gauru venkat reddy
-
గౌరు వర్సెస్ మాండ్ర: బావా బామ్మర్దుల మధ్య పెరిగిన దూరం
బావబామ్మర్దులైన గౌరు వెంకటరెడ్డి, మాండ్ర శివానందరెడ్డి మధ్య దూరం పెరిగిందా? టీడీపీ అధిష్టానం మాండ్రను పూర్తిగా పక్కన పెట్టిందా? మాండ్ర కారణంగా తాను రాజకీయంగా నష్టపోయానని గౌరు తన బావ, సోదరితో వాదనకు దిగారా? మాండ్ర జిల్లా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయారా? ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. గౌరు వెంకటరెడ్డి, మాండ్ర శివానందరెడ్డి మధ్య మాటలు లేవని, దూరం పెరిగిందని వారి సన్నిహితులే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, కర్నూలు విభేదాలకు ఇదీ కారణం.. టీడీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా కొన్ని నెలల క్రితం గౌరు వెంకటరెడ్డిని ఆ పార్టీ నియమించింది. ఈ నియామకంపై టీడీపీ తరఫున నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాండ్ర శివానందరెడ్డికి అధిష్టానం మాటమాత్రం కూడా చెప్పలేదు. దీంతో పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని మాండ్ర గమనించారు. గత నెల 18న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి రాగా.. మాండ్ర గైర్హాజరయ్యారు. పైగా గౌరు ఇంటికి కూడా వెళ్లడం మానేశారు. ఇటీవల మాండ్ర, గౌరు కుటుంబాల మధ్య వాదులాట కూడా జరిగినట్లు తెలుస్తోంది. మాండ్ర వైఖరితో తీవ్రంగా నష్టపోయామనే భావనలో గౌరు మాండ్ర శివానందరెడ్డి డీఎస్పీగా ఉంటూ 2014 ఎన్నికల సమయంలో వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల వరకూ వైఎస్సార్సీపీ మద్దతుదారుడిగా కొనసాగారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరి, నందికొట్కూరు ఇన్చార్జ్గా పనిచేశారు. దీంతో బావబామ్మర్దులు అధికార, విపక్షపార్టీలో కొనసాగారు. అయితే పార్టీలు వేరైనా ఇద్దరూ సయోధ్యతో రాజకీయాలు నడిపారు. ఇదే గౌరు వెంకటరెడ్డికి మైనస్‌గా మారింది. 2017లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తనను అభ్యర్థిగా టీడీపీ ప్రకటిస్తోందని గౌరుతో మాండ్ర చెప్పారు. స్థానిక సంస్థలలో వైఎస్సార్సీపీకి మెజార్టీ సభ్యులు ఉన్నారు. దీంతో ఆ పార్టీ గౌరు వెంకటరెడ్డిని బరిలోకి దించాలని భావించింది. అయితే ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా బలంగా లేమని, టీడీపీ ప్రలోభాలతో ఫలితం వ్యతిరేకంగా ఉండే ప్రమాదముందని వైఎస్సార్సీపీ అభ్యర్థి బరిలో లేకుండా ఉండే ప్రయత్నం గౌరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మాండ్రను కాకుండా కేఈ ప్రభాకర్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో తాను పోటీ చేస్తానని గౌరు ముందుకొచ్చారు. అప్పటికే ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో గౌరు రాజకీయ విలువలకు పాతరేసి బావకు సహకరించారని అప్పట్లో తీవ్ర చర్చ నడిచింది. ఇదే గౌరు రాజకీయ పతనానికి నాంది పలికింది. ఆపై వైఎస్సార్సీపీలో టిక్కెట్ దక్కకపోవడంతో మాండ్ర సూచనలతో టీడీపీలో చేరారు. పాణ్యం నుంచి గౌరు చరిత పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు నంద్యాల ఎంపీగా పోటీ చేసి మాండ్ర పరాజయం పొందారు. పరస్పరం మాటల యుద్ధం ‘మీ మాటలు విని రాజకీయంగా నష్టపోయా. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి, ఇప్పుడు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆ రోజు మీరు ఒత్తిడి చేయకపోయి ఉంటే నా రాజకీయ భవిష్యత్ మరోలా ఉండేది. మీరు నన్ను నాశనం చేశారు?’ అని గౌరు ఆగ్రహం వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. దీనికి మాండ్ర, అలాగే గౌరు సోదరి కూడా తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ‘రాజకీయంగా నీ ఎదుగుదల కోసం అన్ని విధాలా ఎంతో సాయం చేశాం. అవి మరిచి మాపైనే నిందలు మోపుతావా?’ అని గట్టిగా నిలదీసినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల వాదోపవాదనల నేపథ్యంలో మాండ్ర పూర్తిగా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి దూరమయ్యారు. హైదరాబాద్ నుంచి కర్నూలుకు రాని పరిస్థితి. చివరకు నారా లోకేశ్ వచ్చినా గైర్హాజరయ్యారంటే పరిస్థితి ఏంటో తెలుస్తోంది. మాండ్ర విషయాన్ని టీడీపీ తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పోయిన విశ్వసనీయతను తెచ్చుకోవాలంటే మాండ్రకు దూరంగా రాజకీయాలు చేయాలని, తిరిగి ఆయన ప్రలోభాలలో ఉంటే మరింత నష్టపోతాననే యోచనలో గౌరు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా గౌరు, మాండ్ర వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. -
‘సమైక్య’ దిగ్బంధం
కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్య దండు కదిలింది. వైఎస్ఆర్ కాంగెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు సైతం కదంతొక్కారు. విభజన నిర్ణయంపై గళం విప్పారు. గురువారం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో చేపట్టిన రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికక్కడ వాహనాలు కిలోమీటర్ల పొడవున నిలిచిపోయాయి. జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు శివారులోని గుత్తి పెట్రోల్ బంకు వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై రాకపోకలను స్తంభింపజేశారు. కర్నూలు, కోడుమూరు, పాణ్యం, పత్తికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, గౌరు చరిత, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ రాకేష్‌రెడ్డితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆదేశాలతో నంద్యాలలోని నూనెపల్లె చౌరస్తా వద్ద కర్నూలు-కడప రోడ్డును దిగ్బంధించారు. దాదాపు నాలుగు గంటల పాటు వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. ఆదోనిలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో భీమాస్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ఆళ్లగడ్డలో బీవీ రామిరెడ్డి ఆధ్వర్యంలో చెన్నై జాతీయ రహదారిని దిగ్బంధించి వంటావార్పు చేపట్టారు. శిరివెళ్లలో విద్యార్థులు మానవహారం నిర్మించారు. ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో దేవనకొండ టర్నింగ్ వద్ద కర్నూలు-బళ్లారి రహదారిపై వంటావార్పు నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. బనగానపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రబోతుల వెంకటరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పెట్రోల్ బంకు కూడలిలో రహదారిని దిగ్బంధించారు. నందికొట్కూరులో నాయకులు ఐజయ్య, బండి జయరాజు ఆధ్వర్యంలో పటేల్ సెంటర్ వద్ద కర్నూలు-గుంటూరు రహదారిలో రాకపోకలను స్తంభింపజేశారు. అక్కడే వంటావార్పు చేపట్టి సహపంక్తి భోజనం చేశారు. డోన్ శివారులోని కొత్తపల్లి వై.జంక్షన్లో డోన్ నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గన రాజారెడ్డి ఆధ్వర్యంలో 44వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. -
కర్షక సమరం
కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునకు రైతులు కదంతొక్కారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించి మద్దతు పలికారు. విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు. పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్ వద్ద జాతీయ రహదారిని రైతులు ట్రాక్టర్లతో గంట పాటు దిగ్బంధించారు. అనంతరం కృష్ణానగర్, బిర్లాగేట్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. మంత్రాలయంలో కర్నూలు-రాయచూరు రోడ్డుపై రాకపోకలను స్తంభింపజేశారు. అంతకుముందు పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రదీప్‌రెడ్డి, మండల కన్వీనర్ భీమిరెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. నందికొట్కూరులో బండి జయరాజు, ఐజయ్యల ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ కొనసాగింది. ఆదోనిలో బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్, స్థానిక నాయకులు ప్రసాదరావు, గురునాథరెడ్డి, చంద్రకాంతరెడ్డి, వెంకటేశ్వరరెడ్డిల నాయకత్వంలో చేపట్టిన ర్యాలీలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో గంగాధరరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాం, వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యుడు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో తెర్నేకల్లులో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. డోన్ నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గన రాజారెడ్డి, స్థానిక నాయకులు ధర్మారం సుబ్బారెడ్డి, శ్రీరాములు ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. బనగానపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రబోతుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అవుకు మిట్ట నుంచి పాతబస్టాండ్ మీదుగా పెట్రోల్ బంకు కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. -
నేడు రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ
పాణ్యం రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో బుధవారం రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన పాణ్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదటి నుంచి పోరాడుతున్నది తమ పార్టీ మాత్రమేనన్నారు. తెలంగాణ ప్రకటనపై సీమాంధ్రలోని కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రానున్న ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారని ప్రశ్నించారు. విభజన దిశగా కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ముమ్మరం చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే బుధవారం నియోజకవర్గాల వారీగా పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో రైతులతో ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. పార్టీ శ్రేణులతో పాటు రైతులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
యువ గర్జన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కర్నూలులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సోనియాగాంధీ, కిరణ్‌కుమార్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి తదితరులతో రూపొందించిన ఫ్లెక్సీని పెట్రోల్ పోసి తగలబెట్టారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు పర్ల శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆలూరులో నియోజకవర్గం సమన్వయకర్త గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జూనియర్ డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆదోనిలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్, ప్రసాదరావు, సన్నీ, ఫయాజ్, సాయిరాంల నాయకత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆళ్లగడ్డలో వైఎస్సార్సీపీ నాయకులు చిన్నవెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్మించారు. బనగానపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రబోతుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు స్థానిక క్రీడామైదానం నుంచి పెట్రోల్ బంకు కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. డోన్‌లో స్థానిక నాయకులు ధర్మారం సుబ్బారెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు శ్రీరాములు, గుల్షన్ నాయకత్వంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ధర్మారం సుబ్బారెడ్డి కార్యాలయం నుంచి పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి సోనియాగాంధీ ఫ్లెక్సీని తగలబెట్టి దహనం చేశారు. మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రదీప్‌రెడ్డి, మండల కన్వీనర్ భీమిరెడ్డి, సర్పంచు తెల్లబండ్ల భీమయ్యల ఆధ్వర్యంలో కర్నూలు-రాయచూరు రహదారిని దిగ్బంధించారు. నంద్యాలలో పట్టణ కన్వీనర్ మల్లికార్జునశెట్టి, సుభాన్, వడ్డె శ్రీను, మనోజ్‌ల నాయకత్వంలో పద్మావతి నగర్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి శ్రీనివాస సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మాచారి నాగరాజు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు షరీఫ్, బలరాంల నాయకత్వంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి విద్యార్థులు మద్దతు ప్రకటించారు. సోమప్ప సర్కిల్లో మానవహారంగా ఏర్పడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. - న్యూస్‌లైన్, కర్నూలు