సమైక్య ముసుగులో విభజన వీరులు | chandra babu and kiran kumar reddy play drama for united state | Sakshi
Sakshi News home page

సమైక్య ముసుగులో విభజన వీరులు

Published Sun, Dec 22 2013 1:03 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

సమైక్య ముసుగులో విభజన వీరులు - Sakshi

సమైక్య ముసుగులో విభజన వీరులు

చంద్రబాబు, కిరణ్ అండ్ కో దొంగాటకం
 
 సాక్షి, హైదరాబాద్:రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నప్పుడే రాష్ట్రంలో అంతా ఒక్కటై రాజకీయ సంక్షోభం సృష్టించి ఉంటే కేంద్రం ముందుకు వెళ్లేదా? ప్రజలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సంఘాలన్నీ ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నప్పుడే రాజకీయ పక్షాలన్నీ వారికి అండగా నిలిచి ఉంటే విభజన ప్రక్రియ ముందుకు సాగేదా? సీమాంధ్ర ఉద్యమం రాజకీయ మలుపు తిరగకుండా అడ్డుకునే కుయుక్తిలో భాగంగా కీలక సమయంలో ఉద్యోగ సంఘాల సమ్మెను విరమింపజేయకుండా ఉండి ఉంటే కేంద్రం వెనక్కి తగ్గేది కాదా? ఈ రోజు సీమాంధ్ర సమస్యలంటూ గొంతు చించుకుంటున్న పార్టీలు, వాటి నేతలు ఆ రోజు తెలంగాణకు అనుకూలమంటూ తాము స్వయంగా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోకుండానే విభజనను ఆపుతామంటే విశ్వసించేదెవరు? విభజనను అడ్డుకునే అవకాశాలన్నింటినీ ఒకటొకటిగా ఉద్దేశపూర్వకంగా ‘చేజార్చి’... ఇప్పుడు ‘ఆపి తీరుతాం’ అంటూ ప్రగల్భాలు పలుకుతుంటే ఏమనుకోవాలి? పరిస్థితి ఇంతదాకా రావడానికి కారణమెవరు? విభజనకు కారకులే ఈ రోజు మళ్లీ సమైక్య ముసుగు ధరించి ప్రజలను మరోసారి నట్టేట ముంచడానికి సిద్ధమవుతున్నారా? విభజనకు అంగీకరించిన వాళ్లు, ఆ ప్రక్రియను సాఫీగా ముందుకు నడుపుతున్న వాళ్లే కొత్తగా సమైక్య రాగమెత్తుకుంటే... సమైక్యోద్యమాన్ని భుజాన మోస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్లే సదరు ముసుగు దొంగలకు హారతి పడుతున్నారా? ముఖం చెల్లని వారికి ముసుగులు కప్పి ఒక వేదికను సిద్ధం చేస్తున్నారా? జరుగుతున్న పరిణామాల క్రమం చూస్తుంటే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి.
 
 

సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక తాజాగా నిర్వహించిన సమావేశం ఇదే పరిస్థితికి అద్దం పడుతోంది. ఒకవైపు సీఎం కిరణ్, మరోవైపు విపక్ష నేత చంద్రబాబు.. అడుగడుగునా వారిద్దరి కనుసన్నల్లో నడుస్తున్నారంటూ మొదటి నుంచీ విమర్శలను ఎదుర్కొంటున్న సమైక్యోద్యమ సంధానకర్తలు... ఇలా కీలక వ్యక్తులంతా నాలుగున్నర నెలలుగా కలసికట్టుగా ఆడుతున్న నాటకాలకు తాజా పరిణామాలన్నీ పరాకాష్టేనని భావిస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ చిత్తశుద్ధితో అవిశ్రాంత పోరాటం చేస్తున్న పార్టీలను, సమైక్య ముసుగులో విభజనవాదంతో ముందుకు పోతున్న కుహనా పార్టీలను కడుతున్న ఈ వేదిక తీరును సమైక్యవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు.
 
 

