samaikyandhara
-
సమైక్య ముసుగులో విభజన వీరులు
చంద్రబాబు, కిరణ్ అండ్ కో దొంగాటకం సాక్షి, హైదరాబాద్:రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నప్పుడే రాష్ట్రంలో అంతా ఒక్కటై రాజకీయ సంక్షోభం సృష్టించి ఉంటే కేంద్రం ముందుకు వెళ్లేదా? ప్రజలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సంఘాలన్నీ ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నప్పుడే రాజకీయ పక్షాలన్నీ వారికి అండగా నిలిచి ఉంటే విభజన ప్రక్రియ ముందుకు సాగేదా? సీమాంధ్ర ఉద్యమం రాజకీయ మలుపు తిరగకుండా అడ్డుకునే కుయుక్తిలో భాగంగా కీలక సమయంలో ఉద్యోగ సంఘాల సమ్మెను విరమింపజేయకుండా ఉండి ఉంటే కేంద్రం వెనక్కి తగ్గేది కాదా? ఈ రోజు సీమాంధ్ర సమస్యలంటూ గొంతు చించుకుంటున్న పార్టీలు, వాటి నేతలు ఆ రోజు తెలంగాణకు అనుకూలమంటూ తాము స్వయంగా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోకుండానే విభజనను ఆపుతామంటే విశ్వసించేదెవరు? విభజనను అడ్డుకునే అవకాశాలన్నింటినీ ఒకటొకటిగా ఉద్దేశపూర్వకంగా ‘చేజార్చి’... ఇప్పుడు ‘ఆపి తీరుతాం’ అంటూ ప్రగల్భాలు పలుకుతుంటే ఏమనుకోవాలి? పరిస్థితి ఇంతదాకా రావడానికి కారణమెవరు? విభజనకు కారకులే ఈ రోజు మళ్లీ సమైక్య ముసుగు ధరించి ప్రజలను మరోసారి నట్టేట ముంచడానికి సిద్ధమవుతున్నారా? విభజనకు అంగీకరించిన వాళ్లు, ఆ ప్రక్రియను సాఫీగా ముందుకు నడుపుతున్న వాళ్లే కొత్తగా సమైక్య రాగమెత్తుకుంటే... సమైక్యోద్యమాన్ని భుజాన మోస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్లే సదరు ముసుగు దొంగలకు హారతి పడుతున్నారా? ముఖం చెల్లని వారికి ముసుగులు కప్పి ఒక వేదికను సిద్ధం చేస్తున్నారా? జరుగుతున్న పరిణామాల క్రమం చూస్తుంటే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక తాజాగా నిర్వహించిన సమావేశం ఇదే పరిస్థితికి అద్దం పడుతోంది. ఒకవైపు సీఎం కిరణ్, మరోవైపు విపక్ష నేత చంద్రబాబు.. అడుగడుగునా వారిద్దరి కనుసన్నల్లో నడుస్తున్నారంటూ మొదటి నుంచీ విమర్శలను ఎదుర్కొంటున్న సమైక్యోద్యమ సంధానకర్తలు... ఇలా కీలక వ్యక్తులంతా నాలుగున్నర నెలలుగా కలసికట్టుగా ఆడుతున్న నాటకాలకు తాజా పరిణామాలన్నీ పరాకాష్టేనని భావిస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ చిత్తశుద్ధితో అవిశ్రాంత పోరాటం చేస్తున్న పార్టీలను, సమైక్య ముసుగులో విభజనవాదంతో ముందుకు పోతున్న కుహనా పార్టీలను కడుతున్న ఈ వేదిక తీరును సమైక్యవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. సమైక్య ఉద్యమ పరిరక్షణ వేదిక శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న పార్టీలను, వాటి తీరుతెన్నులను గమనిస్తే.. విభజన విషయంలో సీమాంధ్ర ప్రజలను తొలినుంచీ పథకం ప్రకారం మోసగిస్తూ వస్తున్న శక్తులే మరోసారి కుహనావాదంతో వారి ముందుకెళ్లడానికి మరో దారి ఏర్పాటు చేసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. సమైక్యం కోసం ముందు నుంచీ చిత్తశుద్ధితో పోరాడుతున్న పార్టీలతో వేదిక ఏర్పాటు చేసి, మిగతా పార్టీలను కూడా దాని మార్గంలోకి కలుపుకుపోయేలా ఒత్తిడి చేయాల్సి ఉండగా... శనివారం వేదిక పేరుతో జరిగిన పరిణామాలన్నీ అందుకు పూర్తి భిన్నంగానే సాగాయి. తొలి నుంచీ సమైక్యం కోసం పోరాడుతున్న పార్టీలను కాదని, విభజనవాద పార్టీల కలయికతో ‘సమైక్య’ వేదికను ఏర్పాటు చేసుకోవాలన్న విచిత్ర ప్రయత్నంలో తాజాగా అఖిలపక్షం ద్వారా తొలి అడుగు పడినట్టు చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం... ఈ 3 పార్టీలే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మొదటి నుంచీ ముక్త కంఠంతో కోరుతున్నాయి. