విలేకరులపై దాడి దుర్మార్గం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
గుంటూరు రూరల్ : ప్రాణాలకు సైతం తెగించి ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు నిత్యం కృషి చేసే విలేకరులపై ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తన అనుచరులతో దాడి చేయటం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. సోమవారం అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విప్ జారీ చేసేందుకు పార్టీ నాయకులు, సమాచారం మేరకు విలేకరులు అక్కడికి వచ్చారని, విప్ ఇవ్వలేదని అబద్ధం ఆడేందుకు తన మనుషులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఇటువంటి హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విప్‌ను అందుకోవాల్సి వస్తుందనే భయంతో జలీల్‌ఖాన్ ఈ విధంగా మతిస్థిమితం లేని పనులు చేస్తున్నాడన్నారు.
ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి ఇటువంటి వికృత చర్యలకు పాల్పడుతున్న జలీల్‌ఖాన్, అతని అనుచరులపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా విలేకరులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విప్‌ను జారీ చేసేందుకు వచ్చిన వారిపై దాడి చేయటం, ఆపై వారిపై కేసులు పెట్టి నమోదు చేయించటం విప్‌ను అందుకున్నానని జలీల్ ఖాన్ చెప్పకనే చెప్పినట్టని తెలిపారు. విప్‌ను అందుకున్నారని చెప్పటానికి జలీల్‌ఖాన్ పెట్టిన కేసు ప్రధాన ఆధారమన్నారు. నిజాన్ని రాసేందుకు ప్రజలకోసం పోరాడే విలేకరులపై దాడి జరిగిందంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంటగలిసినట్టేనని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.