* సీపీఎంకు వైఎస్సార్ సీపీ ప్రతిపాదన
* సీపీఎం నేతల్ని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు
* చర్చించి చెబుతామన్న రాఘవులు
* పొత్తుల గురించి చర్చించలేదు: మైసూరా
* త్వరలో ఎంఐఎం నేతలనూ కలుస్తామన్న నేత
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రకు కట్టుబడి పని చేస్తున్న పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఆ పార్టీ నాయకులు గురువారం సీపీఎం నేతలతో భేటీ అయ్యారు. సమైక్యతపై సూత్రప్రాయంగా అంగీకారమున్న పార్టీలు ఏకమవాల్సిన అవసరాన్ని వారితో నొక్కిచెప్పారు. దీనిపై పార్టీలో చర్చించి తుది నిర్ణయం చెబుతామని సీపీఎం ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, జూపూడి ప్రభాకరరావు గురువారం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌కు వెళ్లారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావులతో అరగంట సేపు భేటీ అయ్యారు. అనంతరం ఇరు పార్టీల నేతలు విడివిడిగా మీడియాతో మాట్లాడారు.
సమన్వయంతో పని చేద్దామన్నాం: మైసూరారెడ్డి
‘‘సమైక్యాంధ్ర కోసం మనసా వాచా పని చేస్తున్న పార్టీల్లో సీపీఎం ఒకటి. అటువంటి పార్టీలతో కలసి సమైక్య ఉద్యమాన్ని నిర్మించేందుకు చేస్తున్న రాజకీయ చర్చల్లో భాగంగా సీపీఎం నేతలను కలిశాం. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని గతంలో కేంద్ర హోంమంత్రి వద్ద జరిగిన సమావేశంలో కూడా వైఎస్సార్‌సీపీ, సీపీఎం, ఎంఐఎం చెప్పాయి. ఈ నేపథ్యంలో కలసి పని చేసే అంశాన్ని చర్చించేందుకు వచ్చాం. వాళ్లు పార్టీలో చర్చించుకుని చెబుతామన్నారు. ఇవి కేవలం ప్రాథమిక చర్చలే. సమైక్యాంధ్రప్రదేశ్‌కు కట్టుబడిన పార్టీలన్నింటితో చర్చలు జరుపుతున్నాం. సీపీఎం కలసి రావాలని ప్రతిపాదించాం. పొత్తులు, రాజకీయాల గురించి చర్చించలేదు. ఇతర ఊహాగానాలేవీ ప్రస్తావనకూ రాలేదు. ఉద్యమంపైనే చర్చించాం. త్వరలో ఎంఐఎంను కలుస్తాం’’ అని మైసూరా మీడియాకు వివరించా రు. రాబోయే పరిణామాలకు ఇది ప్రారంభమా అని అడగ్గా, ‘మీరు ఎట్లనుకుంటే అట్లా’ అని బదులిచ్చారు. ఉద్యమం తప్ప మిగతా అంశాలేవీ చర్చించలేదని సుబ్బారెడ్డి చెప్పారు.
పూర్తిస్థాయిలో చర్చించి చెబుతాం: రాఘవులు
‘‘సమైక్యాంధ్ర కోసం పని చేద్దామని వైఎస్సార్‌సీపీ ప్రతినిధి వర్గం ప్రతిపాదించింది. మాతో కలసి ఉద్యమంలో కృషి చేస్తే బాగుంటుందన్నారు. కోస్తా, రాయలసీమల్లో మేం మా స్వతంత్ర వైఖరితోనే వెళ్తున్నాం. ఇతర పార్టీలతో కలసి ఇప్పటివరకూ వ్యవహరించలేదు. మాది ప్రత్యేక వైఖరి. మౌలిక సమస్యలపై ఆధారపడి స్వతంత్రంగానే పని చేయాలన్నది ఇప్పటిదాకా మా నిర్ణయం.
భాషాప్రయుక్త రాష్ట్రాలుంటేనే లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం బలంగా ఉంటాయి. ఈ మౌలిక విషయాల కోసం, రాష్ట్రాలు బలంగా ఉండాలనే ఉద్దేశంతో మేం సమైక్యతను సమర్థిస్తున్నాం. అంతే తప్ప ఎవరికో ఇబ్బందనో, సమస్యనో చూడడం లేదు. ఆ వైఖరితోనే సాగుతున్నాం. ఇలాంటి భిన్నమైన వైఖరి వల్లే మేమెవరితోనూ కలవలేదు. ఇప్పుడు ఈ ప్రతిపాదన వచ్చింది. పూర్తి స్థాయిలో చర్చించాక దీనిపై నిర్ణయం తెలియజేస్తాం. వైఎస్సార్‌సీపీ ఇప్పటికే రాజీనామాలు, ఉద్యమాలు చేస్తున్నా మేం స్వతంత్రంగానే ఉద్యమిస్తున్నాం. కానీ కేంద్రం సమస్యను నానబెట్టి రాష్ట్రాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చింది. మారిన పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ వైఖరి కూడా మారింది.
మొన్నటిదాకా సమ న్యాయం అన్నవాళ్లు ఇప్పుడు సమైక్యం అంటున్నారు. కాబట్టి వారి ప్రతిపాదనను చర్చించి తగిన సమయంలో నిర్ణయం చెబుతాం. అందుకు నిర్దిష్ట గడువంటూ లేదు. బీజేపీతో కలుస్తున్నట్టు టీడీపీ ఇంకా చెప్పలేదు. 2014 ఎన్నికల గురించి ఇప్పుడే చర్చించడం వసంతం రాకముందే కోకిల కూసినట్టుగా ఉంటుంది. మా కేంద్ర కమిటీ కూడా రాష్ట్రం గురించి చర్చించలేదు. ఏ సిగ్నల్ ఎటు పోతుందో అర్థం కావడం లేదు. మావైపు నుంచి ఎలాంటి రాజకీయ ప్రతిపాదనా లేదు’’ అని రాఘవులు చెప్పారు.
‘సమైక్యం’గా పనిచేద్దాం
Published Fri, Sep 27 2013 2:19 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement
Advertisement