సమైక్యదారిలో వైఎస్సార్ సీపీ
సాక్షి, గుంటూరు: సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. అలుపెరగని పోరులో పార్టీ నేతలు, కార్యకర్తలు భాగస్వామ్యులవుతున్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నాయి. గురువారం ఆయా నియోజకవర్గాల్లో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల్ని వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు దిగ్బంధించి రోడ్డుపైనే వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. సమైక్యతే పార్టీ విధానమంటూ నినదించారు.
చిలకలూరిపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చెన్నై హైవేపై ఆందోళన నిర్వహించారు. ఎన్‌ఆర్టీ సెంటర్‌లో పెద్ద ఎత్తున కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. విభజన విషయంలో కేంద్రం అమానుషంగా వ్యవహరించడంపై మం డిపడ్డారు. కృష్ణా-గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంగళగిరి వద్ద చెన్నై హైవేను దిగ్బంధించి రాస్తారోకో చేసి వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గురజాల నియోజకవర్గంలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాస్తారోకో, వంటా వార్పు నిర్వహించారు. రేపల్లె నియోజకవర్గంలో 214 ఎ జాతీయ రహదారిపై మాజీ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణరావు, లోయ తాండవకృష్ణలు పాల్గొన్నారు. పొన్నూరులోని జీబీసీ రోడ్డుపై బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు వద్ద రావి వెంకటరమణ వంటావార్పు, రాస్తారోకో చేశారు. గుంటూరు నగర కన్వీనరు లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో బుడంపాడు వద్ద చెన్నై హైవేపై సమన్వయకర్తలు షేక్ షౌకత్, నసీర్ అహ్మద్‌లతో కలిసి వంటావార్పు నిర్వహించి రాస్తారోకో చేశారు. తెనాలిలో పార్టీ నాయకుడు అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో గల్లా చందు, రావి వెంకటరమణ, ఆలమూరి విజయలక్ష్మి గుంటూరు-తెనాలి రహదారి దిగ్బంధం తో పాటు వంటావార్పు నిర్వహించారు. తెనాలిలోనే వేమూరు సమన్వయకర్త మేరుగ నాగార్జున పాల్గొన్నారు. విభజన విషయంలో స్పీకర్ మనోహర్ తీరుపై శివకుమార్ ధ్వజమెత్తారు.
తెనాలిలో అడుగుపెట్టకుండా పార్టీ శ్రేణులతో కలిసి అడ్డుకుంటామని ప్రతిన బూనారు. నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రావిపాడు రోడ్డుపై వంటా వార్పు జరిగింది. పెదకూరపాడు నియోజకవర్గంలో నూతలపాటి హనుమయ్య ఆధ్వర్యంలో హైదరాబాదు-గుంటూరు హైవేపై బెల్లంకొండ అడ్డరోడ్డు వద్ద వంటావార్పు, ధర్నా చేశారు. వినుకొండ నియోజకవర్గంలో నన్నపనేని సుధ ఆధ్వర్యంలో కర్నూలు-గుంటూరు రోడ్డు దిగ్బంధంతో పాటు వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గంలో గుంటూరు-నరసరావుపేట రోడ్డులో మేడికొండూరు వద్ద సమన్వయకర్తలు ఈపూరి అనూప్, కొల్లిపర రాజేంద్రప్రసాద్, మందపాటి శేషగిరిరావులు రాస్తారోకో చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మండల పార్టీ కన్వీనర్లు ముప్పాళ్ళ వద్ద రాస్తారోకో నిర్వహించారు.