్నికల్లో పార్టీలను కాదని, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులను చూసి ఓటెయ్యాల్సిందిగా ప్రజలను కోరుతామని అశోక్‌బాబు పేర్కొన్నారు. ‘విద్యుత్తు ఉద్యోగులు సమ్మెతో సీమాంధ్ర ప్రజలు నరకం అనుభవించారు. దాంతో ఉద్యోగులు సమ్మెకు తాత్కాలిక విరామం ఇచ్చారు కానీ ప్రజల బాధలకు ప్రజాప్రతినిధులు మాత్రం చలించలేదు. అసలు వాళ్లు మనుషులేనా అన్న అనుమానం కలుగుతోంది. అధిష్టానం ఆదేశించిందనో, పార్టీ చెప్పిందనో ప్రజాకాంక్షను పట్టించుకోని రాజకీయ వ్యవస్థ ఉన్నంత కాలం సమాజానికి మంచి జరగదు’ అన్నారు. ప్రత్యామ్నాయాలు అడగం ప్రత్యామ్నాయాల కోసం అడిగామంటే విభజనకు మద్దతిచ్చినట్టేనని అశోక్‌బాబు స్పష్టం చేశారు. రాష్ట్రం విడిపోదనే ఇప్పటికీ నమ్ముతున్నానన్నారు. ఎమ్మెల్యేలు నేరుగా వారి ప్రజల ముందు అభిప్రాయాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే వారి అసలు రంగేంటో తెలుస్తుందన్నారు. ‘విభజనకో, సమైక్యానికో.. దేనికి కుప్పంలో చంద్రబాబు జై కొడతారో చూద్దాం. ఆ తర్వాత వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రజలే నిర్ణయిస్తారు’ అన్నారు. ఒక్కో జిల్లా నుంచి వేయి మంది చొప్పున ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు చేస్తూ, ఒక్కో రోజు ఒక్కో జాతీయ నేతను కలవాలని నిర్ణయించామని తెలిపారు. పార్టీ పెట్టే ఖ్యాతి ఉన్నా.. తన మనస్తత్వానికి రాజకీయాలు పడవని అశోక్‌బాబు తెలిపారు. రాజకీయాల్లో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదని స్పష్టంచేశారు. రాజకీయ పార్టీ పెట్టే ఖ్యాతి ఉన్నా ఆర్థికంగా, ఇతరత్రా శక్తిసామర్ధ్యాలు లేవని అన్నారు. -
సిమ్స్ లో సాధారణ వైద్య సేవలు బంద్
పుట్టపర్తి అర్బన్/ అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా పుట్టపర్తిలోని సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (సిమ్స్)లో సాధారణ వైద్య సేవలన్నీ బంద్ అయ్యాయి. లక్షలాది మంది నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి మూడు రోజులుగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో సాధారణ సేవలన్నీ నిలిపేసి.. అత్యవసర సేవలను మాత్రం జనరేటర్ సాయంతో కొనసాగిస్తున్నారు. ‘విద్యుత్ సరఫరాలో నిరవధిక అంతరాయం వల్ల ఆస్పత్రిని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసివేయడమైనది’ అనే నోటీసును రెండు ప్రధాన ద్వారాల వద్ద అతికించారు. సత్యసాయి సేవాదళ్ సిబ్బంది కూడా ఎమర్జెన్సీ రోగులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ ఆస్పత్రిని 22 ఏళ్లలో ఏ ఒక్క రోజూ బంద్ చేయలేదు. అలాంటిది మూడు రోజులుగా మూసి వేయడంతో వేలాది మంది రోగులు అవస్థ పడుతున్నారు. ఇక్కడ ఖరీదైన వైద్య సేవలు సైతం ఉచితంగా అందిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి రోగులు వస్తుంటారు. నెలల తరబడి ఇక్కడే ఉంటూ వైద్యం చేయించుకుంటుంటారు. ప్రస్తుతం ఆస్పత్రిని మూసివేయడం వల్ల సుదూర ప్రాంత రోగులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. సర్వజనాస్పత్రిలోనూ కరెంటు కష్టాలు అనంతపురం నగరంలోని సర్వజనాస్పత్రిలోనూ కరెంటు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు వైద్యులు, సిబ్బంది ‘సమైక్య’ సమ్మెలో భాగంగా ఓపీ సేవలకు దూరంగా ఉండడం, మరో వైపు విద్యుత్ సమ్మెతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బుధవారం ఉదయం ఏడు గంటలకు పోయిన కరెంటు సాయంత్రం 6 గంటలకు వచ్చింది. విద్యుత్ లేని సమయంలో జనరేటర్ వేసే ఎలక్ట్రీషియన్ అందుబాటులో లేడు. దీంతో అత్యవసర సేవలు, చిన్నారుల ఐసీఐసీయూ, ఐసీయూ, ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ విభాగాల్లో రోగులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అనంతపురం రూరల్‌కు చెందిన ఓ గర్భిణీకి సిజేరియన్ చేయాల్సిన సమయంలో కరెంటు సరఫరా ఆగిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చిన్నపిల్లల వార్డులో పిల్లలకు ఏమైనా జరుగుతుందేమోనని తల్లిదండ్రులు భయపడ్డారు. విద్యుత్ సమ్మె ప్రభావం ఆపరేషన్లపైనా పడుతోంది. నిత్యం 60 ఆపరేషన్లు జరిగే సర్వజనాస్పత్రిలో ప్రస్తుతం పది కూడా దాటడం లేదు. సాధారణ ఆపరేషన్ థియేటర్‌ను తాత్కాలికంగా మూసేశారు. ఎమర్జెన్సీ ఓటీలో మాత్రమే జరుగుతున్నాయి. ఈ నెల 6న మూడు, 7,8 తేదీల్లో పది చొప్పున, బుధవారం11 ఆపరేషన్లు జరిగాయి. వీటిలోనూ ఎక్కువ శాతం సిజేరియన్లే. ఆరోగ్యశ్రీ కేసులు సైతం ఆలస్యమవుతున్నాయి. కరెంటు లేక అప్రూవల్ కోసం పంపలేకపోతున్నామని ఆరోగ్యశ్రీ సిబ్బంది చెబుతున్నారు. జనరేటర్ వాడాలంటే గంటకు 20 లీటర్ల డీజిల్ అవసరమని, ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రవాణా లేకపోవడం, బంకులు కూడా బంద్ చేస్తుండడంతో ఇబ్బంది కలుగుతోందని ఇన్చార్జ్ ఆర్ఎంఓ డాక్టర్ వైవీ రావు తెలిపారు. -
71వ రోజూ.. సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలు
సాక్షి నెట్వర్క్ : రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచాలి నినదిస్తూ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వరుసగా 71వ రోజైన బుధవారం కూడా సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు హోరెత్తాయి. ఏపీఎన్జీవోల పిలుపు మేరకు రెండోరోజూ కేంద్ర కార్యాలయాల్ని, బ్యాంకుల్ని సమైక్యవాదులు మూయించారు. కార్మిక సంఘాలూ మద్దతుపలికి బంద్ పాటించాయి. వైద్య వర్గాల బంద్‌తో సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు మినహా ఓపీలు, ఇతర సేవలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి దిగ్బంధం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 216 జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. రాజమండ్రిలో విద్యుత్ ఉద్యోగులు ‘దుర్గమ్మ, బతుకమ్మ మాకు ఒక్కటే’ అంటూ ఇద్దరు దేవతలకు పూజలు చేశారు. బొమ్మూరు 220 కేవీ సబ్‌స్టేషన్ వద్ద విద్యుత్ ఉద్యోగులు టవర్ లైన్ ఎక్కి సమైక్య నినాదాలు చేశారు. ఏలేశ్వరంలో ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్నంగా ఆకులు తింటూ, రాష్ట్రం విడిపోతే తమ బతుకులు ఇంతేనని చాటి చెప్పారు. జగన్ దీక్షకు మద్దతుగా కొత్తపేటలో సమైక్యవాదులు ‘జై సమైక్యాంధ్ర, జై జగన్’ పేర్లతో పేపరు బెలూన్లను గాలిలోకి వదిలారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి సమైక్య శంఖారావం నిర్వహించారు. 