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు కూడా సమైక్య రాష్ట్రాన్నే కోరుతున్న నేపథ్యంలో ఈ మూడు పార్టీలకు తోడు ఒక్కో పార్టీనీ సమైక్య బాటలోకి తీసుకొచ్చి ఉంటే మూడు పార్టీలు కాస్తా నాలుగు, తర్వాత ఐదు పార్టీలు... ఇలా సమైక్యానికి మద్దతు నానాటికీ పెరిగేది. అలా ప్రజల అభిమతానికి అనుగుణంగా ముందుకొచ్చి ఉంటే ఈ రోజు విభజన ప్రక్రియ ఇంతగా ముందుకు సాగేదే కాదు. కానీ గడిచిన ఐదు నెలలుగా ఏ రాజకీయ పార్టీలైతే విభజన కావాలని కోరాయో, సరిగ్గా ఆ పార్టీలే ఇప్పుడు సమైక్య చాంపియన్లుగా ప్రజల ముందుకు వెళ్లడానికి ముసుగు ధరించే ఎత్తుగడకు పదును పెడుతున్నాయి. నిజానికి హస్తిన పెద్దల డెరైక్షన్ మేరకు రాష్ట్ర విభజన ప్రక్రియను మరింత సాఫీగా, త్వరితంగా పూర్తి చేయించే లక్ష్యంతో పాటు ఎలాగోలా సీమాంధ్ర ప్రజల్లోకి వెళ్లడానికి మార్గం ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ తీర్మానం చేసినప్పటి నుంచి ఐదు నెలలుగా విభజన ప్రక్రియలో కేంద్రం ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు టీడీపీ అధినేత కూడా ఈ విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో కేంద్రానికి సంపూర్ణంగా సహకరిస్తూనే వస్తున్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామంటూ కేంద్రానికి ఏకంగా లేఖే ఇచ్చిన చంద్రబాబు, సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడ్డ మరుక్షణమే, ‘సీమాంధ్రలో కొత్త రాజధానికి కేంద్రమే నిధులు మంజూరు చేయాలి’ అంటూ డిమాండ్ ఎత్తుకున్నారు. కిరణ్ కూడా అంతర్గతంగా అధిష్టానం ఆదేశాలను పాటిస్తూనే, సమైక్య చాంపియన్‌గా తనకు తాను ముద్ర వేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. కేంద్రం విభజన యత్నాలను ఏ దశలోనూ నిలువరించే ప్రయత్నం చేయని ఈ నాయకులు... ఇప్పుడు సమైక్య చాంపియన్లమనే ముద్ర కోసం చేస్తున్న ప్రయత్నాల్లో తాజా వేదిక భాగమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం విభజన నిర్ణయం తీసుకుని నాలుగున్నర నెలలు దాటుతుండగా, సమైక్యాంధ్ర కోసం రాజకీయ పార్టీలన్నింటినీ కలిపి ఒక వేదిక నిర్మించాలన్న డిమాండ్‌ను ఇన్ని రోజుల్లోనూ ఏ సందర్భంలోనూ కాంగ్రెస్, టీడీపీ ఏనాడూ పట్టించుకోలేదు. పైగా ఆ దిశగా కొందరు చేసిన ప్రయత్నాలను విఫలం చేయడానికి ఈ రెండు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డాయి! సమైక్యం కోసం కట్టుబడ్డారన్న క్రెడిట్ మరో పార్టీకి గానీ, ఇంకో నాయకుడికి గానీ దక్కకూడదన్న లక్ష్యంతోనే ఆ రెండు పార్టీల నేతలూ వ్యవహరిస్తూ వచ్చారు. పైగా నిజానికి రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్నదే ఆ రెండు పార్టీలు! తెలంగాణకు కట్టుబడి ఉన్నామంటూ లేఖ ఇచ్చింది టీడీపీ అయితే, ఆ లేఖకు అనుగుణంగానే రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకున్నది అధికార కాంగ్రెస్ పార్టీ! పైగా తమ తమ నిర్ణయాలకు కట్టుబడే ఉన్నామంటూ ఆ పార్టీలు నాలుగు నెలలుగా ప్రకటిస్తూనే ఉన్నాయి. నిప్పులపై నీళ్లు చల్లి... సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటు తీర్మానం తర్వాత రాష్ట్ర ప్రజల్లో సమైక్యోద్యవుం ఒక్కసారిగా పెల్లుబుకింది. ఊరూవాడా ఏకమై దాదాపు రెండు నెలలపాటు ఉద్యమించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలన్నీ అందులో పూర్తిగా చేరిపోయాయి. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న ఆ తరుణంలో అధికార కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ఉద్యవుంలోకి రాజకీయు పార్టీలు చేరి దాని ఉధృతిని వురింత పెంచాలని వైఎస్సార్సీపీ వంటి పార్టీలు పిలుపునిచ్చినా కాంగ్రెస్, టీడీపీ అందుకు ముందుకు రాలేదు. ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం ద్వారా సంక్షోభం ఏర్పడుతుందని, తద్వారా కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని వైఎస్సార్సీపీ ఒక ప్రతిపాదనతో ముందుకొచ్చినప్పుడు కూడా ఆ రెండు పార్టీలు అసలే కలిసిరాలేదు. పైగా రాజీనామాలు చేస్తే అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకోలేమని, కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ రాజీనామాలు చేయొద్దని చెబుతూ కిరణ్ వ్యూహాత్మకంగాా వారిని వారించారు. అసెంబ్లీకి వచ్చే తీర్మానాన్ని అడ్డుకుంటామని ముఖ్యమంత్రే చెప్పడంతో అప్పట్లో ఉధృతంగా ఉద్యమం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు సైతం... రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని, సీఎం చెప్పినట్టు అసెంబ్లీకొచ్చే తీర్మానాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. తీరా విభజన బిల్లు తీర్మానం కోసం కాకుండా కేవలం అభిప్రాయం కోసం మాత్రమే అసెంబ్లీకి వచ్చింది. దాంతో మళ్లీ కొత్త రాగం అందుకున్నారు. ఇలా విభజన బిల్లు విషయంలో అడుగడుగునా దాన్ని అడ్డుకునే అవకాశాలన్నింటినీ ఒక్కొక్కటిగా కావాలనే వదిలేసి... ఇప్పుడు బిల్లును అసెంబ్లీ చర్చకు చేపట్టిన తరుణంలో మరో కొత్త ఎత్తుగడలో భాగంగానే ఇలా వేదికను తెరపైకి తెస్తున్నారన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ యత్నానికి శనివారం జరిగిన భేటీ కేవలం ఆరంభం మాత్రమేనంటున్నారు. కాంగ్రెస్, టీడీపీల్లోని ప్రధాన విభజనవాదులు ఇంతకాలం విభజనకు అనుకూలంగా వ్యవహరించిన నేపథ్యంలో సీమాంధ్రలో అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడం, మరోవైపు ఎన్నికలు ముంచుకొస్తుండటంతో... ఆ విభజన వాదులే ఇప్పుడిలా సమైక్య ముసుగు ధరించి ప్రజల్లోకి వెళ్లడానికి మార్గం ఏర్పాటు చేసుకుంటున్నారని తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. కాదంటే... ఔననే! కాంగ్రెస్, టీడీపీలు సమైక్యమంటూ మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ కేంద్రం ఏదో రకంగా విభజన అంకంలో ఒక అడుగు ముందుకు వేస్తూ వస్తోంది! సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత జరిగిన పరిణామ క్రమమంతా అదే రీతిలో సాగింది. విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర పడగానే సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను కిరణ్ విరమింపజేశారు. రాజీనామాలు చేస్తామంటూ ఎమ్మెల్యేలంతా ముందుకొచ్చినప్పుడు కూడా, చివరిదాకా పదవుల్లో కొనసాగడమే ఉద్యమానికి మంచిదని కబుర్లు చెబుతూ వారందరినీ వారించారు. మరోవైపు అడపాదడపా విలేకరుల సమావేశం పెట్టి, అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతూ, తానే సమైక్య చాంపియన్ అనిపించుకునే ప్రయత్నం కూడా చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో పార్టీనే ధిక్కరించినట్టు కూడా మాట్లాడినా అధిష్టానం ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇదంతా హస్తిన స్క్రిప్టులో భాగంగానే జరుగుతూ వస్తోందని ఈ పరిణామాలన్నీ నిర్ద్వంద్వంగా రుజువు చేస్తున్నాయి. -
సమైక్యదారిలో వైఎస్సార్ సీపీ
