జనానికి ఇక్కట్లు
సాక్షి నెట్‌వర్క్: విద్యుత్ ఉద్యోగుల సమ్మె రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సీమాంధ్రతో పాటు రాష్ట్రంలో పలు ఇతర జిల్లాల్లో కూడా అంధకారం అలముకుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు రైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. పలు రైళ్లను రద్దుచేశారు. వేలాది గ్రామాలకు కరెంట్ సరఫరా ఆగిపోయింది. మోటార్లు పనిచేయక తాగునీటికి ఇక్కట్లు మొదలయ్యాయి. పరిశ్రమల్లో పనులు నిలిచిపోయాయి. ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తిరుమలకు మూడు గంటల సేపు విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఆదివారం అనంతపురం జిల్లాలో 3,235 గ్రామాల్లో, ప్రకాశంలో 1,024 పంచాయతీలు, కర్నూలులో 960, కృష్ణాలో 750 గ్రామాల్లో కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
సీమాంధ్ర అంతటా పలు నగరాలు, పట్టణాలు కూడా కోతలతో అల్లాడాయి. తిరుమలలో కూడా మధ్యాహ్నం 1.40 నుంచి సాయంత్రం 4.40 గంటల వరకు 3 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో బ్రహ్మోత్సవాల కోసం వచ్చిన శ్రీవారి భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. టీటీడీ అధికారుల విజ్ఞప్తి మేరకు సాయంత్రం 4.40 తర్వాత తిరుమలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. విజయవాడ నగరంలోనూ పలు ప్రాంతాల్లో 5 గంటల పాటు కోతలు అమలయ్యాయి. ఎన్‌టీటీపీఎస్ వద్ద బీఎస్‌ఎఫ్ బలగాలను మోహరించారు. కనకదుర్గ ఆలయంలో ఆదివారం రాత్రి 8.30 సమయంలో ఒక్కసారిగా చీకట్లు అలముకున్నాయి. జనరేటర్ల సాయంతో భక్తులకు ఇబ్బంది లేకుండా చూశారు. కరెంటు కోత దెబ్బకు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కూడా ఆదివారం ఉదయం పలు విభాగాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు ఫర్నేస్‌లలో ఉత్పత్తి నిలిచిపోయి కోట్లాది రూపాయల ఉత్పత్తికి అంతరాయం కలిగింది. పూర్తిస్థాయి పునరుద్ధరణకు మరో 24 గంటలు పడుతుందని భావిస్తున్నారు.