15 వేల మందికి పైగా విద్యార్థులు హాజరై సమైక్య నినాదాలు మార్మోగించారు. గురువారం భీమవరంలో గోదావరి ప్రజాగర్జన పేరుతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎయిర్‌పోర్టుకూ ఉద్యమ సెగ కృష్ణాజిల్లాలో గన్నవరం విమానాశ్రయానికి సమైక్య సెగ తగిలింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విద్యుత్తు కోత విధించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనరేటర్లను ఏర్పాటు చేయడంతో కొంత వెసులుబాటు కలిగింది. విమాన సర్వీసులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేలా అధికారులు ప్రయత్నించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రైలురోకో చేపట్టారు. కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్ రైలును అడ్డుకోవడంతో పోలీసులు సమైక్యవాదులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో విద్యార్థులు కేంద్ర మంత్రుల కమిటీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఉద్యోగులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఇందిరా క్రాంతి పథం ఆధ్వర్యంలో పొదుపు మహిళలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా విద్యుత్ సబ్స్టేషన్ల ఎదుట నిరసనలు చేపట్టారు. శ్రీకాకుళంలో పీఆర్ అండ్ ఆర్డీ ఉద్యోగులు కేంద్రమంత్రి కృపారాణి శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. రాజాంలో కాపు కన్నెర్ర పేరిట ఆ కులస్తులు పట్టణ బంద్, సభ నిర్వహించారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో మహిళా ఉపాధ్యాయులు రోడ్డుపై బైఠాయించి బొత్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ నగరంలో ఆర్టీసీ ఎన్ఎంయూ నేతలు కళ్లకు గంతలు క ట్టుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు. హిందువుల పూజలు, ముస్లింలు, క్రైస్తవుల ప్రార్ధనలు కర్నూలు జిల్లా నంద్యాలలో హిందువులు దేవాలయాల్లో పూజలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని కోరారు. క్రైస్తవులు చర్చిల్లో రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు ప్రార్థనలు చేపట్టారు. అనంతపురంలో విద్యుత్ ఉద్యోగులు, ఎస్కేయూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో కురుబ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. కణేకల్లులో ముస్లింలు ర్యాలీ నిర్వహించి, సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై ప్రార్థన చేశారు. పెనుకొండలో సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్‌ల దిష్టిబొమ్మలకు సమాధి కట్టి.. పిండప్రదానం చేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఐదు వేల పోస్టుకార్డులను రాష్ట్రపతికి పంపారు. ఆర్టీపీపీలో ఐదు యూనిట్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతోపాటు ఆరవ యూనిట్ పనులను సైతం విద్యుత్ జేఏసీ అడ్డుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో సమైక్యవాదులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట మండుటెండలో గంటసేపు పడుకుని నిరసన తెలిపారు. తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిపాలన భవ నాన్ని ముట్టడించారు. శ్రీకాళహస్తిలో విద్యార్థి గర్జన పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎక్సైజ్ ఉద్యోగుల సమ్మెబాట... విజయవాడ : సీమాంధ్రలోని 13 జిల్లాల్లో గురువారం నుంచి మద్యం విక్రయాలకు బ్రేక్ పడనుంది. సమైక్యాంధ్ర సాధన కోసం ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి అడిషనల్ కమిషనర్ స్థాయి వరకు ఉద్యోగులు, అధికారులంతా సమ్మె బాట పట్టనున్నారు. వారంతా బుధవారం విజయవాడలో సమావేశమై ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పరచుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతోపాటు చైర్మన్ ఆదినారాయణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ, బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం అర్ధరాత్రి నుంచి తాము సమ్మె చేస్తామని వెల్లడించారు. సీమాంధ్రలో 17న సాగునీరు బంద్ ఉద్యమంలో భాగంగా సీమాంధ్రలో వివిధ ప్రాజెక్టుల నుంచి కాలువల ద్వారా రైతులకు సరఫరా చేస్తున్న సాగునీటిని ఈ నెల 17న 24 గంటలపాటు నిలిపివేయాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు నిర్ణయించారు. ఆ రోజు ఉ.7 గంటల నుంచి సాగునీటి నియంత్రణ వ్యవస్థలు (వాటర్ రెగ్యులేటరీ సిస్టమ్స్) అన్నింటినీ 24 గంటలపాటు బంద్ చేస్తామని ఇంజినీర్ల జేఏసీ నేతలు వెల్లడించారు. వీరు బుధవారం విజయవాడలో సమావేశమై, ఐక్యకార్యాచరణ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేసుకున్నారు. విజయనగరం ప్రశాంతం సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరంలో బుధవారం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. బుధవారం రెండు గంటలపాటు కర్ఫ్యూను సడలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. అదనపు డీజీ పూర్ణచంద్రరావు, ఐజీ ద్వారకా తిరుమలరావు, డీఐజీలు ఉమాపతి, స్టీఫెన్ రవీంద్ర పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఇంతవరకూ 250 మందిని అరెస్టు చేశామని పోలీసులు చెబుతుండగా వీరిలో ఎక్కువమంది అమాయకులు, విద్యార్థులే ఉన్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. మరోవైపు ఎస్పీ కార్తికేయ విలేకరులతో మాట్లాడుతూ, పత్రికలు, చానళ్లలో వచ్చిన ఫుటేజీ ఆధారంగా అరెస్టులు చేస్తున్నట్లు చెప్పారు. యువతను అక్రమంగా అదుపులోకి తీసుకోవడం మంచిది కాదని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు అన్నారు. కర్ఫ్యూ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఎస్టేట్ ఆఫీసర్‌పై దాడి... : కలెక్టర్ సూచన మేరకు ఉదయాన్నే రైతుబజార్‌ను తెరచిన ఎస్టేట్ ఆఫీసర్ సతీష్‌ను అదనపు ఎస్పీ మోహన్‌రావు అకారణంగా చితకబాదారు. కర్ఫ్యూ సడలించిన సమయంలో రైతుబజార్‌ను తెరచి కూరగాయల విక్రయానికి చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ ఎస్టేట్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఉదయం ఆరున్నరకే ఆర్అండ్బీ బజార్‌ను తెరచి రైతులతో మాట్లాడుతున్న సతీష్‌ను మోహన్‌రావు చితకబాదడమేగాక రెండు గంటలపాటు నేలపై కూర్చోబెట్టి అవమానించారు. దీంతో రైతులంతా ఆందోళన చేసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని రైతుబజార్లనూ గురువారం బంద్ పాటిస్తున్నాయి. మరోవైపు గురువారం ఉ. 7 నుంచి 9 వరకు, మ.2నుంచి 4వరకు కర్ఫ్యూను సడలిస్తున్నారు. మరో ఇద్దరు మృత్యువాత సాక్షి నెట్వర్క్ : తెలంగాణ ఏర్పాటు ప్రక్రి య వేగవంతమవుతున్నట్లు టీవీలో వస్తున్న వార్తలను చూసి తట్టుకోలేక బుధవారం తిరుపతిలోమనోహర్ (40) అనే ఫొటోగ్రాఫర్ గుండెపోటుతో మృతిచెందాడు. విభజన కలతతో మంగళవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన అనంతపురం జిల్లా కంబదూరు మండలం చెన్నంపల్లికి చెందిన మల్లికార్జున నాయక్ (37) హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ విషయాన్ని బయటకు వెల్లడించవద్దని, గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేయాలంటూ మంత్రి రఘువీరారెడ్డి అనుచరులు ఆశ చూపగా, ఇది గుప్పుమనడంతో స్థానికంగా కలకలం రేగింది. కాగా, మృతుని ఇతని కుటుంబాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. -
కరెంట్ కోతతో మూతపడిన సత్యసాయి ఆస్పత్రి
సాక్షి, నెట్వర్క: విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది సమ్మెతో ప్రజల కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఒకవైపు ఉత్పత్తి పడిపోవడం, మరోవైపు బ్రేక్ డౌన్లను సరిచేసేవారు లేకపోవడంతో సీమాంధ్రను చీకట్లు వీడడం లేదు. ఆస్పత్రులకు కూడా కరెంట్ సరఫరా కాకపోవడంతో కొన్నింటిని మూసివేస్తున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (సిమ్స్)కి మూడురోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో సాధారణ సేవలను నిలిపివేశారు. జనరేటర్ సాయంతో అత్యవసర సేవలు మాత్రమే కొనసాగిస్తున్నారు. అయితే ‘విద్యుత్ సరఫరాలో నిరవధిక అంతరాయం వల్ల ఆస్పత్రిని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసివేయడమైనది’ అనే నోటీసును రెండు ప్రధాన ద్వారాల వద్ద అతికించారు. దేశం నలుమూలల నుంచి వచ్చే రోగులు నెలల తరబడి ఇక్కడే ఉంటూ ఆస్పత్రిలో ఉచిత వైద్యసేవలు పొందుతారు. ఆస్పత్రిని మూసివేయడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలులో పూర్తిగా విద్యుత్‌పైనే ఆధారపడిన ఆక్వా సాగు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. గుంటూరు జిల్లాలో చిన్న పరిశ్రమలు సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో కేంద్ర ఆస్పత్రులు, విమానాశ్రయాలు, తిరుమలకు మాత్రమే విద్యుత్‌సరఫరా చేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని కోల్డ్ స్టోరేజీలకు విద్యుత్ సరఫరా లేక కోట్ల రూపాయల విలువ చేసే సరుకు దెబ్బతింటోందని చేపలు, రొయ్యల సరఫరాదారులు, ఉత్పత్తిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పలు పరిశ్రమలకు యాజమాన్యాలు సెలవులు ప్రకటిస్తున్నాయి. కర్నూలు జిల్లా శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో నాలుగు రోజుల సమ్మె వల్ల 73.84 మిలియన్ యూనిట్ల ఉత్పాదన కు కోతపడింది. -
సమైక్య రాష్ట్రాన్ని రక్షిస్తాం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ హోరు కొనసాగుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వరుసగా 70వ రోజు ఆందోళనలు నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు సైతం సమ్మె చేపట్టడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. వైఎస్ఆర్ సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఎన్జీఓల ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లా కేంద్రమైన ఒంగోలులో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించారు. నగరంలోని పోస్టాఫీసులు, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ కార్యాలయాలతో పాటు సుమారు 60 వాణిజ్య బ్యాంకులు పూర్తిగా మూతపడ్డాయి. అలాగే నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించిన ఉద్యోగులు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇంటిని ముట్టడించారు. ఆ సమయంలో ఆందోళనకారులను ఎంపీ ఇంటివద్ద పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తాను ఎంపీ పదవికి ఎప్పుడో రాజీనామా చేశానని, స్పీకర్ ఆమోదించడం లేదని ఉద్యోగులకు మాగుంట సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రాజీనామా లేఖను వారందరికీ చూపించారు. అనంతరం ఉద్యోగులతో కలిసి ఆందోళన కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ర్యాలీలు, రాస్తారోకోలు, ముట్టడి కార్యక్రమాలతో నిరసన... జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, ముట్టడి కార్యక్రమాలతో సమైక్యవాదులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మరోసారి ముట్టడించారు. ఉద్యోగులు అధిక సంఖ్యలో వాటిని ముట్టడించి కార్యకలాపాలను అడ్డుకున్నారు. అద్దంకిలో ఆర్టీసీ కార్మికులు, ఎన్జీఓలు, ఉద్యోగులు కలిసి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మూసివేయించి నిరసన తెలిపారు. పట్టణంలో భారీ ర్యాలీ, రాస్తోరోకో నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు రోడ్డుపై ఆందోళనకు దిగి నిరసన తెలియజేశారు. టీడీపీ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. చీరాల పట్టణంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ కార్మికులు, టీడీపీ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. విజ్ఞాన్ భారతి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించారు. మార్కాపురంలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉద్యోగులంతా నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. బీఎస్ఎన్ఎల్, పోస్టాఫీసులు, బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలను మూసివేయించి కేంద్ర ప్రభుత్వ సర్వీసులను అడ్డుకున్నారు. ఎన్జీఓలు, ఉపాధ్యాయులు ప్రదర్శన నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల దీక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీ కార్యకర్తల దీక్షను ఉద్యోగులు అడ్డుకున్నారు. సమైక్యం కోసం చేస్తున్నారా..విభజన కోసం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఏ విషయం ప్రకటించిన తర్వాతే దీక్షలు చేయాలంటూ హెచ్చరించారు. కొండపిలోనూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కొనసాగింది. టీడీపీ కార్యకర్తల రిలేదీక్షలు జరుగుతున్నాయి. కందుకూరులోనూ సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. పర్చూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 20వ రోజుకు చేరాయి. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల దీక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు దీక్షలు ప్రారంభమయ్యాయి. గిద్దలూరు నియోజకవర్గంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. వైఎస్ జగన్ ఆమరణ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో వివేకానందకాలనీ యువకులు కూర్చున్నారు. విద్యుత్ ఉద్యోగులు స్థానిక కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి జేఏసీ నాయకులతో కలిసి రాస్తారోకో చేశారు. టీడీపీ నాయకుల రిలేనిరాహార దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. కనిగిరిలో సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తుతోంది. రాష్ట్రవిభజనకు నిరసనగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎన్ఎంయూ కార్మికులు రిలే దీక్షకు కూర్చున్నారు. ముందుగా రోడ్డుపై బైఠాయించి తమలపాకులు తిని నిరసన తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు రోడ్డుపై బత్తాకాయలు అమ్మి నిరసన తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు వేర్పాటువాదుల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి చర్చిసెంటర్లో వాటిని దహనం చే శారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలేదీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కనిగిరి, వెలిగండ్ల, హెచ్ఎం పాడు, సీఎస్ పురం, పామూరులో టీడీపీ కార్యకర్తలు రిలేదీక్షలు చేపట్టారు. దర్శిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగులు ముట్టడించి కార్యకలాపాలను అడ్డుకున్నారు. యర్రగొండపాలెంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల దీక్షలు నాలుగోరోజుకు చేరుకున్నాయి. బ్యాంకులు, పోస్టాఫీసులు, బీఎస్ఎన్ఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగులు మూసివేయించి నిరసన తెలిపారు. -
షార్కు తగిలిన షాక్
సాక్షి నెట్వర్క్ : విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది నిరవధిక సమ్మె కారణంగా ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. మంగళవారం రోజూ సీమాంధ్రలో చీకట్లు అలుముకున్నాయి. రాత్రి సమయంలో అక్కడక్కడా విద్యుత్‌ను పునరుద్ధరించినా ఉదయం 6 గంటల నుంచే విద్యుత్ సరఫరా క్రమంగా షట్‌డౌన్ అయింది. దేశానికే తలమానికమైన సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్)కు సమైక్య ఉద్యమ సెగ తాకింది. విద్యుత్ ఉద్యోగులు మంగళవారం సమ్మెలోకి వెళ్లడంతో మధ్యాహ్నం 1.20కి మన్నూరు పోలూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షార్, రైల్వే, పారిశ్రామికవాడకు వెళ్లే లైన్లు ట్రిప్ అయ్యాయి. షార్ కేంద్రంలో ఈ నెల 28న అంగారకుడిపై పరిశోధనల నిమిత్తం మార్స్‌మిషన్ ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో పనికి తీవ్ర ఆటంకం కలిగింది. రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ ఉత్పాదన అందిస్తున్న విజయవాడలోని ఎన్టీటీపీఎస్లో ఏడు యూనిట్లు నిలిచిపోవడంతో సదరన్ పవర్ గ్రిడ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. కృష్ణా జిల్లాలో సుమారు 5 వేల పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. విశాఖలోని కేజీహెచ్, రిమ్స్, కాకినాడ జీజీహెచ్ తదితర ప్రధాన ఆస్పత్రులు, నీటి సరఫరా కేంద్రాలకు అత్యవసర కేటగిరీలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. సీలేరు, డొంకరాయి జలవిద్యుత్ కేంద్రాల్లో 240 మెగావాట్లు, ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులోని మాచ్‌ఖండ్‌లో 57మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఖమ్మం జిల్లా లోయర్ సీలేరు ఏపీజెన్కో ప్రాజెక్టు పరిధిలోని పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికీ సమైక్య సెగ తగిలింది. ఉద్యోగుల సమ్మెతో పశ్చిమగోదావరి జిల్లాలోని ఈపీడీసీఎల్‌కు సుమారు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లింది. తెలంగాణకు చెందిన డొంకరాయి జల విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ కృష్ణయ్య తమ సమ్మెను వ్యతిరేకిస్తున్నారని ఆరోపిస్తూ సిబ్బంది ఆందోళన చేపట్టారు. అధికారులను గదిలో నిర్బంధించి సమైక్య నినాదాలు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీలలో 40శాతం ఉత్పత్తులు పడిపోగా, సున్నం పరిశ్రమలు మూడపడ్డాయి. గుంటూరు, గణపవరం, పేరేచర్ల ప్రాంతాల్లోని పలు స్పిన్నింగ్ మిల్లుల్లో నూలు తయారీకి తీవ్ర ఆటంకం కలిగింది. అయోమయంలో రైల్వే అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభం ఈస్ట్‌కోస్ట్ రైల్వేపై ప్రభావం చూపింది. ఏ రైలు నడపాలి, ఏ రైలును రద్దుచేయాలో తెలియక అధికారులు అయోమయంలో పడిపోయారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరే గోదావరి, విశాఖ, గరీబ్థ్ ్రఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా నిలిపివేసినట్లు తూర్పుకోస్తా రైల్వే అధికారులు ఉదయం ప్రకటించగా, మధ్యాహ్నానికి అత్యవసర సర్వీసులకు విద్యుత్తును పునరుద్ధరించడంతో వాటిని తిరిగి నడిపారు. బుధవారం నుంచి అన్ని రైళ్లు యథావిధిగానే నడుస్తాయని తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది. విశాఖపోర్టులో విద్యుత్ కోత కారణంగా సోమవారం అర్థరాత్రి వచ్చిన నౌకలకు నావిగేషన్ చూపలేకపోవడంతో చాలావరకు మధ్యలోనే ఆగిపోయాయి. స్టీల్‌ప్లాంట్‌లో మాత్రం కొంచెం పురోగతి కనిపించింది. -
సమ్మె విరమించేది లేదన్న విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
-
విద్యుత్ సమ్మె పై కేంద్రం సీరియస్
-
జన జీవనం అస్తవ్యస్తం
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసింది. విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు బయల్దేరే అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, ప్యాసింజర్ రైళ్లన్నీ రద్దయ్యాయి. విమానాల రాకపోకల మీద కూడా విద్యుత్ సమ్మె ప్రభావం చూపింది. విశాఖ నగరం సహా జిల్లా మొత్తం తాగునీటి సరఫరా స్తంభించి జనం ఇక్కట్లకు గురయ్యారు. ఐటీ ఉత్పత్తులు కుప్ప కూలాయి. విశాఖ పోర్టుకు కూడా విద్యుత్ సమ్మె తగిలే ప్రమాదం ఏర్పడింది. స్టీల్‌ప్లాంట్‌లో పరిస్థితి ఘోరంగా మారి ఉత్పత్తి హీన దశకు చేరింది. విశాఖ నగరం సహా, పట్టణాలు, పల్లెలన్నీ గాఢాంధకారంలో కొట్టుమిట్టాడాయి. ప్రభుత్వ వైద్య శాలలు సమ్మె దెబ్బకు చీకటిమయమయ్యాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు సాయంత్రం 6 గంటలకే మూత పడగా, నివాస గృహాల్లో కొవ్వొత్తుల వెలుగులు మాత్రమే కనిపించాయి. మంగళవారం నుంచి డొంకరాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉద్యోగులు కూడా సమ్మె బాట పడుతున్నారు. మన రాష్ర్టంలో జరుగుతున్న సమ్మె దెబ్బకు పొరుగునే ఉన్న మాచ్‌ఖండ్ విద్యుదుత్పత్తి కేంద్రంలో మూడు యూనిట్లు ట్రిప్ అయ్యాయి. ఎక్కడి రైళ్లక్కడే... : వాల్తేర్ రైల్వే డివిజన్‌కు అవసరమైన విద్యుత్ అందకపోవడంతో విశాఖపట్నం -కోరాపుట్, విశాఖపట్నం - రాయగడ , విశాఖపట్నం- పలాస, విశాఖపట్నం - దుర్గ్, విశాఖపట్నం- రాయ్‌పూర్, విశాఖపట్నం- విజయనగరం, రాజమండ్రి- విశాఖపట్నం, భువనేశ్వర్- విశాఖపట్నం, విశాఖపట్నం- రాజమండ్రి, విశాఖపట్నం- మచిలీపట్నం, విశాఖపట్నం - విజయవాడ, విశాఖపట్నం- కాకినాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ఈ రైళ్లను మంగళవారం కూడా రద్దు చేశారు. భువనేశ్వర్- విశాఖపట్నం రైలు సోం పేట వరకు, పూరి- గున్పూర్ ప్యాసింజర్‌ను రాంభా వరకు మాత్రమే డీజిల్ ఇంజిన్లతో నడిపారు. విశాఖపట్నంలో మధ్యాహ్నం 1-35కు బయల్దేరిన విశాఖ- విజయవాడ రత్నాచల్ రైలు కిలోమీటరు దూరం వెళ్లి సాయంత్రం 4-30 గంటలకు మళ్లీ విశాఖ స్టేషన్‌కు వచ్చింది. ఈ రైలుకు డీజిల్ ఇంజన్ అమర్చడంతో సాయంత్రం 5-20 గంటలకు విజయవాడకు బయల్దేరింది. భువనేశ్వర్- బెంగళూరు మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు నాలుగు గంటల 40 నిమిషాలు ఆలస్యంగా నడిచింది. దువ్వాడ వద్ద విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తడంతో సుమారు గంట పాటు ఆగిపోయింది. ముంబయి నుంచి భువనేశ్వర్ వస్తున్న కోణార్స్ ఎక్స్‌ప్రెస్ పాయకరావుపేట రైల్వే గేట్ వద్ద సుమారు గంట పాటు ఆగిపోయింది. హౌరా- యశ్వంత్ పూర్ రైలు విశాఖకు ఉదయం 10.40 గంటలకు రావాల్సి ఉండగా రాత్రి 7 గంటలు దాటినా రాలేదు. యశ్వంత్ పూర్ - హౌరా రైలు మధ్యాహ్నం 3.55 గంటలకు విశాఖ రావాల్సి ఉండగా ఆ రైలుది కూడా అదే పరిస్థితి. విశాఖ- తిరుపతి మధ్య నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరాల్సి ఉండగా సాయంత్రం 5.20 గంటలకు బయల్దేరింది. విశాఖపట్నం- నిజాముద్దీన్ లింక్ ఎక్స్‌ప్రెస్ కూడా మూడున్నర గంటలు ఆలస్యంగా నడిచింది. విశాఖ- హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి, గరీబ్థ్ రైళ్లను డీజిల్ ఇంజన్లతో నడిపారు. రైళ్ల రద్దు : మంగళవారం విశాఖ- భువనేశ్వర్ మధ్య నడిచే ఇంటర్సిటీ (రెండువైపులది) భువనేశ్వర్- సికింద్రాబాద్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్- పాండిచ్చెరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్టు రైల్వే పీఆర్వో జయరాం తెలిపారు. విశాఖ నుంచి బయలు దేరాల్సిన జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్, తిరుమల, దక్షిణ్, లింక్, గరీభ్థ్, దురంతో, విశాఖ-నాన్దెడ్, కెఆర్పీయు-విశాఖ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లు మంగళవారం రద్దయినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. -
కర్నూలు జిల్లా శ్రీశైలం పవర్ హొస్ దగ్గర ఉద్రిక్తత
-
జనానికి ఇక్కట్లు
సాక్షి నెట్వర్క్: విద్యుత్ ఉద్యోగుల సమ్మె రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సీమాంధ్రతో పాటు రాష్ట్రంలో పలు ఇతర జిల్లాల్లో కూడా అంధకారం అలముకుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు రైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. పలు రైళ్లను రద్దుచేశారు. వేలాది గ్రామాలకు కరెంట్ సరఫరా ఆగిపోయింది. మోటార్లు పనిచేయక తాగునీటికి ఇక్కట్లు మొదలయ్యాయి. పరిశ్రమల్లో పనులు నిలిచిపోయాయి. ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తిరుమలకు మూడు గంటల సేపు విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఆదివారం అనంతపురం జిల్లాలో 3,235 గ్రామాల్లో, ప్రకాశంలో 1,024 పంచాయతీలు, కర్నూలులో 960, కృష్ణాలో 750 గ్రామాల్లో కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సీమాంధ్ర అంతటా పలు నగరాలు, పట్టణాలు కూడా కోతలతో అల్లాడాయి. తిరుమలలో కూడా మధ్యాహ్నం 1.40 నుంచి సాయంత్రం 4.40 గంటల వరకు 3 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో బ్రహ్మోత్సవాల కోసం వచ్చిన శ్రీవారి భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. టీటీడీ అధికారుల విజ్ఞప్తి మేరకు సాయంత్రం 4.40 తర్వాత తిరుమలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. విజయవాడ నగరంలోనూ పలు ప్రాంతాల్లో 5 గంటల పాటు కోతలు అమలయ్యాయి. ఎన్టీటీపీఎస్ వద్ద బీఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. కనకదుర్గ ఆలయంలో ఆదివారం రాత్రి 8.30 సమయంలో ఒక్కసారిగా చీకట్లు అలముకున్నాయి. జనరేటర్ల సాయంతో భక్తులకు ఇబ్బంది లేకుండా చూశారు. కరెంటు కోత దెబ్బకు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కూడా ఆదివారం ఉదయం పలు విభాగాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు ఫర్నేస్‌లలో ఉత్పత్తి నిలిచిపోయి కోట్లాది రూపాయల ఉత్పత్తికి అంతరాయం కలిగింది. పూర్తిస్థాయి పునరుద్ధరణకు మరో 24 గంటలు పడుతుందని భావిస్తున్నారు. -
ఏపీ స్విచ్ ఆఫ్!
విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఆదివారం తీవ్రరూపం దాల్చింది. దాంతో ఏకంగా 3,780 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దానికి తోడు పలు విద్యుత్ సబ్స్టేషన్లను ఉద్యోగులే ట్రిప్ చేయడంతో కరెంటు కోతతో రాష్ట్రం అల్లాడింది. సీమాంధ్రలోనైతే అంతటా అంధకారం నెలకొంది. తాగునీటికి కొరత ఏర్పడింది. ఆసుపత్రులకూ కరెంటు నిలిచిపోయింది. చివరికి విద్యుత్ సరఫరా లేక రైల్వే శాఖ కూడా పలు రైళ్లను నిలిపేయాల్సి వచ్చింది! విద్యుత్ సమ్మె తిరుమలనూ తాకింది. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా వెలవెలబోయాయి. నవరాత్రుల సందర్భంగా శోభాయమానంగా వెలిగిపోయే విజయవాడ కనకదుర్గ గుడిలోనూ చీకట్లు అలముకున్నాయి. శ్రీశైలం దేవస్థానంలోనూ ఇదే పరిస్థితి. ఇక పలు పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె ప్రభావంతో హైదరాబాద్‌లోనూ 2 నుంచి 3 గంటలు కోతలు అమలయ్యాయి. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈపీడీసీఎల్ సిబ్బంది కూడా సోమవారం ఉదయం నుంచి సమ్మెకు దిగనున్నారు. దాంతో సమస్య మరింత తీవ్రరూపు దాల్చనుంది. సాక్షి, హైదరాబాద్: విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్రప్రదేశ్ కోసం సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు తలపెట్టిన నిరవధిక సమ్మెతో రాష్ట్రంలో అంధకారం నెలకొంది. సీమాంధ్రలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక చీకట్లు అలుముకున్నాయి. ఒకవైపు జెన్కోకు చెందిన వివిధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తిని శనివారం నుంచి నిలిపివేసిన ఉద్యోగులు.... ఆదివారం మొత్తం విద్యుత్ సరఫరా లైన్లు, సబ్‌స్టే„షన్లను లక్ష్యంగా చేసుకున్నారు. విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో 500 మెగావాట్ల ప్లాంటుకు ఏకంగా చీఫ్ ఇంజనీరు సమ్మయ్యే డోజర్ నడుపుతూ బొగ్గు సరఫరా చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ఉద్యోగులు ఒక్కరూ రాకపోవడంతో ఆదివారం రాత్రి 8 గంటలకు అక్కడ కూడా విద్యుదుత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది. మొత్తం మీద జెన్కో ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్రలోని వివిధ విద్యుత్ ప్లాంట్లలో ఏకంగా 3,780 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. ఆదివారం ఉదయం నుంచి ట్రాన్సకో, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సిబ్బంది కూడా సమ్మెకు దిగడంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ ఎక్కడికక్కడ పూర్తిగా స్తంభించింది. సీమాంధ్రలోని అనేక ప్రాంతాల్లోని 400, 220, 133 కేవీ సబ్‌స్టే„షన్లతో పాటు 33/11 కేవీ సబ్‌స్టే„షన్లను ట్రిప్ చేయడం ద్వారా విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దాంతో జల విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి చేసి కరెంటును సరఫరా చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్రలో పూర్తిగా అంధకారం నెలకొంది. పల్లె, పట్నం తేడా లేకుండా చీకట్లు అలముకున్నాయి. దాంతో కనీసం తాగునీటికి కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆసుపత్రులకు కూడా సమ్మె సెగ తాకింది. ఘన్పూర్, శ్రీశైలం, గుత్తిల్లో 400 కేవీ స్టేషన్లను కూడా ట్రిప్ చేశారు. చిత్తూరులో 315 ఎంవీఏ, గుంటూరు జిల్లా నరసరావుపేట, వైఎస్సార్ జిల్లా పులివెందులల్లో 100 ఎంవీఏ సామర్థ్యమున్న సబ్‌స్టే„షన్లు పేలిపోయాయి. ఈపీడీసీఎల్ పరిధిలో 5,000 మంది సోమవారం ఉదయం నుంచి సమ్మెలో పాల్గొననున్నారు. సమ్మె ప్రభావం హైదరాబాద్‌నూ తాకింది. రాజధానిలో 2 నుంచి 3 గంటల పాటు కోతలు అమలయ్యాయి. సమ్మె నుంచి టీటీడీకి తొలుత మినహాయింపు ఇచ్చారు. అయితే రాత్రి వేళల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆ సమయంలో విద్యుత్‌ను సరఫరా చేయాలని, పగలు యథావిధిగా కోతలు అమలు చేయాలని కొన్ని జిల్లాల్లోని విద్యుత్ ఉద్యోగుల జేఏసీలు నిర్ణయించాయి. ఆ మేరకు ఆదివారం రాత్రి 8 గంటల నుంచి పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభమయ్యింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా సరఫరాను నిలిపేస్తామని ఉద్యోగులు అంటున్నారు. ఇంధన శాఖ వర్గాలు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామంటున్నాయి. గ్రిడ్‌కు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూం ద్వారా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమ్మె విరమించేలా ఉద్యోగుల నేతలతో జెన్కో ఎండీ కె.విజయానంద్, ట్రాన్సకో సీఎండీ (ఇన్చార్జి) మునీంద్ర సోమవారం విద్యుత్ సౌధలో చర్చలు జరపనున్నారు. 3,780 మెగావాట్ల విద్యుత్ నష్టం...!: సమ్మెతో సీమాంధ్రలోని పలు ప్లాంట్లలో ఆదివారం రాత్రికల్లా ఏకంగా 3,780 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. సోమవారం నుంచి మరో 265 మెగావాట్ల ఉత్పత్తికీ గండిపడే ప్రమాదముంది. విజయవాడలోని నార్లతాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో 210 మెగావాట్ల సామర్థ్యమున్న 7 యూనిట్లు మొత్తం 1460 మెగావాట్ల విద్యుదుత్పత్తీ శనివారమే నిలిచిపోయింది. 500 మెగావాట్ల మరో యూనిట్లో ఆదివారం రాత్రి 8 గంటల దాకా కరెంటును ఉత్పత్తి చేశారు. బొగ్గును సరఫరా చేసేందుకు ఒక్క ఉద్యోగీ అందుబాటులో లేకపోవడంతో చీఫ్ ఇంజనీర్ సమ్మయ్యే డోజర్ ద్వారా బొగ్గును లోడ్ చేయాల్సి వచ్చింది! చివరికి ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆ 500 మెగావాట్ల ఉత్పత్తినీ నిలిపేశారు. దాంతో ఒక్క ఎన్టీటీపీఎస్లోనే ఏకంగా 1,960 మెగావాట్ల విద్యుదుత్పత్తి వైస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్టీపీపీ)లో 210 మెగావాట్ల సామర్థ్యమున్న 5 యూనిట్లలో మొత్తం 1,050 మెగావాట్ల ఉత్పత్తీ శనివారమే పడకేసింది. 770 మెగావాట్ల శ్రీశైలం విద్యుత్కేంద్రం లోని ఉద్యోగులు కూడా ఆదివారం నుంచి సమ్మెకు దిగారు. దాంతో ఈ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. సోమవారం ఉదయం ఆరింటి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు విశాఖ కేంద్రంగా ఉన్న ఉద్యోగులు కూడా ప్రకటించడంతో 240 మెగావాట్ల సీలేరు, 25 మెగావాట్ల డొంకరాయి జల విద్యుత్కేంద్రాల్లోనూ ఉత్పత్తి నిలిచిపోనుంది. కరెంటున్నా తీసుకునే వారేరీ?: సమ్మెతో విద్యుదుత్పత్తికి నష్టం వాటిల్లడంతో రిజర్వాయర్లలో నీళ్లున్నందున జల విద్యుదుత్పత్తిని జెన్కో పెంచింది. శ్రీశైలం, జూరాల, సీలేరు, డొంకరాయి, మాచ్‌ఖండ్ వంటి జల విద్యుత్కేంద్రాలతో పాటు తెలంగాణలోని పలు థర్మల్ ప్లాంట్లలో కూడా పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, వరంగల్ జిల్లా కాకతీయ థర్మల్ ప్లాంట్లకు నాణ్యమైన సీ-గ్రేడ్ బొగ్గుతో పాటు ఒరిస్సా నుంచి వచ్చే వాష్డ్ కోల్నూ సరఫరా చేశారు. ఇలా ఇబ్బడిముబ్బడిగా విద్యుదుత్పత్తి చేసినా సీమాంధ్రలో అనేక ఈహెచ్‌టీ సబ్‌స్టే„షన్లను ట్రిప్ చేయడంతో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దాంతో ఆదివారం ఒకానొక సమయంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కేవలం 7,000 మెగావాట్లకే పరిమితమైన పరిస్థితి నెలకొంది. తిరుపతి కేంద్రంగా ఉన్న ఎస్పీడీసీఎల్కు వాస్తవంగా 1700 మెగావాట్లు అవసరం కాగా ఆదివారం మధ్యాహ్నం 300 మెగావాట్లనే తీసుకుంది. అంటే డిమాండ్ ఏకంగా 1,400 మెగావాట్ల మేర పడిపోయింది! కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ డిమాండ్ లేకపోవడంతో మరో 800 మెగావాట్ల విద్యుత్ అవసరం లేకుండా పోయింది. అంటే మొత్తం మీద 2,200 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ తగ్గిపోయింది. దాంతో ఆదివారం సాయంత్రానికి శ్రీశైలం ఎడమగట్టు, సీలేరు విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి జరగకుండా ప్లాంట్లను నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి ఏడింటి నుంచి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో ఈ ప్లాంట్లలో తిరిగి ఉత్పత్తిని ప్రారంభించారు. విద్యుత్ సౌధలో కంట్రోల్ రూం: సమ్మె నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు విద్యుత్ సౌధలో కంట్రోల్ రూములను జెన్కో, ట్రాన్సకో ఏర్పాటు చేశాయి. సరఫరా వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు వీలుగా డెరైక్టర్ స్థాయి అధికారి నిరంతర పర్యవేక్షణలో కంట్రోల్ రూంను ట్రాన్సకో ఏర్పాటు చేసింది. రైల్వే శాఖ అధికారి కూడా అక్కడే ఉండి ఏయే లైన్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందనే వివరాలను తమ శాఖకు చేరవేశారు. జెన్కో కూడా విద్యుదుత్పత్తికి ఇబ్బంది కలగకుండా, సరఫరాకు అనుగుణం గా ఉత్పత్తి జరిగేలా చూసేందుకు డెరైక్టర్ (హెచ్ఆర్) ఏవీ రావు ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్లు సుందర్‌సింగ్, సుజయ్కుమార్లతో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. సబ్‌స్టే„షన్లే లక్ష్యంగా...! విద్యుత్ ఉద్యోగుల అకస్మిక సమ్మె వల్ల సీమాంధ్ర ప్రాంతంలోని అనేక జిల్లాల్లో అంధకారం అలుముకుంది. అక్కడి పలు ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపేసిన ఉద్యోగులు, తర్వాత విద్యుత్ సరఫరా వ్యవస్థపై దృష్టి సారించారు. ఎక్సట్రా హై-టెన్షన్ (400, 220, 132 కేవీ సబ్‌స్టే„షన్లను లక్ష్యంగా చేసుకున్నారు. వాటిలో విద్యుత్ సరఫరాను నిలిపేశారు. అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని అన్ని ఈహెచ్‌టీ సబ్‌స్టే„షన్లనూ ట్రిప్ చేశారు. చిత్తూరు జిల్లాలో 132 కేవీ పుంగనూరు, కర్నూలు జిల్లాలోని 400 కేవీ నన్నూరు, 220 కేవీ ఏపీ కారై్బడ్స, వైఎస్సార్ జిల్లాలో అన్ని ఈహెచ్టీలతో పాటు 220 కేవీ రాజంపేట, 220 కేవీ ఎరగ్రుంట్ల విద్యుత్ సరఫరా లైన్లను ట్రిప్ చేశారు. గుంటూరు జిల్లాలో 132 కేవీ మాచర్ల, 132 కేవీ బాపట్ల స్టేషన్లనూ ట్రిప్ చేశారు. ఫలితంగా విద్యుత్ పంపిణీ చేసినా, సబ్‌స్టే„షన్లను ట్రిప్ చేయడంతో సరఫరా వ్యవస్థ నిలిచిపోయింది! దాంతో సీమాంధ్రలోని చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. పెద్ద సబ్‌స్టే„షన్లకు సరఫరా లేకపోవడంతో గృహాలకు సరఫరా చేసే 33/11 కేవీ స్టేషన్లకు కూడా కరెంటు నిలిచిపోయింది. ఈహెచ్‌టీ సబ్‌స్టే„షన్లను లక్ష్యంగా చేసుకోవడం వల్ల పరిశ్రమలు, ఆసుపత్రులకు కూడా విద్యుత్ ఆగిపోయింది. పలుచోట్ల 33/11 కేవీ స్టేషన్లలోని ఆపరేటర్లను కూడా బయటికి తీసుకెళ్లారు. వాటికి విద్యుత్ సరఫరా కాకుండా ట్రిప్ చేశారు. దాంతో కొన్నిచోట్ల పెద్ద సబ్‌స్టే„షన్ల నుంచి కరెంటు వచ్చినా స్థానికంగా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. పైగా 33/11 కేవీ స్టేషన్లను ట్రిప్ చేయడంతో పై నుంచి విద్యుత్ సరఫరా జరిగిన ప్రాంతాల్లో ఓవర్‌లోడ్ వల్ల పలు ట్రాన్సఫార్మర్లు పేలిపోయాయి. ఇలా సీమాంధ్రలో వందలాది ట్రాన్సఫార్మర్లు పేలిపోయినట్టు సమాచారం. దీనికి తోడు విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని సిబ్బంది కూడా సోమవారం నుంచి సమ్మెకు దిగనుండటంతో ఆ జిల్లాల్లోనూ సోమవారం విద్యుత్ సరఫరా వ్యవస్థ కుప్పకూలడం ఖాయమంటున్నారు. రక్షణ పూజ్యం...! విద్యుత్ ఉద్యోగుల సమ్మెను ఎదుర్కొనేందుకు కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో కూడా ఇంధన శాఖ విఫలమైంది. కనీసం 400, 220, 132 కేవీ సబ్‌స్టే„షన్ల వద్ద కూడా ఏమాత్రమూ ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేయలేదనే విమర్శలున్నాయి. దాంతో సీమాంధ్రలో పలు ఈహెచ్‌టీ సబ్‌స్టే„షన్లను ముట్టడించి సరఫరాను నిలిపేసినా అడ్డుకునే వారు లేకుండాపోయారు. సబ్‌స్టే„షన్‌కు ఒక పోలీసు చొప్పున రక్షణ కావాలని ఎస్పీలను ఇంధన శాఖ తాజాగా కోరింది. ఒక్క పోలీసు ఏం రక్షణ కల్పిస్తారనే విమర్శలు విన్పిస్తున్నాయి. పలు ప్రాంతాల్లోని సబ్‌స్టే„షన్ల రక్షణ ఇలా... జోన్ సబ్స్టేషన్ల సంఖ్య రక్షణ ఉన్నది రక్షణ లేనిది విజయవాడ 34 9 25 నెల్లూరు 34 34 -- కడప 34 30 4 కర్నూలు 47 8 30 విశాఖపట్నం 33 2 31 రాజమండ్రి 31 2 29 400 కేవీ సబ్‌స్టే„షన్- మాచ్‌ఖండ్1 - 1 400 కేవీ సబ్‌స్టే„షన్- కల్పకం1 1 - దక్షిణాది గ్రిడ్‌కు ఢోకా లేనట్టే! సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో దక్షిణాది గ్రిడ్ కుప్పకూలుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ, ఇంధన శాఖ అధికారులు మాత్రం వాటిని తోసిపుచ్చుతున్నారు. రాష్ట్రంలో గ్రిడ్ కుప్పకూలే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు. ‘‘రాష్ట్రంలో ఏయే విద్యుత్కేంద్రాల్లో ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. అలాగే ఏయే సబ్‌స్టే„షన్లు పని చేయడం లేదో కూడా ఇప్పటికే పూర్తి సమాచారముంది. సమ్మె గురించి కూడా ముందే తెలిసిన కారణంగా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యాం. నిరంతరం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం’’ అని తెలిపారు. -
తిరుమలకు తాకిన సమైక్య విద్యుత్ సెగ
-
చీకట్లోనే మగ్గుతున్న అనేక గ్రామాలు
-
విద్యుత్ ఉద్యోగుల 72 గంటల సమ్మె
-
12 నుంచి నిరవధిక సమ్మె
చీరాల అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు నిరసనగా సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 12వ తేదీ నుంచి నిరవధికంగా సమ్మె చేయనున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ ఎం.హరిబాబు వెల్లడించారు. విద్యుత్ ఉద్యోగసంఘ నాయకులు స్థానిక వాడరేవురోడ్డులోని డివిజన్ ఇంజినీర్ కార్యాలయంలో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించేందుకు కుట్రపన్నిందని మండిపడ్డారు. రాష్ట్ర విభజనతో తెలంగాణకు అక్షయపాత్ర ఇచ్చి, సీమాంధ్రకు భిక్షాటన చేసే పాత్ర ఇచ్చినట్లవుతుందన్నారు. తక్కువ ఆదాయంతో సీమాంధ్ర అభివృద్ధి చెందలేదన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివినా ఉపాధిలేక రోడ్లపైనే అడుక్కోవాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు లేకుంటే పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు టి.జయకరరావు మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలోని విద్యుత్ ఉద్యోగులందరూ కార్యాచరణ రూపొందించుకుని దశల వారీగా ఉద్యమించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో జరిగే అనర్థాలపై కరపత్రాల ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అన్ని రంగాలకు చెందిన జేఏసీ నాయకులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారని చెప్పారు. ఉద్యోగులందరూ గురువారం సామూహిక సెలవు, 6న సహాయ నిరాకరణ,7న చలో విద్యుత్ సౌధ, 8,9,10 తేదీలు సహాయ నిరాకరణ, 11న అన్ని కేడర్‌లోని విద్యుత్ ఉద్యోగుల డిపార్ట్మెంటల్ సిమ్‌కార్డులు యాజమాన్యానికి అందజేయుట, 12 నుంచి నిరవధిక సమ్మె లో పాల్గొంటున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రకటనను వెనక్కు తీసుకునే వరకూ ఉద్యమిస్తామని, సమ్మెతో ప్రజలకు ఇబ్బంది కలిగినా ఓర్పుతో సహకరించాలని కోరారు. అనంతరం నిరవధిక సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ టి.సాంబశివరావు, కోశాధికారి రాజేంద్రప్రసాద్, చీరాల డివిజన్ కమిటీ చైర్మన్ డీఈ టి.శ్రీనివాసరావు, వేటపాలెం ఏడీఈ అశోక్‌బాబు, ఆర్.నాగభూషణం, ఎం.వెంకటరెడ్డి, లైన్‌మన్ కళ్యాణరావు, వేటపాలెం ఏఈ టి.సత్యనారాయణ, డీ-2 సెక్షన్ ఏఈ వి.భాస్కరరావు, ఏఈఓ టి.శ్రీనివాసరావు, టౌన్ ఏఈ ఉదయకిరణ్ పాల్గొన్నారు.