సమైక్య ఉద్యమ పరిరక్షణ వేదిక శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న పార్టీలను, వాటి తీరుతెన్నులను గమనిస్తే.. విభజన విషయంలో సీమాంధ్ర ప్రజలను తొలినుంచీ పథకం ప్రకారం మోసగిస్తూ వస్తున్న శక్తులే మరోసారి కుహనావాదంతో వారి ముందుకెళ్లడానికి మరో దారి ఏర్పాటు చేసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. సమైక్యం కోసం ముందు నుంచీ చిత్తశుద్ధితో పోరాడుతున్న పార్టీలతో వేదిక ఏర్పాటు చేసి, మిగతా పార్టీలను కూడా దాని మార్గంలోకి కలుపుకుపోయేలా ఒత్తిడి చేయాల్సి ఉండగా... శనివారం వేదిక పేరుతో జరిగిన పరిణామాలన్నీ అందుకు పూర్తి భిన్నంగానే సాగాయి. తొలి నుంచీ సమైక్యం కోసం పోరాడుతున్న పార్టీలను కాదని, విభజనవాద పార్టీల కలయికతో ‘సమైక్య’ వేదికను ఏర్పాటు చేసుకోవాలన్న విచిత్ర ప్రయత్నంలో తాజాగా అఖిలపక్షం ద్వారా తొలి అడుగు పడినట్టు చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం... ఈ 3 పార్టీలే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మొదటి నుంచీ ముక్త కంఠంతో కోరుతున్నాయి. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు కూడా సమైక్య రాష్ట్రాన్నే కోరుతున్న నేపథ్యంలో ఈ మూడు పార్టీలకు తోడు ఒక్కో పార్టీనీ సమైక్య బాటలోకి తీసుకొచ్చి ఉంటే మూడు పార్టీలు కాస్తా నాలుగు, తర్వాత ఐదు పార్టీలు... ఇలా సమైక్యానికి మద్దతు నానాటికీ పెరిగేది. అలా ప్రజల అభిమతానికి అనుగుణంగా ముందుకొచ్చి ఉంటే ఈ రోజు విభజన ప్రక్రియ ఇంతగా ముందుకు సాగేదే కాదు. కానీ గడిచిన ఐదు నెలలుగా ఏ రాజకీయ పార్టీలైతే విభజన కావాలని కోరాయో, సరిగ్గా ఆ పార్టీలే ఇప్పుడు సమైక్య చాంపియన్లుగా ప్రజల ముందుకు వెళ్లడానికి ముసుగు ధరించే ఎత్తుగడకు పదును పెడుతున్నాయి. నిజానికి హస్తిన పెద్దల డెరైక్షన్ మేరకు రాష్ట్ర విభజన ప్రక్రియను మరింత సాఫీగా, త్వరితంగా పూర్తి చేయించే లక్ష్యంతో పాటు ఎలాగోలా సీమాంధ్ర ప్రజల్లోకి వెళ్లడానికి మార్గం ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని తెలుస్తోంది.
 
 రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ తీర్మానం చేసినప్పటి నుంచి ఐదు నెలలుగా విభజన ప్రక్రియలో కేంద్రం ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు టీడీపీ అధినేత కూడా ఈ విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో కేంద్రానికి సంపూర్ణంగా సహకరిస్తూనే వస్తున్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామంటూ కేంద్రానికి ఏకంగా లేఖే ఇచ్చిన చంద్రబాబు, సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడ్డ మరుక్షణమే, ‘సీమాంధ్రలో కొత్త రాజధానికి కేంద్రమే నిధులు మంజూరు చేయాలి’ అంటూ డిమాండ్ ఎత్తుకున్నారు.
 
 కిరణ్ కూడా అంతర్గతంగా అధిష్టానం ఆదేశాలను పాటిస్తూనే, సమైక్య చాంపియన్‌గా తనకు తాను ముద్ర వేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. కేంద్రం విభజన యత్నాలను ఏ దశలోనూ నిలువరించే ప్రయత్నం చేయని ఈ నాయకులు... ఇప్పుడు సమైక్య చాంపియన్లమనే ముద్ర కోసం చేస్తున్న ప్రయత్నాల్లో తాజా వేదిక భాగమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం విభజన నిర్ణయం తీసుకుని నాలుగున్నర నెలలు దాటుతుండగా, సమైక్యాంధ్ర కోసం రాజకీయ పార్టీలన్నింటినీ కలిపి ఒక వేదిక నిర్మించాలన్న డిమాండ్‌ను ఇన్ని రోజుల్లోనూ ఏ సందర్భంలోనూ కాంగ్రెస్, టీడీపీ ఏనాడూ పట్టించుకోలేదు. పైగా ఆ దిశగా కొందరు చేసిన ప్రయత్నాలను విఫలం చేయడానికి ఈ రెండు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డాయి! సమైక్యం కోసం కట్టుబడ్డారన్న క్రెడిట్ మరో పార్టీకి గానీ, ఇంకో నాయకుడికి గానీ దక్కకూడదన్న లక్ష్యంతోనే ఆ రెండు పార్టీల నేతలూ వ్యవహరిస్తూ వచ్చారు. పైగా నిజానికి రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్నదే ఆ రెండు పార్టీలు! తెలంగాణకు కట్టుబడి ఉన్నామంటూ లేఖ ఇచ్చింది టీడీపీ అయితే, ఆ లేఖకు అనుగుణంగానే రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకున్నది అధికార కాంగ్రెస్ పార్టీ! పైగా తమ తమ నిర్ణయాలకు కట్టుబడే ఉన్నామంటూ ఆ పార్టీలు నాలుగు నెలలుగా ప్రకటిస్తూనే ఉన్నాయి.
 
