సాక్షి, రాజమండ్రి : రాష్ర్ట విభజనతో కడుపు మండి ఆందోళనకు దిగిన సమైక్యవాదులపై ఎంపీ హర్షకుమార్ తనయులు వీరంగం సృష్టించారు. ఉద్యమకారులపై కరల్రతో దాడిచేశారు. దొరికినవారిని దొరికినట్టే చితకబాదారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు ఎంపీకి చెందిన ఆస్తుల విధ్వంసానికి దిగారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శనివారం ఏపీఎన్‌జీఓలు ఇంటర్నేషనల్ పేపర్ మిల్లు దిగ్బంధం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా కొందరు ఎన్‌జీఓలు సమీపంలోని హర్షకుమార్‌కు చెందిన రాజీవ్‌గాంధీ కళాశాల వద్ద రోడ్డుపై రాకపోకలను నిలిపివేయడానికి బారికేడ్లు పెట్టారు. ఓ ఆందోళనకారుడు హర్షకుమార్ రాజీనామా చేయాలంటూ కళాశాల బ్యానర్‌ను స్వల్పంగా చించారు.
కళాశాల సిబ్బంది సమాచారంతో అక్కడికి వచ్చిన హర్షకుమార్ కుమారులు శ్రీరాజ్, సుందర్ సమైక్యవాదుల చేతిలోని జెండాలు లాక్కుని, వాటికున్న కరల్రతో ఉద్యోగులను చితకబాదారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కోనసీమతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన ఎన్‌జీఓలు రాజమండ్రి చేరుకుని కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఆగ్రహం పట్టలేక కళాశాలపై దాడిచేసి విధ్వంసం సృష్టించారు. కాగా, రాజమండ్రిలో హర్ష తనయుల దాడిని నిరసిస్తూ అమలాపురంలో ఎంపీ హర్షకుమార్ క్యాంపు కార్యాలయాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. కార్యాలయంలోనికి చొచ్చుకుపోయేందుకు యత్నించగా పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు.
చింతమనేని ఆగ్రహం
ఏలూరు ఆశ్రం కళాశాల జాతీయ రహదారిపై ఎన్జీవోలు ఉదయం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలివ్వగా, అక్కడే ఉన్న టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారిపై దౌర్జన్యానికి దిగారు. బాబును నిందించడానికి మీరేం సరిపోతారంటూ చింతమనేని ఉద్యోగులను దుర్భాషలాడారు. క్షమాపణ చెప్పాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేసినా చింతమనేని పట్టించుకోకుండా వెళ్లిపోయారు.
టీడీపీ ఎమ్మెల్యేలను తరిమిన సమైక్యవాదులు
అనంతపురం: అనంతపురంలో వైద్య ఆరోగ్య శాఖ జేఏసీ నేతృత్వంలో ఆ శాఖ సిబ్బంది ధర్నా చేశారు. అదే సమయంలో టీడీపీ జిల్లా కార్యాలయానికి వెళుతున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బీకే పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులును గమనించిన ఆందోళనకారులు ‘సీమాంధ్ర ద్రోహులారా ఖబడ్దార్ అంటూ నినాదాలు చేస్తూ వెంటపడ్డారు. దీంతో వారు మరోమార్గం ద్వారా వెళ్లేందుకు యత్నించగా అక్కడా అడ్డుకున్నారు. వాహనాలు దిగి నడుచుకుంటూ వెళుతున్న వారినీ వదలకపోవడంతో ఓ హోటల్‌లోకి వెళ్లి దాక్కున్నారు. వెలుపల ఉద్యోగులు నినాదాలు చేయడంతో వారు పరుగులు తీశారు.