
వైఎస్ఆర్ సీపీ నేత మర్రి రాజశేఖర్
సాక్షి, గుంటూరు: ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హత్యా రాజకీయాలు చేస్తున్నారని, అన్యాయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే హత్యలకు సైతం వెనుకాడటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలుకలూరిపేట సమన్వయకర్త మర్రి రాజశేఖర్ మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిలకలూరిపేటలో నిర్వహించిన బహిరంగసభలో మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. మంత్రి పుల్లారావు అక్రమాలను ఎండగట్టారు. పుల్లారావు హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి అని, తనను ప్రశ్నించిన వారిని హత్య చేయించేందుకు వెనుకాడటం లేదన్నారు. మంత్రి అవినీతి, అక్రమాలపై వార్తలు రాస్తే శంకర్ అనే విలేకరిని హత్యచేయించారని ఆరోపించారు. మరో విలేకరి సురేంద్రపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారని చెప్పారు.
పుల్లారావు భార్య స్థానికంగా మంత్రిగా చెలామణి అవుతున్నారని తెలిపారు. చిలుకలూరిపేటలో మంత్రి పుల్లారావు అరాచకాలకు అంతే లేదన్నారు. పుల్లారావుతో పాటు ఆయన భార్య కూడా తానేం మంత్రి హోదాకు తక్కువ కాదన్నట్లుగా వ్యవహరించడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. చివరకు ఇక్కడ టపాసులు అమ్మాలన్నా పుల్లారావుకు కప్పం కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మంత్రి పుల్లారావుకు రోజులు దగ్గర పడ్డాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్థానికల ప్రజలనుద్దేశించి వైఎస్ఆర్ సీపీ నేత మర్రి రాజశేఖర్ ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment