ఎంపీ హర్షకుమార్‌కు సమైక్యసెగ
ఉప్పలగుప్తం, న్యూస్‌లైన్: అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్‌ను సమైక్యవాదులు ఘెరావ్ చేశారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి వచ్చిన ఆయనకు ఆదివారం వైఎస్సార్‌సీపీ నేతలు, విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజల నుంచి తీవ్రవ్యతిరేకత ఎదురైంది. ఆయన సభావేదిక వద్దకు రాగానే ‘ఎంపీ గో బ్యాక్, జై సమైక్యాంధ్ర’ అంటూ బిగ్గరగా నినదించారు. ఎంపీ ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేయత్నం చేశారు. అయినప్పటికీ సమైక్యవాదులు వెనక్కితగ్గక మరింత వ్యతిరేక నినాదాలు చేయడంతో అసహనం ప్రదర్శించిన ఎంపీ ఆ తర్వాత ఆందోళనకారులతో మాట్లాడారు. విభజనే జరిగితే అధికార పార్టీకి చెందిన ఎంపీలమంతా అవిశ్వాసానికి ఓటేసి ప్రభుత్వాన్ని పడగొడతామని తనను నమ్మాలని విజ్ఞప్తి చేశారు.
ఎంపీ, మంత్రి ఫొటోల ఫ్లెక్సీ దహనం
గొల్లవిల్లిలో సమైక్యవాదుల నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న హర్షకుమార్ నియోజకవర్గ కేంద్రమైన అమలాపురంలో జరగాల్సిన రచ్చబండకు హాజరుకాలేదు. ఆయన వస్తే అక్కడ కూడా సమైక్య సెగ చూపిద్దామనుకున్న ఆందోళనకారులు ఎంపీ రావడం లేదని తెలిసి ‘తోక ముడిచిన ఎంపీ’అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎంపీ హర్షకుమార్, మంత్రి తోట నరసింహంల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ధ్వంసం చేసి దహనం చేశారు.
ఉపాధ్యాయ ఉద్యమ జేఏసీ ఆవిర్భావం
రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్రప్రదేశ్‌కు మద్దతుగా ఉద్యమించేందుకు ఉపాధ్యాయ ఉద్యమ జేఏసీ ఒంగోలులో ఆవిర్భవించింది. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లాశాఖ కార్యాలయంలో ఆదివారం వివిధ ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో జేఏసీని ఏర్పాటుచేస్తూ తీర్మానించారు. జేఏసీలో ఐదు ఉపాధ్యాయ సంఘాలున్నాయి. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ సర్వేపల్లి ప్రజా ఉపాధ్యాయ సంఘం (ఏపీఎస్‌పీయూఎస్), మైనార్టీ టీచర్స్ అసోసియేషన్ (ఎంటీఏ), రాష్ట్రోపాధ్యాయ సంఘం డెమోక్రటిక్ (ఎస్‌టీయూడీ), రాష్ట్రీయ జాతీయ ఉపాధ్యాయ పరిషత్ (ఆర్‌జేయూపీ) సంఘాలు జేఏసీలో సభ్య సంఘాలుగా ఉన్నాయి. రాష్ట్ర విభజన ప్రకటన మొదట ప్రకటించిన డిసెంబర్ 9వ తేదీని విద్రోహ దినంగా పాటించాలని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ కె.ఓబులాపతి, ఉద్యమ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మెట్టు శంకరరావు పిలుపునిచ్చారు. సీమాంధ్ర 13 జిల్లాల్లోని ఉపాధ్యాయులందరూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలపాలని కోరారు. ఈనెల 10 నుంచి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలకు ఉపాధ్యాయులందరూ హాజరు కావాలని కోరారు.
జేఏసీ కార్యవర్గమిదే..
ఉద్యమ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌గా మెట్టు శంకరరావు (గుంటూరు), రాష్ట్ర కో.కన్వీనర్లుగా మాగంటి శ్రీనివాసరావు (కృష్ణా జిల్లా), టీవీ రమణారెడ్డి (కడప జిల్లా), సీహెచ్ శరత్‌చంద్ర (కృష్ణాజిల్లా), ఎం.మహేశ్వరరావు (ప్రకాశం జిల్లా), సయ్యద్ ఇశాక్ (గుంటూరు జిల్లా)లను ఎన్నుకున్నారు.