సాక్షి, గుంటూరు: సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. అలుపెరగని పోరులో పార్టీ నేతలు, కార్యకర్తలు భాగస్వామ్యులవుతున్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నాయి. గురువారం ఆయా నియోజకవర్గాల్లో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల్ని వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు దిగ్బంధించి రోడ్డుపైనే వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. సమైక్యతే పార్టీ విధానమంటూ నినదించారు. చిలకలూరిపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చెన్నై హైవేపై ఆందోళన నిర్వహించారు. ఎన్ఆర్టీ సెంటర్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. విభజన విషయంలో కేంద్రం అమానుషంగా వ్యవహరించడంపై మం డిపడ్డారు. కృష్ణా-గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంగళగిరి వద్ద చెన్నై హైవేను దిగ్బంధించి రాస్తారోకో చేసి వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గురజాల నియోజకవర్గంలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాస్తారోకో, వంటా వార్పు నిర్వహించారు. రేపల్లె నియోజకవర్గంలో 214 ఎ జాతీయ రహదారిపై మాజీ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణరావు, లోయ తాండవకృష్ణలు పాల్గొన్నారు. పొన్నూరులోని జీబీసీ రోడ్డుపై బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు వద్ద రావి వెంకటరమణ వంటావార్పు, రాస్తారోకో చేశారు. గుంటూరు నగర కన్వీనరు లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో బుడంపాడు వద్ద చెన్నై హైవేపై సమన్వయకర్తలు షేక్ షౌకత్, నసీర్ అహ్మద్‌లతో కలిసి వంటావార్పు నిర్వహించి రాస్తారోకో చేశారు. తెనాలిలో పార్టీ నాయకుడు అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో గల్లా చందు, రావి వెంకటరమణ, ఆలమూరి విజయలక్ష్మి గుంటూరు-తెనాలి రహదారి దిగ్బంధం తో పాటు వంటావార్పు నిర్వహించారు. తెనాలిలోనే వేమూరు సమన్వయకర్త మేరుగ నాగార్జున పాల్గొన్నారు. విభజన విషయంలో స్పీకర్ మనోహర్ తీరుపై శివకుమార్ ధ్వజమెత్తారు. తెనాలిలో అడుగుపెట్టకుండా పార్టీ శ్రేణులతో కలిసి అడ్డుకుంటామని ప్రతిన బూనారు. నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రావిపాడు రోడ్డుపై వంటా వార్పు జరిగింది. పెదకూరపాడు నియోజకవర్గంలో నూతలపాటి హనుమయ్య ఆధ్వర్యంలో హైదరాబాదు-గుంటూరు హైవేపై బెల్లంకొండ అడ్డరోడ్డు వద్ద వంటావార్పు, ధర్నా చేశారు. వినుకొండ నియోజకవర్గంలో నన్నపనేని సుధ ఆధ్వర్యంలో కర్నూలు-గుంటూరు రోడ్డు దిగ్బంధంతో పాటు వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గంలో గుంటూరు-నరసరావుపేట రోడ్డులో మేడికొండూరు వద్ద సమన్వయకర్తలు ఈపూరి అనూప్, కొల్లిపర రాజేంద్రప్రసాద్, మందపాటి శేషగిరిరావులు రాస్తారోకో చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మండల పార్టీ కన్వీనర్లు ముప్పాళ్ళ వద్ద రాస్తారోకో నిర్వహించారు. -
కర్షక సమరం
కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునకు రైతులు కదంతొక్కారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించి మద్దతు పలికారు. విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు. పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్ వద్ద జాతీయ రహదారిని రైతులు ట్రాక్టర్లతో గంట పాటు దిగ్బంధించారు. అనంతరం కృష్ణానగర్, బిర్లాగేట్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. మంత్రాలయంలో కర్నూలు-రాయచూరు రోడ్డుపై రాకపోకలను స్తంభింపజేశారు. అంతకుముందు పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రదీప్‌రెడ్డి, మండల కన్వీనర్ భీమిరెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. నందికొట్కూరులో బండి జయరాజు, ఐజయ్యల ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ కొనసాగింది. ఆదోనిలో బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్, స్థానిక నాయకులు ప్రసాదరావు, గురునాథరెడ్డి, చంద్రకాంతరెడ్డి, వెంకటేశ్వరరెడ్డిల నాయకత్వంలో చేపట్టిన ర్యాలీలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో గంగాధరరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాం, వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యుడు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో తెర్నేకల్లులో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. డోన్ నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గన రాజారెడ్డి, స్థానిక నాయకులు ధర్మారం సుబ్బారెడ్డి, శ్రీరాములు ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. బనగానపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రబోతుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అవుకు మిట్ట నుంచి పాతబస్టాండ్ మీదుగా పెట్రోల్ బంకు కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. -
జనానికి ఇక్కట్లు
సాక్షి నెట్వర్క్: విద్యుత్ ఉద్యోగుల సమ్మె రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సీమాంధ్రతో పాటు రాష్ట్రంలో పలు ఇతర జిల్లాల్లో కూడా అంధకారం అలముకుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు రైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. పలు రైళ్లను రద్దుచేశారు. వేలాది గ్రామాలకు కరెంట్ సరఫరా ఆగిపోయింది. మోటార్లు పనిచేయక తాగునీటికి ఇక్కట్లు మొదలయ్యాయి. పరిశ్రమల్లో పనులు నిలిచిపోయాయి. ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తిరుమలకు మూడు గంటల సేపు విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఆదివారం అనంతపురం జిల్లాలో 3,235 గ్రామాల్లో, ప్రకాశంలో 1,024 పంచాయతీలు, కర్నూలులో 960, కృష్ణాలో 750 గ్రామాల్లో కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సీమాంధ్ర అంతటా పలు నగరాలు, పట్టణాలు కూడా కోతలతో అల్లాడాయి. తిరుమలలో కూడా మధ్యాహ్నం 1.40 నుంచి సాయంత్రం 4.40 గంటల వరకు 3 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో బ్రహ్మోత్సవాల కోసం వచ్చిన శ్రీవారి భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. టీటీడీ అధికారుల విజ్ఞప్తి మేరకు సాయంత్రం 4.40 తర్వాత తిరుమలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. విజయవాడ నగరంలోనూ పలు ప్రాంతాల్లో 5 గంటల పాటు కోతలు అమలయ్యాయి. ఎన్టీటీపీఎస్ వద్ద బీఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. కనకదుర్గ ఆలయంలో ఆదివారం రాత్రి 8.30 సమయంలో ఒక్కసారిగా చీకట్లు అలముకున్నాయి. జనరేటర్ల సాయంతో భక్తులకు ఇబ్బంది లేకుండా చూశారు. కరెంటు కోత దెబ్బకు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కూడా ఆదివారం ఉదయం పలు విభాగాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు ఫర్నేస్‌లలో ఉత్పత్తి నిలిచిపోయి కోట్లాది రూపాయల ఉత్పత్తికి అంతరాయం కలిగింది. పూర్తిస్థాయి పునరుద్ధరణకు మరో 24 గంటలు పడుతుందని భావిస్తున్నారు. -
ఎంపీ కొడుకులైతే వదిలేస్తారా?
విశాఖ: ఎంపీ కొడుకులైతే చట్టానికి ఏమన్నా చుట్టాలా? అని సమైక్య వాదులు ప్రశ్నిస్తున్నారు. సమైక్య ఉద్యమంలో భాగంగా నిరసన తెలుపుతున్న సమైక్య వాదులపై ఎంపీ హర్షకుమార్ తనయులు దాడికి దిగడాన్ని ఏయూ విద్యార్థులు ఖండించారు. ఎంపీలు కొడుకులైతే వారిని వదిలేస్తరా? అంటూ పోలీసులను నిలదీస్తున్నారు. దీనికి నిరసనగా వారు రేపు విశాఖ బంద్ కు పిలుపునిచ్చారు. హర్షకుమార్ తనయుల్ని వెంటనే అరెస్టు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సమైక్యవాదులపై శనివారం అమలాపురం ఎంపీ హర్షకుమార్ తనయులు దాడి చేశారు. ఎవడురా సమైక్యాంధ్ర అంటోంది అంటూ కర్రలతో వీరంగం సృష్టించారు. అంతేకాకుండా భద్రతా సిబ్బంది కూడా దాడులు చేసేలా ప్రోత్సహించారు. అంతకు ముందు అమలాపురం ఎంపీ హర్షకుమార్ తనయులు సమైక్యవాదులపై దాడికి పాల్పడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనను నిరసిస్తూ రాజమండ్రిలోని హర్షకుమార్కు చెందిన కాలేజ్‌ను సమైక్యవాదులు ముట్టడించారు. ఎంపీకి వ్యతిరేక నినాదాలు చేస్తూ .. కళాశాల ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లారు. దీంతో హర్షకుమార్ తనయులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది .. సమైక్యవాదులపై దాడులకు దిగారు. కర్రలతో కొట్టడంతో, వారు కాలేజీ బస్సులను ధ్వంసం చేశారు. దాడికి నిరసనగా .. సమైక్యవాదులు కళాశాల ప్రాంగణంలో చెత్త వేయడంతో మరోసారి ఘర్షణ చెలరేగింది. ఇరువర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, సమైక్యవాదులపైనే విరుచుకుపడ్డారు. -
రేపటి నుంచి శోభా నాగిరెడ్డి 48 గంటల నిరాహార దీక్ష
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నుంచి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో 48 గంటల నిరాహారదీక్ష చేపడుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత, ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తెలిపారు. సోమవారం ఆమె ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. కేంద్రం సమైక్యాంధ్ర ప్రకటన చేసే వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందన్నారు. సీమాంధ్రుల ఉద్యమాన్ని హేళన చేసి మాట్లాడడం కేసీఆర్‌కు తగదన్నారు. -
‘సమైక్యం’గా పనిచేద్దాం
* సీపీఎంకు వైఎస్సార్ సీపీ ప్రతిపాదన * సీపీఎం నేతల్ని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు * చర్చించి చెబుతామన్న రాఘవులు * పొత్తుల గురించి చర్చించలేదు: మైసూరా * త్వరలో ఎంఐఎం నేతలనూ కలుస్తామన్న నేత సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రకు కట్టుబడి పని చేస్తున్న పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఆ పార్టీ నాయకులు గురువారం సీపీఎం నేతలతో భేటీ అయ్యారు. సమైక్యతపై సూత్రప్రాయంగా అంగీకారమున్న పార్టీలు ఏకమవాల్సిన అవసరాన్ని వారితో నొక్కిచెప్పారు. దీనిపై పార్టీలో చర్చించి తుది నిర్ణయం చెబుతామని సీపీఎం ప్రకటించింది. వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, జూపూడి ప్రభాకరరావు గురువారం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌కు వెళ్లారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావులతో అరగంట సేపు భేటీ అయ్యారు. అనంతరం ఇరు పార్టీల నేతలు విడివిడిగా మీడియాతో మాట్లాడారు. సమన్వయంతో పని చేద్దామన్నాం: మైసూరారెడ్డి ‘‘సమైక్యాంధ్ర కోసం మనసా వాచా పని చేస్తున్న పార్టీల్లో సీపీఎం ఒకటి. అటువంటి పార్టీలతో కలసి సమైక్య ఉద్యమాన్ని నిర్మించేందుకు చేస్తున్న రాజకీయ చర్చల్లో భాగంగా సీపీఎం నేతలను కలిశాం. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని గతంలో కేంద్ర హోంమంత్రి వద్ద జరిగిన సమావేశంలో కూడా వైఎస్సార్సీపీ, సీపీఎం, ఎంఐఎం చెప్పాయి. ఈ నేపథ్యంలో కలసి పని చేసే అంశాన్ని చర్చించేందుకు వచ్చాం. వాళ్లు పార్టీలో చర్చించుకుని చెబుతామన్నారు. ఇవి కేవలం ప్రాథమిక చర్చలే. సమైక్యాంధ్రప్రదేశ్‌కు కట్టుబడిన పార్టీలన్నింటితో చర్చలు జరుపుతున్నాం. సీపీఎం కలసి రావాలని ప్రతిపాదించాం. పొత్తులు, రాజకీయాల గురించి చర్చించలేదు. ఇతర ఊహాగానాలేవీ ప్రస్తావనకూ రాలేదు. ఉద్యమంపైనే చర్చించాం. త్వరలో ఎంఐఎంను కలుస్తాం’’ అని మైసూరా మీడియాకు వివరించా రు. రాబోయే పరిణామాలకు ఇది ప్రారంభమా అని అడగ్గా, ‘మీరు ఎట్లనుకుంటే అట్లా’ అని బదులిచ్చారు. ఉద్యమం తప్ప మిగతా అంశాలేవీ చర్చించలేదని సుబ్బారెడ్డి చెప్పారు. పూర్తిస్థాయిలో చర్చించి చెబుతాం: రాఘవులు ‘‘సమైక్యాంధ్ర కోసం పని చేద్దామని వైఎస్సార్సీపీ ప్రతినిధి వర్గం ప్రతిపాదించింది. మాతో కలసి ఉద్యమంలో కృషి చేస్తే బాగుంటుందన్నారు. కోస్తా, రాయలసీమల్లో మేం మా స్వతంత్ర వైఖరితోనే వెళ్తున్నాం. ఇతర పార్టీలతో కలసి ఇప్పటివరకూ వ్యవహరించలేదు. మాది ప్రత్యేక వైఖరి. మౌలిక సమస్యలపై ఆధారపడి స్వతంత్రంగానే పని చేయాలన్నది ఇప్పటిదాకా మా నిర్ణయం. భాషాప్రయుక్త రాష్ట్రాలుంటేనే లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం బలంగా ఉంటాయి. ఈ మౌలిక విషయాల కోసం, రాష్ట్రాలు బలంగా ఉండాలనే ఉద్దేశంతో మేం సమైక్యతను సమర్థిస్తున్నాం. అంతే తప్ప ఎవరికో ఇబ్బందనో, సమస్యనో చూడడం లేదు. ఆ వైఖరితోనే సాగుతున్నాం. ఇలాంటి భిన్నమైన వైఖరి వల్లే మేమెవరితోనూ కలవలేదు. ఇప్పుడు ఈ ప్రతిపాదన వచ్చింది. పూర్తి స్థాయిలో చర్చించాక దీనిపై నిర్ణయం తెలియజేస్తాం. వైఎస్సార్సీపీ ఇప్పటికే రాజీనామాలు, ఉద్యమాలు చేస్తున్నా మేం స్వతంత్రంగానే ఉద్యమిస్తున్నాం. కానీ కేంద్రం సమస్యను నానబెట్టి రాష్ట్రాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చింది. మారిన పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ వైఖరి కూడా మారింది. మొన్నటిదాకా సమ న్యాయం అన్నవాళ్లు ఇప్పుడు సమైక్యం అంటున్నారు. కాబట్టి వారి ప్రతిపాదనను చర్చించి తగిన సమయంలో నిర్ణయం చెబుతాం. అందుకు నిర్దిష్ట గడువంటూ లేదు. బీజేపీతో కలుస్తున్నట్టు టీడీపీ ఇంకా చెప్పలేదు. 2014 ఎన్నికల గురించి ఇప్పుడే చర్చించడం వసంతం రాకముందే కోకిల కూసినట్టుగా ఉంటుంది. మా కేంద్ర కమిటీ కూడా రాష్ట్రం గురించి చర్చించలేదు. ఏ సిగ్నల్ ఎటు పోతుందో అర్థం కావడం లేదు. మావైపు నుంచి ఎలాంటి రాజకీయ ప్రతిపాదనా లేదు’’ అని రాఘవులు చెప్పారు.