కర్షక సమరం
కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునకు రైతులు కదంతొక్కారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించి మద్దతు పలికారు. విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు. పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్ వద్ద జాతీయ రహదారిని రైతులు ట్రాక్టర్లతో గంట పాటు దిగ్బంధించారు. అనంతరం కృష్ణానగర్, బిర్లాగేట్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.
మంత్రాలయంలో కర్నూలు-రాయచూరు రోడ్డుపై రాకపోకలను స్తంభింపజేశారు. అంతకుముందు పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రదీప్‌రెడ్డి, మండల కన్వీనర్ భీమిరెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. నందికొట్కూరులో బండి జయరాజు, ఐజయ్యల ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ కొనసాగింది. ఆదోనిలో బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్, స్థానిక నాయకులు ప్రసాదరావు, గురునాథరెడ్డి, చంద్రకాంతరెడ్డి, వెంకటేశ్వరరెడ్డిల నాయకత్వంలో చేపట్టిన ర్యాలీలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో గంగాధరరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు.
ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాం, వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యుడు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో తెర్నేకల్లులో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. డోన్ నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గన రాజారెడ్డి, స్థానిక నాయకులు ధర్మారం సుబ్బారెడ్డి, శ్రీరాములు ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. బనగానపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రబోతుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అవుకు మిట్ట నుంచి పాతబస్టాండ్ మీదుగా పెట్రోల్ బంకు కూడలి వరకు ర్యాలీ చేపట్టారు.