 నిప్పులపై నీళ్లు చల్లి...
 
 సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటు తీర్మానం తర్వాత రాష్ట్ర ప్రజల్లో సమైక్యోద్యవుం ఒక్కసారిగా పెల్లుబుకింది. ఊరూవాడా ఏకమై దాదాపు రెండు నెలలపాటు ఉద్యమించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలన్నీ అందులో పూర్తిగా చేరిపోయాయి. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న ఆ తరుణంలో అధికార కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ఉద్యవుంలోకి రాజకీయు పార్టీలు చేరి దాని ఉధృతిని వురింత పెంచాలని వైఎస్సార్‌సీపీ వంటి పార్టీలు పిలుపునిచ్చినా కాంగ్రెస్, టీడీపీ అందుకు ముందుకు రాలేదు. ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం ద్వారా సంక్షోభం ఏర్పడుతుందని, తద్వారా కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని వైఎస్సార్‌సీపీ ఒక ప్రతిపాదనతో ముందుకొచ్చినప్పుడు కూడా ఆ రెండు పార్టీలు అసలే కలిసిరాలేదు.
 
 పైగా రాజీనామాలు చేస్తే అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకోలేమని, కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ రాజీనామాలు చేయొద్దని చెబుతూ కిరణ్ వ్యూహాత్మకంగాా వారిని వారించారు. అసెంబ్లీకి వచ్చే తీర్మానాన్ని అడ్డుకుంటామని ముఖ్యమంత్రే చెప్పడంతో అప్పట్లో ఉధృతంగా ఉద్యమం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు సైతం... రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని, సీఎం చెప్పినట్టు అసెంబ్లీకొచ్చే తీర్మానాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. తీరా విభజన బిల్లు తీర్మానం కోసం కాకుండా కేవలం అభిప్రాయం కోసం మాత్రమే అసెంబ్లీకి వచ్చింది. దాంతో మళ్లీ కొత్త రాగం అందుకున్నారు.

 

ఇలా విభజన బిల్లు విషయంలో అడుగడుగునా దాన్ని అడ్డుకునే అవకాశాలన్నింటినీ ఒక్కొక్కటిగా కావాలనే వదిలేసి... ఇప్పుడు బిల్లును అసెంబ్లీ చర్చకు చేపట్టిన తరుణంలో మరో కొత్త ఎత్తుగడలో భాగంగానే ఇలా వేదికను తెరపైకి తెస్తున్నారన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ యత్నానికి శనివారం జరిగిన భేటీ కేవలం ఆరంభం మాత్రమేనంటున్నారు. కాంగ్రెస్, టీడీపీల్లోని ప్రధాన విభజనవాదులు ఇంతకాలం విభజనకు అనుకూలంగా వ్యవహరించిన నేపథ్యంలో సీమాంధ్రలో అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడం, మరోవైపు ఎన్నికలు ముంచుకొస్తుండటంతో... ఆ విభజన వాదులే ఇప్పుడిలా సమైక్య ముసుగు ధరించి ప్రజల్లోకి వెళ్లడానికి మార్గం ఏర్పాటు చేసుకుంటున్నారని తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి.
 
 
 కాదంటే... ఔననే!
 కాంగ్రెస్, టీడీపీలు సమైక్యమంటూ మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ కేంద్రం ఏదో రకంగా విభజన అంకంలో ఒక అడుగు ముందుకు వేస్తూ వస్తోంది! సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత జరిగిన పరిణామ క్రమమంతా అదే రీతిలో సాగింది. విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర పడగానే సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను కిరణ్ విరమింపజేశారు. రాజీనామాలు చేస్తామంటూ ఎమ్మెల్యేలంతా ముందుకొచ్చినప్పుడు కూడా, చివరిదాకా పదవుల్లో కొనసాగడమే ఉద్యమానికి మంచిదని కబుర్లు చెబుతూ వారందరినీ వారించారు. మరోవైపు అడపాదడపా విలేకరుల సమావేశం పెట్టి, అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతూ, తానే సమైక్య చాంపియన్ అనిపించుకునే ప్రయత్నం కూడా చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో పార్టీనే ధిక్కరించినట్టు కూడా మాట్లాడినా అధిష్టానం ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇదంతా హస్తిన స్క్రిప్టులో భాగంగానే జరుగుతూ వస్తోందని ఈ పరిణామాలన్నీ నిర్ద్వంద్వంగా రుజువు చేస్తున్నాయి.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement