
పల్నాడు, సాక్షి: వైఎస్సార్‌సీపీ మర్రి రాజశేఖర్‌ని ఏనాడూ మోసం చేయలేదని, పైగా ఉన్నత స్థానాలు ఇచ్చి గౌరవించిందని మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ ఇంఛార్జి విడదల రజిని గుర్తు చేశారు. పార్టీని వీడే క్రమంలో వైఎస్సార్‌సీపీపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేసిన విమర్శలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మర్రి రాజశేఖర్ నిన్న పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్‌సీపీలో తనకు గౌరవం దక్కలేదని, పదవులు దక్కలేదని అన్నారు. 2004లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మర్రి కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రచారం చేశారు. వైఎస్సార్‌సీపీలో చేరాక ఆయనకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 2014 ఎన్నికల్లో ఓడినా సరే.. ఆయనను ఆ బాధ్యతల్లో కొనసాగించారు. వైఎస్ కుటుంబం మర్రి రాజశేఖర్‌కు ఎంతో గౌరవం ఇచ్చింది. వైఎస్సార్సీపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది.
పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. రెడ్ బుక్ పేరుతో పాలన జరుగుతున్నప్పుడు మర్రి రాజశేఖర్ తన గొంతుక వినిపించి ఉంటే గౌరవం పెరిగి ఉండేది. కానీ, ఆయన అలా చేయలేదు. ఒకవేళ.. మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదం పొందితే ఆ సీటు టీడీపీ ఖాతాలోకే వెళ్తుంది. విమర్శించే ముందు మర్రి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. వైఎస్సార్‌సీపీ ఆయన్ని మోసం చేయలేదు. ఉన్నత పదవులతో గౌరవించింది అని విడదల రజిని అన్నారు.

.. 2019 ఎన్నికల టైంలో నాకు పోటీ చేసే అవకాశం దక్కింది. ఆ సమయంలో పార్టీలో అంతర్గతంగా ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2024లో చిలకలూరి పేట నుంచి పోటీ చేయలేకపోవడం నా దురదృష్టంగా భావించా. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి చెబితేనే పోటీ చేశాను. తిరిగి చిలకలూరిపేటకు తిరిగి ఆయన పంపిస్తేనే వచ్చా. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను కాబట్టే ఆ పనులన్నీ చేశా. పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను పాటించడం మాత్రమే నాకు తెలుసు అని అన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment