కేసీఆర్‌కు లొంగిపోయిన చంద్రబాబు
* అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ప్రశ్నించే ధైర్యం లేదు
* కేసుల భయంతో బీజేపీతో టీడీపీ పొత్తులు
* దీక్ష విరమణ సభలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
చిలకలూరిపేట రూరల్ : కేసీఆర్‌కు లొంగిపోయిన చంద్రబాబు తెలంగాణలో చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపై ప్రశ్నించలేకపోతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు.
కర్నూలులో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న జలదీక్షకు మద్దతుగా పట్టణంలోని కళామందిర్ సెంటర్‌లో మంగళవారం జరిగిన నిరాహారా దీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పాలమూరు, డిండీ పథకాలకు అనుమతులు లేకుండా తెలంగాణలో నిర్మిస్తుంటే పాలకులు అడ్డుకోవాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తుంటే ప్రజలను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు అక్కడ ఉంటే జైల్లో పెడతారని భయపడి విజయవాడకు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లొంగిపోయి అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ప్రశ్నించే ధైర్యం చంద్రబాబు చేయటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో విభేదించి బయటకు వస్తే కేసులు పైన పడతాయని పొత్తు కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోని పక్షంలో భవిష్యత్‌లో సాగు భూములు బీడుగా మారే ప్రమాదం ఉందన్నారు. వాస్తవాలు గమనించి నీటి కోసం వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటానికి రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలపాలని కోరారు.
అంతకుముందు రాజశేఖర్‌కు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా నిమ్మరసం అందించి నిరాహార దీక్షను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు అడుసుమల్లి ప్రతాప్‌కుమార్, న్యాయవాది చిట్టిబాబు, కౌన్సిలర్‌లు అబ్దుల్ రౌఫ్, నాయుడు శ్రీనివాసరావు, సాపా సైదావలి, మాజీ కౌన్సిలర్‌లు గాలిబ్‌షా, నిడమానూరు హనుమంతరావు, వైఎస్సార్ సీపీ యువజన నాయకులు వేజెర్ల కోటేశ్వరరావు, సాతులూరు కోటి, మైనార్టీ నాయకులు అబ్దుల్లా బాషా, బేరింగ్ మౌలాలి, బాలకోటి నాయక్, కుప్పాల శంకర్, నాంపల్లి రాము, యిర్రి రాఘవ, రఫానీ, చిన్నా, హిదయతుల్లా, తదితరులు పాల్గొన్నారు.
జగన్ వెంటే జనం...
అధికార పార్టీ ప్రలోభాలకు ఎంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళినా ప్రజలు జగన్ వెంటే ఉన్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా అన్నారు. దీక్ష విరమణ అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు.