విశాఖ: ఎంపీ కొడుకులైతే చట్టానికి ఏమన్నా చుట్టాలా? అని సమైక్య వాదులు ప్రశ్నిస్తున్నారు. సమైక్య ఉద్యమంలో భాగంగా నిరసన తెలుపుతున్న సమైక్య వాదులపై ఎంపీ హర్షకుమార్ తనయులు దాడికి దిగడాన్ని ఏయూ విద్యార్థులు ఖండించారు. ఎంపీలు కొడుకులైతే వారిని వదిలేస్తరా? అంటూ పోలీసులను నిలదీస్తున్నారు. దీనికి నిరసనగా వారు రేపు విశాఖ బంద్ కు పిలుపునిచ్చారు. హర్షకుమార్ తనయుల్ని వెంటనే అరెస్టు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
సమైక్యవాదులపై శనివారం అమలాపురం ఎంపీ హర్షకుమార్ తనయులు దాడి చేశారు. ఎవడురా సమైక్యాంధ్ర అంటోంది అంటూ కర్రలతో వీరంగం సృష్టించారు. అంతేకాకుండా భద్రతా సిబ్బంది కూడా దాడులు చేసేలా ప్రోత్సహించారు. అంతకు ముందు అమలాపురం ఎంపీ హర్షకుమార్ తనయులు సమైక్యవాదులపై దాడికి పాల్పడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనను నిరసిస్తూ రాజమండ్రిలోని హర్షకుమార్‌కు చెందిన కాలేజ్‌ను సమైక్యవాదులు ముట్టడించారు. ఎంపీకి వ్యతిరేక నినాదాలు చేస్తూ .. కళాశాల ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లారు.
దీంతో హర్షకుమార్ తనయులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది .. సమైక్యవాదులపై దాడులకు దిగారు. కర్రలతో కొట్టడంతో, వారు కాలేజీ బస్సులను ధ్వంసం చేశారు. దాడికి నిరసనగా .. సమైక్యవాదులు కళాశాల ప్రాంగణంలో చెత్త వేయడంతో మరోసారి ఘర్షణ చెలరేగింది. ఇరువర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, సమైక్యవాదులపైనే విరుచుకుపడ్డారు.